ఉన్నచోటే ఉపాధి


Wed,October 16, 2019 01:13 AM

మెడికల్ కోడింగ్&ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యంలోకి వస్తున్న ఉద్యోగం. ఇండియాలో అంతగా గుర్తింపు లేనప్పటికీ ఇప్పుడిప్పుడే ఇక్కడ కూడా వేళ్లూనుకుంటున్నది. బీఎస్సీ, మైక్రో బయాలజీ, లైఫ్‌సైన్స్, బీఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫిజియో థెరఫీ,
నర్సింగ్ వంటి వైద్య సంబంధ కోర్సులు చదివిన వారికి ఈ రంగంలో అవకాశాలు ఎక్కువ. మెడికల్ కోడింగ్ బిల్లింగ్ విధానంలో కొత్తగా అనేక ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా మెడికల్ కోడింగ్ రంగంలో యువతను స్థిరపర్చేందుకు మెడిసన్ హెల్త్‌కేర్ సంస్థ కృషి చేస్తున్నది. వేలాదిమందికి శిక్షణనిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఆ సంస్థ అధినేత డాక్టర్ సంతోష్‌కుమార్ గుప్త. మెడికల్ కోడింగ్ విదేశాల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఆయా దేశాల్లో ఈ ఉద్యోగం చేసేవారు తక్కువ. అందుకని అక్కడి ఇన్సూరెన్స్ కంపెనీలు మన ప్రాంత యువతను ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నాయి. భారీ ప్యాకేజీలు ఇస్తున్నాయి. ఆయా కంపెనీలకు మెడికల్ కోడింగ్ పనిచేసేందుకు ఓ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఇందుకోసం మెడిసన్ హెల్త్‌కేర్ సంస్థ శిక్షణ అందిస్తున్నది. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు మూడు నెలలు. తెలుగు మీడియం విద్యార్థులకు ఆరునెలల కోచింగ్ ఇస్తారు. అవకాశాలను బట్టి ఉద్యోగాలనూ కల్పిస్తారు.

employement

అసలేంటీ మెడికల్ కోడింగ్

మనకు జబ్బు చేస్తే హాస్పిటల్‌కు పరిగెడతాం. అవసరమున్నా లేకున్నా.. కొన్ని టెస్టులు జరిగిపోతుంటాయి. పరిస్థితిని బట్టి అడ్మిట్ చేసుకుంటారు. లేదంటే మందులిచ్చి పంపించేస్తారు. చికిత్స అనంతరం బిల్లు కడతాం. హెల్త్‌కార్డులు ఉంటే బిల్లులు పెట్టుకుంటాం. అప్రూవల్ అయితే అక్కడికే ఆనందపడతాం. మళ్లీ కొన్నాళ్లకు జబ్బు చేస్తే పాత పద్ధతినే అనుసరిస్తాం. అయితే విదేశాల్లో అలా కాదు. పుట్టిన పాపాయి నుంచి పండుటాకుల వరకు అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. ఇది ఆయా దేశాల్లోని నిబంధన. ఇతర దేశాల్లో హాస్పిటల్‌కు వెళ్తే ఆస్పత్రి సిబ్బంది రోగి హెల్త్ ఇన్సూరెన్స్ నంబర్, అనారోగ్య కారణాలు, పూర్తి డేటా సేకరిస్తారు. ఆ తర్వాత పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుని ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా వెళ్లిపోతాడు. హాస్పిటల్ యాజమాన్యం వారి చికిత్సకైన ఖర్చుల్ని ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి తీసుకుంటుంది. ఆయా హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ కంపెనీలకు బిల్లులు పెట్టుకుంటాయి. ఈ క్రమంలో హాస్పిటల్స్ పెట్టుకున్న బిల్లుల్ని నిర్ధారించేందుకు ఒక కోడింగ్ వ్యవస్థ ఉంటుంది. కోడ్స్‌ను ఉపయోగించి బిల్లులను కోడర్స్ అప్రూవల్ చేస్తుంటారు. మెడికల్ వ్యవస్థలో ప్రతి వ్యాధికి ఒక కోడ్ కేటాయించి ఉంటుంది. వ్యాధి తీవ్రతను, స్థాయిని నిర్ధారించే వారిని మెడికల్ కోడర్స్ అంటారు.

కోడింగ్ వర్క్ మనకే ఎందుకిస్తున్నారు?

అమెరికాలో ఉద్యోగులకు డిమాండ్ ఎక్కువ. మన దగ్గర చెల్లించే జీతంతో పోలిస్తే దాదాపు పది రెట్లు అక్కడి ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలో రాత్రయితే మన దగ్గర పగలు. అక్కడి వారు నిద్రించే సమయంలో మన దగ్గర కోడింగ్ చేసి పంపవచ్చు. వీటన్నింటికంటే మన దగ్గర అంకితభావంతో పనిచేసే యువత ఎక్కువ. మెడికల్ కోడింగ్ సిస్టమ్ మన దగ్గర అమలులో లేదు. అయినప్పటికీ కొన్ని కంపెనీలు ఇక్కడి యువతకు ఉద్యోగాల్ని ఆఫర్ చేస్తున్నాయి. నెలకు రూ. 15 వేలు నుంచి రూ.70 వేల వరకు ఇచ్చి ఉద్యోగాల్ని ఆఫర్ చేస్తున్నాయి. ప్రతీ ఏటా CPC (Certified Professional Coder) లో ఉత్తీర్ణులయ్యే వారికి ఈ అవకాశం లభిస్తున్నది.

సీపీసీలో ఉత్తీర్ణులయ్యేలా తీర్చిదిద్దుతారు!

సంతోష్‌కుమార్ గుప్త హైదరాబాద్ వాసి. ఆయన మెడిసన్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించి పదేళ్లుగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 5 వేల మందికి శిక్షణ ఇచ్చారు. ఇందులో 80 శాతం మందికి ఉద్యోగాలొచ్చాయి. సీపీసీలో ఉత్తీర్ణులయ్యేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దడంలో ఆయన విజయం సాధిస్తున్నారు. 1999లో సంతోష్‌కుమార్ ఒక మెరిట్ వైద్య విద్యార్థి. ఆయన తండ్రి ఒక బట్టల దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేసేవారు. తన కొడుకును ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలనే తండ్రి ఆశయాన్ని నీరు గార్చలేదు సంతోష్‌కుమార్. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లి ప్రతిభతో యూఎస్ సర్టిఫైడ్ కోడర్‌గా పేరు పొందారు. అంత సాధించినా మనసులో ఏదో వెలితి. తన పురిటిగడ్డకు ఏదో చేయాలనే ఆలోచన అతడిని ఓ పట్టాన నిద్రపోనివ్వలేదు. ఆ సమయంలోనే కొంత మంది మెడిసిన్ చదివిన వాళ్లు, సైన్స్ స్టూడెంట్స్ సంతోష్‌ను ఉపాధి అవకాశాలు కల్పించమని అడిగారు.

అప్పుడప్పుడే అమెరికాలోని కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల మీద కన్నేశాయి. ఆయా ప్రాంతాల యువతతో మెడికల్ కోడింగ్ చేయించుకునేవి. అక్కడితో పోలిస్తే చాలా తక్కువ మొత్తం చెల్లించేవి. 2003లో సంతోష్ తిరిగి హైదరాబాద్ వచ్చారు. స్థానికంగా ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ మధ్యమధ్యలో అమెరికా వెళ్లివచ్చేవారు. అక్కడి కంపెనీల్లో కోడింగ్ పనులను చూసుకునేవారు. ఆ తర్వాత తానే కంపెనీ పెట్టి వేలాది మందికి ఉపాధి కల్పించాలని అనుకున్నారు. కానీ స్థానిక యువతకు మెడికల్ కోడింగ్ గురించి తెలియదనే విషయాన్ని గమనించాడు. ఆర్థికంగా పరిస్థితులు అనుకూలించకపోవడంతో కంపెనీ ఆలోచనను పక్కన పెట్టేశారు. 2009 వరకు ఓ ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేశారు.

విద్యార్థుల్ని తీర్చిదిద్దారిలా..

2009లో హిమాయత్‌నగర్‌లో MEDESU-కోచింగ్ సెంటర్ ప్రారంభించారు. మొదటి బ్యాచ్‌లో 40 మంది శిక్షణ పొందితే 40 మంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆ తర్వాత అమీర్‌పేటకు ఇన్‌స్టిట్యూట్‌ను మార్చారు. మూడు నెలల మెడికల్ కోడింగ్ కోర్సులో మెడికల్ బిల్లింగ్, ఆస్ట్రేలియా కోడింగ్, ఆడిటింగ్, రిస్క్ అడ్జెస్ట్‌మెంట్ కోడింగ్, హాస్పిటల్ కోడింగ్ నేర్పిస్తారు. ఆయన దగ్గర శిక్షణ పొందిన వారిలో అత్యధికంగా ఏడాదికి రూ. 20 లక్షలు వేతనం తీసుకునే వారు కూడా ఉన్నారు. మెడికల్ కోడింగ్‌లో లక్షాయాభై వేల కోడ్స్ ఉంటాయి. వీటిని సులభమైన మార్గంలో కోచింగ్‌లో నేర్పిస్తారు. సీపీసీ(Certified Professional Coder) ఎంట్రన్స్‌కు విద్యార్థుల్ని సిద్ధం చేస్తారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్షకు హైదరాబాద్‌లో సెంటర్ కూడా ఉన్నది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే కోటివీటీ, ఎక్లాట్, విప్రో, డిలైట్, డబ్ల్యూఎన్‌ఎస్, విజన్2కే, మెడ్‌స్పేస్ తదితర కంపెనీలు మెడికల్ కోడర్స్‌కు శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తాయి. అంతేకాకుండా ఆన్‌లైన్ ద్వారా అమెరికా, దుబాయ్‌లోని విద్యార్థులకు సైతం సంతోష్ శిక్షణ ఇస్తున్నారు. అమెరికాలో ఉన్న మెడిసన్ బ్రాంచి ద్వారా అక్కడి విద్యార్థులు శిక్షణ పొందుతారు. ఇతర దేశాల్లోని అన్ని ప్రముఖ నగరాల్లో సైతం ఉద్యోగాల్ని కల్పిస్తున్నారు.

employement3

ఉపాధి అవకాశాలు ఎక్కువ

ఇండియాలో ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య శ్రీవంటి పథకాలకు మెడికల్‌కోడింగ్‌ను అమలు చేయాలి. తద్వారా వాటిలో జరిగే అవినీతిని అరికట్టవచ్చు. మెడికల్ కోడింగ్‌లో యువతకు ఉపాధి అవకాశాల్ని కల్పించవచ్చు. చాలా కంపెనీల్లో మెడికల్ కోడర్‌గా ఉద్యోగ అవకాశాలున్నాయి. మెడికల్ కోడింగ్‌కు మంచి డిమాండ్ ఉంది. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న విద్యార్థులకు ఇది మంచి అవకాశం. గ్రామీణ విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడిన వారికోసం ఫీజులో రాయితీ ఇస్తున్నాం. ఉద్యోగం సాధించాకే డబ్బులు చెల్లించాలనే శిక్షణ ఇస్తున్నాం. పేద విద్యార్థులను సైతం ఆదుకుంటున్నాం.
- డాక్టర్ మిర్యాల సంతోష్‌కుమార్ గుప్త, మెడిసన్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకులు

employement2

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు!

డాక్టర్‌గా, బోధకుడిగా సంతోష్‌కుమార్ విధులు నిర్వహిస్తూనే 43 డిగ్రీలు సాధించారు. ఈ రంగంలో ఇప్పటివరకు ఇన్ని డిగ్రీలు పొందిన మొదటి వ్యక్తిగా సంతోష్ నిలిచారు. సీసీఎస్-పీ, సీసీఎస్, సీపీసీ, సీవోసీ, సీఐసీ, ఎఫ్‌ఎన్‌ఆర్, సీజీఎస్‌సీ, ఆర్‌ఎంఏ ఇలా పలు డిగ్రీలు పొందారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సైతం చోటు దక్కించుకున్నారు. ఏహెచ్‌ఐఎంఏ ఐసీడీ-10 మొదటి ట్రైనర్‌గా కూడా సంతోష్‌కుమార్ గుర్తింపు పొందారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న తన స్నేహితుల ద్వారా కోడింగ్‌లో విద్యార్థులకు ఉపాధి కల్పిస్తున్నారు. తెలంగాణలోని పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు అనేక మంది ఉద్యోగాల్లో స్థిరపడేందుకు చేయూతనిచ్చారు. అత్యధిక డిగ్రీలు సాధించిన వ్యక్తిగా రాష్ట్రంలో సంతోష్‌కుమార్‌కు మంచి గుర్తింపు ఉంది.

మీరూ శిక్షణ పొందొచ్చు..

సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న విద్యార్థులు ఎవరైనా మెడికల్ కోడింగ్ ద్వారా ఉపాధి పొందవచ్చు. తెలుగు మీడియం వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఉంటుంది. సీపీసీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు శిక్షణ ఇస్తారు. వివరాలకు 9966933693, 9492021666లో సంప్రదించవచ్చు.

-పడమటింటి రవికుమార్
-చిన్న యాదగిరిగౌడ్

2101
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles