కలల కానుకకు రూపమిస్తూ...


Tue,October 22, 2019 01:01 AM

zindagi
ఓ అందమైన జ్ఞాపకం మదిలో మెదులుతుంటే మనసంతా పులకింతగా ఉంటుంది. అదే జ్ఞాపకం ఓ అందమైన కళాకృతితో మన ముందే కదలాడుతుంటే.. ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందో కదా!. లక్ష్యం కోసం పోరాడేవారిని, బంధుమిత్రులకు దూరంగా ఉన్నవారిని.. జ్ఞాపకాలే జీవితంగా బతుకుతున్నవారిని ఓ సరికొత్త కళతో ఆకట్టుకుంటున్నది రిధీగుప్తా. సందర్భానికి తగ్గట్లుగా ‘మినియేచర్‌ ఆర్ట్‌'తో అద్భుత కళాకృతులను ఆవిష్కరిస్తున్నది. సృజనాత్మకతను జోడించి జీవకళ ఉట్టిపడేలా
వాటికి రూపమిస్తున్న రిధీగుప్తా.. తన మినియేచర్‌ ప్రపంచం గురించిన విషయాలను ‘జిందగీ’తో పంచుకున్నది.

zindagi6
ఓ యువకుడు కార్పొరేట్‌ ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఎప్పటికైనా అదే కంపెనీకి బాస్‌ అవ్వాలనేది అతని కల. చాలాసార్లు పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ క్లాసులకు వెళ్లాడు. అక్కడ స్పీచ్‌ వినగానే సాధించాలనే ఆవేశం, పట్టుదల పొంగుకొచ్చేవి. అవి ఓ గంట, అరగంట కంటే ఎక్కువసేపు ఉండేవికాదు. ఇలా ప్రతీసారి ఎవరో ఒకరు స్పీచ్‌ ఇవ్వాలంటే కుదరని పని. ప్రతీక్షణం కళ్లముందు తన లక్ష్యం కనిపిస్తూ ఉండాలనుకున్నాడు. ‘టినీజినీ’ సంస్థను సంప్రదించాడు. తన లక్ష్యం చెప్పాడు. కొద్దిరోజుల్లోనే అతని కలను అందమైన కళాకృతితో పొందుపర్చింది రిధీ. ఇప్పుడా కళాకృతిని చూస్తూనే తన గోల్‌ చేరుకునేందుకు శ్రమిస్తున్నాడతను.
zindagi5
ఐదుగురు అమ్మాయిలు కాలేజ్‌లో మంచి స్నేహితులు. చదువు పూర్తయింది. ఎవరి దారి వారిది. ఐదుగురికి పెండ్లిళ్లు అయ్యాయి. ఒక్కొక్కరు ఒక్కో దేశంలో స్థిరపడ్డారు. కలుసుకుందామంటే సమయం ఉండేది కాదు. గుర్తొచ్చినప్పుడల్లా వీడియోకాల్స్‌ చేసి మాట్లాడుకున్నా.. ఏదో వెలితి. ఈ ఐదుగురిలో ఓ యువతి రిధీని సంప్రదించింది. తమ కాలేజ్‌ రోజులు, తీపిజ్ఞాపకాలు గుర్తుచ్చేలా ఓ ఆకృతి చెప్పింది. ఆమె ఆలోచనలకు అనుగుణంగానే ‘కంబైన్డ్‌ స్టడీస్‌ ఆర్ట్‌'ను అందించింది రిధీ. అది చూసినప్పుడల్లా తన బాధంతాపోతుంది.
zindagi4
ఇలా ఎంతోమంది కలలకు తనదైన కళతో రూపమిస్తున్నది రిధీగుప్తా. ఇంతకీ రిధీ ప్రత్యేకత ఏంటంటే.. మినియేచర్‌ ఆర్ట్‌. దీనితో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించగలదు. మాల్స్‌, జ్యువెలరీ షాపులు, స్టాల్స్‌ను.. ఎక్కడెక్కడో ఉన్న అద్భుత, అందమైన ప్రదేశాలను కూడా ఇంట్లో మన కళ్లముందు కనిపించేలా కళాత్మకంగా డిజైన్‌ చేయగలదు. తేలికగా కనిపించే ఈ ఆర్ట్‌ను తయారు చేయడం క్లిష్టమైన ప్రక్రియ. ఈ మినియేచర్‌ ఆర్ట్‌ నేర్చుకుంటే వచ్చేది కాదు. ప్రతి వస్తువులోనూ ఒక రూపాన్ని చూడగలిగినప్పుడే అది అబ్బుతుందని అంటున్నది రిధీగుప్తా. ఈమెకు చిన్నప్పట్నుంచి లైబ్రరీ అంటే చాలా ఇష్టం. పుస్తకాలు బాగా చదువుతుండేది. సొంత లైబ్రరీ కావాలనుకున్నది. తనకు ఇష్టమైన బొమ్మల ద్వారా లైబ్రరీకి రూపమిచ్చింది. ఐస్‌క్రీమ్‌ పుల్లలు, కాగితం, స్మార్ట్‌ఫోన్‌ కవర్‌, థర్మాకోల్‌ వంటి వస్తువులే ఆమె సామాగ్రి. మనకు వృథా అనిపించిన వస్తువులకే అందమైన రూపమివ్వగలదు.
zindagi1

విభిన్న ఐడియాలు

రిధీ మినియేచర్‌ ఆర్ట్‌కు ఆదరణ పెరగడంతో.. ఎక్కువ సంఖ్యలో కస్టమర్లు వచ్చేవారు. వారు తమ విభిన్న ఆలోచనలను ఆమెకు చెప్పి.. అందమైన కళాకృతి తయారు చేయించుకునేవారు. ‘చంద్రుడి వెలుతురులో ప్రేమికులు కూర్చున్నట్లు, కూతురు పుట్టినరోజు జరుపుకొన్నట్లు, వివాహ వార్షికోత్సవం జరుపుకొంటున్నట్లు, జ్యువెలరీ స్టోర్‌ ప్రారంభిస్తున్నట్లు.. ఇలా ఎన్నో రకాల విభిన్న ఆలోచనలు. అలాంటి వాటన్నింటికీ రూపమిచ్చింది రిధీ. ఒక ప్రాజెక్ట్‌కు, మరొక ప్రాజెక్ట్‌కూ సంబంధమే ఉండదు. ప్రతీది భిన్నంగానే ఉంటుంది. ఈ మినియేచర్‌ ఆర్ట్‌కు పాత వస్తువులను రీసైకిల్‌ చేసి ఉపయోగిస్తానంటున్నది రిధీ. ఒక్కో ప్రాజెక్ట్‌కు 4 నుంచి 5 రోజులు పడుతుందట. ప్రాజెక్ట్‌ను బట్టి రూ.3000 నుంచి రూ.9000 వరకు ధర ఉంటుంది. మినియేచర్‌ ఆర్ట్‌తో పాటు ‘క్విల్లింగ్‌ ఆర్ట్‌' కూడా చేస్తుంది రిధీ. దేని ప్రత్యేకత దానిదే. వచ్చిన కస్టమర్లు ఏ ఆర్ట్‌పై ఆసక్తి చూపితే.. అదే ఆర్ట్‌తో వారి ఆలోచనలకు రూపం ఇస్తుంది.
zindagi3
zindagi7

వయసులో చిన్నదే..

20 యేండ్ల రిధీకి చిన్నప్పట్నుంచి బొమ్మలంటే ఇష్టం. వాటితోనే ఎక్కువ సమయం గడిపేది. తన మనసులో ముద్రపడిన అందమైన బొమ్మలు, జ్ఞాపకంగానే కాకుండా వాటికి సృజనాత్మక రూపమిచ్చేంతగా దగ్గరయ్యాయి. మినియేచర్‌పై పట్టు సాధించి ఇతరులకు నేర్పించేవరకు ఎదిగింది. కాలేజ్‌లో నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో పాల్గొని మినియేచర్‌ ఆర్ట్‌తో అందరినీ అబ్బురపరిచింది. ఫ్రెండ్స్‌కోసం మంచి బొమ్మలు తయారు చేసి ఇచ్చేది. అందరి నుంచి మంచి స్పందన వస్తుండడంతో మినియేచర్‌ ఆర్ట్‌నే కెరియర్‌గా ఎంచుకున్నది రిధీ. 2018లో ‘టినీజినీ’ సం స్థను ప్రారంభించింది. రిధీ చేసిన మినియేచర్‌ ఆర్ట్‌ను ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేది. నెటిజన్ల నుంచీ మంచి స్పందన వచ్చేది. వారు కూడా ఆన్‌లైన్‌లోనే తమకు నచ్చిన బొమ్మల కోసం ఆర్డర్లు ఇచ్చేవారు. పిల్లలకు వర్క్‌షాప్‌లు కూడా నిర్వహిస్తున్నది.
zindagi2

త్వరలో యూట్యూబ్‌ చానెల్‌!:

నాన్న ప్రవీణ్‌కుమార్‌ గుప్తా వ్యాపారి. తల్లి దీపాగుప్త గృహిణి. నాలోని కళను తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతోనే ఇక్కడి వరకు వచ్చాను. మినియేచర్‌, క్విల్లింగ్‌ ఆర్ట్‌కు కావాల్సిన మెటీరియల్‌ వీలైనంత వరకు ఇంట్లోనే సేకరిస్తాను. కొన్ని బయట మార్కెట్‌లో కొనుగోలు చేస్తా. వచ్చిన ప్రతీ ఆర్డర్‌కు వారం రోజులు గడువు తీసుకుంటా. కస్టమర్లను సంతృప్తి పరిచేందుకు ఎక్కువ సమయం తీసుకున్నా పర్వాలేదనిపిస్తుంది. మున్ముందు టినీజీని పేరుతో యూట్యూబ్‌ చానల్‌ పెట్టాలనుకుంటున్నా. మినియేచర్‌ ఆర్ట్‌ ట్యుటోరియల్‌తో మీ ముందుకు వస్తాను. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ teenygeniethings లలో మరిన్ని వివరాలకు సంప్రదించవచ్చు.
- రిధీ గుప్తా, మినియేచర్‌ ఆర్టిస్ట్‌

- వనజ వనిపెంట గడసంతల శ్రీనివాస్‌

483
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles