జిహ్వ రుచికి ఉసిరి


Thu,October 31, 2019 01:41 AM

AMLA
ఉసిరి.. చెట్టు బెరడు నుంచి కాయల వరకు సంపూర్ణ ఔషధంలా పనిచేస్తాయి. ఉసిరి రుచితో పాటు ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఉసిరితో ఎప్పటికప్పుడు కొత్త వంటకాలు మనకు పరిచయం అవుతూనే ఉన్నాయి.
ఈసారి కూడా ఉసిరితో సరికొత్త వంటకాలను మీకు పరిచయం చేస్తున్నాం.


ఉసిరి పులిహోర

pulihora

కావాల్సినవి :

ఉసిరికాయలు : 10, నెయ్యి : 2 టీస్పూన్లు, పసుపు : పావు టీస్పూన్, ఆవాలు : పావు టీస్పూన్, జీలకర్ర : పావు టీస్పూన్, ఇంగువ : పావు టీస్పూన్, నిమ్మకాయ : 1, పచ్చిమిర్చి : 3, ఎండుమిర్చి : 2, మినుపపప్పు : అర టీస్పూన్, పచ్చి శనగపప్పు : అర టీస్పూన్, జీడిపప్పు : 1 టీస్పూన్, కరివేపాకు : 2 రెమ్మలు, బియ్యం : 200 గ్రా., ఉప్పు : తగినంత.

తయారీ :

ఉసిరికాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బియ్యాన్ని కడిగి అరగంటపాటు నానబెట్టాలి. తర్వాత పొడిపొడిగా ఉండేలా అన్నం వండుకోవాలి. మందపాటి గిన్నెలో నెయ్యి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, పసుపు, మినుపపప్పు, పచ్చి శనగపప్పు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఇందులో కట్‌చేసిన ఉసిరిముక్కలు వేసి దోరగా వేయించాలి. బాగా ఉడికేవరకూ మగ్గనివ్వాలి. ఇప్పుడు ముందుగా ఉడికించిన అన్నంలో ఉప్పుతో పాటు పోపు వేసుకొని బాగా కలుపాలి. చివరగా ఉప్పు, కారం, పులుపు సరిచూసుకోవాలి. ఉసిరిముక్కలతో పులుపు సరిపోకుంటే నిమ్మరసం కలుపుకోవచ్చు. ఉసిరికాయ పులుపు, మిర్చి కారం, అన్నంలోని కమ్మదనం అన్నీ కలిపితే.. సరికొత్త రుచిని ఆస్వాదించవచ్చు.

ఉసిరి అరటికాయ

usirikaya-banana

కావాల్సినవి :

ఉసిరికాయలు : 6,
పచ్చిమిర్చి పేస్ట్ : ఒకటిన్నర స్పూన్,
అల్లంపేస్ట్ : 1 టీస్పూన్,
పసుపు : పావు టీస్పూన్,
నూనె : 2 టీస్పూన్లు,
అరటికాయలు : 2,
కొత్తిమీర : 1 చిన్నకట్ట,
ఉప్పు : తగినంత.

తయారీ :

ఉసిరికాయలను శుభ్రం చేసి గింజలు తొలిగించాలి. వీటిని చిన్న
ముక్కలుగా కట్‌చేసి పేస్ట్‌లా మిక్సీ పట్టాలి. విడిగా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. ఫింగర్ చిప్స్ సైజులో అరటికాయను కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో ఉసిరికాయ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకొని అరటి ముక్కలు వేసి గంటపాటు నానబెట్టాలి. నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేడి చేసి అరటిముక్కల మిశ్రమం వేసి సన్నని సెగపై కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఉప్పు, కారం సరిచూసుకొని దించేయాలి. సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించుకొని వేడి వేడిగా వడ్డిస్తే సరికొత్త రుచి నోరూరిస్తుంది.

ఉసిరి ఆవకాయ

avakay

కావాల్సినవి :

ఉసిరికాయలు : 4, నువ్వులనూనె : 2 కప్పులు, కారం : 1 కప్పు, ఆవపిండి : 1 కప్పు, మెంతులు : పావు కప్పు, జీలకర్ర : పావు కప్పు, నిమ్మకాయలు : 2, ఉప్పు : తగినంత.

తయారీ :

ముందుగా ఉసిరికాయలను శుభ్రం చేసుకోవాలి. చాకుతో గాటుపెట్టి నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. నిమ్మరసం తీసి గంటపాటు ఎండలో పెట్టాలి. జీలకర్ర,మెంతులు, దోరగా వేయించి చల్లారిన తర్వాత పొడిచేయాలి. దోరగా వేయించిన ఉసిరికాయలలో కారం, ఆవపిండి, ఉప్పు, జీలకర్రపొడి, మెంతులు పొడి వేసి బాగా కలుపాలి. చివరిగా నూనె వేసుకోవాలి. ఉప్పు, కారం, పులుపు, సరిచూసుకోవాలి. పులుపు సరిపోకుంటే నిమ్మరసం వేసుకోవచ్చు. 3 రోజులపాటు జాడీలో నిల్వ ఉంచి తర్వాత వేడి వేడి అన్నం, నెయ్యితో పాటు వడ్డిస్తే.. కొత్త ఆవకాయ అన్నం కాంబినేషన్‌కు పోటీ వస్తుంది.

ఉసిరి షర్బత్

sharbath

కావాల్సినవి :

ఉసిరికాయలు : 2
చక్కెర : సరిపడా
పుదీనా ఆకులు : గార్నిష్ కోసం
నీరు : 250 మి.లీ. / 1 గ్లాసు

తయారీ :

ఉసిరికాయలు శుభ్రం చేసుకొని గింజలు తొలిగించి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మందపాటి గిన్నెలో నీరు పోసి దీనికి సరిపడా చక్కెర, ఉసిరికాయ ముక్కలు వేసి బాగా ఉడకనివ్వాలి. చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టించాలి. ఈ మిశ్రమాన్ని గ్లాస్‌లోకి తీసుకోవాలి. గట్టిగా ఉంటే సరిపడా నీరు పోసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. గంట తర్వాత పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకుంటే.. రుచికరమైన ఉసిరి షర్బత్ అదిరిపోతుంది.

514
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles