బ్రెయిన్ స్ట్రోక్‌తో ఇక భయం లేదు!


Tue,October 29, 2019 12:40 AM

Strock

-వేగంగా స్పందిస్తే తప్పే పక్షవాతం ముప్పు
-అక్టోబర్ 29న వరల్డ్ స్ట్రోక్ డే

ఎంత చెట్టుకు అంత గాలి... అది ఒకప్పటి సామెత. ఎంత చెడ్డ అలవాట్లుంటే అన్ని రోగాలు.. ఇది ఇప్పటి మాట. మారిన ఆహార పద్ధతులు, చిన్నవయసులోనే మొదలుపెడ్తున్న దురలవాట్లు.. వెరసి.. ఎప్పుడో 60 దాటాక వచ్చే జబ్బులు కూడా ఇప్పుడు పాతికేళ్ల వయసులోనే వచ్చిపడుతున్నాయి. అలాంటి వ్యాధుల సరసన పోటీ పడుతున్న జబ్బు పక్షవాతం. అవును.. చిన్నవయసులోనే ఇప్పుడు పక్షవాతం బారిన పడుతున్నవాళ్ల సంఖ్య ఎక్కువవుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు, అంగవికలత్వానికి రెండో కారణంగా మారింది పక్షవాతం. అయితే పక్షవాతం బారిన పడ్డామని కుంగి పోనవసరంలేదు. త్వరగా హాస్పిటల్ చేరితే పక్షవాతం వచ్చినా కూడా ఎప్పటిలా నడిచే వీలు ఇప్పుడుంది. నేడు వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా పక్షవాతానికి ఉన్న కొత్త చికిత్సల గురించి..

ఒకప్పుడు.. పక్షవాతం అంటే ఇక అతని పని అయిపోయింది.. ప్రాణం పోయేవరకు మంచానికి అతుక్కుపోవడమే అని అనుకునేవాళ్లు. ఇంట్లో పక్షవాతం వచ్చిన రోగి ఉంటే కుటుంబమంతటి పైనా ఆ ప్రభావం ఉంటుంది. అందుకే పక్షవాతం అంటే చాలు.. ఆందోళన కలుగుతుంది. అయితే పక్షవాతం వచ్చిన వాళ్లకు వెనువెంటనే చికిత్స అందించగలిగితే వాళ్లను ఎప్పటిలా పనులు చేసుకునేట్టుగా చేయడం ఇప్పుడు సాధ్యమవుతున్నది. పక్షవాతం ఏ వయసులోనైనా రావొచ్చు. అందుకే పక్షవాతం లక్షణాలు, చికిత్సల గురించి అవగాహన పెంచుకుని సకాలంలో గుర్తించి, చికిత్స తీసుకోవాలి.

పక్షవాతం ఎలా వస్తుంది?

శరీరంలోని కణాలన్నీ ఆరోగ్యంగా ఉండాలంటే కణ కణానికీ నిరంతరం రక్తం సరఫరా కావాలి. మెదడు లోని కణాలు కూడా అంతే. ఏ కారణం చేతనైనా మెదడుకు తగినంత రక్తం అందకపోతే ఆయా కణాలు దెబ్బతిని చనిపోతాయి. ఇలా రక్తం అందకపోవడానికి ప్రధానంగా రెండు రకాల కారణాలున్నాయి.

ఇస్కిమిక్ స్ట్రోక్ : మెదడుకు మొత్తం నాలుగు రక్తనాళాలు వెళ్తాయి. ఇందులో రెండు రక్తనాళాలు ఎడమవైపు మెదడుకి, రెండు కుడివైపు మెదడుకి వెళ్తాయి. ఈ రక్తనాళాల్లో ఎక్కడైనా రక్తం గడ్డకడితే అది రక్తప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. దాంతో మెదడుకు రక్తసరఫరా సరిగా జరుగక పక్షవాతం వస్తుంది. దాదాపు 80 శాతం కేసుల్లో ఇదే కారణం.

హెమరేజిక్ స్ట్రోక్ : రక్తనాళాల్లో ఏదైనా చిట్లిపోయి, రక్తం బయటకు రావడంతో మెదడులోని కణాలు దెబ్బతింటాయి. ఇలాంటప్పుడు వచ్చే పక్షవాతం ఇది. దాదాపు 20 శాతం పక్షవాతం కేసులకు ఇదే కారణం.

ఎందుకు వస్తుంది?

పక్షవాతం రావడానికి ప్రధాన కారణం అధిక రక్తపోటు. మధుమేహం కూడా కారణమవుతుంది. బీపీ, మధుమేహం ఇంతకుముందైతే అరవయ్యేళ్ల వయసులో కనిపించేవి. కాని ఇప్పుడు మూడు పదుల్లోనే కనిపిస్తున్నాయి. అందుకే పక్షవాతం కూడా ఈ వయసువాళ్లలో ఎక్కువగా కనిపిస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా జంక్‌ఫుడ్‌కి అలవాటు పడడం, పబ్ కల్చర్ వల్ల స్మోకింగ్, ఆల్కహాల్ ఫ్యాషన్ అయిపోయాయి. డ్రగ్స్‌కు కూడా అలవాటు పడుతోంది నేటి యువత. ఇవన్నీ కూడా పక్షవాతానికి కారణమయ్యేవే. మరో ముఖ్య కారణం అధిక ఒత్తిడి. కార్పొరేట్ ఉద్యోగాలు పెరిగిన తరువాత చిన్న వయసులోనే అధిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దాంతో నిండా ముప్పయ్యేళ్లు దాటకుండానే పక్షవాతానికి గురవుతున్నారు. ఇలాంటి జీవనశైలి సంబంధిత కారణాలతో పాటు జన్యుపరమైన కారణాలు కూడా పక్షవాతం రావడానికి దోహదపడుతాయి. పక్షవాతానికి మరో కారణం డైసెక్షన్. దీనిలో రక్తనాళం లోని రెండు పొరలు విచ్చుకుంటాయి. సాధారణంగా రక్తనాళంలో 3 పొరలుంటాయి. వీటిలోమొదటి రెండు పొరలు ఓపెన్ అయిపోయి అందులోకి రక్తం వెళ్తుంది. దానివల్ల పక్షవాతం వస్తుంది. ఎక్కువగా మసాజ్ చేయించుకోవడం, లాంగ్ డ్రైవ్ చేయడం, డ్రైవ్ చేస్తూ మెడ వెనక్కి తిప్పడం వల్ల రక్తనాళాలు ట్విస్ట్ అయిపోయి ఇలాంటి సమస్య రావొచ్చు. చిన్నారుల్లో గుండెజబ్బుల వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలెక్కువ. ఆ తర్వాత సికిల్ సెల్ అనీమియా, మోయా-మోయా అనే వ్యాధి (దీనిలో రక్తనాళాలు సన్నగా అవుతాయి) లాంటివి చిన్నపిల్లల్లో పక్షవాతం రావడానికి కారణమవుతాయి.

పక్షవాతం వస్తే ఏమవుతుంది?

మెదడులోని నాడీ కణజాలానికి రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడినప్పుడు ఆ కణాలకు పోషకాలు, ఆక్సిజన్ అందక అక్కడి కణాలు నశిస్తాయి. ఇలాంటప్పుడు ఏ నాడీకణజాలం మన శరీరంలోని ఏ పనిని నిర్వర్తిస్తుందో ఆ కణజాలం దెబ్బతినడం వల్ల ఆయా పనులు చేయలేకపోతాము. ఉదాహరణకు కాలు, చెయ్యి కదలికలను నియంత్రించే నాడీకణజాలానికి రక్తం అందక అది మరణిస్తే ఇక కాలు, చెయ్యి కదిలించలేము. మాటకు సంబంధించి పనిచేసే నాడీకణజాలం దెబ్బతింటే మాట పడిపోవడమో, సరిగా మాట్లాడలేకపోవడమో లాంటి సమస్యలు వస్తాయి. అదే విధంగా ఏ అవయవానికి సంబంధించిన నాడీకణజాలం దెబ్బతింటే ఆ అవయవం చచ్చుబడుతుందన్నమాట.

ఎలా గుర్తించాలి?

-మాటలో తేడా రావడం, నత్తి
- మాట్లాడలేకపోవడం
-విన్నది అర్థం చేసుకోలేకపోవడం
-మూతి పక్కకి వెళ్లిపోవడం (ఫేషియల్ పెరాలిసిస్)
-ఒకవైపు చెయ్యి, కాలు బలహీనం కావడం
-ఒక కాలు లేదా ఒక చెయ్యి బలహీనం కావడం
- నడిస్తే అడుగులు తడబడడం
-ఒకరు ఇద్దరుగా కనిపించడం
-ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సిటి స్కాన్ చేసి ట్రీట్‌మెంట్ మొదలుపెట్టాలి.

చికిత్సతో బాగవుతుందా?

పక్షవాతం వచ్చినా నాలుగున్నర గంటల లోపు చికిత్స అందించగలిగితే శరీరం చచ్చుబడకుండా కాపాడవచ్చు. పక్షవాతానికి ఒకప్పుడు ట్రీట్‌మెంట్ లేదు. కానీ ఇప్పుడు గత 15 నుంచి 20 ఏళ్లుగా చికిత్స ఉంది. పక్షవాత లక్షణాలు కనిపించిన మొదటి నాలుగున్నర గంటలలోగా హాస్పిటల్‌కి వెళ్లి ట్రీట్‌మెంట్ మొదలుపెడితే అవకరాలు ఏర్పడకుండా ఉంటాయి. ప్రాణాపాయం తప్పుతుంది. హాస్పిటల్‌కి వెళ్లగానే మొదట సిటి స్కాన్ చేస్తారు. దీనిలో రక్తనాళం చిట్లి రక్తస్రావం కావడం వల్ల పక్షవాతం వచ్చిందా లేక బ్లాక్ వల్ల వచ్చిందా అనేది తెలుస్తుంది. రక్తస్రావం వల్ల కాకుండా బ్లాక్ వల్ల వచ్చిన ఇస్కిమిక్ స్ట్రోక్ అయితే వెంటనే క్లాట్ కరగడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఇది టిష్యూ ప్లాస్మోజెన్ యాక్టివేటర్ (టిపిఎ) లేదా టెనెక్టిప్లేస్ ఇంజెక్షన్. ఇలా ఇంజెక్షన్ ఇవ్వడాన్ని థ్రాంబోలైటిక్ థెరపీ అంటారు. దీనివల్ల అప్పటివరకు చచ్చుబడిన భాగాల్లో మెరుగుదల ఉంటుంది. ఈ ఇంజెక్షన్ వల్ల రక్తసరఫరాకు ఆటంకంగా ఉన్న గడ్డ కరిగిపోయి రక్తనాళం తెరుచుకుంటుంది. దాంతో రక్తసరఫరా సాఫీగా జరుగుతుంది. ఫలితంగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నాడీకణాలకు ఆక్సిజన్ అంది, ఇంప్రూవ్ అవుతాయి. ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ రక్తనాళంలో గడ్డ కరగకుండా రక్తనాళం తెరుచుకోకపోతే, మెకానికల్ థ్రాంబెక్టమీ చేస్తారు. అంటే ఎండోవాస్కులర్ థెరపీ ద్వారా కెథటర్ పంపి, క్లాట్ తీసేస్తారు. ఇది 6 గంటలలోపు చేయాలి. కొందరిలో 24 గంటల లోపు కూడా చేయవచ్చు. పక్షవాతం నుంచి కోలుకోవడానికి ఫిజియోథెరపీ అత్యంత ముఖ్యమైన చికిత్స. ఫిజియోథెరపీలో స్ట్రెంతెనింగ్ వ్యాయామాలు చేయిస్తారు. స్టిఫ్‌నెస్ పోవడానికి ఇంజెక్షన్లు ఇస్తారు. వాకింగ్ చేయిస్తారు. ఇలాంటి వాటివల్ల పక్షవాతానికి గురైన అవయవాలు శక్తిని పుంజుకుని, వాటి పనితీరు మెరుగుపడుతుంది. థ్రాంబోలైటిక్ థెరపీ ఇంజెక్షన్లు ప్రతి జిల్లాలోనూ జిల్లాస్థాయిలోనైనా అందుబాటులో ఉంటే అక్కడే వెంటనే చికిత్స ఇవ్వవచ్చు. వాళ్లు ఇక్కడివరకూ వచ్చే టైం మిగులుతుంది.

మొబైల్ స్ట్రోక్ యూనిట్స్

చాలాదేశాల్లో పక్షవాతానికి త్వరగా చికిత్స అందించేందుకు ప్రత్యేకమైన అంబులెన్స్ యూనిట్లు ఉంటాయి. వీటిని మొబైల్ స్ట్రోక్ యూనిట్స్ అంటారు. ఈ అంబులెన్స్ లోనే సిటి స్కాన్, డాక్టర్, నర్సు అందరూ ఉంటారు. పేషెంటు దగ్గరికి వెళ్లగానే అదే అంబులెన్సులో సిటి స్కాన్ చేసి, అక్కడే ఇంజెక్షన్ ఇస్తారు. ఇలాంటి యూనిట్లను ఇక్కడ కూడా ప్రారంభించే ఆలోచన ఉంది. అయితే మన దగ్గరి మొబైల్ స్ట్రోక్ యూనిట్‌లో సిటిస్కాన్‌ను ఉంచలేం. అందువల్ల పేషెంట్‌ను సిటిస్కాన్ చేయించుకుని రిపోర్ట్ వాట్సప్‌లో పంపమని చెప్తాం. ఈలోపు అంబులెన్స్ పేషెంట్ దగ్గరికి చేరుకుంటుంది. అక్కడే వెంటనే ఇంజెక్షన్ చేసేసి హాస్పిటల్‌కి తరలిస్తారు. పేషెంట్ హాస్పిటల్ దాకా వచ్చే టైం సేవ్ అవుతుంది.
Strock1

టైం.. అత్యంత కీలకం..!

నాడీకణాలు ఒకసారి చచ్చిపోతే ఇక కొత్త నాడీకణాలు ఏర్పడవు. కాబట్టి అవి నశించిపోకుండా చూసుకోవాలి. స్ట్రోక్ వచ్చినప్పుడు రక్తసరఫరా ఆగిపోయిన చోట ఉన్న కొన్ని కణాలు వెంటనే దెబ్బతింటాయి. నిమిష నిమిషానికీ ఇలా దెబ్బతినే కణాల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఒక నిమిషానికి 7 బిలియన్ల న్యూరాన్లు చనిపోతాయి. అందుకే పక్షవాతం వచ్చినప్పుడు ప్రతీ నిమిషం కీలకమైనదే. బ్లాక్ దగ్గర ఉన్న కణాల చుట్టూ కొంతమేర ఉండే కణజాలాన్ని పెనెంబ్రా అంటారు. దీన్ని రిస్క్‌లో ఉన్న కణజాలంగా పరిగణిస్తారు. ఈ కణజాలం ఎంత ఎక్కువ భాగం డ్యామేజి అయితే అంత ఎక్కువ నష్టం ఉంటుంది. టైం దాటిపోతున్న కొద్దీ చికిత్స ఫలితం వేరుగా ఉంటుంది. రిస్క్ కణజాలం మొత్తం డ్యామేజి అయితే ఏ చికిత్సా చేయలేం. అందుకే పక్షవాతం వచ్చినప్పుడు ఎంత తొందరగా హాస్పిటల్‌కి తీసుకొస్తే అంత మంచిది.
Strock2

100
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles