వృక్షాలకు ప్రాణభిక్ష!


Fri,November 1, 2019 12:08 AM

-మొక్కలపై వేలాడుతున్న కాలుష్యపు కత్తి
-వాతావరణ రసాయనాలే విషనాగులు
-మన మనుగడ కోసమైనా వృక్షాల రక్షణ

కాలుష్య విషసర్పం బారిన పడి చిన్న మొక్కలనుంచి పెద్ద చెట్లవరకు అనేక వృక్షజాతులు దయనీయ దుస్థితికి చేరుకొంటున్నట్టు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మొక్కలపై వేలాడుతున్న కత్తి’కి కారణం మనిషేనని కూడా తేల్చారు. ఏ కాలుష్యం మొక్కలను ఏ రకంగా కాటు వేస్తున్నది? ఫలితంగా పత్రహరితం నిర్వీర్యమవుతున్న తీరు ఎలాంటిది? ఇవి తెలిశాక ‘అయ్యో పాపమని’ మన మనసు రోదిస్తుంది. మన కర్తవ్యాన్ని గుర్తుచేసే వ్యాసం చదువండి.
Tree

పరిశ్రమలు, వాహనాలు, పలు రకాల మానవ కార్యకలాపాలు మనిషికి స్వచ్ఛమైన గాలిని దూరం చేస్తున్న సంగతి తెలిసిందే. వాతావరణ కాలుష్యం మానవాళి ఆరోగ్యానికి మాత్రమే పెనుముప్పు తెస్తున్నదనుకొంటే అది అసంపూర్ణ అవగాహనే అవుతుంది. నోరు లేని జీవజాతులకు తోడు మూగమొక్కల ప్రపంచం సైతం దాని బారిన పడి రోదిస్తున్నది. ప్రాణం తీసే రసాయనాలు వాటి పచ్చదనాన్ని హరిస్తున్న వైనం అత్యంత దయనీయం.

భూమినుండి నీరు, లవణాలు, సూర్యరశ్మిని గ్రహించే మొక్కలు, వృక్షాలు మనిషికి ఎంతో స్వచ్ఛమైన గాలిని అందిస్తాయని వేరే చెప్పక్కర్లేదు. అవి మనం వదిలివేసే బొగ్గుపులుసు వాయువు (కార్బన్‌ డై ఆక్సైడ్‌)ను పీల్చుకొని ఆక్సీజన్‌ (ఆమ్లజని లేదా ప్రాణవాయువు)ను విడుదల చేస్తాయన్నది అందరికీ తెలిసిందే. మనుషులు తమ అవసరాల కోసం వాతావరణంలోకి మొక్కల ప్రాణం తీసేలా కాలుష్యపు కారకాలనూ విడుదల చేస్తున్నారని శాస్త్రవేత్తలు గత కొన్నాళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలిలో కలిసిన పలు రసాయన వాయువులు వాటిని అంతం చేసేవరకూ వదలడం లేదు. మరోవైపు చాలా అరుదుగా లభ్యమయ్యే కొన్ని రకాల మొక్కలు సైతం దీనివల్ల అంతరించిపోతున్నట్టు వారు చెబుతున్నారు.

భూమి ఇంత నివాసయోగ్యంగా ఉందంటే దాని మూలకారణాలలో ఒకటి పచ్చని మొక్కలు. ‘వృక్షాలను మనం రక్షిస్తేనే అవి మనల్ని రక్షిస్తాయన్న’ ఇంగితం చాలామందిలో ఏమైపోతున్నదో అర్థం కావడం లేదు. తల్లిగర్భం నుంచి, మనిషి పురుడు పోసుకొన్న క్షణం నుంచీ మరణించే దాకా మనం ప్రాణవాయువుతోనే జీవనం సాగిస్తుంటాం. జీవజాతులకు ప్రత్యేకించి మానవజాతి మనుగడకు అతిముఖ్యమైన ఈ ఆమ్లజని భూమిపై ఇంత విస్తారంగా ఆవిర్భవించడం వెనుక మొక్కలు, చెట్ల పాత్ర అత్యంత కీలకం. ఈ రకంగా వృక్షజాలమే మనకు ప్రాణభిక్ష పెడుతున్నది. కానీ, ఫలితంగా మనిషి వాటికేం చేస్తున్నాడు? మనకు ఊపిరిపోసే వాయువును ప్రసాదించే వాటి ఉనికికే ప్రమాదం తెస్తున్నాడు.

ఉదా॥కు గాలిలో అధికశాతం పేరుకుపోతున్న విషరసాయనాలలో సల్ఫర్‌ డయాక్సైడ్‌ ఒకటి. మొక్కల ఆకుల కణజాలాన్ని (లీఫ్‌ నెక్రోసిస్‌) ఇది చంపేస్తున్న వైనం దయనీయం. ఆకుల చివరి భాగాన్ని, వెయి న్స్‌ (Veins)ను సల్ఫర్‌ డయాక్సైడ్‌ నాశనం చేస్తున్నది. ఈ వాయువు తో అధికంగా చర్యకు లోనవడం ద్వారా ఆకులు క్లోరోసిస్‌ను కోల్పోయి పసుపురంగులోకి మారిపోతై. అసలీ ప్రక్రియ ఎలా జరుగుతుంది? చెట్లు, మొక్కల్లో స్టోమా (ద్వారం) తెరచుకోవడం, ముడుచుకోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ సల్ఫర్‌ డయాక్సైడ్‌ మొక్కల ఆకులద్వారా లోనికి ప్రవేశిస్తుంది. ఆకులలోని నీటితో చర్య జరిపి సల్ఫైట్‌గా మారుతుంది. ఇంతేకాదు, ఆకుల్లోని ‘పిహెచ్‌' (pH of leaves) లోనూ మార్పు జరుగుతున్నదని, ఈ రకంగా ఈ రసాయన వాయువు విషపూరితం చేస్తున్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

కొన్ని రకాల చెట్ల (మైముసోప్స్‌ ఎలంజీ: Mimusops elengi, మాంగీఫెరా ఇండికా: Mangifera indica, ఫికస్‌ రెలిజియోసా: Ficus religiosa వంటివి) లో ఎక్కువశాతం సల్ఫైట్‌ వాటి పత్రాలలోనే ఉంటుంది. ఆకులు దెబ్బ తినడంతోనే పత్రహరితం (chlorophyll) శాతం కూడా తగ్గిపోతుంది. మరోవైపు సల్ఫర్‌ శాతం మొక్కలలో ఎక్కువైతే అవి ఎత్తు పెరగకుండా ప్రొటీన్‌లు తగ్గుముఖం పడుతాయని వృక్షశాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాదు, వాటిలో పుష్పించే గుణమూ తగ్గిపోయి, ఫోలియర్‌ ఇంజ్యూరీ (foliar injury) బారిన పడతాయని చెబుతున్నారు. గాలిలోని ఓజోనుకూడా మొక్కల ప్రాణం తీస్తున్నది. ఈ వాయువు ఆకుల గుండా లోనికి ప్రవేశించి, ‘హైడ్రేటర్‌ పాలిసైడ్‌ సెల్‌'ను కరిగించి వేస్తుందని జీవశాస్త్రవేత్తలు వెల్లడించారు. ఫలితంగా మొక్కలు, చెట్లలోని జీవక్రియలో వినాశనకర మార్పులు సంభవిస్తాయని వారంటున్నారు. ఈ పరిస్థితి పంట ఉత్పత్తిని బాగా దెబ్బ తీస్తున్నది. ఈ విషయమై మన దేశంతోపాటు అమెరికాలోనూ సంయుక్తంగా జరిపిన పరిశోధనల్లో పంట నష్టాలు పెద్ద ఎత్తున నమోదైనట్టు తేలింది.

మన దేశంలో అయితే లక్షలాది ప్రజలకు అందేంత ధాన్యాల దిగుబడి ఈ ఓజోనువల్ల నష్టపోయినట్లు తేలింది. గాలిలోని నైట్రోజన్‌ ఆక్సైడ్‌కూడా నీటితో చర్యలు జరిపి, చెట్ల ఆకుల్లోని తడి భాగాలను ఆమ్లసహితంగా మార్చేస్తున్నదని శాస్త్రజ్ఞులు అన్నారు. ఆకుల్లోని టిష్యూలను ఇది దెబ్బతీస్తున్నట్టు వారు గుర్తించారు. ఒక పీపీఎం సల్ఫర్‌ డయాక్సైడ్‌ గోధుమ మొక్కల పైన రోజుకు 2 గంటల చొప్పున, 20-90 రోజులపాటు ప్రభావం చూపితే, వాటి ఎదుగుదలకు మొదట్లో తోడ్పడి, తర్వాత జీవక్రియ చర్యల్లో మార్పులను కలుగజేసి, పెరుగుదలను అడ్డుకొంటున్నట్టు వారు చెబుతున్నారు. నైట్రోజన్‌ ద్వితీయ ఉత్పాదకాలైన ‘పెరాక్సీ అక్సైల్‌ నైట్రోజన్‌' (పీఏఎన్‌: పాన్‌)లతోనూ పంటల ఉత్పత్తి తగ్గుతున్నట్టు వారు తెలిపారు.
వాతావరణంలో అమ్మోనియా శాతం ఎక్కువైనా మొక్కలు నశిస్తాయి. ఎరువుల (ఫెర్టిలైజర్‌) కర్మాగారాల పరిసరాలలోని మొక్కలపై ఈ రకమైన మార్పులు అధికంగా సంభవిస్తున్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రోజుకు 3 గంటలపాటు 50 పీపీఎంల అమ్మోనియాతో కనుక చర్యలు జరిగితే, మొక్కల ఆకులలోని పత్రహరిత శాతాన్ని అది పెద్ద ఎత్తున హరించి వేస్తుందని వారు తెలిపారు. గాలిలోని విషపూరిత అతిసూక్ష్మకణాల పదార్థం ఆకులపై చేరి, సూక్ష్మనీటిబిందువులతో కలిస్తే, గడ్డ కట్టుకున్నట్టుగా మారి, కిరణజన్యసంయోగ క్రియలోనూ మార్పులు తెస్తున్నట్టు కూడా తేలింది.

రాతిపూల మొక్కలతో మేలు

‘లైకెన్‌' (lichen) అనే నాచుజాతి మొక్కలు చెట్టు బెరళ్లు, రాళ్లమీద పెరుగుతుంటై. ఇవి గాలి లోని కాలుష్య రసాయనాలను పీల్చుకొంటూ మన వాతావరణానికి ఒక రకంగా మేలు చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. వీటిని ‘రాతిపూలు’గానూ పిలుస్తారు. ‘లైకెన్స్‌' వున్న ప్రాంతాలను ‘పరిశుభ్రమైన ప్రదేశాలు’గా వారు గుర్తించడం విశేషం. ఈ జాతిమొక్కలలో 20,000కు పైగా రకాలుండగా, ఇవి కొన్ని వేల సంవత్సరాలుగా భూమిపై పెరుగుతున్నట్టు వారు అంటున్నారు. ఈ మొక్కలలో సుగంధ ద్రవ్య లక్షణాలూ ఉంటాయనీ శాస్త్రవేత్తలు చెప్తారు. వాతావరణంలోని బొగ్గుపులుసు వాయువుతోసహా సల్ఫర్‌ డయాక్సైడ్‌, భారలోహాలు, దుమ్ము తదితరాలను ఇవి చక్కగా గ్రహిస్తాయి. వీటివల్ల వాతావరణంలోని ఎంతో కొంత కాలుష్యాన్ని నివారించవచ్చునని వారంటున్నారు.
TreeMain-box

మందుపాతరలను గుర్తించే మొక్కలు!

ఉగ్రవాదులు అమర్చే మందుపాతరలను ‘థేల్‌ క్రెస్‌' (Thale cress) అనే మొక్కలు గుర్తిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. డెన్మార్క్‌లోని జీవసాంకేతిక శాస్త్రవేత్తలు వీటిలో జన్యుమార్పిడి చేయడం ద్వారా మందుపాతరలను గుర్తించగలిగేలా చేశారు. మందుపాతరలోని పేలుడు వస్తువులు వెలువరించే నైట్రోజన్‌ డయాక్సైడ్‌ ఈ మొక్కల పూలను తాకినప్పుడు అవి ఎర్రగా మారుతాయని వారన్నారు. వాతావరణంలోని నైట్రోజన్‌ డయాక్సైడ్‌ను గుర్తించడమే వీటి ప్రత్యేకతగా వారు చెబుతున్నారు.
TreeMain-box1

డా॥ రాజూరు రామకృష్ణారెడ్డి
సెల్‌: 94404 32464

173
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles