విలన్ పాత్ర చేయాలనుంది


Sun,October 27, 2019 01:17 AM

పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో సృజనశీలియైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు తరుణ్ భాస్కర్. ఓవైపు నిర్దేశకుడిగా సత్తాచాటుతూనే మరోవైపు నటుడిగా రాణిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం మీకు మాత్రమే చెప్తా నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. షమ్మీర్ సుల్తాన్ దర్శకుడు. ఈ సందర్భంగా తరుణ్‌భాస్కర్ నమస్తే తెలంగాణతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
Tarun

దర్శకుడి నుంచి హీరోగా టర్న్ అయ్యారు. ఊహించిన మలుపేనా ఇది?

హీరో అవుతానని అనుకోలేదు. కాకతాళీయంగా జరిగిపోయింది. నేను దర్శకత్వం వహించిన పెళ్లిచూపులు పెద్ద విజయాన్ని సాధిస్తుందని ముందుగా ఊహించలేదు. అలాగే హీరోను అయ్యాను. ఒకే మూసకు పరిమితం కాకుండా ప్రయోగాలతో కూడిన విభిన్నమైన పనులు చేయడం ఇష్టం.

హీరోగా సినిమా చేయడం ఎలాంటి అనుభూతిని పంచింది?

హీరోగా నటించడం కంటే దర్శకత్వమే ఉత్తమమని నా అభిప్రాయం. మన మనసులో ఆవిర్భవించిన ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడంలో ఉన్న వినోదం, ఉత్సుకత దీనిలో లభించదు.

మీ పాత్ర కోసం మిమ్నల్ని ఎంచుకోవాలనే ఆలోచన విజయ్ దేవరకొండదా? దర్శకుడిదా?

రాకేష్ అనే పాత్ర కోసం నన్ను తీసుకోవాలనే ఆలోచన దర్శకుడిదే. విజయ్ దేవరకొండ అతడికి చాలా అప్షన్ ఇచ్చారు. ఈ పాత్ర కోసం అన్వేషిస్తూ షమీర్ సుల్తాన్ నా దగ్గరకొచ్చారు. మహానటిలో నా నటన చూసిన తర్వాత వ్యక్తిగతంగా నన్ను కలిసి మాట్లాడారు. ఆ తర్వాతే క్యారెక్టర్‌కు నేను సరిపోతానని ఎంపిక చేశారు. అయోమయం, అందోళనా మనస్తత్వమున్న యువకుడిగా ఈ సినిమాలో కనిపిస్తాను.

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది? ఈ సినిమా నేపథ్యమేమిటి?

ఫోన్ అనేది ప్రతి ఒక్కరికీ పర్సనల్ డైరీలా మారిపోయింది. ప్రైవసీ నెపంతో ఫోన్ ఇతరులకు ఇవ్వం. ప్రైవసీ అనేది పెద్ద ఇష్యూగా మారింది. ఓ యువకుడి జీవితంలో ముఖ్యమైన వేడుక ముందు ఈ ప్రైవసీ సమస్య ఎలాంటి గందరగోళాన్ని సృష్టించిందనేది వినోదాత్మక పంథాలో ఈ సినిమాలో చూపించాం. ఫోన్ కారణంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయనే ఆలోచన సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరి లో మొదలవుతుంది. హీరో పాత్ర ఎదుర్కొనే సమస్య లు తమకు రావద్దనే భావన అందరిలో కలుగుతుంది.

పెళ్ళిచూపులు సినిమాతో వచ్చిన పేరు, గుర్తింపును తరుణ్ భాస్కర్ సరిగా వాడుకోలేదనే విమర్శలున్నాయి?

మానసిక ప్రశాంతతకు కంటే విలువైంది ఏదీ లేదని నా అభిప్రాయం. పెద్ద సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం కొందరికి వస్తుంది. కానీ దాని కోసం నచ్చనివాళ్లతో పనిచేయాల్సి ఉంటుంది. డబ్బు కంటే నాకు మానసిక ప్రశాంతతే ముఖ్యం. కుటుంబ మనుగడ కోసం డబ్బు సంపాదించడం అవసరమే. కానీ, మూడు, నాలుగు వందల కోట్లు సంపాదించుకోవాలనే డబ్బు పిచ్చి మాత్రం నాకు లేదు.

పెళ్లిచూపులు సినిమాతో విజయ్ దేవరకొండకు హీరో గా మంచి గుర్తింపు వచ్చింది. ఆ కృతజ్ఞతతోనే మిమ్మల్ని హీరోగా పరిచయం చేస్తున్నారని అనుకోవచ్చా?

మా ఇద్దరి మధ్య బలమైన స్నేహం ఉంది. నేను మంచిగా నటిస్తాను, స్నేహితుణ్ణి కాబట్టే నన్ను ఈ సినిమాలో విజయ్ తీసుకున్నాడని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ షమీర్‌సుల్తాన్‌కు విజయ్ దేవరకొండకు ఎలాంటి సంబంధం లేదు. మంచికథతో విజయ్‌ని అతడు వెతుక్కుంటూ వచ్చాడు. ఆ తర్వాత నన్ను హీరోగా తీసుకోవాలని అనుకున్నాడు. అలా నేను హీరోనయ్యానంతే. డబ్బులు పోతాయనే భయం కంటే దర్శకుడిగా నా ఇమేజ్‌కు ఏమైపోతుందనే భయంతోనే విజయ్ ఈ సినిమా విషయంలో ఎక్కువ టెన్షన్‌పడ్డాడు. తరుణ్‌ను ప్రొటెక్ట్ చేయమని ఎప్పుడూ చెబుతుండేవాడు. నా పట్ల విజయ్‌లో సోదరభావం కనిపిస్తుంది. ఆ మాట నాతో ఎప్పుడూ చెప్పలేదు.నా కోసమే ఈ సినిమా చేశాడనేది కనిపిస్తుంది.

స్వతహాగా మీరు ఓ దర్శకుడు. ఓ సినిమా రూపకల్పనలో దర్శకుడి పనితీరులో మీ జోక్యం ఎంత ఉంది? అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చారా?

తొలి షెడ్యూల్ చిత్రీకరణ సమయంలో దర్శకుడికి సలహాలు ఇవ్వాలనే ఆలోచనలు చాలా ఉండేవి. కానీ ఆ ఈగోను చంపుకోవడం నాకో పెద్ద డెవలప్‌మెంట్‌గా అనిపించింది. పూర్తిగా నటనపై మాత్రమే దృష్టిపెట్టాను. దర్శకుడి పనిలో నేను ఎలాంటి జోక్యం చేసుకోలేదు. సినిమా హిట్టయితే క్రెడిట్ మొత్తం దర్శకుడు షమీర్ సుల్తాన్‌దే. అతడి నుంచి నేను చాలా విషయాల్ని నేర్చుకున్నాను.

నటనలోని కిక్ మీరు ఎంతవరకు ఆస్వాదించారు?

నటుడిగా చాలా ఎంజాయ్ చేస్తూ సినిమాను పూర్తిచేశాను. ఆ క్యారెక్టర్‌లో మనల్ని మనం చూసుకోవడం, పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేశామనే భావనలో చాలా సంతృప్తి ఇమిడి ఉంటుంది.

విజయ్ దేవరకొండ కోసం కొత్త కథలు సిద్ధం చేసే ఆలోచన ఉందా?

విజయ్ కోసం కొన్ని ఆసక్తికరమైన కథలు సిద్ధం చేస్తున్నాను. సమయం దొరికినప్పుడు వాటి గురించి అతడితో చర్చిస్తుంటాను. విజయ్ కోసమే కాకుండా చాలామంది హీరోలను దృష్టిలో పెట్టుకొని కథలు రాస్తున్నాను. వెంకటేష్‌తో సినిమా చేయనున్నాను. వినూత్నమైన పాయింట్‌తో ఈ సినిమా రూపొందనున్నది. అలాగే నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ కథ రాస్తున్నాను.

భవిష్యత్తులో నటుడిగా ఎలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నారు?

ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమే. ముఖ్యంగా విలన్ పాత్ర చేయాలనుంది. అలాగే సీరియస్ రోల్స్ చేసి నా ప్రతిభను పరీక్షించుకోవాలని ఉంది. బిచ్చగాడి పాత్రలోనైనా నటిస్తా.

- సినిమా డెస్క్
- సీఎం ప్రవీణ్‌కుమార్

645
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles