కథ చెబుతాం.. కొత్తగా!


Wed,October 30, 2019 01:33 AM

Vamshi
అనగనగ అంటూ కథలు మొదలవుతాయి. కథ కంచికి మనం ఇంటికి అంటూ ముగుస్తాయి. ఇలాంటి కథలెన్నో మనం వినే ఉంటాం. అంతే సాధారణంగా మరిచిపోయే ఉంటాం. కానీ కొన్ని కథలు మాత్రం కంచికిపోవు. కొన్నాళ్లు మనతో ప్రయాణిస్తాయి. తెలియకుండానే మన ఆలోచనల్ని మారుస్తాయి. జీవితాన్ని నిలబెడతాయి. అలాంటి కథలే చెబుతున్నారు కృష్ణచైతన్యరెడ్డి, వంశీకృష్ణరెడ్డి బ్రదర్స్‌. కథలు చెప్పడం వెనుక ఉన్న కథ చెప్పమని ‘యువ’ వారిని పలుకరించింది.


ఎండలు దంచికొడుతున్నాయ్‌. భూమి పొగలు కక్కుతున్నది. బావుల్లో, మనుషుల శరీరాల్లో నీరు ఆవిరైపోతున్నది. అది 2019 జూన్‌. బీఎన్‌ రెడ్డినగర్‌. ఓ జ్యూస్‌ సెంటర్‌ వద్ద చాలామంది ఉన్నారు. స్పీడ్‌గా ఓ రేంజ్‌రోవర్‌ కారు వచ్చి ఆగింది. అందులో ముందు కూర్చున్న వ్యక్తి మిర్రర్‌ దించారు. “రెండు గ్లాస్‌ల మోసంబీ జ్యూస్‌ ఇవ్వవా’ అనడిగారు. జ్యూస్‌ తీసేపనిలో పడ్డాడు నిర్వాహకుడు. కారును పార్క్‌ చేసి వచ్చారు ఓ ఇద్దరు. మోసంబీ జ్యూస్‌ తాగుతున్నారు. స్లెండర్‌ బైక్‌పై వచ్చాడు మరో వ్యక్తి. ‘భాయ్‌ ఏక్‌ గ్లాస్‌ పైనాపిల్‌ జ్యూస్‌ దేవో’ అనడిగాడు. వెనక్కి తిరిగి కూర్చోబోయాడు. అప్పటికే జ్యూస్‌ తాగుతున్న ఇద్దరిని బాగా చూస్తున్నాడు. “సార్‌ మీరు కృష్ణచైతన్యరెడ్డి, వంశీకృష్ణరెడ్డి కదా” అని అడిగాడు. అవునూ అన్నట్లుగా తలూపారు ఇద్దరు. “సార్‌ మీ వల్లనే నేను ఇప్పటిదాకా బతికి ఉన్నా. థాంక్యూ థాంక్స్‌ ఎలాట్‌ సార్‌.. మీ రుణం ఈ జన్మలో మరిచిపోను” అన్నాడు. థాంక్యూ.. థాంక్యూ.. “అర్జెంట్‌ పని ఉంది. వెళ్తాం” అంటూ ఇద్దరూ వెళ్లబోయారు. “సార్‌ సార్‌ ఒక్క సెల్ఫీ.. అంటూ సెల్ఫీ తీసుకున్నాడు. కారులో వాళ్లు, బైక్‌పై ఇతను వెళ్లిపోయాడు. ఇంతకీ ఎవరు వాళ్లు. బైక్‌పై వచ్చిన వ్యక్తికి ఏం సాయం చేశారు? ఓ ఐదేళ్లు వెనక్కి వెళ్దాం.

ఫ్లాష్‌బ్యాక్‌!

అది 2014. హైదరాబాద్‌లోని రాంకోటి. ‘చైతన్యరెడ్డి ఇన్‌స్టిట్యూట్‌'. పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు మెరుస్తుందక్కడ. ‘బ్యాంకింగ్‌, అప్టిట్యూడ్‌ క్లాసెస్‌ ఆర్‌ స్టార్టెడ్‌' అని బోర్డుపైరాసి ఉంది. లోపలికి అడుగుపెట్టేముందు వరుసగా చెప్పుల స్టాండ్‌లు కనిపించాయి. లోపల క్లాస్‌ నడుస్తున్నది. పెద్ద హాల్‌. ఎక్కువ మంది లేనందుకేమో రీ సౌండ్‌ వస్తున్నది. అది మొదటి రోజు. ట్రైనింగ్‌ కోసం ముగ్గురే వచ్చారు. నెల రోజులు గడిచాయి. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో మళ్లీ అదే ముగ్గురు కనిపించారు. నెల తిరగకముందే ఇన్‌స్టిట్యూట్‌కు తాళం. దాదాపు రూ. 15 లక్షలు నష్టం. ఆస్తులన్నీ పోయాయి. కొందరికి నమ్మకం కూడా పోయింది. కానీ తనపై తనకు మాత్రం నమ్మకం రెట్టింపయ్యింది.

పోయింది డబ్బు.. నమ్మకం కాదు

‘అమ్మ చేతి గాజులు, నాన్న స్కూటర్‌. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు. దొరికిన కాడికి అప్పులు.’ ఇవన్నీ పదే పదే గుర్తు చేసింది గతం. రోడ్డున పడేసింది ఇన్‌స్టిట్యూట్‌. అప్పుడెన్నో అవమానాలు. ఎన్నో ఛీత్కారాలు. ఆస్తులన్నీ పోయినా తల్లిదండ్రులకు మాత్రం కృష్ణచైతన్యరెడ్డిపై నమ్మకం పోలేదు. వారి నమ్మకాన్ని నిలబెట్టాలనుకున్నారు. ఎక్కడైతే ఓడిపోయామో అక్కడి నుంచే ప్రారంభించాలనుకున్నారు. అది దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ చౌరస్తా. సిగ్నల్‌ పడింది. వాహనాలన్నీ రోడ్డుపై నిలిచిపోయాయి. ఓ వ్యక్తి కొన్ని ఇన్‌స్టిట్యూట్లకు సంబంధించిన పాంప్లేంట్స్‌ పంచుతున్నాడు. అందరిలాగే అతడి దగ్గర పాంప్లెంట్‌ తీసుకున్నారు కృష్ణచైతన్య. ఆ నంబర్‌కు ఫోన్‌ చేసి నేను ఆప్టిట్యూడ్‌ క్లాసెస్‌ చెప్తాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అనడిగారు. ఇలా దాదాపు రెండు వందల ఇన్‌స్టిట్యూట్ల నంబర్లకు మెసేజ్‌లు పెట్టారు. కాల్‌ చేశారు. కొడుక్కు తెలియకుండానే అవకాశం ఇవ్వాలని తల్లిదండ్రులు కూడా చాలా ఇన్‌స్టిట్యూషన్‌లను సంప్రదించారు. “మీవోడికంటే బుద్ధిలేదు.. వయసులో పెద్దవారు మీకైనా కొంచెం జ్ఞానం ఉండాలె కదా. ఆయనకు అవకాశం ఇవ్వలేదని మిమ్మల్ని పంపించాడా.. గెట్‌ లాస్ట్‌” అంటూ కోప్పడ్డారు.

ఒక్క అవకాశం.. ఆశావాదం

ఒకరోజు దిల్‌సుఖ్‌నగర్‌లోని మరో ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఫోన్‌ కాల్‌. ‘డెమో ఇవ్వాలి. అర్జెంట్‌గా రండి. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం’ అని. సరే అని వెళ్లారు కృష్ణ చైతన్య. డెమో ఇచ్చారు. ఒక్క క్లాస్‌కు రూ. 125. కానీ డెమో విన్న తర్వాత రూ. 25 ఎక్కువ ఇస్తామన్నారు. అదనంగా ఇస్తామన్న ఆడబ్బులు ఆయనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. ఆదివారాలు, సెలవు రోజులు పోను నెలకు తొమ్మిది వేలు. ఈ విషయం గురించి తెలిసిన వాళ్లకు ఫోన్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ‘లక్షలన్నీ ఊడ్చిపెట్టి.. వందల్లో సంపాదిస్తున్నావ్‌' అని కొందరు హేళన చేశారు. వారందరికీ సమాధానం చెప్పేరోజు తప్పక వస్తుందనుకున్నారు కృష్ణచైతన్యరెడ్డి. ఓ రోజు ఓ ఇన్‌స్టిట్యూట్‌లో క్లాస్‌ చెప్తుండగా విద్యార్థులు డల్‌గా ఉన్నారు. వారిని ఉత్తేజపర్చేందుకు ఓ కథ చెప్పారు. అలర్టయిన విద్యార్థులు కథను ఆసక్తిగా వింటున్నారు. “కథలు చెప్పడానికి కాదు మీకు డబ్బులిచ్చేది” అని ఆ ఇన్‌స్టిట్యూట్‌ యజమాని కోపంతో ఊగిపోతున్నాడు. కృష్ణచైతన్యరెడ్డి వెళ్లి గట్టిగా అతన్ని హత్తుకున్నారు.

ఆ సారే కావాలి!

ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్‌ చేసేవారు ఇస్త్రీ బట్టలేసుకుంటారు. నీట్‌గా షేవ్‌ చేసుకుంటారు. ఫార్మల్‌ షూ వేసుకుంటారు. కొందరు టై కట్టుకుంటారు. మరికొందరు కోటు వేసుకుంటారు. కానీ కృష్ణ చైతన్యరెడ్డి తీరే వేరు. ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారో.. క్లాస్‌ చెప్పినప్పుడు కూడా అలాగే ఉంటారు. జీన్స్‌, టీ షర్టు, గడ్డంతో కనిపిస్తారు. కానీ ఎక్కడ అప్టిట్యూడ్‌ క్లాస్‌ చెప్పినా విద్యార్థులంతా ఫిదా అవుతూనే ఉంటారు. మొదటిసారి తన ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. తాను క్లాస్‌ చెప్పిన అనేక మంది సెటిలయ్యారు. ఎన్నో ఇన్‌స్టిట్యూట్‌లలో క్లాస్‌లు చెప్పారు కృష్ణచైతన్యరెడ్డి.

ఆలోచింపజేసే..

కృష్ణచైతన్యరెడ్డి తమ్ముడు వంశీకృష్ణారెడ్డి. ఇద్దరూ కలిసి ‘ఆలోచింపజేసే’ అనే పుస్తకం రాశారు. వంశీకృష్ణారెడ్డి సైతం ఎన్నో ఇన్‌స్టిట్యూట్‌లలో డెమోలు ఇచ్చారు. కానీ అవేవీ ఫలించలేదు. తమనెందుకు యాక్సెప్ట్‌ చేయట్లేదో తెలుసుకున్నారు. దాదాపు 10 ఇన్‌స్టిట్యూట్‌లలో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత బోధనలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పర్చుకున్నారు. 2016లో ఎల్బీనగర్‌లో ‘క్రియేట్‌ యు’ ఇన్‌స్టిట్యూట్‌ పెట్టారు. ప్రస్తుతం ఇక్కడ ఆఫీస్‌ మాత్రమే ఉంది. కృష్ణ చైతన్యరెడ్డి, వంశీకృష్ణరెడ్డి హైదరాబాద్‌లోని అన్ని కాలేజీల్లో అప్టిట్యూడ్‌, ఆటిట్యూడ్‌ క్లాసెస్‌ చెబుతున్నారు. గతంలో తమ తల్లిదండ్రుల్ని అవమానించిన ఓ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వాహకుడు గతేడాది కృష్ణచైతన్యకు ఫోన్‌ చేశాడు. “సార్‌ మా స్టూడెంట్స్‌ మీ క్లాసెస్‌ కావాలంటున్నారు. మీరు మా ఇన్‌స్టిట్యూట్‌లో క్లాస్‌ చెప్తారా. డబ్బులెంతైనా ఫరవాలేదు” అన్నారు. “సారీ సార్‌ ఏడాది వరకు డేట్స్‌ లేవు. కావాలంటే వచ్చే ఏడాది వచ్చి చెప్తాను.” అని కృష్ణచైతన్యరెడ్డి సమాధానమిచ్చారు. ఇదంతా పక్కనే ఉండి విన్నారు తల్లిందండ్రులు.
Vamshi1
గతేడాది కృష్ణచైతన్యరెడ్డి, వంశీకృష్ణరెడ్డి బ్రదర్స్‌ ‘తెలుగు స్టోరీస్‌ క్రియేట్‌ యు’ చానెల్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు లక్షా యాభై వేల మంది సబ్‌స్రైబర్లు అయ్యారు. వేల మంది వీరి వీడియోలను షేర్‌ చేస్తుంటారు. అవన్నీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ మోరల్‌ స్టోరీస్‌ విని ఎంతోమంది మంచి మార్గంలో నడుస్తున్నారు. మరెంతోమంది ఆత్మహత్య ఆలోచన నుంచి బయటపడుతున్నారు. జీవితంపై ఆశలూ పెంచుకుంటున్నారు. ఆరోజు బీఎన్‌ రెడ్డినగర్‌లో జ్యూస్‌ తాగుతుంటే ‘మీ వల్లే బతికాను’ అని అన్న వ్యక్తి కూడావీరు చెప్పిన కథలు వినే.

‘క్రియేట్‌ యూ’

“కథలు చెప్పడానికి కాదు డబ్బులిచ్చింది” గతంలో ఓ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వాహకుడు కృష్ణచైతన్యరెడ్డితో అన్నమాట ఇది. ఈ మాట అన్న వ్యక్తి మరిచిపోయాడు. కానీ కృష్ణచైతన్య మర్చిపోలేదు. తన తమ్ముడితో కలిసి 2017 ఫిబ్రవరిలో ‘తెలుగు స్టోరీస్‌ క్రియేట్‌ యు’ అనే వెబ్‌ చానెల్‌ ప్రారంభించారు. అన్నదమ్ములిద్దరూ మోరల్‌ స్టోరీస్‌ చెప్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 41 కథలు చెప్పారు. లక్షల్లో లైకులు, వేలల్లో షేర్‌లు పొందారు. వీటన్నింటికంటే లక్షలాది మంది మదిలో నిలిచారు.

- పడమటింటి రవికుమార్‌ గడసంతల శ్రీనివాస్‌

364
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles