కందగడ్డ.. శక్తికి అడ్డా


Thu,November 7, 2019 01:01 AM

Kandagadda
కార్తీకమాసం మొదలవ్వడంతో నోములు, వ్రతాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఉపవాసాలంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కందగడ్డని ఆహారంలో కలుపుకొంటే ఎలాంటి అలసటా ఉండదు. ఇది ఆరోగ్యంగా ఉంచడంతోపాటు శివునికి నైవేద్యంగానూ పెట్టుకోవచ్చు. అందుకే.. కందగడ్డతో కొన్ని రకాల వంటలను మీకు పరిచయం చేస్తున్నాం.


కందబిల్వ పాయసం

kanda-payasam

కావాల్సినవి :

కండగడ్డ : 300 గ్రా., పాలు : అర లీటర్, బాదం, జీడిపప్పు : 100 గ్రా., నెయ్యి : 2 టేబుల్‌స్పూన్లు, తేనె : 200 గ్రా., బిల్వపత్రాలు : 5

తయారీ :

ముందుగా కందగడ్డను తురిమి పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు, బాదంపప్పును దోరగా వేయించాలి. అదే కడాయిలో కందగడ్డ తురుమును కూడా దోరగా వేయించుకోవాలి. మందపాటి గిన్నెలో పాలు పోసి బాగా మరగనివ్వాలి. అందులో కందతురుము వేసి పది నిమిషాలపాటు ఉడికించుకోవాలి. దీనిలో చక్కెరకు బదులుగా తేనె జోడించాలి. బిల్వపత్రాలను సన్నగా తరిగి నెయ్యిలో వేయించుకోవాలి. దీన్ని ఉడికించిన కందతురుములో వేసి చిన్నమంట మీద ఉడికించి దించేయాలి. తర్వాత బాదం, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే కందబిల్వ పాయసం రెడీ! శివుడికి ఇష్టమైన నైవేద్యంగా పెట్టవచ్చు.

కంద మిక్చర్

kanda-karapoosa

కావాల్సినవి :

కందగడ్డ : 300 గ్రా., పల్లీలు : 100 గ్రా., పుట్నాలపప్పు : 50 గ్రా., పచ్చిమిర్చి : 3, కరివేపాకు : 2 రెమ్మలు
కొత్తిమీర : 1 చిన్నకట్ట, నూనె : అర లీటర్
చాట్ మసాలా : 1 టేబుల్‌స్పూన్
ఉప్పు, కారం : తగినంత

తయారీ :

కందగడ్డను తురుముకోవాలి. కడాయిలో నూనె పోసి కందతురుమును వేసి దోరగా వేయించుకోవాలి. అదే కడాయిలో పల్లీలు, పుట్నాలపప్పును వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేయించాలి. వీటిని విడివిడిగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వీటిపై ఉప్పు, కారం, చాట్‌మసాలా వేసి బాగా కలుపుకోవాలి. దీనికి కొత్తిమీర, కరివేపాకు గార్నిష్ చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది.

కంద గారెలు

kanda-vada

కావాల్సినవి :

కందగడ్డ : 300 గ్రా., కారం : 2 టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర : 1 చిన్నకట్ట, కరివేపాకు : 2 రెమ్మలు, పచ్చిమిర్చి : 2, జీలకర్ర : 1 టీస్పూన్, వెల్లుల్లి ముక్కలు : టీస్పూన్, మొక్కజొన్న పిండి: 300 గ్రా., నూనె : అర లీటర్, ఉప్పు : తగినంత, నీరు : సరిపడా

తయారీ :

ముందుగా కందగడ్డను తురుముకొని ఉడికించుకోవాలి. దీనికి మొక్కజొన్నపిండి, కారం, ఉప్పు, తరిగిన కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, సరిపడా నీరు పోసి వడలు చేసుకొనేలా కలిపి పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత కడాయిలో నూనె వేడి చేయాలి. పిండితో వడలు చేసి వేడి నూనెలో వేసి డీప్‌ఫ్రై చేసుకోవాలి. వీటిని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.

కంద చిప్స్

kanda-chips

కావాల్సినవి :

కంద : 300 గ్రా., కారం : 2 టేబుల్‌స్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్, కరివేపాకు : 2 రెమ్మలు, పచ్చిమిర్చి : 3, నిమ్మరసం : 1 టీస్పూన్, బియ్యం పిండి : 100 గ్రా., కార్న్‌ఫ్లోర్ : 100 గ్రా., శనగపిండి : 1 టేబుల్‌స్పూన్, నూనె, ఉప్పు: తగినంత

తయారీ :

కందగడ్డను ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, బియ్యంపిండి, కొత్తిమీర, కార్న్‌ఫ్లోర్, నిమ్మరసం వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆలస్యం చేయకుండా కడాయిలో నూనెపోసి వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని వేడినూనెలో వేసి డీఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే కడాయిలో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేయించుకోవాలి. కంద చిప్స్‌ను ప్లేట్‌లోకి తీసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే బాగుంటుంది.

కంద అన్నం

kanda-annam

కావాల్సినవి :

బియ్యం : 250 గ్రా., కంద : 150 గ్రా., జీలకర్ర, ఆవాలు : అర టీస్పూన్, ఎండుమిర్చి : 4, నెయ్యి: 100 గ్రా., కరివేపాకు : 2 రెమ్మలు, కొత్తిమీర : 2 రెమ్మలు, పచ్చిమిర్చి : 2, పచ్చి శనగపప్పు : 1 టీస్పూన్, పెసరపప్పు : 1 టీస్పూన్, మినుపపప్పు: 1 టేబుల్‌స్పూన్

తయారీ :

బియ్యం బాగా కడిగి పొడి పొడిగా అన్నం వండుకోవాలి. కందగడ్డను తురిమి పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో నెయ్యి వేసి తురిమిన కందగడ్డ, జీలకర్ర, అవాలు, పచ్చి శనగపప్పు, పెసరపప్పు, మినుపపప్పు వేసి వేయించాలి. అందులోనే ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి. ఈ పోపును అన్నంలో వేసి కలుపుకోవాలి. అంతే.. కంద అన్నం రెడీ!

సతీష్ ,ఎగ్జిక్యూటివ్ చెఫ్
కృష్ణపట్నం ,జూబ్లీహిల్స్, రోడ్‌నం. 36, హైదరాబాద్

997
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles