కళ్లు తెరిచి చదవండి ఈమె కథ


Wed,October 16, 2019 01:34 AM

కలదేముంది? కళ్లు మూసుకుంటే ఎవ్వరైనా కనొచ్చు. కానీ ఈమెది.. కళ్లు తెరిచినా మూసినా ఒకటే ప్రపంచం. అంధకారం. అందరిలా కాదు. అయినా కలతచెందలేదు. కలగన్నది. తన లక్ష్యం కోసం ఎన్ని అవాంతరాలు ఎదురైనా చీకటిని జయించి సరికొత్త రికార్డు సృష్టించింది. భారతదేశపు తొలి అంధ మహిళా ఐఏఎస్ అధికారిగా చరిత్రకెక్కింది. ఈ విజయగాథ వెనుక ఎంతో వ్యథ.. కష్టాల కథ ఉన్నది.
pranjal
మంచి ఉద్యోగం సాధించాలంటే పరీక్షలు పాసవ్వాలి. పోటీని ఎదుర్కోవాలి. ఈ పరీక్షలు అందరికీ ఓ దశలో వచ్చేవే. కానీ ప్రంజల్ పాటిల్ జీవితమే ఓ పరీక్షగా మారింది. చిన్నతనంలోనే ఆమె జీవితాన్ని చీకటి అలుముకున్నది. ఆరేండ్లప్పుడే ఆమెకు వందశాతం దృష్టి లోపించింది. అప్పుడు ఆమె కోల్పోయింది చూపును మాత్రమే మేధస్సును కాదు. చీకటి నిండిన కన్నులతోనే కలలు కన్నది. జీవితంలో చదువుల జ్యోతిని వెలిగించుకుంది. జీవితం అనే పరీక్షలో ప్రతి దశనూ ఎదుర్కొంది. బెగినింగ్, లెర్నింగ్, స్ట్రెంథెనింగ్ అన్ని ఫేజ్‌లను దాటింది. ఇప్పుడు ఓ విజేతగా నిలిచింది. ఆమె ఎదుర్కొన్న ప్రతి ఫేజ్ స్ఫూర్తినిచ్చేదే..


1. Beginning phase

బలహీనమైన కంటి చూపుతో ఆమె జన్మించింది. రోజులు గడిచాయి. ఆడుతూపాడుతూ బడికి వెళ్లింది. బడికెళ్తున్న కొద్ది రోజులకే ఆమె దృష్టి మరింత మసకబారడం ప్రారంభమైంది. సూర్యరశ్మి ఆమె కండ్లను నేరుగా తాకడంతో ఆమె దృష్టిని పూర్తిగా కోల్పోయింది. ఆమెకప్పుడు ఆరేండ్ల వయసు పసి ప్రాయంలోనే ఆమెను చీకటి అలుముకుంది. ఆరేండ్ల వయసులో తెలుసు జీవితం అంటే. తల్లిదండ్రులు మాత్రం ఆమె చదువును మధ్యలో ఆపాలనుకోలేదు. కండ్లు లేవని ఆమె జీవితం మధ్యలోనే ఆగిపోవడానికి వారు ఇష్టపడలేదు. మహారాష్ట్రలో అంధుల కోసం ప్రత్యేకంగా నడిపే కమలా మెహతా స్కూల్‌లో చేర్పించారు.

2. Learning phase

దేశ భవిష్యత్ తరగతి గదిలోనే రూపు దిద్దుకుంటుంది అన్న మాట ఎంత నిజమో ప్రంజల్ భవిష్యత్తు కూడా ఆ తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంది. పాఠశాలలో చేరిన తర్వాత ఆమె మేధస్సు మెరుగు పడింది. పరీక్షల్లో ఎప్పుడూ ముందుండేది. మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో ఇంటినుంచి ఆమె రోజూ పాఠశాలకు హాజరయ్యేది. శివాజీ టెర్మినస్ రైల్వేస్టేషన్ నుంచి ఆమె రోజూ నడుచుకుంటూ వెళ్లేది. అక్కడ ప్రయాణికులు ఆమెకు సాయం చేసేవారు. రైల్లో ఎక్కించడానికి, రోడ్డు దాటడానికి, ఎప్పుడూ ముందుండేవారు. ఇట్లా ఆమె పాఠశాలకు వెళ్లడానికి ఎప్పుడూ ఎక్కువ ఇబ్బంది పడలేదు. తర్వాత చాందీబాయి హిమాత్మల్ మన్సుఖాని కళాశాలలో ఇంటర్ చేసింది. మంచి మార్కులతో పాసైంది. ముంబైలోని సెయింట్ జేవియర్ కళాశాలలో డిగ్రీలో చేరింది. బీఏలో పొలిటికల్ సైన్స్ ఎంచుకుంది.

3. Strengthening phase

ఒక పరీక్షకు సిద్ధమయ్యేటప్పుడు పై రెండు దశలను దాటి సుదీర్ఘ ఫలితం కోసం కష్టపడేదే ఈ మూడో దశ. జీవితపు పరీక్ష రాసేటప్పుడు ఎంత కష్టం వస్తే అంత పోరాడడం ఈ దశలో నేర్చుకుంటాడు మనిషి. సమస్యలకు తగ్గట్టు సత్తా చూపిస్తాడు. ఒక దశలో ఓడిపోయినా, ఇంకో దశలో గెలుస్తాడు. ప్రంజల్ జీవితంలో మూడో దశ ప్రారంభమైంది. డిగ్రీలో పొలిటికల్ సైన్స్‌లో చేరింది. ఇదే సమయంలో ఆమె జీవిత లక్ష్యం ఎంచుకుంది. కాలేజీలో ఓ రోజు ఆమె స్నేహితుడు కలిశాడు. ఇండియన్ ఆడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ( ఐఏఎస్) గురించి ఒక ఆర్టికల్ వినిపించాడు. ఆ సమయం ఆమెకు సివిల్ సర్వీస్‌పై ఆసక్తిని పెంచింది. సివిల్ సర్వీస్‌లోనే ఆమె జీవితాన్ని కొనసాగించడానికి నిర్ణయించుకుంది.

ఇప్పుడు సివిల్ సర్వీస్ ఆమె డ్రీమ్. అనుకున్నవెంటనే ఆమె ప్రయత్నాలు చేయలేదు. ఆటలో గెలవడం వేరు, ఉత్తమంగా గెలిచి నిలవడం వేరు. ఆమె సివిల్ సర్వీస్‌లో ఉత్తమంగా నిలవాలనుకుంది. పూర్తిగా సిద్ధమయ్యాకే సివిల్ సర్వీస్ ప్రయత్నాలు ప్రారంభించాలనుకుంది. అందుకే పరీక్షకు సిద్ధమయ్యేంత వరకూ ఆలస్యం చేసింది. డిగ్రీ తర్వాత ఆమె ఢిల్లీలోని జేఎన్‌యూ (జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ) మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరింది. ఆమె జీవితం పూర్తి చదువుల ప్రపంచంలో వెల్లివిరిసిందక్కడే. 2015లో జేఎన్‌యూలో ఆమె ఎంఫిల్ డిగ్రీ చేస్తున్న క్రమంలో యూపీఎస్‌సీ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. దీని కోసం టెక్నాలజీ సాయం తీసుకుంది. జేఏడబ్య్లూ (జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్) స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్‌వేర్‌తో ఆమె పరీక్షలకు సిద్ధమయింది. అక్షరాలను శబ్ధంలోకి మార్చి వినిపిస్తుంది ఈ సాఫ్ట్‌వేర్.

ఇలా ఆమె సివిల్ సర్వీస్‌కు సిద్ధమైంది. ఈ టెక్నాలజీ చాలా కఠినతరమైందనీ, దీన్ని ఉపయోగించడానికి అవసరమైన పుస్తకాలన్నిటినీ స్కాన్ చేయాల్సి ఉంటుందని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో పాటు ఆమె పరీక్షలు రాయడానికి ఓ సహాయకున్ని పెట్టుకోవాల్సి వచ్చేది. సాధారణంగా పరీక్ష సమయం 3 గంటలు ఉంటే సాయం చేసే వారికి ఎక్కువ సమయం పట్టేది. అందుకే వేగంగా రాసే వారిని వెతికి పట్టుకోవడంలో ప్రంజల్ కొంత ఇబ్బంది ఎదుర్కొన్నది. అలాంటి సమయంలోనే విధూషి అనే మిత్రురాలు ఆసరా అయింది. ఆమె చాలా వేగంగా రాసేది. ఒకవేళ ప్రంజల్ జవాబులు చెప్పడంలో నెమ్మదిగా ఉంటే ఆమె తిట్టేది. అందుకే ప్రంజల్ మరింత వేగంగా జవాబులు చెప్పడానికి సిద్ధమయ్యేది. సివిల్స్‌కు సిద్ధమవుతున్న క్రమంలో ప్రంజల్ ఏ కోచింగ్ సెంటర్‌ల్లో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు. కేవలం మాక్ టెస్టులకు మాత్రమే హాజరయ్యేది. ఇది ఆమెలో క్రమశిక్షణను పెంపొందించిందని చెప్తుంది.
pranjal1

4. Finishing phase

సివిల్స్ కోసం పూర్తిగా సిద్ధమైన తర్వాత ఆమె 2015లో యూపీఎస్సీ పరీక్ష రాసింది. 773వ ర్యాంకు వచ్చింది. ఐఆర్‌ఏఎస్ (ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్)లో ఉద్యోగం సాధించింది. దీని కోసం 2016 డిసెంబర్‌లో శిక్షణ ప్రారంభవవుతుందని ఆమెకు సమాచారం ఇచ్చారు. కానీ వంద శాతం దృష్టి లోపం ఉన్నవారికి నియమించలేమని ఆమె నియమకాన్ని రద్దు చేశారు. ఇది ప్రంజల్‌కు బాధ కలిగించింది. న్యాయం కోసం ప్రధాని మోడీకి, అప్పటి రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభుకు లేఖ రాసింది. ప్రభుత్వం స్పందించింది. కానీ ఆమె ఈ ఉద్యోగానికి తగినట్టుగా భావించలేదు.

5. Achievement

రైల్వే ఉద్యోగం విరమించుకునే సమయంలో ప్రంజల్ జేఎన్‌యూలో పీహెచ్‌డీ చేస్తున్నది. 2017 మరో ప్రయత్నంగా యూపీఎస్సీ పరీక్ష రాసింది. 124వ ర్యాంకు సాధించింది. ఐఏఎస్‌కు అర్హత సాధించిన తొలి అంధ విద్యార్థిణిగా గుర్తింపు పొందింది. 2018లో యూపీలోని లాల్‌బహదూర్‌శాస్త్రీ నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడ్మినిష్ర్టేషన్ నుంచి ఐఏఎస్ శిక్షణ మొదటి దశను పూర్తి చేసుకుంది. 2018 మేలో కేరళలోని ఎర్నాకుళం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా విధుల్లో చేరింది. అక్కడ నుంచి తాజాగా ఆక్టోబర్ 14న తిరువనంతపురం సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించింది. మొదటి రోజు ఆమెకు కలెక్టర్ కె. గోపాల కృష్ణన్ స్వాగతం పలికారు.

ప్రంజల్ అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నప్పుడే సోదరుని వివాహం అయింది. ఆ వివాహంలో ప్రంజల్, ఆమె భర్త కోమల్ సింగ్ పాటిల్ అందరినీ ఆశ్చర్యపరిచారు. అవయవదానం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇద్దరూ సంతకాలు చేశారు. అవయవదానం కోసం అందరిలో చైతన్యం కలిగిస్తామని చెప్పారు.

- వినోద్ మామిడాల

995
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles