నాలుగు వసంతాల శ్రేయోభిలాషీటీమ్


Wed,October 23, 2019 01:56 AM

ఈవ్ టీజింగ్‌కు గురైన వారు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు ఒకప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించేవారు. కుటుంబ పరువు పోతుందేమోనని కొందరు, పోలీస్‌స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందని మరికొందరు ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ వేసేవాళ్లు. ఎంతోమంది మహిళలు, యువతులు తాము చేయని తప్పుకు కుంగిపోయేవారు. అటువంటి వారిని రక్షించేందుకు తెలంగాణ సర్కారు ముందుకు వచ్చింది. మహిళలపై జరిగే అఘాయిత్యాలను, వేధింపులను అరికట్టేందుకు షీటీమ్స్‌ను ప్రారంభించింది. మహిళల రక్షణ కోసం ప్రారంభించిన షీటీమ్స్‌తో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. షీ టీమ్స్ నీడలా పోకిరీలను వెంటాడుతుండడంతో మహిళలను వేధించేందుకు వారు భయపడుతున్నారు. బాధితులకు షీటీమ్స్ అండగా ఉండటంతో ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకొస్తున్నారు. ఆ టీమ్స్ అతివల
శ్రేయోభిలాsheలా పనిచేస్తున్నాయి. నాలుగు వసంతాలు పూర్తిచేసుకున్న షీటీమ్స్ అక్టోబర్ 24న ఐదో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.

sheeteam
కార్యాలయాలు, కళాశాలలు, రైల్వేస్టేషన్లు, బస్టాప్‌లతో పాటు బహిరంగప్రదేశాల్లో మహిళలను, విదారిన్థులను వేధించే వారి భరతం పట్టేందుకు షీ టీమ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. పోకిరీల అగడాలను అరికట్టేందుకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన వారికి షీటీమ్స్ వారి తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సెలింగ్ ఇచ్చి మళ్లీ అలాంటి ఉదంతానికి పాల్పడకుండా వారిలో మార్పు తీసుకొస్తున్నారు. ఈవ్‌టీజర్లను పట్టుకోవడంతో పాటు వ్యవహరించాల్సిన తీరుపై షీ టీమ్ సభ్యులు ప్రత్యేక తర్ఫీదు పొందారు. వీరు బస్‌స్టాపులు, బస్సులు, మెట్రో రైల్ స్టేషన్లు, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లలో అమ్మాయిలను వేధిస్తున్న వారిని కనిపెడతారు. రహస్య కెమెరాలతో ఆకతాయిల ఆగడాలను షూట్ చేసి పట్టేస్తారు. దీనికోసం ప్రత్యేక టీమ్‌లు బహిరంగ ప్రదేశాల్లో, రద్దీ ప్రాంతాల్లోనూ నిఘా వేస్తుంటారు. ఆడపిల్లలను వేధించినట్టు కనిపిస్తే అదుపులోకి తీసుకుని వారిలో మార్పు తెస్తున్నారు. మరికొందరికి చేసిన నేరాన్ని బట్టి కఠినంగా శిక్షలూ వేస్తున్నాయి న్యాయస్థానాలు.


ఇదీ పద్ధతి

ఈయర్ (ఎగ్జామిన్, యాక్సెప్ట్, రిజెక్ట్) పద్ధతితో ఈవ్‌టీజర్ల పరివర్తనలో మార్పు తీసుకొస్తున్నారు షీ టీమ్ సభ్యులు. కౌన్సెలర్లు (మానసిక నిపుణులు) ఈవ్‌టీజర్ల వ్యక్తిత్వాన్ని తెలుసుకునేందుకు వారి కుటుంబ నేపథ్యంతోపాటు స్నేహితులకు సంబంధించిన విషయాలపై ప్రశ్నావళి ఇచ్చి పూర్తి చేయమంటారు. ఈ ప్రశ్నావళి ఆధారంగా కౌన్సెలర్లు అతన్ని పరీక్షిస్తారు. ఈవ్‌టీజింగ్ చేయలేదని తప్పించుకోజూస్తే షీటీమ్ బృందాలు షూట్ చేసిన వీడియోను వారి తల్లిదండ్రుల సమక్షంలోనే చూపిప్తారు. ఆ దృశ్యాలను చూసిన తర్వాత వారు ఎటువంటి తప్పు చేశారో తెలుసుకుంటున్నారు. ఇలా ఆడపిల్లలను వేధించే ఆకతాయిల్లో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు మన పోలీసులు.

ముఖ్యంగా కళాశాల ప్రాంగణాలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, మాల్స్‌లో ఆకతాయిల బారిన పడిన మహిళలు వాట్సాప్ ద్వారా షీ బృందాలకు ఫిర్యాదు చేస్తున్నారు. సంబంధిత షీటీమ్ బృందాలు మఫ్టీలో వెళ్లి ఈవ్‌టీజర్ల అకృత్యాలను కెమెరాలతో వీడియో తీస్తున్నారు. ఆ వెంటనే ఆకతాయిని పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగిస్తున్నారు. మేజర్ అయితే పెట్టీ కేసులు, మైనర్ అయితే కౌన్సెలింగ్ ఇస్తున్నారు. తద్వారా 90 శాతం మంది తమ తప్పులను తెలుసుకుంటున్నారు. షీ టీమ్స్‌కు చిక్కుతున్న వారిలో యువకులేకాదు, అన్ని వయసుల వారూ ఉండడం గమనార్హం.
shee-team

పీడీ యాక్ట్

తెలిసీ తెలియక ఆడవారిని వేధించేవారిని మొదటిసారి హెచ్చరించి, కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తారు. కావాలని ఏడిపించినవారిపై పెట్టీ కేసులు పెడుతున్నారు. మరింత తీవ్రమైన నేరం చేస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కోర్టుకు పంపుతున్నారు. పదేపదే ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై ప్రివెంటివ్ డిటెన్షన్(పీ.డీ.)యాక్ట్ అమలు చేస్తున్నారు. కేసుల రికార్డు నిర్వహణకు షీ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.

ఆమె సంరక్షణ కోసం ...

మహిళారక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ-టీమ్స్ నిఘా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. 2014లో హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన షీటీమ్స్‌మంచి ఫలితాలు ఇస్తున్నాయి. మహిళలు, బాలికలు, యువతులు, విద్యార్థినులను వేధిస్తున్న ఘటనలపై 100కు డయల్, ఫోన్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిపై విచారణ జరిపి బాధితులకు అండగా నిలుస్తున్నారు. షీటీమ్స్ తెలంగాణలోని 33 జిల్లాలకు విస్తరించాయి. జిల్లాల్లో మహిళలపై జరిగే అఘాయిత్యాలను అరికడుతూనే బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్ ఇస్తూ వారిలో ఆత్మైస్థెర్యాన్ని పెంచుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై జరిగే వేధింపులపైనే కాకుండా సోషల్ మీడియా ద్వారా మహిళలను బ్లాక్ మెయిల్ చేసే అకతాయిలనూ కఠినంగా శిక్షిస్తున్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఉన్న సమాచారం ప్రకారం 2,587 ఎఫ్‌ఐఆర్ కేసులు నమోదయ్యాయి. 5,608 మందిపై పెట్టీ కేసులు పెట్టారు. 12,188 మందికి కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మార్పు తీసుకువచ్చారు. బాధితుల గురించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచడం వల్ల మరింతమంది కేసులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు నమోదు చేసేందుకు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ రూపొందించారు. కొన్ని కేసులను సుమోటోగా స్వీకరించి పరిష్కరిస్తున్నారు. భరోసా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా బాధిత మహిళలకు పలు అంశాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తున్నారు.
sheeteam1

అవగాహనా కార్యక్రమాలు

ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో షీటీమ్ సభ్యులు ఈవ్‌టీజింగ్‌ను నిరోధించడానికి ప్రత్యేక ప్రచారం చేపట్టారు. దీనివల్ల తలెత్తే పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. అందుకోసం ప్రతి కళాశాలలో ఈవ్‌టీజింగ్ వ్యతిరేక కమిటీలు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటివరకు ఈవ్‌టీజింగ్‌కు వ్యతిరేకంగా 496పైగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. మల్కాజిగిరి, ఎల్‌బీనగర్, మాదాపూర్, ఐటీ కారిడార్, బాలానగర్, శంషాబాద్ జోన్‌లో 400కు పైగా ఉన్న హాట్‌స్పాట్స్ (ఆకతాయిల వేధింపులపై ఎక్కువ ఫిర్యాదు వచ్చే ప్రాంతాలు)పై షీ టీమ్స్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి. అక్కడ పోలీసులు ఉదయం సాయంత్రం వేళల్లో పెట్రోలింగ్ పెంచారు. మరోపక్క ఫోన్‌లో వేధింపులకు గురవుతున్న మహిళలు పోలీసుల భరోసాతో నేరుగా ఠాణాలకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు.

గతంలోకంటే ఇప్పుడు జనాల్లో చైతన్యం పెరిగింది. అందుకే తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు. పాఠశాలలు, కాలేజీలు, ట్యుటోరియల్స్, రైల్వేస్టేషన్లు, మాల్స్, బస్తీ తదితర ప్రాంతాల్లో మహిళా చట్టాలపై షీ బృందాలు పూర్తి స్థాయిలో అవగాహన కలిగిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తూ భరోసా కల్పిస్తున్నాయి. తద్వారా వేధింపులకు గురైన అతివలు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. నేరుగా ఫోన్‌కాల్స్ కూడా చేస్తున్నారు. గతంలో ఠాణా గడప తొక్కేందుకే ఆలోచించిన మహిళలు ఇప్పుడు అవే వేధింపులపై గళం విప్పుతుండడం శుభపరిణామం.

ఆన్‌లైన్ లో ఫిర్యాదులు

swati-lakra
మహిళల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది. ప్రవాస భారతీయులకు సంబంధించి ప్రత్యేకంగా ఓ విభాగం పనిచేస్తున్నది. మన రాష్ట్రంలో పెండ్లి చేసుకుని ఇతర దేశాల్లో ఉండే మహిళా బాధితులకు మన షీటీమ్ అండగా నిలుస్తున్నది. అటువంటి కేసులను కూడా పరిష్కరిస్తున్నాం. ఆన్‌లైన్ ద్వారా వారి ఫిర్యాదులు నమోదు చేసి విచారణ చేస్తున్నాం. ఇంకా చాలామంది బాధితులు ముందుకు రావాలి. గతంలో మహిళలు, యువతులు పట్టపగలు బయటకు రావాలంటే భయపడేవాళ్లు. షీటీమ్ వారికి అండగా నిలవడంతో వారు ధైర్యంగా ముందుకు వస్తుండడం అభినందనీయం.
-స్వాతి లక్రా, షీటీమ్ ఇన్‌చార్జీ

ఆగడాలకు అడ్డుకట్ట

dara-kavita-ips
వయసుతో సంబంధంలేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టి ఆడపిల్లలకు అండగా నిలుస్తున్నది షీటీమ్. బహిరంగ ప్రదేశాల్లోనూ, బస్సులు, రైళ్లలో మహిళలకు రక్షణ కల్పించేందుకు పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారు. వారు ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఎక్కువగా నేరాలు జరిగే ప్రదేశాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. కొంతమంది బాధితులు ఫిర్యాదు చేయడానికే వెనుకాడుతున్నారు. బాధితులు ముందుకు వస్తే వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచి సమస్యను పరిష్కరిస్తాం.
- కవిత, అడిషనల్ ఎస్పీ విమన్ సేఫ్టీ వింగ్.

ఇతర దేశాలకూ ఆదర్శం

తెలంగాణ సర్కారు మహిళల రక్షణ కోసం అమలు చేస్తున్న విధివిధానాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. దీంతో ఇతర దేశాలు, రాష్ర్టాలు కూడా షీటీమ్ అనుసరిస్తున్న విధివిధానాలను ఆయా చోట్ల వేర్వేరు పేర్లతో అమలు చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర , ఆంధ్రప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ వంటి రాష్ర్టాలు అక్కడి మహిళలను రక్షించేందుకు షీటీమ్ చేపడుతున్న చర్యలనే అనుసరిస్తున్నాయి. కెనడా నుంచి వచ్చిన అక్కడి పోలీసు బృందం తెలంగాణరాష్ట్ర పోలీసు వ్యవస్థపై అధ్యయనం చేశారు. ఇక్కడ మనం అమలు చేసే విధానాలపై వారు ప్రశంసలు కురిపించారు.

-పసుపులేటి వెంకటేశ్వరరావు
shee-team1
shee-team2

281
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles