మిర్యాల గాంధీ హోటల్ తిన్నంత భోజనం!


Wed,November 6, 2019 01:50 AM

లోపలికి వెళ్లండి. రూ.50 ఇచ్చి టోకెన్ తీసుకోండి. మీరెంత తింటారో తినండి. మీరు తినగలిగేంత రుచికరమైన భోజనం వడ్డిస్తారు. అవును నిజం. అదేదో అన్నం, ఇంత కూర పెట్టి చేతులు దులుపుకోరు. పాపడా, చట్నీ, పప్పు, ఫ్రై కర్రీ, సాంబారు, పెరుగు.. వంటివన్నీ పెడతారు. అది కూడా మన ఇంట్లో తిన్నంత రుచికరంగా. ఇంతకంటే ఏం కావాలి?


ఆకలితో ఉన్నవారికి ఇదే పరమాన్నం కదా. బాగా ఆకలేస్తే కడుపు నింపుకోవడానికి డబ్బులు ఎంతైనా ఇచ్చేవాళ్లు ఉన్నారు. కానీ అందరూ అలా ఖర్చు పెట్టలేరు కదా? అందరికీ అంత స్థోమత ఉండదు కదా? ఫైనల్‌గా డబ్బులు ఊరికే రావు కదా?
అలాంటివారికే ఈ తిన్నంత తిను హోటల్ భోజనం. పైగా ఇక్కడ కూర్చోవడానికి కంఫర్ట్‌గా కుర్చీలు.. బెంచీలు ఉంటాయి. ప్యూరిఫైడ్ వాటర్ కూడా ఉంటుంది. ఎంత తింటే అంత తిను అనే వెసులుబాటు ఉంది. అది కూడా యాభై రూపాయలకు మాత్రమే.
Hotel

గాంధీ ఆలోచన

వాస్తవానికి ఈ రోజుల్లో కడుపు నింపుకోవాలంటే కనీసం వంద రూపాయలు కావాలి. అది కూడా ఏదో చిన్నపాటి హోటల్‌లోనే సాధ్యం. కాస్త పెద్ద హోటల్‌లోనైతే కడుపు నిండా తినాలంటే రూ.250 నుంచి రూ.25 వేల వరకు ఉన్నది. చిన్న హోటళ్లలో చాయ్ తాగితే రూ.10. టిఫిన్ చేస్తే రూ.30. కానీ రూ.50లకే భోజనం ఎలా వడ్డించగలుగుతున్నారు? ఈ సందేహమే పెద్ద పెద్ద హోటళ్ల యజమానులకూ వచ్చింది. ఎవరీ తిన్నంత భోజనం యజమాని అని ఆరా తీశారు. అతడే హైదరాబాద్ యువకుడు మిర్యాల గాంధీ. పెద్ద హోటల్ యజమానులకు గాంధీ ఆలోచన ఇబ్బందికరంగా మారింది. మేం రూ.వందల్లో తీసుకుంటే నువ్వెందుకు రూ.50లకే తిన్నంత భోజనం పెట్టి మార్కెట్‌ను దెబ్బతీస్తావు అంటూ బెదిరింపులూ తప్పలేదు.

సరిపడా తినండి.. సంతృప్తి చెందండి

ఇదే కాదు.. ఏదైనా వ్యాపారం చేయాలంటే ముందు మంచి ఆలోచన ఉండాలి. ఇక్కడ గాంధీ చేసింది అదే. పెట్టుబడి కూడా పెద్దగా పెట్టకుండా.. తనతోపాటు నలుగురికి ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండా ఉపాధి అవకాశాలు కల్పించి వ్యాపార రుచి చూపించాడు. లాభాపేక్ష లేకుండా ఏదైనా వ్యాపారం చేస్తే చాలు.. నలుగురికి పని కల్పించనూ వచ్చు. ఇప్పుడు వినియోగదారులకు రూ.50లకే నగరానికి చెందిన యువకుడు మిర్యాల గాంధీ తిన్నంత భోజనం పెడుతున్నాడు. చికెన్ దమ్ బిర్యానీ కూడా రూ.80లకే. మంచిగా తినండి.. సరిపడా తినండి.. సంతృప్తి చెందండి కాన్సెప్ట్‌తో ఓ హోటల్‌ను నెలకొల్పి 15 మందికి ఉపాధి కల్పిస్తుండడం విశేషం. వాళ్ల నాన్న శంకరయ్య వ్యాపారాన్నే కొనసాగిస్తున్నాడు. కానీ కాస్త వైవిద్యంగా, లాభాలు తక్కువగా తీసుకుంటూ, వినియోగదారుల మన్ననలు పొందేందుకు వేసిన ఎత్తుగడ సత్ఫలితాలనిస్తున్నది. తన అన్న సూర్యప్రకాశ్ పెట్టిన హోటల్‌లో తన ఆలోచనతో వైవిద్యతను ప్రదర్శించాడు. ఇప్పుడు రోజూ 600లకు పైగా వినియోగదారుల మన్ననలు పొందుతున్నాడు. రెండేండ్లుగా తన వ్యాపారాన్ని ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా నడిపిస్తున్నాడు.

శభాష్ గాంధీ

ఇతను ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నించినా చదువు సరిపోలేదు. అందుకే తన కాళ్ల మీద తను నిలబడి నలుగురికి ఉపాధి కల్పించే మార్గాన్ని ఎంచుకొని బంధుమిత్రుల్లోనూ శభాష్ అనిపించుకున్నాడు. కొద్దిరోజుల వరకు బంధుమిత్రుల తిరస్కరణ, తిట్లు తప్పలేదు. రూ.50లకే భోజనం పెట్టడమేమిటని తిట్టిపోశారు. కానీ ఇప్పుడు జొమాటో, స్విగ్గీలోనూ ఆర్డర్లు వస్తుండడం విశేషం. రేటింగ్ కూడా బాగానే ఉండడం గమనార్హం. కాన్సెప్ట్ ఉండాలి. ఆచరణలో చూపే చిత్తశుద్ధి ఉండాలి. ఎగ్జాంపుల్‌గా గాంధీ ఉన్నాడు కదా? వ్యాపారం ఎందుకు సక్సెస్ కాదు?
Hotel2

బీపీటీ బియ్యమే..

రూ.50లకు భోజనం పెడుతున్నారంటే.. అదేదో నాణ్యత లేని బియ్యాన్ని వాడుతారని అనుకోవద్దు. బీపీటీ బియ్యమే వాడుతున్నారు. పప్పు, సాంబారు, ఫ్రై కర్రీ, పెరుగు.. అన్నీ నాణ్యమైనవే. ఒక్కసారి తిన్నోళ్లకు మళ్లీ అదే హోటల్‌కు రావాలన్న కోరిక పుడుతుందని హోటల్ యాజమాన్యం చెబుతున్నది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సదుపాయం ఉంటుంది. ఆర్టీఓ కార్యాలయానికి వచ్చే చాలామంది తిన్నంత భోజనం రుచి చూస్తున్నారు. ఆదివారం కూడా తెరిచే ఉంటుంది. పండుగా పబ్బం ఏదీ లేదు. ప్రతి రోజూ తెరిచే ఉంటుంది. ఇప్పుడు వినియోగదారుల మన్ననలు పొందడంతో ఫంక్షన్లకు కూడా ఆర్డర్లు మొదలయ్యాయి. ఫంక్షన్లకైతే ప్రత్యేకంగా వంట చేయాలి. కనుక భోజనానికి రూ.60 వరకు తీసుకుంటున్నారు. 100 మందికి తీసుకెళ్తే కచ్చితంగా 130 మంది వరకు తినొచ్చు. ఐతే ఫంక్షన్ దగ్గరికి వచ్చి సప్లయి చేసేందుకు వీళ్ల దగ్గర మానవ వనరులు లేవు.

కుటుంబ సభ్యులంతా పనిలో నిమగ్నం

మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిన్నంత భోజనంలో గాంధీ కుటుంబమంతా పనిలో నిమగ్నమై ఉంటుంది. వంటలు చేసేందుకు ముందుగానే వచ్చేస్తారు. మాస్టర్ కుంభం అంజయ్యది అందె వేసిన చెయ్యి. గాంధీ తండ్రి శంకరయ్యతో ఉన్న అనుబంధం వల్ల నేటికీ పని చేస్తున్నారు. రెగ్యులర్‌గా వచ్చే వినియోగదారుల సంఖ్యే ఎక్కువ.

రూ.10 లక్షల పెట్టుబడితో వ్యాపారం

మా నాన్న మిర్యాల శంకరయ్య చాలా కాలంగా హోటల్ వ్యాపారమే నిర్వహించారు. నేను 8, 9 ఏండ్లు ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని ప్రయత్నించా. ఆ తర్వాత నాకు ఉపాధి దొరక్కపోవడంతో నేనూ ఇదే వ్యాపారాన్ని వైవిద్యంగా చేయాలని రంగంలోకి దిగాను. అప్పు చేసి రూ.10 లక్షల పెట్టుబడితో ఆరంభించా. నెగెటివ్‌గా మాట్లాడిన వారే అధికం. అందరూ నిరుత్సాహపరిచారు. ఐనా వెనుకడుగు వేయలేదు. ఎలాగైనా సక్సెస్ కావాలని పని చేశా. వినియోగదారులను ఆకట్టుకునేందుకు నాణ్యతను మెయింటెయిన్ చేస్తున్నాం అని మిర్యాల గాంధీ చెప్పారు. ఇప్పటికీ చాలా హోటళ్ల యజమానులు, ఉద్యోగులు వచ్చి బెదిరిస్తూనే ఉంటారు. ఎలా వర్కవుట్ అవుతుందని ప్రశ్నిస్తున్నారు. కొందరైతే మేనేజర్ ఉద్యోగం ఇస్తామంటూ ఆఫర్లు ఇచ్చారు. కానీ ఎవరి దగ్గరా పని చేయడం ఇష్టం లేదని తిరస్కరించా. మరికొందరేమో మా దగ్గర స్థలం ఇస్తాం. ఇదే హోటల్‌ను ఏర్పాటు చేయాలంటూ ఆఫర్లు కూడా ప్రకటించారు. ఘట్‌కేసర్ నుంచి వచ్చిన ఓ నాయకుడికి మా భోజనం రుచి నచ్చింది. అవుషాపూర్‌లో వెయ్యి గజాల స్థలం ఇస్తా. నీకు ఇష్టం ఉన్నన్ని రోజులూ హోటల్‌ను నడిపించమంటూ కోరారు. అదే నా జీవితానికి ఎంతో తృప్తినిచ్చిన ప్రశంస అంటాడు గాంధీ. హోటల్‌ను నడపడమంటే అంత ఈజీ కాదు. అది కూడా వినియోగదారుల మన్ననలు పొందడం చాలా కష్టం. కానీ వ్యాపారాన్ని లాభాపేక్ష లేకుండా చేస్తే సక్సెస్ సాధ్యమే.

బిర్యానీ కూడా ఫేమస్

తిన్నంత భోజనంలో బిర్యానీ కూడా ఉంది. అది కూడా కేవలం రూ.80లకే. ప్లేట్ బిర్యానీ పెడతారు. అది ఒకరికి కచ్చితంగా సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదని ఎవరైనా అడిగితే మళ్లీ అన్నం, పప్పు, ఫ్రై కర్రీ, సాంబారు, పెరుగు వంటివి ఇస్తారు. వినియోగదారుడికి సరిపోయిందనేంత వరకు వడ్డిస్తూనే ఉంటారు. ఇప్పుడు బిర్యానీకి ఆర్డర్లు కూడా బాగానే వస్తున్నట్లు యజమాని గాంధీ చెప్పాడు. ప్రధానంగా సభలు, సమావేశాలకు బిర్యానీ ఆర్డర్లు వస్తున్నాయి.
Hotel1


స్థలం: ఉప్పల్ ఆర్టీఓ కార్యాలయం పక్కన.

హోటల్: తిన్నంత భోజనం

శిరందాస్ ప్రవీణ్‌కుమార్ , హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ జి.భాస్కర్

670
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles