బ్రెయిన్ ట్యూమర్ నుంచి విముక్తినిచ్చే కొత్త ట్రీట్‌మెంట్


Tue,October 22, 2019 12:49 AM

WhatsApp-Image
మెదడులో గడ్డకు సర్జరీ చేయాలంటే ఎవరికైనా భయంగా, ఆందోళనగానే ఉంటుంది. సున్నితమైన మెదడులో గడ్డను తీసేయాలంటే కత్తిమీద సామే అయ్యేది ఒకప్పుడు. కాని వైద్యరంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు మెదడు సర్జరీలను కూడా
సురక్షితం చేశాయి. అలా వచ్చిందే ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్‌ఐ -న్యూరో నావిగేషన్ - న్యూరో మానిటరింగ్. మెదడు నుంచి క్యాన్సర్‌ను పూర్తిగా తొలగించడం ఒకప్పుడు సాధ్యమయ్యేది కాదు.. కాని ఇప్పుడు ఈ చికిత్సా విధానంతో క్యాన్సర్ గడ్డను సమూలంగా తీసేయడం సులభమైంది. మెదడులో నాడులు దెబ్బతినకుండా సురక్షితంగా చేయగల ఈ సర్జరీ హైదరాబాద్‌లో కూడా అందుబాటులో ఉంది. దాని గురించి..

Neurology


ఎంత సైజు గడ్డలు?

క్యాన్సర్ అయినా, కాకపోయినా మెదడులో ఏర్పడిన గడ్డలను తొలగించక తప్పదు. అయితే గడ్డ సైజు పెరిగే కొద్దీ సమస్యలూ, నష్టం పెరుగుతూ ఉంటాయి. కాబట్టి గడ్డ చిన్నదిగా ఉన్నప్పుడే త్వరపడాలి. చిన్న గడ్డ అయితే నరాలు దెబ్బతినకుండా ఉంటాయి. సర్జరీ తర్వాత క్యాన్సర్ నుంచి విముక్తి పొందే అవకాశాలూ పెరుగుతాయి. క్యాన్సర్ తిరగబెట్టే అవకాశాలూ తగ్గుతాయి. అలా కాకుండా పెద్ద గడ్డగా మారిన తర్వాత సర్జరీ చేయించుకుంటే ఎక్కువ నాడులకు నష్టం జరుగుతుంది. సర్జరీ తర్వాత కీమోథెరపీ, రేడియేషన్‌ల అవసరం పెరుగుతుంది. క్యాన్సర్ తిరగబెట్టే అవకాశాలూ ఎక్కువగానే ఉంటాయి.
Brain

సర్జరీతో ఉపయోగాలు

ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ సర్జరీతో ఉపయోగాలు ఎక్కువ. మెదడులో గడ్డలను సమూలంగా తొలగించడం ఒక ఎత్తయితే, ఎలాంటి కాంప్లికేషన్లు లేకుండా రోగికి నాణ్యమైన, మెరుగైన జీవితాన్ని అందించే ఉన్నతమైన చికిత్సగా ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్. ఈ సర్జరీతో మెదడులో గడ్డలను నూటికి నూరు శాతం తొలగించవచ్చు. అదే సమయంలో నాడులతో పాటు వాటి నుంచి అవయవాలకు అందే స్పందనలను గమనిస్తూ, వాటిని కాపాడుకోవచ్చు. క్యాన్సర్ నుంచి శాశ్వత విముక్తి పొందవచ్చు. సర్జరీ నుంచి కోలుకునే సమయాన్నీ తగ్గించుకోవచ్చు. సర్జరీతో సత్ఫలితం సాధించవచ్చు. ఇన్ని ఉపయోగాలు మెదడులోని గడ్డలను తొలగించే మరే రకమైన చికిత్సల్లోనూ ఉండవు.
Doctor

ఇంట్రా-ఆపరేటివ్ ఎంఆర్‌ఐ అండ్ న్యూరో మానిటరింగ్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ

32 ఏళ్ల కిరణ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆఫీసులో స్నేహితులతో మాట్లాడేటప్పుడు అతనికి ఉన్నట్టుండి నాలుక సహకరించడం మానేసింది. ఎందుకిలా జరుగుతోందని వైద్యులని కలిసి పరీక్షలు చేయిస్తే మెదడులో క్యాన్సర్ గడ్డ మాటలకు సంబంధించిన నాడిని నొక్కేస్తున్నట్టు తేలింది. మెదడులో క్యాన్సర్ గడ్డ అనగానే బెంబేలు పడిపోయిన కిరణ్ సర్జరీ గురించి చాలా భయపడిపోయాడు. మెదడుకు సర్జరీ అంటే ఏమైనా జరగొచ్చు. ఏమాత్రం పొరపాటు జరిగినా నాడులు దెబ్బతిని మాట పూర్తిగా పోవచ్చు. అంతకుమించిన నష్టం కూడా జరగొచ్చు. అయితే తన భయాలన్నీ అర్థం లేనివని సర్జరీ తర్వాత కిరణ్‌కు అర్థమైంది. సర్జరీతో క్యాన్సర్ నుంచి శాశ్వత విముక్తి పొందడమే కాదు, అంతకుముందు లాగా ధారాళంగా మాట్లాడగలుగుతున్నాడు. ఇదంతా ఇంట్రా ఆపరేటివ్ ఎమ్‌ఆర్‌ఐ. న్యూరో నావిగేషన్, న్యూరో మానిటరింగ్ వల్లనే సాధ్యమైంది.

మెదడులో గడ్డ అనగానే ఉలిక్కిపడతాం. ప్రాణభయంతో వణికపోతాం. ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుంటాం. కానీ గడ్డ ఎలాంటిదైనా, ఎంత పరిమాణంలో ఉన్నా, ఏ రకమైనా.. దాన్ని కూకటివేళ్లతో పెకిలించి, వ్యాధి నుంచి విముక్తి కలిగించి, ప్రాణ ప్రదానం చేసే సురక్షితమైన, అంతిమ చికిత్స ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్. మెదడుకు సంబంధించిన గడ్డల విషయంలో ఈ సర్జరీ విధానాన్ని మించిన సమర్థమైన, ఫలవంతమైన, ఉన్నతమైన, సురక్షితమైన చికిత్స మరొకటి లేదు. ఎటువంటి నష్టం లేకుండా, నూటికి నూరు శాతం ఫలం దక్కాలన్నా, ఉన్నవాటన్నింటిలో ఉత్తమమైన చికిత్స కావాలనుకున్నా ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్‌నే ఎంచుకోవాలి. ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్‌ఐ, న్యూరో నావిగేషన్, న్యూరో మానిటరింగ్‌లతో కూడిన చికిత్స ఇది.
Angiography

మెదడులో గడ్డలు

మెదడులో క్యాన్సర్ (మాలిగ్నెంట్) లేదా క్యాన్సర్ కాని (బినైన్) అని రెండు రకాల గడ్డలు వస్తూ ఉంటాయి. ఇవి ఏర్పడిన భాగాన్ని బట్టి అక్కడి నాడులతో సంబంధం ఉన్న అవయవాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. కిరణ్ విషయంలో మాటకు సంబంధించిన నాడి ప్రభావితం అయింది. అలాగే వినికిడికి సంబంధించిన నాడి దెబ్బతింటే చెవులు పనిచేయకుండా పోతాయి. ఇలాంటప్పుడు సర్జరీతో ఆ భాగంలోని గడ్డను తొలగించాలి. ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ విధానం అందుబాటులోకి రాకముందు మెదడులోని గడ్డలను తొలగించే సర్జరీ సమయంలో కేవలం కంటికి కనిపించినంత మేరకే గడ్డను తొలగించేవారు. ఆ సమయంలో అక్కడి నాడులు ఏ మేరకు పనిచేస్తున్నాయి..? వాటికిస్పందనలు ఉన్నాయా..? అనే విషయాలను వైద్యులు తెలుసుకునే వీలు ఉండేది కాదు. దాంతో నాడికి నష్టం కలుగకుండా గడ్డను తొలగించాలని ప్రయత్నించేవారు. అందుకే కొంత క్యాన్సర్ గడ్డను వదిలిసి కుట్లు వేసేవారు. ఆ సమయంలో నాడి పనిచేస్తుందో లేదో, స్పందనలు ఉన్నాయో లేదో తెలుసుకునే అవకాశం వైద్యులకు ఉండేది కాదు. సర్జరీ అయిపోయిన తరువాత రేడియేషన్, కీమోథెరపీలతో క్యాన్సర్‌ను నయం చేసేవారు. కాని పూర్తిగా తొలగించకుండా వదిలేసిన ఆ కొద్ది క్యాన్సర్ గడ్డ తరువాతి కాలంలో పెరిగి సమస్యలు తెచ్చిపెడుతుంది.

ఇంతకు ముందు అనుసరించే విధానంలో సర్జరీ ముగిసి, రోగి తెలివిలోకి వచ్చిన తరువాతే నాడి దెబ్బతినకుండా ఉన్నదీ లేనిదీ తెలిసేది. ఒకవేళ సర్జరీ వల్ల అప్పటికే నాడి దెబ్బతింటే తిరిగి సరిదిద్దే వీలు ఉండదు. దాంతో రోగికి సర్జరీ ఫలం దక్కకుండా పోవడంత పాటు నాడి నష్టం కూడా జరిగేది. తిరిగి రెండోసారి సర్జరీ అవసరమయ్యేది. ఈ ఇబ్బందులేవీ లేకుండా సర్జరీ చేసేటప్పుడే ఏ మేరకు క్యాన్సర్ గడ్డ నాడులను ఆక్రమించుకుంది, ఎంతవరకు మెదడు లోపలికి చొచ్చుకుపోయింది అనేది న్యూరోమానిటరింగ్ విధానం ద్వారా స్పష్టంగా చూసే వీలు ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్‌లో సాధ్యపడుతుంది. అంతేకాదు, సాధ్యమైనంత మేరకు ఆ గడ్డను తొలగించే వెసులుబాటుతో పాటు నాడులు దెబ్బతింటున్నాయా, నాడుల్లో స్పందనలు ప్రసరిస్తున్నాయో లేదో జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ సర్జరీ చేసే వీలు కూడా ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్‌లోనే ఉంది. ఓ పక్క సర్జరీ చేస్తూనే అప్పటికప్పుడే ఎంఆర్‌ఐ పరీక్షతో మెదడులో పూర్తి గడ్డ తొలగించిందీ లేనిదీ పరీక్షించి సర్జరీని కొనసాగించే వీలు కూడా దీనిలో ఉంది. ఇందుకోసం ఆపరేషన్ థియేటర్‌లోనే ఎంఆర్‌ఐ వెసులుబాటు ఉంటుంది.

న్యూరో మానిటరింగ్‌తో నాడులు భద్రం

సర్జరీ సమయంలో నాడులు దెబ్బతినకుండా ఉండాలంటే క్యాన్సర్ గడ్డ చుట్టూ ఉన్న నాడులకు ఏయే అవయవాలతో సంబంధం ఉందో ఆ అవయవాలు స్పందిస్తున్నాయో లేదో గమనిస్తూ ఉండాలి. ఇందుకు న్యూరోమానిటరింగ్ అనే సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతుంది. అయితే ఈ చికిత్సలో నాడులకు మెదడు నుంచి అందే స్పందనలను తెలుసుకోవాలంటే రోగిని మెలకువలో ఉంచి సర్జరీ చేయాలి. కాబట్టి మిగతా సర్జరీల్లో లాగా రోగికి జనరల్ అనెస్తీషియా ఇవ్వడం సాధ్యపడదు. కాబట్టి నొప్పి తెలియకుండా, రోగిని మెలకువగా ఉంచే ప్రత్యేకమైన మత్తు ఇంజెక్షన్లు (అవేక్ సర్జరీ) రోగికి ఇస్తారు. వీటితో కండరాలు విశ్రాంతి చెందకుండా, నొప్పి తెలియకుండా రోగి మెలకువగా ఉంటాడు. ఇలా చేసే సర్జరీని అవేక్ సర్జరీ అంటారు. ఈ న్యూరో మానిటరింగ్ సహాయంతో ఆపరేషన్ థియేటర్‌లోనే ఉండే టెక్నీషియన్లు, వైద్యులు సర్జరీ చేస్తున్నప్పుడు నాడుల స్పందనను గమనిస్తూ ఏ చిన్న తేడా వచ్చినా వైద్యులను అప్రమత్తం చేస్తారు. దాంతో క్యాన్సర్ గడ్డను తొలగించే వైద్యులు నాడి దెబ్బతిననంత మేరకే ఎంతో జాగ్రత్తగా గడ్డను తొలగిస్తారు. నాడి దెబ్బతింటుందనుకుంటే మరింత లోతుకు వెళ్లకుండా ఆగిపోతారు. ఈ వెసులుబాటు వల్ల నాడులను దెబ్బతీయకుండా వీలైనంత ఎక్కువగా మెదడులోని గడ్డలను తొలగించే వీలుంది. మరీ ముఖ్యంగా ఇలాంటి గడ్డల కారణంగా పార్షియల్ పెరాలసిస్ రాకుండా ఉంటుంది. ఉదాహరణకు చెవి వెనుక భాగంలో గడ్డ ఏర్పడితే ఆ వైపు చెంప కండరాలకు ఫేషియల్ పెరాలసిస్ వచ్చి అందవిహీనంగా తయారవుతారు. న్యూరో మానిటరింగ్ విధానంలో సర్జరీ చేస్తే ముఖంలోకి వెళ్లే నాడి దెబ్బతినకుండా ఆ మేరకే గడ్డను తీయవచ్చు. మిగిలిన గడ్డను కీమోథెరపీ, రేడియేషన్‌లతో కరిగించవచ్చు.

గడ్డకు 3డి రూపం.. న్యూరో నావిగేషన్

నావిగేషన్ అంటే దారి చూపించడం. ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్‌లో భాగమైన న్యూరో నావిగేషన్ ఉపయోగించే వైద్యులకు మెదడులోకి వెళ్లే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. మెదడు, దానిలోని గడ్డ, అది పెరిగిన తీరు, మెదడులోకి చొచ్చుకువెళ్లిన దూరం, నాడుల మీద గడ్డ వల్ల పడే ఒత్తిడి.. ఇవన్నీ కంటితో చూసి కనిపెట్టలేం. కానీ ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ చికిత్సా విధానంలోని న్యూరో నావిగేషన్ మెదడు, గడ్డ, నాడులు.. ఈ మూడింటిని మూడు కోణాల్లో కళ్లకు స్పష్టంగా చూపిస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రాని రోజుల్లో వైద్యులు కేవలం తమ అనుభవాన్ని బట్టి గడ్డ సైజును, భాగాన్ని అంచనా వేసి సర్జరీతో తొలగించేవారు. ఇలా చేయడం వల్ల నాడులు దెబ్బతినవచ్చు. గడ్డ ఎంతో కొంత మెదడులోనే మిగిలిపోతూ ఉండవచ్చు. లేదంటే గడ్డను తొలగించే క్రమంలో నాడులకు నష్టం జరిగి పక్షవాతం కూడా రావొచ్చు. కాని ఈ కొత్త పద్ధతి ద్వారా ఇటువంటి ఇబ్బందులేమీ ఉండవు.

సత్వర స్కానింగ్.. ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్‌ఐ

మెదడులో అవసరమైనంత మేరకు గడ్డ తొలగించి కుట్లు వేసిన తర్వాత ఎంఆర్‌ఐ పరీక్షలో మరికొంత క్యాన్సర్ గడ్డ మిగిలిపోయిందని ఫలితం వస్తే.. మళ్లీ ఆ మిగిలిపోయిన గడ్డను తొలగించడం కోసం మరొక సర్జరీ చేయడం శ్రమ, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అలాగని ఆ గడ్డను వదిలేస్తే అది తిరిగి పెరిగిపోయి ప్రాణాంతకం కావొచ్చు. కాబట్టి ఇలాంటి పొరపాట్లకు వీలు లేకుండా సర్జరీ చేస్తున్నప్పుడే గడ్డను తొలగించి, తెరచిన పుర్రెను మూయకముందే ఎంఆర్‌ఐ పరీక్ష చేసే వెసులుబాటు ఉంది. అదే.. ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్‌ఐ. ఈ పరీక్ష కోసం రోగిని మరో ప్రదేశానికి తరలించాల్సిన అవసరం లేకుండా ఆపరేషన్ థియేటర్‌లోనే ఎంఆర్‌ఐ సదుపాయం ఉంటుంది. దీంతో అక్కడికక్కడే, అప్పటికప్పుడే గడ్డ పూర్తిగా తొలగించిందీ లేనిదీ తెలుసుకోవచ్చు. ఫలితాన్ని బట్టి గడ్డ ఇంకా మిగిలి ఉంటే వైద్యులు దాన్ని కూడా సమూలంగా తొలగించి సర్జరీ ముగిస్తారు. ఈ వెసులుబాటు వల్ల క్యాన్సర్ నుంచి శాశ్వత విముక్తి కలుగుతుంది.

వెన్నుపాము సమస్యలకు కూడా..

పుట్టుకతో కొంతమంది పిల్లలకు వెన్ను తెరుచుకుని ఉంటుంది. మరికొందరికి వెన్నుపాము వంకరగా ఉంటుంది. తెరుచుకుని ఉన్న వెన్నును సర్జరీతో మూయడానికి కూడా ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ విధానం అవసరమవుతుంది. వెన్నుపాము మధ్యలో ఉండే నాడుల సముదాయం దెబ్బతింటే అవయవాలు శాశ్వతంగా పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ నాడులకు మెదడు నుంచి స్పందనల ప్రసారాన్ని గమనిస్తూ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఈ వెసులుబాటు ఇంట్రాఆపరేటివ్ న్యూరో మానిటరింగ్‌లోనే ఉంది. అలాగే వంకరగా ఉన్న వెన్నుపూసలను సరిచేసే (స్కోలియోసిస్), వెన్ను నిటారుగా మార్చడానికి ఇదే విధానాన్ని ఆశ్రయించవచ్చు. వెన్నులోని నాడులు దెబ్బతినకుండా సురక్షితంగా ఉండేలా చూసుకుంటూ, వెన్నును సరిచేయడం ఈ విధానంతో సాధ్యం. అలాగే వెన్నుపాములో ఏర్పడే గడ్డలను తొలగించడానికి కూడా ఈ సర్జరీ విధానం మంచిది.
neurogen-brain

163
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles