కొత్త హాస్యావధానులు!


Wed,October 23, 2019 01:55 AM

కాలం మారింది.. పరిస్థితులు మారాయ్.. మనసుల స్వభావమూ మారింది. కాలానికి, పరిస్థితులకు, మనుషుల స్వభావానికి తగ్గట్లుగానే హాస్యంలోనూ మార్పు లొచ్చాయి. ఇన్నాళ్లూ హాస్యావధానం అంటే.. పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి.. సభికులను కడుపుబ్బా నవ్వించడం. ఈ తరహా హాస్యావధానం నుంచి వచ్చిందే ఇంప్రోవ్ కామెడీ. ఈ కొత్త తరహా హస్యవల్లరి ఇన్నాళ్లూ విదేశాల్లో, ఉత్తర భారతంలోనే అందుబాటులో ఉండేది. ఇప్పుడు హైదరాబాద్‌కూ వచ్చేసింది. తెలుగులోనూ సభికులను కడుపుబ్బా నవ్విస్తున్నది.
ntg
బుక్‌మై షో వెబ్‌సైట్‌లో.. తెలుగులో ఇంప్రోవ్ కామెడీ షో.. ఆగస్టు 24.. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అంటూ ప్రకటన.. తెలుగులో ఇదే మొదటి షో కావడంతో ఎక్కువగా జనం రారేమో అనుకొని బంజారాహిల్స్‌లోని నృత్యహాల్‌ను ఎంచుకొని, 30మంది వరకే టికెట్లు అమ్మకానికి పెట్టారు నిర్వాహకులు.
ఈ ప్రకటన ఏదో కొత్తగా ఉందే.. ఏంటో చూద్దాం అంటూ తెలిసినవాళ్లు, హాస్యంపై పరిజ్ఞానం ఉన్నవాళ్లు టికెట్లు బుక్ చేసుకున్నారు.
షో ఇంకా ప్రారంభమే కాలేదు.. నిర్ణీత సమయానికి 60మందికిపైగా వచ్చారు. వచ్చినవారిని కాదనలేక ప్రత్యేకంగా కుర్చీలు తెప్పించారు నిర్వాహకులు.
సమయం సాయంత్రం 7గంటలు.. షో స్టార్ట్ అయింది.


స్టేజ్ కర్టెన్ తీయగానే.. హాల్‌మొత్తం నిండిన ప్రేక్షకులను చూసి అవాక్కయ్యారు హ్యాసావధానులు. ఇక ఫస్ట్ సీట్లలో కూర్చున్న అనుకోని అతిథి ప్రముఖ దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ను చూసి మరోషాక్. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే విజయేంద్రప్రసాద్.. చిరునవ్వుతో వారిని ప్రోత్సహించడంతో రెట్టించిన ఉత్సాహంతో షో ప్రారంభించారు. ఇంప్రోవ్ కామెడీలో భాగంగా సభికులు ఇచ్చిన ఆసక్తికర సన్నివేశాలకు.. సందర్భోచితంగా కామెడీ పండిస్తూ.. షో ఆసాంతం ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పువ్వులు పూయించారు. హాస్యప్రియుడైన విజయేంద్రప్రసాద్ కూడా మనస్ఫూర్తిగా నవ్వుకొని.. తెలుగులో మొదటిసారిగా ఇంప్రోవ్ కామెడీ చేసిన జయశ్రీ బృందాన్ని మనసారా దీవించారు.

అసలేంటీ ఇంప్రోవ్ కామెడీ?

ఇదొక కొత్త నవ్వుల లోకం. ఈ విధానంలో ముందుగా స్క్రిప్ట్ రాసుకోవడం ఉండదు. స్క్రిప్ట్‌కు అనుగుణంగా నటించడం ఉండదు. సభకు హాజరైనవారు ఏదైనా ఒక టాపిక్ ఇస్తే.. అప్పటికప్పుడు ఆ టాపిక్‌కు అనుగుణంగా క్యారెక్టర్లు డిసైడ్ చేసుకుంటారు నటులు. ఆ క్యారెక్టర్లలోకి పరకాయ ప్రవేశం చేసి, సందర్భోచితంగా నవ్విస్తుంటారు. ఉదాహరణకు.. కూలర్ ఒక టాపిక్ అనుకుంటే.. భర్త, భార్య, అత్తమామలు, పిల్లలు క్యారెక్టర్లు ఎంచుకుంటారు. ఆ కూలర్‌లో నీళ్లు ఎవరు పోయాలి, ఎవరు క్లీన్ చేయాలి.. ఎవరు కొన్నారు.. దాని వెనుకపడిన కష్టనష్టాలు ఏంటి.. డబ్బులెంత ఖర్చు అయ్యాయి? అనే అంశాలతో ఫ్రెష్‌గా కామెడీ పండించడం. ఇందులో Yes, And అనేది నిబంధన. ఈ ఇంప్రోవ్‌లోనే ఒకే వేదికపై నాలుగు టాపిక్‌లు నడిచే విధానం ఉంటుంది. దానినే ఫోర్ స్వేర్స్ గేమ్ అంటారు. సభికులు ఇచ్చిన నాలుగు టాపిక్‌లతో వరసగా ఒకే వేదికపై హాస్యం పండిస్తారు. ఇలా ఒక్కో టాపిక్‌కు 3 నుంచి 5 నిమిషాల టైమ్ ఉంటుంది. ఒక్కోసారి ప్రేక్షకుల స్పందననుబట్టి సమయం పొడిగిస్తారు. అష్టావధానంలో పృచ్ఛకులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పినట్లే.. ఇందులో ప్రేక్షకులు ఇచ్చిన ప్రతి టాపిక్‌కు అనుగుణంగా క్షణాల్లోనే ఓ సీన్ క్రియేట్ చేసి, అప్పటికప్పుడు నవ్వించాలి.

కత్తిమీద సాము..!

ముందుగా స్క్రిప్ట్ అంటూ తయారు చేసుకోకపోవడం ఇంప్రోవ్ ప్రత్యేకత. అందుకే ఈ తరహా కామెడీ కత్తిమీద సాములాంటిది. ఎందుకంటే ప్రేక్షకులు ఎలాంటి టాపిక్స్ ఇస్తారో తెలియదు. కాబట్టి సమాజంలో జరిగే ప్రతీ అంశంపై అవగాహన ఉండాలి. పాత విషయాలు గుర్తుకు తెచ్చుకోవాలి. కొత్త విషయాలపై కసరత్తు చేయాలి. ఈ ట్రెండ్‌కు తగ్గట్లుగా కొత్తగా ఎలా కామెడీ పండించాలో తెలుసుకోవాలి. ఒక్కమాటలలో చెప్పాలంటే కాలంతోపాటు పరుగెత్తాలి. అలాగని ఎవరినీ కించపరిచేలా మాట్లాడకూడదు. సభకు వచ్చిన ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకొని వెళ్లడం వీరి ముఖ్య ఉద్దేశం. ఎక్కువగా ఇంటి వాతావరణం ప్రతిబింబించేలా అత్తా కోడళ్లు, భార్యాభర్తలకు సంబంధించిన జోకులే అడుగుతుంటారు ప్రేక్షకులు. పాత జోకులు చెప్పకుండా కొత్తవాటిపై కసరత్తు చేస్తేనే మరోసారి ప్రేక్షకుడు షోకు వస్తాడు. పాతవే రిపీట్ చేస్తే ప్రేక్షకులను సంపాదించుకోవడం చాలా కష్టం. ఇలాంటి చాలెంజింగ్ కామెడీని తెలుగులో పరిచయం చేసింది జయశ్రీ.

నవ్వించడమే వీరి పని..

హైదరాబాద్‌కు చెందిన జయశ్రీకి చిన్నప్పటి నుంచి నలుగురిని నవ్వించడమంటే చాలా ఇష్టం. ఎదుటివారిని ఏడిపించడం కన్నా.. నవ్వించడం చాలా కష్టం అంటున్నది. ఉర్దూ, ఇంగ్లిష్ బాగా మాట్లాడుతుంది. యాక్టింగ్ వైపు కూడా ఆసక్తి ఉన్నది. ఈమెకు నాటికలు వేయడం చాలా ఇష్టం. ఐ డ్రీం మీడియాలో దీనెమ్మ జీవితం అనే వెబ్ సిరీస్‌లో, ఈటీవీ ప్లస్‌లో కొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించింది. ఆ తర్వాత నటనకు స్వస్తి చెప్పి స్టాండప్ కామెడీవైపు అడుగులు వేసింది జయశ్రీ. ఓపెన్ మైక్స్ అనే విధానం ద్వారా ప్రేక్షకుల నవ్వులనాడిని తెలుసుకొని అనవసరమైన పదాలను తొలగించుకునే ప్రయత్నం చేసింది. 2017లో నిర్వహించిన స్టాండప్ కామెడీ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి క్వీన్ ఆఫ్ కామెడీ బహుమతి సాధించింది. ఆకాశవాణి రెయిన్‌బో ఎఫ్‌ఎంలో ఆర్జేగా చేస్తున్న జయశ్రీ ప్రతిభను గుర్తించి.. అన్ని ప్రైవేట్ ఎఫ్‌ఎం చానెల్స్ ఇంట ర్వ్యూ చేశాయి. ఈ బృందంలో మరో సభ్యురాలు ప్రణ వి. ఆమెదీ హైదరాబాదే. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. హాస్యంపై ఇష్టంతో స్టాండప్ కమెడియన్‌గా మారింది.

ఆ తరువాతే ఈ ఐసీహెచ్ బృందంలో చేరింది. అలాగే కేరళకు చెందిన అథిర కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగినే. హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నది. అమెరికన్ టీవీషోలు కూడా చేస్తోంది. హైదరాబాద్‌కు చెందిన జై సోలంకి కూడా జీఎస్టీ ప్రాక్టీషనర్. వీరితో పాటుగా అబిద్, వీణా నాయర్, నిహర్‌గౌడ్, శ్రీనివాస్ ఆర్యన్, బాబూరి వెంకటేశ్వర్లు, సంఘమేశ్వర్ వంటివారు వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ ఐసీహెచ్ ద్వారా ప్రేక్షకులను నవ్విస్తున్నారు. బెంగళూరుకు చెందిన కేవీఎం కిషోర్ వీరిని ప్రోత్సహిస్తున్నారు. ఈ టీమ్ సభ్యులంతా ఉన్నత విద్యావంతులే. అయిదంకెల జీతం అందుకుంటున్నవారే. వీరందరి అభిరుచి హాస్యం. అదే వీరిని కలిపింది. హాస్యంతోపాటు సామాజిక సేవ ఓ భాగం. వీరంతా మొదట్లో స్టాండప్ కామెడీ చేసేవాళ్లు. ఇప్పుడు ఇంప్రోవ్ చేస్తున్నారు. బాధల్లో ఉన్నవారికి హాస్యాన్ని పంచగలిగితే వాళ్లు సంతోషించడమే కాదు... జీవితాంతం మనల్ని గుర్తు పెట్టుకుంటారు. అదే వీళ్లు చేస్తున్నారు. ఎప్పుడైనా ఇంప్రోవ్ కామెడీ షో జరిగితే మీరు మిస్సవకండి.
ntg1

సామాజికాంశాలే అస్త్రంగా..

తెలుగు మొదటి స్టాండప్ కమెడియన్ రాజశేఖర్ మామిడన్న ఈ ఇంప్రోవ్ కామెడీని తొలిసారిగా హైదరాబాద్‌కు పరిచయం చేశారు. అప్పటి నుంచి హిందీ, ఇంగ్లిష్‌లోనే ఇంప్రోవ్ కామెడీ షోలు జరుగుతున్నాయి. మామిడన్న దగ్గర శిష్యరికం చేసిన జయశ్రీ.. తెలుగులో ఇంప్రోవ్‌ను ప్రవేశపెట్టాలని ప్రయోగం చేసింది. ఇందుకోసం ఫ్రెండ్ జై సోలంకితో కలిసి ఇంప్రోవ్ కామెడీ హైదరాబాద్ (ఐసీహెచ్) పేరుతో ఓ టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నది. తర్వాత బెంగళూరులో నిర్వహించిన వర్క్‌షాపులకు హాజరై.. మరింత మెరుగైన తర్వాత గత ఆగస్టు 24న మొట్టమొదటి తెలుగు ఇంప్రోవ్ షోను విజయవంతంగా నిర్వహించింది. ఈ కొత్త హాస్య విధానంలో కూడా సామాజికాంశాలను అస్త్రంగా చేసుకొని తనకంటూ ప్రత్యేకత చాటుకున్నది జయశ్రీ. ప్లాస్టిక్ భూతం, గృహహింస, ట్రాఫిక్, నేరాలు, జంతువధ, యానిమల్స్ కేర్ టేకింగ్, సైబర్ క్రైమ్స్, పిల్లలపై అఘాయిత్యాలు వంటి వివిధ అంశాలను కొత్తగా ప్రేక్షకులకు చెబుతూ అవగాహన కల్పిస్తున్నది. ఈ కొత్త హాస్యాన్ని మరింతమందికి చేరువ చేయడానికి ఉచితంగా ఇంప్రోవ్ కామెడీకి తరగతులు నిర్వహిస్తున్నది.

-డప్పు రవి

223
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles