సైన్స్‌ అంటే బతుకుపై అవగాహన!


Fri,November 1, 2019 12:01 AM

సైన్స్‌ అంటే బతుకు గురించిన అవగాహన. ఖగోళశాస్త్రం కూడా మనమీద ప్రభావం చూపుతుంది. దాన్ని మనం చూడగలగాలి. తెలిసిన సైన్స్‌ నేరుగా బతుకుమీద ప్రభావం చూపించకపోవచ్చు. ప్రభావం చూపించే సైన్సు గురించి మనకు చెప్పేవారు ఎవరూ లేకపోవచ్చు. ఈ ఖాళీలను పూరించాలి. అందరూ ప్రశ్నలు అడగాలి. అప్పుడు జవాబు చెప్పేవాళ్లు తప్పకుండా దొరుకుతారు.
Vignanam


సైన్స్‌ పరిశోధన అనుకున్నంత క్రమంగా జరుగడం లేదు. ఒక రంగం, ఒక విషయం గురించిన పరిశోధనలు వరుసబెట్టి ఒకేసారి, ఒకేచోట చేయడం కుదరదు. ఎవరికి అవసరమైన విషయం గురించి, వీలైన విషయం గురించి, తెలిసిన విషయం గురించి పరిశోధనలు చేస్తుంటారు. ఒకప్పుడు ఇటువంటి పరిశోధనల ఫలితాలు వెంటనే అందరికీ తెలిసేవి కాదు. విశ్వం పుట్టిననాడు పుట్టిన ఒక రొద ఇప్పటికీ మన టీవీలో స్టేషన్‌ లేనిచోట వినిపిస్తుంటుంది. చుక్కలు ఎగురుతూ ఒక రకమైన చప్పుడు వినిపిస్తుంది. దాని గురించి పరిశోధించే వాళ్ళు, ‘యాంటెనా మీద కూర్చున్న పావురాల వల్ల ఈ చప్పుడు వినిపిస్తున్నదని’ అనుకున్నారు. చివరకు కొందరు కొన్నిచోట్ల ఆ పావురాలను చంపారు కూడా. కానీ, మరొకచోట కూడా పరిశోధకులకు అటువంటి గోల వినిపించింది. దాంతో అప్పటి అసలు సంగతి అందరికీ బోధపడింది.

ఒక పరిశోధకుడు ఏదో ఒక చిన్న విషయాన్ని కనుగొని పక్కన పెడతాడు. అదే సమయంలో అందరికీ దాని సంగతి అర్థం కాదు. కొంతకాలానికి అది మరొకరికి ఉపయోగపడుతుంది. కనుకనే, సైన్స్‌ పరిశోధనలో క్రమాన్ని మనం వెతుక్కోవాలి. సైన్సు గురించి మనం ఒక పద్ధతిలో తెలుసుకోవాలి. అప్పుడు మనకు అందులోని ఆనందం తెలిసి వస్తుంది. ‘ప్రెషర్‌ కుక్కర్‌లో అన్నం ఎందుకు తొందరగా ఉడుకుతుందో’ తెలిసినప్పుడు సంతోషం కలుగుతుంది. మనకు తెలియకపోయినా కూడా అన్నం ఉడుకుతుంది. కానీ, అందులో సంతోషం ఉండదు. అన్నం మాత్రమే ఉంటుంది.

సైన్స్‌ గురించి తెలిసిన వాళ్లు కూడా, సైన్స్‌ అనగానే కొన్ని పేర్లను తప్పకుండా గుర్తుకు తెచ్చుకుంటారు. వాళ్ళంతా గొప్పవాళ్ళు. వాళ్ల దష్టిలో వాళ్ళు గొప్పవాళ్ళు కాకపోవచ్చు. తరువాత వాళ్ల గొప్పతనం గుర్తింపులోకి వస్తుంది. కానీ, పేరు వచ్చిన ప్రతి ఒక్క పరిశోధకుడికీ వందలాదిమంది పేరు రానివారి సహాయం ఉండి తీరుతుంది. వాళ్ళందరి గురించి తెలుసుకునే అవకాశం మనకు ఉండకపోవచ్చు. నిజానికి లేదు కూడా. బతుకు సాగించలేక బాధలు పడుతున్న వారు, ఇక సైన్సును కూడా ఎక్కడ పట్టించుకుంటారని మీరు అడుగవచ్చు. సైన్స్‌ను అర్థం చేసుకుంటే, బతుకు కొంచెం సులభం అయ్యే అవకాశం ఉందనే వాళ్ళు చాలామంది ఉన్నారు.

‘సైంటిఫిక్‌ పద్ధతి’ అని ఒకటి ఉంది. సమస్యను గురించి పరిశీలించాలి. ఒక్కచోట కాదు, చాలాచోట్ల పరిశోధించాలి. రకరకాల పరిస్థితులలో ఆ సమస్యను పట్టించుకుని చూడాలి. ఇవన్నీ జీవితానికి కూడా అన్వయించి చూడవచ్చు. పరిశీలన చాలా అవసరం. ఆ తర్వాత ప్రయోగం ఎంతో అవసరం. ఒక సమస్య వస్తుంది. అది వచ్చిన పరిస్థితులను గుర్తించడం పరిశీలన. ఆ పరిస్థితులు వచ్చినప్పుడల్లా అదే ఫలితం వస్తుందని అనుభవంలోకి వస్తే అది ప్రయోగం. వీలైతే ఆ పరిస్థితులను కల్పించి వచ్చే ప్రయోజనాలను చూడవచ్చు. అందరికీ, అన్ని సందర్భాలలో అటువంటి ఫలితాలు వస్తే అదొక సిద్ధాంతం అవుతుంది. ఇవన్నీ చెప్పడానికి ఏదో పెద్దగా వినిపిస్తాయి. తుమ్మితే నిజంగా అపశకునం అయిందా, అని పరిశీలించి చూడండి. విషయం మీరే తెలుసుకోండి. అప్పుడు మరి ఎవరినీ అడుగనవసరం లేదు.

‘తెలుగులో సైన్స్‌ చదువుతున్నారా?’ అన్నది అసలు ప్రశ్న అయితే, దానికి ఎదురు ప్రశ్న ఒకటి ఉంది. ‘తెలుగులో సైన్స్‌ రాస్తున్నారా?’ అని అడుగవచ్చు. ‘రాస్తే అచ్చు వేస్తున్నారా?’ తర్వాతి ప్రశ్న. ‘పుస్తకాలు చదివే అలవాటు ఎంతమందికి ఉంది?’ మరొక ప్రశ్న. సమస్యలలో పడి కొట్టుకుపోవడం బాగనిపించిన వారికి సమాధానాలు వెతికే ఓపిక ఉండదు.

సైన్స్‌ అంటే బతుకు గురించిన అవగాహన. ఖగోళశాస్త్రం కూడా మనమీద ప్రభావం చూపుతుంది. దాన్ని మనం చూడగలగాలి. తెలిసిన సైన్స్‌ నేరుగా బతుకుమీద ప్రభావం చూపించకపోవచ్చు. ప్రభావం చూపించే సైన్సు గురించి మనకు చెప్పేవారు ఎవరూ లేకపోవచ్చు. ఈ ఖాళీలను పూరించాలి. అందరూ ప్రశ్నలు అడగాలి. అప్పుడు జవాబు చెప్పేవాళ్లు దొరుకుతారు, తప్పకుండా దొరుకుతారు.

-డా॥ కె.బి.గోపాలం, సెల్‌: 9849062055

137
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles