కోటి దివ్య కాంతులు!


Sun,November 3, 2019 02:12 AM

Koti-Deepothsavam
భక్తి టీవీ ప్రతి ఏటా నిర్వహించే ‘కోటి దీపోత్సవం’ నేడు (3వ తేది) మొదలవుతున్నది. ఈనెల 18వ తేది వరకు ప్రతిరోజూ సాయంత్రాలు అనేక విశేష కార్యక్రమాలతో అశేష భక్తజనాన్ని అలరింపజేస్తూ, అద్భుత ఆధ్యాత్మిక వాతావరణానికి
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం ఎప్పటిలా వేదిక కానున్నది. ఈ సందర్భంగా.. ఈ ప్రత్యేక కథనం చదువండి.


‘సాధ్యం త్రివక్తి సంయుక్తం/ వహ్నినా యోజితం మయా/ గృహాణ మంగళం దీపం/ త్రైలోక్య తిమిరాపహం’. మూడు వత్తులు, కాస్త చమురు లేదా ఆవు నెయ్యి వేసి వెలిగించిన దీపం ముల్లోకాల చీకట్లను తొలగిస్తుందని’ ఈ శ్లోకానికి అర్థం. జీవితమనే ప్రమిదలో వయసనే వత్తులు వేసి, కోర్కెలనే చమురును పోస్తే.. జ్ఞానమనే వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగు మరికొన్ని దీపాలను వెలిగిస్తుంది. అలా, మన హైందవ సంప్రదాయంలో దీపానికి విశిష్ఠ స్థానమున్నది. ఒక్క దీపానికే ఇంత శక్తి ఉంటే, ఒకేచోట వందలు, వేలు, లక్షలను దాటేసి, ఏకంగా కోటి దీపాలను వెలిగింపజేస్తే ఆ దివ్యహారతుల నడుమ ముక్కోటి దేవుళ్లంతా మురిసిపోకుండా ఉంటారా! భక్తుల భక్తి పరవశాల నడుమ కోలాటాలు, భజనల మధ్య అధిదేవతా దేవుళ్ల కల్యాణాలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు, వేద పండితులు, వేదవిజ్ఞానుల శుభ ప్రవచనాలు, ఆకాశాన్ని తాకేలా వేదమంత్రాల హోరు. ఆద్యంతం ఆధ్యాత్మిక తరంగాలతో ఆ ప్రాంతమంతా దేవీప్యమానమే.

ఉన్నట్టుండి, ఆకాశంలో మెరిసే తారలను గుర్తుకు తెచ్చేలా నేలపైన, మనం నడయాడుతున్న చోటే, అత్యంత కళాత్మకంగా కొలువుదీరిన లక్షలాది ప్రమిదల హృదయాలపై దీపాల పూలు పూస్తాయి. కళ్లు మూసి తెరిచేంతలో కనుచూపుమేర స్వర్ణకాంతి కిరణాలు ఉదయిస్తాయి. అద్భుత ఆధ్యాత్మిక వైభవానికి వేలాది మంగళహారతులు ఘన స్వాగతం పలుకుతాయి. తెలుగు ప్రజల చెక్కుచెదరని భక్తివెలుగుకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం నిలువుటద్దం పడుతున్నది. ప్రతి ఏటా కార్తీక మాసంలో ‘భక్తి టీవీ’ యాజమాన్యం నిర్వహించే ‘కోటి దీపోత్సవం’ ఇవాళ అత్యంత వైభవోపేతంగా, భక్తి ప్రపత్తుల మధ్య ప్రారంభమవుతున్నది.

ఇది అసలే, అత్యంత విశేషమైన కార్తీకమాసం. ముఖ్యంగా దీపానికి, ప్రత్యేకించి కార్తీక దీపాల జ్వలనాలకు, దీపదానాలకు విశిష్ఠ ప్రాధాన్యమున్న పవిత్ర సమయం. ‘కోటిదీప సంరంభం ఎప్పుడు మొదలవుతుందా’ అని కండ్లలో వత్తులు వేసుకొని ఎదురుచూసే వాళ్లు ఎందరో. పంచభూతాల సాక్షిగా, ప్రకృతి సమక్షంలో జరిగే ఈ అతిపెద్ద ధార్మిక కార్యక్రమం మన హైదరాబాద్‌కే గర్వకారణం. ఎందరో ప్రజలకు మరీ ముఖ్యంగా వేలాది మహిళామణులకు ఈ పక్షం రోజుల సాయంత్రాలు పెద్ద పండుగ రోజులే. భక్తిటీవీ ఆధ్వర్యంలోని ఈ ‘కోటి దీపోత్సవం’ 2013లో మొదలైంది. ఈ ఏడేండ్లుగా నిర్విఘ్నంగా జరుగుతూనే ఉన్నది. సువిశాలమైన మైదానం లక్షలాది భక్తులతో ఎప్పటిలా కిక్కిరిసి పోతుంది.

రోజూ ఒక పండుగ

ఇవాళ (ఆదివారం) సాయంత్రం సూర్యుడు అస్తమించే వేళ, సుమారు 6 గంటలకు దివ్య శంఖారావంతో కోటిదీపోత్సవ కార్యక్రమం మొదలవుతుంది. అనేకమంది వేదపండితులు, ఘనాపాఠుల వేదపఠనం మధ్య కార్తీకమాస శోభాదేవికి, దేవ దేవుళ్లు అందరికీ బ్రహ్మాండ స్వాగతం లభిస్తుంది. పరవశింపజేసే భక్తి సంగీతంతో పరిసరాలన్నీ కళకళలాడుతుంటాయి. ప్రసిద్ధ ఆధ్యాత్మిక వేత్తలు, ఉపాసకులు, సాధకుల దివ్య ప్రవచనాలు హాజరైన భక్తులకు ఎనలేని ఉత్సాహాన్ని, దైవిక స్ఫూర్తిని కలిగిస్తుంటాయి. ఏ రోజుకా రోజు జరిగే కల్యాణం, ఊరేగింపు, దీపారాధనలు, లింగోద్భవం, సప్తహారతులు, మహానీరాజనం, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ అక్కడి సందర్శకులనే కాకుండా టీవీలలో వీక్షించే వారినీ కన్నార్పకుండా దర్శింపజేస్తుంటాయి. కోటి దీపోత్సవం ఆద్యంతం ప్రతిరోజూ ఒక గొప్ప పండుగను తలపిస్తుంది.

ప్రధాన వేదిక వద్ద ఎత్తయిన హిమగిరులు కైలాసాన్ని తలపింపజేస్తాయని కార్యక్రమ నిర్వాహకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘వాటి మధ్యలో యోగముద్రలో శివుడు దర్శనమిస్తాడు’. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి మన రెండు కళ్లూ సరిపోవు. నలుదిక్కులా దేవతలు కొలువై భక్తజనావళిని దీవిస్తున్నట్లుండే ఈ వేదికపై ప్రతీ క్షణం పండుగ వాతావరణమే. ఇంతటి విశేష సందర్భం కనుకే, మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొంటుంటారు. మన రెండు తెలుగు రాష్ర్టాల నుంచే కాక, దేశ విదేశాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వేడుకలో పాల్గొంటారని వారు ప్రకటించారు.
Koti-Deepothsavam3

అందరికీ ఆహ్వానం

‘కోటి దీపోత్సవ’ కార్యక్రమంలో మహిళలు ఎవ్వరైనా చక్కగా పాల్గొనవచ్చునని నిర్వాహకులు తెలిపారు. ‘ఎంట్రీ ఫీజు’ అంటూ ఏమీ ఉండదు. ‘భక్తి- శ్రద్ధ- సహనం’ ఇవి వుంటే చాలు. అక్కడికి వెళ్లాక పూజాసామగ్రి, ప్రమిదలు, వత్తులు, చమురు తదితర ద్రవ్యాలన్నీ తామే అందజేస్తామని చెప్పారు. ‘ఖాళీ చేతులతో వచ్చి కొండంత పుణ్యాన్ని తీసుకెళ్లండి’ అంటూ ప్రజలకు గొప్ప అవకాశాన్ని వారు కలిగిస్తున్నారు. కోటి దీపోత్సవమంటే కేవలం దీపాల అలంకరణ మాత్రమే కాదు. ప్రసిద్ధుల ఆధ్యాత్మిక బోధనలు వినవచ్చు. ఇవే కాకుండా కదలకుండా కూర్చోపెట్టే సంప్రదాయ నృత్యాలు, జానపద కళాప్రదర్శనలు వంటివాటిని ప్రత్యక్షంగా వీక్షించవచ్చునని వారు పేర్కొన్నారు. ఈ ఉత్సవ ప్రాంగణంలో ఉన్నంతసేపు వెలకట్టలేని ధార్మిక ఆనందాన్ని పొందవచ్చునని వారంటారు.

ఎందరో మహానుభావులు

2012లో పారంభమైన లక్ష దీపాల పండుగకు శృంగేరీ జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వచ్చారు. 2013లో ‘కోటి దీపాల పండుగ’గా దీనిని అభివృద్ధి పరిచారు. అప్పట్నుంచీ ప్రతీ ఏడూ పవిత్రమైన కార్తీకమాసంలో లోకకళ్యాణమే లక్ష్యంగా పరమభక్తి పూర్వకంగా భక్తిటీవీ యాజమాన్యం కోటి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నది. ఉత్సవం జరిగినన్ని రోజులూ ఈ ధార్మిక కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనే మహానుభావులు ఎందరో. ఇంకా, కేంద్రమంత్రులు, రాష్ర్టాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వోన్నతాధికారులూ కుటుంబాల సమేతంగా పాల్గొంటుంటారు. ఈ ఏడాదికూడా అంతే స్థాయిలో ప్రసిద్ధులెందరో హాజరు కానున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ప్రతి రోజు సుమారు ముప్పయిమంది వేద పండిత, పురోహితులు, వేద పాఠశాలల విద్యార్థులతో ఘనాపాఠుల నడుమ వేదమంత్రాల పఠనం ఆస్తికులను తరింపజేస్తుంది.

కన్నుల పండువగా కళ్యాణ వైభోగాలు

‘కోటి దీపోత్సవం’ జరిగినన్ని రోజులూ ప్రతి రోజూ ఓ దేవదేవుని కల్యాణం జరిపిస్తారు. ఇవాళ కాళేశ్వర ముక్తేశ్వర కల్యాణంతో ఉత్సవం ప్రారంభమవుతుంది. ఈనెల 8న దుర్గమ్మకు, ఈనెల 10వ తేది, 16 తేదీలలో రెండు రోజులపాటు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి, 15న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి, 18న వేములవాడ రాజరాజేశ్వర స్వామివారికి కల్యాణోత్సవాలు జరుగుతాయి. భద్రకాళి, శ్రీ శైలం, శ్రీ కాళహస్తీశ్వరుల కళ్యాణాలు కూడా ఆయా తేదీలలో నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. కొల్హాపూర్‌ అమ్మవారి బంగారు విగ్రహాన్ని కూడా ఈ కోటి దీపోత్సవ వేదికపై అత్యంత సుందర దృశ్యంగా దర్శించుకోవచ్చు.
Koti-Deepothsavam2

మహానీరాజనం

‘హర హర హర హర శంభో శంకర’ అంటూ ఢమరుక నాదాలు, మహిళల కోలాటాలు. కళాకారుల నృత్యాలు. వేద పండితుల మంగళవాద్యాలు. జానపద కళాకారుల డోలు విన్యాసాలు. వీటన్నింటి మధ్య ప్రతిధ్వనించే శివోహం శబ్దం. హాజరైన ప్రతి ఒక్కరి మనసు భక్తితరంగాలతో ఉప్పొంగుతుండగా, శివయ్య మహానీరాజనం అందుకొంటాడు. ‘ధ్యానముద్రలోంచి మన మధ్యలోకి కదిలివచ్చిండా’ అనిపించే తరుణమది. ఈ వేడుకను చూసే ప్రతి ఒక్కరూ భక్తి పారవశ్యంలో మునిగిపోవడం ఖాయం. 400 మంది కళాకారులతో మహాశివలింగానికి అభిషేకం మరో ప్రత్యేకత.

అన్ని ఏర్పాట్లూ పూర్తి

ఎన్టీఆర్‌ గార్డెన్‌లో జరిగే కోటి దీపోత్సవం కార్యక్రమానికి నిర్వాహకులు సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. గుజరాత్‌, బెంగళూరు కళాకారులతో ప్రమిదల్ని తయారు చేయించారు. పలు రాష్ర్టాలనుంచి టన్నులకొద్ది పూలు తెప్పిస్తున్నారు. కోటి దీపాలను వెలిగించడానికి కావలసిన చమురు (సుమారు 25 వేల లీటర్లు)నూ సిద్ధం చేశారు. ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో తయారు చేయించిన వనమూలికల నూనెకూడా ఇందులో ఉన్నట్టు వారు చెబుతున్నారు. నగరంలోని అన్ని దేవాలయాల నుంచి ప్రచారరథాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులందరికీ ప్రతీ రోజు మూడు రకాల ప్రసాదాలను అందజేస్తారు. తెలంగాణ జిల్లాలనుంచి బిల్వార్చనకు టన్నుల కొద్ది బిల్వదళాలు తీసుకువస్తున్నట్టు సమాచారం.

కార్యక్రమంలో స్ఫటిక లింగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. కూరగాయలు, రుద్రాక్షలతో దేవతామూర్తుల రూపాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రాంగణమంతా దేవతామూర్తుల ప్రతిమలతో అలంకరించనున్నట్టు నిర్వాహకు లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వేలసంఖ్యలో వలంటీర్ల సేవలూ అందనున్నాయి. 6 ఆంబులెన్స్‌లు, మంచి నీటి వసతి, మెడికల్‌ క్యాంపులు, ఫైర్‌ ఇంజిన్లు.. ఇలా అన్ని ఏర్పాట్లనూ ఇప్పటికే పూర్తి చేశారు.
Koti-Deepothsavam1

ఇదొక మహా యజ్ఞం!

దీపం వెలిగించడం భారతీయ ఉత్కృష్ట సంస్కృతి. ప్రతి ఇంటా కార్తీక దీపకాంతి చైతన్యాన్ని వెలింగించాలనేదే మా సంకల్పం. 2012లో లక్ష దీపాల పండుగతో ప్రారంభించాం. 2013లో కోటి దీపోత్సవంగా మార్చాం. అప్పటినుంచి ప్రతి ఏటా కార్తీకమాసంలో ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమాన్ని మహా యజ్ఞంలా నిర్వహిస్తున్నాం. ఈ మహోత్సవంలో భక్తి కార్యక్రమాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. రాష్ట్ర నలుమూలల నుంచి కళాకారులు వచ్చి వేదికపై ఆసక్తికరమైన ధార్మిక ప్రదర్శనలు ఇస్తారు. గొప్ప ఆధ్యాత్మిక వేత్తలు రోజుకొకరు ప్రవచనం చేస్తారు. అరుదైన ఈ అద్భుత అవకాశాన్ని అందరం సద్వినియోగం చేసుకొందాం.
- తుమ్మల నరేంద్ర చౌదరి, రచన టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధినేత

మీరూ వలంటీరుగా సేవ చేయొచ్చు!

కోటి దీపోత్సవంలో ఎవ్వరైనా పూర్తి ఉచితంగా పాల్గొనవచ్చు. ఇందులో వలంటీరుగా సేవ చేయాలనుకునే వారు మాత్రం www.bhakthitv.inలో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

- పడమటింటి రవికుమార్‌

290
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles