కొత్త కాలేయంతో జీవితం


Tue,November 5, 2019 12:37 AM

మన శరీరంలో పునరుత్పత్తి చెందగలిగిన అవయవం కాలేయం. అందుకే రోగికి అమర్చడానికి వేరొకరి నుంచి కొంత కాలేయాన్ని తీసుకున్నప్పటికీ వాళ్లలో తిరిగి పూర్తి కాలేయం వచ్చేస్తుంది. అందుకే లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సలు విజయవంతం అవుతున్నాయి. సిర్రోసిస్ వచ్చి లివర్ ఫెయిల్యూర్ అయినప్పుడే కాదు., లివర్ క్యాన్సర్ ఉన్న పేషెంట్లకు కూడా కాలేయ మార్పిడితో కొత్త జీవితాన్ని అందించవచ్చంటున్నారు నిపుణులు.


శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. మనం తిన్న ఆహారం నుంచి శక్తి రావాలంటే కాలేయం సక్రమంగా పనిచేయాలి. జీర్ణప్రక్రియ జీర్ణాశయం, పేగుల్లో జరిగితే జీవక్రియ (మెటబాలిజమ్) కాలేయంలో జరుగుతుంది. శరీరానికి కావలసిన ముఖ్యమైన ప్రొటీన్లన్నీ కాలేయం నుంచే వస్తాయి. వ్యాధి నిరోధక శక్తిలో కాలేయం కీలకమైన పాత్ర పోషిస్తుంది. శరీరానికి కావాల్సిన వ్యాధినిరోధకతను తయారుచేయడంలో సహాయపడుతుంది. రకరకాల మందులు వాడడం వల్ల గానీ, ఆహార పదార్థాల ద్వారా గానీ శరీరంలోకి చేరిన టాక్సిన్స్‌ను తీసివేసి శుభ్రం చేస్తుంది. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన లివర్ దెబ్బతింటే శరీరం అస్తవ్యస్తం అయిపోతుంది. జీవక్రియలన్నీ స్తంభించిపోతాయి. దాంతో మొత్తం శరీరమే కుప్పకూలిపోతుంది. కాలేయం చాలా రోజుల వరకు దెబ్బతిని ఉంటే కండరాలు బలహీనం అయిపోతాయి. మజిల్ మాస్ తగ్గిపోతుంది. శరీరంలో నీరు చేరుతుంది. శక్తి తగ్గిపోతుంది. సత్తువ సన్నగిల్లుతుంది. ఇన్‌ఫెక్షన్ల అవకాశం పెరుగుతుంది. ఇతర అవయవాలు కూడా ప్రభావితం అవుతాయి. కాబట్టి క్రమంగా కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండె పాడవుతాయి.
Liver

కాలేయం ఎందుకు పాడవుతుంది?

లివర్ వ్యాధి వచ్చింది అనగానే.. వెంటనే మందు తాగుతారా..? అని అడుగుతుంటారు. కాలేయ అనారోగ్యానికీ, ఆల్కహాల్‌కీ అంతటి దగ్గరి సంబంధం ఉంది. ఇన్‌ఫెక్షన్లు, జన్యుపరమైన వ్యాధులు కూడా కాలేయాన్ని దెబ్బతీస్తాయి. కాలేయానికి వచ్చే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్‌ఫెక్షన్లకు సకాలంలో చికిత్స తీసుకోకపోతే క్రమేణా ఇవి కాలేయాన్ని పూర్తిగా పనిచేయకుండా చేస్తాయి. శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయినవాళ్లలో కాలేయం పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇనుము లోపం వల్ల కలిగే హీమోక్రొమటాసిస్, విల్సన్స్ డిసీజ్ (రాగి లోపం) లాంటి కొన్ని వ్యాధులు లివర్ సిర్రోసిస్‌కి దారితీస్తాయి.
మనం వేసుకునే సాధారణ పారాసిటమాల్ నుంచి కొన్ని రకాల మందులు, ఎలుకల మందు, మెటబాలిక్ వ్యాధుల లాంటివి కూడా కాలేయాన్ని దెబ్బతీస్తాయి. ఈ కారణాలన్నింటి వల్ల చివరికి ఫ్యాటీ లివర్ సమస్యకు దారితీస్తాయి. ఇది లివర్ దెబ్బతిని సిర్రోసిస్ రావడానికి దారితీస్తుంది. సాధారణంగా కాలేయ వ్యాధుల్లో 40-50 శాతం వరకు క్రిప్టోజెనిక్ అంటే ఇలాంటి ఏ కారణం లేనివి ఉంటాయి. ఇలాంటివాటిని సాధారణంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు.
Liver1

కాలేయంలో సమస్య ఉంటే ఏమవుతుంది?

కాలేయం శరీరానికి ఒక ఫ్యాక్టరీ లాంటిది. అన్ని జీవక్రియలూ ఇక్కడే జరుగుతాయి. కాలేయం పనిచేయకపోతే జీవక్రియలన్నీ ఆగిపోతాయి. మనం తిన్న ఆహారం కాలేయం లోని వినియోగింపబడుతుంది. జీవక్రియలకు కావాల్సినవేవీ ఉత్పత్తి కావు. అందువల్ల అన్నీ స్తంభించిపోతాయి. తద్వారా రకరకాల సమస్యలు ఎదురవుతాయి. ఇన్‌ఫెక్షన్ అయినా, ఏ ఇతర వ్యాధి వల్లనైనా కాలేయంలో సమస్య మొదలైతే అది నెమ్మదిగా సిర్రోసిస్‌కి దారి తీయవచ్చు.కాలేయంలో సమస్య ఉన్నప్పుడు వాటి లక్షణాల ద్వారానే అనుమానించవచ్చు.
-కాలేయంలో సమస్య ఏదైనా ముందుగా కామెర్లు కనిపిస్తాయి.
-శరీరంలో ముఖ్యంగా పొట్ట, పాదాల్లో నీరు పేరుకుపోతుంది.
-మజిల్ మాస్ తగ్గుతుంది.
-చాలా బలహీనంగా ఉంటారు.
-రక్తపు వాంతుల వంటి కాంప్లికేషన్లు రావొచ్చు. మెదడులోకి నీరు చేరి ఎన్‌కెఫలోపతీ అనే పరిస్థితి ఏర్పడొచ్చు. ఎన్‌కెఫలోపతి వల్ల అపస్మారకంలోకి కూడా వెళ్తారు.
-కాలేయంలో సమస్య వల్ల ఊపిరితిత్తుల్లో కూడా ద్రవం చేరవచ్చు. దీన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు.
-కాలేయం పాడైతే శరీర వ్యాధినిరోధక శక్తి కూడా తగ్గుతుంది. కాబట్టి వీళ్లలో పదే పదే ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. శరీరంలో పేరుకున్న నీటిలో (అసైటిక్ ద్రవం) కూడా ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. ఈ ఇన్‌ఫెక్షన్లు స్పాంటేనియస్ బాక్టీరియల్ పర్‌క్యుటేనియస్ (ఎస్‌బిపి) అనే పరిస్థితికి దారితీయొచ్చు. చివరికి ఎండిఆర్-మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. అంటే శక్తివంతమైన రకరకాల యాంటిబయాటిక్స్‌కి కూడా నిరోధకతను పెంచుకున్న బాక్టీరియా వల్ల కూడా ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. ఎసినిటోబాక్టర్, క్లెబ్సియెల్లా న్యుమోనియా లాంటివి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బాక్టీరియా. ఇలాంటివి ఇన్‌ఫెక్ట్ చేయొచ్చు.

చికిత్స ఏమిటి?

కాలేయంలో సమస్య ఉందనగానే ఇక కొత్త కాలేయాన్ని అమర్చడం ఒకటే మార్గం అని భయపడవద్దు. కాలేయంలో సమస్య రావడానికి గల కారణానికి చికిత్స ఇస్తే సమస్య తొలగిపోతుంది. సమస్య ఏదైనా కాలేయం పూర్తిగా చెడిపోకముందే సరైన సమయంలో చికిత్స మొదలుపెడితే మందులతో వీటిని నివారించొచ్చు. ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమయ్యే దశలో కూడా మందులు వాడుతూ ఉండడం కరెక్ట్ కాదు. లక్షణాలను కంట్రోల్ చేయడానికి మందులు పనిచేస్తాయి. శరీరంలో పేరుకుపోయిన నీటిని తగ్గించడానికి డైయురెటిక్స్ ఇస్తారు. ఇన్‌ఫెక్షన్లను నివారించడానికి యాంటిబయాటిక్స్ ఇస్తారు. ఫ్యాటీ లివర్ సమస్యను కూడా తొలిదశలో అయితే మందులతో కంట్రోల్ చేయవచ్చు. ఫ్యాటీలివర్ సమస్య లివర్ ఫైబ్రోసిస్‌కి దారితీస్తుంది. ఇది ఎఫ్1, ఎఫ్2, ఎఫ్3 అని మూడు దశల్లో ఉంటుంది. ఎఫ్1, ఎఫ్2 దశల్లో మందులు, లైఫ్ స్టయిల్ మాడిఫికేషన్లు, డయాబెటిస్‌ని కంట్రోల్ చేయడం ద్వారా సమస్యను పోగొట్టి తిరిగి సాధారణ స్థితికి వచ్చేట్టు చేయొచ్చు. కానీ ఎఫ్3 దశకు చేరితే మాత్రం అది లివర్ సిర్రోసిస్‌కి దారితీస్తుంది. అందుకే ఫైబ్రోసిస్ దశలోనే ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే మెరుగైన ఫలితాలుంటాయి. కాలేయం జబ్బుకు కారణం తెలియకపోతే క్రిప్టోజెనిక్ అంటారు. ఇలాంటి వ్యాధికి మందులుండవు. బట్టతలకు మందు ఉండనట్టుగానే ఇలాంటి సమస్యల వల్ల వచ్చే సిర్రోటిక్ లివర్‌కీ మందులు ఉండవు. మూలకణ చికిత్స గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అవింకా పరిశోధన దశలోనే ఉన్నాయి.

లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్

ప్రతి ఏటా పది వేల మందిలో ఒకరికి కాలేయ మార్పిడి అవసరం అవుతోంది. అంటే 25 నుంచి 30 వేల మందికి ప్రతి సంవత్సరం కాలేయాన్ని మార్చాల్సిన అవసరం ఏర్పడుతోంది. కానీ కెడావర్ లివర్ అందుబాటులో ఉండడం లేదు. మన దగ్గర దాతలు తక్కువ కాబట్టి లివర్లు తక్కువగా ఉంటాయి. అందువల్ల చాలా అనారోగ్యంగా ఉన్న పేషెంట్లు ఎక్కువ కాలం వేచి చూడలేరు. లివర్ దొరకకముందే చనిపోతారు. చనిపోయిన వాళ్ల లివర్ కోసం వెయిట్ చేసేలోపు కాలేయ వ్యాధి ముదిరి పేషెంట్ మరణించవచ్చు. అందుకే మనదేశంలో కెడావర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కన్నా లైవ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్లే ఎక్కువగా జరుగుతున్నాయి. నిజానికి లైవ్ ట్రాన్సప్లాంట్ కొంచెం క్లిష్టమైన చికిత్స. దాత నుంచి కొంత లివర్‌ని తీసుకుని పేషెంటుకు అమరుస్తారు. కాబట్టి వాళ్లకు కూడా చిన్నపాటి సర్జరీ చేసినట్టుగా అవుతుంది. అందుకే పాశ్చాత్యదేశాల్లో కెడావర్ ట్రాన్స్‌ప్లాంట్సే ఎక్కువగా జరుగుతుంటాయి. అక్కడ డోనర్లు ఎక్కువగా ఉంటారు కూడా. ప్రస్తుతం మన తెలంగాణాలో అవగాహన పెరగడం వల్ల దాతలు పెరుగుతున్నారు.
Liver2

కాలేయం దానం చేస్తే..?

లైవ్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం రోగి కుటుంబసభ్యులు లేదా ఆత్మీయుల దగ్గరి నుంచి కాలేయంలో కొంత భాగాన్ని తీసుకుని రోగికి అమరుస్తారు. అయితే కాలేయాన్ని దానం చేయడం వల్ల మనకేదో అనారోగ్యం వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. కాలేయానికి పునరుత్పత్తి చెందగల శక్తి ఉంటుంది. అది నాలుగు నుంచి ఆరు వారాల్లో రీజనరేట్ అవుతుంది. కాలేయ మార్పిడి కోసం సాధారణంగా కాలేయంలోని కుడి లోబ్‌ను దాత నుంచి తీసుకుంటారు. ఎడమవైపు ఉన్న లోబ్ దాతలోనే ఉంటుంది. ఇది క్రమంగా సైజు పెరుగుతూ నాలుగు నుంచి ఆరు వారాల్లో పెద్దగా అవుతుంది. కాబట్టి మళ్లీ వాళ్ల కాలేయం వాళ్లకు వచ్చేస్తుంది.

ట్రాన్స్‌ప్లాంట్ ఎవరికి చేస్తారు?

మందులు వాడుతున్నప్పుడు వ్యాధి లక్షణాలు సాధారణంగా తగ్గుముఖం పట్టాలి. అంటే లక్షణాలు, మెడిసిన్స్ బ్యాలెన్స్‌గా ఉన్నంతవరకు పరవాలేదు. కానీ మందులు వేసుకుంటున్నా కూడా లక్షణాలు తగ్గకపోతే కాలేయమార్పిడికి వెళ్లవలసి వస్తుంది. మెడిసిన్స్ లక్షణాలను కంట్రోల్ చేయకుంటే డీకంపెన్సేటెడ్ లివర్ అంటారు. దీని ప్రారంభదశలోనే ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే మంచిది. కొందరిలో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. అంటే మందు లు వేసుకుంటుంటే లక్షణాలు బాగవుతూ, మళ్లీ తరువాత సిక్ అవుతూ ఉంటారు. కానీ చివరికి సమస్య తీవ్రం అవుతుంది. ఇలాంటి వాళ్లలో మొదట్లోనే ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి. సమస్య తీవ్రమైన తరువాత ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే రిజల్ట్ అంత బాగా ఉండవు. ఎందుకంటే కాలేయమార్పిడికి కాలేయం క్వాలిటీతో పాటుగా పేషెంట్ ఫిట్‌నెస్ ఇంపార్టెంట్. వీటిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. లివర్ ఎక్కువగా చెడిపోతే కష్టం. తొందరగా వస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. లేకుంటే ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. బెటర్‌గా ఉన్న పేషెంట్‌కు ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే తక్కువ ఇన్‌ఫెక్షన్, సిక్‌గా ఉన్న పేషెంట్‌కు ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే ఎక్కువ ఇన్‌ఫెక్షన్‌కు అవకాశం ఉంటుంది. అందువల్ల వ్యాధి బాగా ముదిరిపోయిన తరువాత కన్నా మధ్యస్థ దశలో ఉన్నప్పుడే ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవడం మంచిది.

కాలేయ మార్పిడి తరువాత

కాలేయ మార్పిడికి వచ్చేవాళ్లో ప్రతి పది మందిలో తొమ్మిది మంది మూడు నాలుగు నెలల్లో చనిపోయేవాళ్లే ఉంటారు. కానీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత 3 నెలల్లో బాగవుతారు. అసలు పేషెంట్‌లా కూడా కనిపించరు. ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత జీవితాంతం ఇమ్యునో సప్రెసెంట్స్ వాడాలి. అయితే ఆరు నెలలకు ఒకసారి డోస్ తగ్గుతుంది. ఒకటిన్నర సంవత్సరం కల్లా ఒక్క మెడిసిన్‌కి వస్తారు. చాలా తక్కువ డోస్.
మొదటి 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ లోకి వెళ్లవద్దు. మాస్క్ లేకుండా వెళ్లొద్దు. సినిమా హాళ్ల వంటి ఎక్కువ జనం ఉండేచోటికి వెళ్లొద్దు.
ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత సర్జరీ ఫెయిల్ అవడం అరుదు. చాలామంది ఇమ్యూనిటీ తక్కువై ఇన్‌ఫెక్షన్ల వల్లనే చనిపోతారు.

చిన్నారులకు ట్రాన్స్‌ప్లాంట్ చేయొచ్చా?

చిన్న పిల్లలకు కూడా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం కావొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లల్లో కూడా కాలేయ సమస్యలు రావొచ్చు. అలాంటివాటిలో సాధారణంగా కనిపించేది బిలియరీ అట్రీషియా. ఈ సమస్య ఉన్న పిల్లలు కామెర్లతోనే పుడ్తారు. వీళ్లకు పుట్టుకతోనే బైల్ డక్ట్ డెవలప్ మెంట్‌లో ప్రాబ్లం ఉంటుంది. పుట్టుకతో పైత్యరస నాళాలు ఏర్పడవు. లేదా బ్లాక్ అయివుంటాయి. బిలియరీ ఆట్రీషియా ప్రతి 10 వేల మందిలో ఒకరికి ఉంటుంది. దీన్ని పుట్టిన వెంటనే గుర్తించి చికిత్స చేస్తే లివర్ పాడవకుండా ఉంటుంది. ఇలాంటి పిల్లలకు రెండు నెలల్లోగా సర్జరీ చేయాలి. అంటే చిన్నపేగు నుంచి కొంత భాగాన్ని తీసి, పైత్యరస నాళాలు ఉండాల్సిన చోటికి కలుపుతారు. అయితే ఇది తాత్కాలిక చికిత్సే. 10-14 ఏళ్ల వరకే ఇది పనిచేస్తుంది. ఆ తరువాత లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిందే. పిల్లల్లో ైగ్లెకోజన్ స్టోరేజ్ డిజార్డర్ లాంటి సమస్యల వల్ల కూడా కాలేయం దెబ్బతింటుంది. ఇలాంటి పుట్టుకతో వచ్చే సమస్యల వల్ల కూడా లివర్ ఫెయిల్ కావొచ్చు. ఇలాంటప్పుడు చిన్న పిల్లలకు కూడా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయవచ్చు. పిల్లల్లో కూడా అరుదుగా లివర్ క్యాన్సర్ కనిపించవచ్చు. ఇలాంటప్పుడు కూడా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసి చిన్నారులను బతికించవచ్చు.
Liver3

కాలేయ వ్యాధిని నివారించొచ్చా?

కాలేయం అనారోగ్యం పాలు కాకుండా ఉండడానికి కొంతవరకు మనం పాటించే జాగ్రత్తలు మేలు చేస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి ఏర్పరుచుకోవడం, అనారోగ్యకరమైన అలవాట్లు మానేయడం అందులో ముఖ్యమైనవి.
-జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.
-ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి
-హెపటైటిస్ బి, సి కోసం హెచ్‌బివి, హెచ్‌సివి యాంటిబాడీ టెస్టులు చేయించుకోవాలి. పాజిటివ్ వస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి. వీటికి మంచి చికిత్స అందుబాటులో ఉంది. వీటిని మొదట్లోనే చికిత్స తీసుకుంటే లివర్ చెడిపోకుండా ఉంటుంది.
-నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ రాకుండా వ్యాయామం చేయాలి
-డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవాలి.
-లివర్ క్యాన్సర్ కోసం అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి.
-బరువు పెరగకుండా చూసుకోవాలి.
-కాలేయ వ్యాధి ముదరకుండా తరచుగా ఎల్‌ఎఫ్‌టి, హెపటైటిస్ బి, సి, లిపిడ్ ప్రొఫైల్, రెండుమూడేళ్లకు ఒకసారి అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే రెగ్యులర్‌గా చేయించుకోవాలి.
-డయాబెటిస్ పరీక్షలు కూడా చేయించుకోవాలి.
Liver4

కారణాలు

హెపటైటిస్ బి, సి
హెపటైటిస్ వైరస్ బి, హెపటైటిస్ వైరస్ సి వల్ల కాలేయం ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుంది. హెపటైటిస్ వైరస్‌ల డిఎన్‌ఎ కాలేయ కణాల డిఎన్‌ఎతో కలిసి అవి పనిచేయకుండా చేస్తుంది. హెపటైటిస్ వైరస్ ఇన్‌ఫెక్షన్‌కి వెంటనే చికిత్స తీసుకోకపోతే నెమ్మదిగా కాలేయం దెబ్బతింటుంది. చివరికి లివర్ ఫెయిల్యూర్‌కి దారితీయవచ్చు. అయితే ఈ ఇన్‌ఫెక్షన్ల వల్ల కాలేయం చెడిపోవడానికి దాదాపు 25నుంచి 30 ఏళ్లు పడుతుంది.
Liver5

ఆల్కహాల్
కాలేయానికి ప్రధాన శత్రువు ఆల్కహాల్. మద్యం ఎక్కువగా తాగేవాళ్లలో కాలేయం పాడయ్యే అవకాశం ఎక్కువ. ఆల్కహాల్ తీసుకోకపోతే కాలేయం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పలేం. కాని ఆల్కహాల్ తీసుకుంటే మాత్రం కాలేయం పాడయ్యే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ఈ అలవాటు ఉన్న కొందరిలో రెండు మూడేళ్లలోనే కూడా లివర్ పాడైపోవచ్చు. కొందరిలో మాత్రం ఆల్కహాల్ వల్ల కాలేయం పాడవడానికి 30 నుంచి 40 ఏళ్లు పడుతుంది.

ఆటోఇమ్యూన్ వ్యాధులు

శరీరంలోని సొంతకణాలపైనే పనిచేసే ఇమ్యూనిటీని ఆటోఇమ్యూనిటీ అంటారు. దీనివల్ల కలిగే వ్యాధులను ఆటోఇమ్యూన్ వ్యాధులు అంటారు. ఆటోఇమ్యూన్ సమస్య కూడా లివర్‌ని ప్రభావితం చేస్తుంది. ఇలాంటి సమస్యల వల్ల కూడా కాలేయం పాడయిపోవచ్చు.

లివర్ క్యాన్సర్

కాలేయం దెబ్బతినడానికి రెండో అతి ముఖ్య కారణం లివర్ క్యాన్సర్. పెద్దవాళ్లలో హెపటోసెల్యులర్ కార్సినోమా, చిన్నవాళ్లలో హెపటోబ్లాస్టోమా వల్ల కాలేయం పనిచేయడం మానేస్తుంది. పిల్లల్లో ట్యూమర్లు రావడం అరుదు. కాలేయంలో ట్యూమర్ ఉంటే ఇక చనిపోవడం తప్ప మార్గం లేదనుకుంటారు. కాని లివర్ క్యాన్సర్ పేషెంట్లకు కూడా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసి ప్రాణం పోయవచ్చు. లివర్ క్యాన్సర్ రెండు రకాలుగా ఉంటుం ది. ప్రాథమికంగా క్యాన్సర్ ముందుగా కాలేయంలోనే కనిపిస్తే దాన్ని ప్రైమరీ లివర్ క్యాన్సర్ అంటారు. శరీరంలో వేరే చోట క్యాన్సర్ ఉండి అది కాలేయానికి వ్యాపిస్తే దాన్ని సెకండరీ లివర్ క్యాన్సర్‌గా పరిగణిస్తారు. సెకండరీ లివర్ క్యాన్సర్ ఉన్నప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ పనికిరాదు. సాధారణంగా ప్రైమరీ లివర్ క్యాన్సర్ ఉన్నప్పుడే లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. కాలేయంలో ఏర్పడిని కణితి సైజు 8 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉంటే 75 శాతం నయం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ కణితి 5 సెంటీమీటర్ల కన్నా కూడా తక్కువ ఉంటే ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో పూర్తిగా నయమయ్యే అవకాశం 90 శాతం ఉంటుంది. సరైన సమయంలో వచ్చి ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే మంచి ఫలితాలుంటాయి.
meenon

82
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles