మేమున్నామనీ.. మీకేం కాదనీ!


Wed,October 16, 2019 01:02 AM

ఆనందం..

చదువు అయిపోయినంక మా బిడ్డెను అమెరికా పంపిస్తాం
మా కొడుకు ఢిల్లీలోనే సెటిల్ అయ్యిండు

ఆరాటం..

మా బిడ్డె ఆస్ట్రేలియా నుంచి ఏమో పంపిందంట కొంచెం తెలుసుకో నాయనా
మా కొడుకు డబ్బులు పంపిస్తా అన్నడు.. వచ్చినయా కొంచెం చూడమ్మా


ఆవేదన..

అంత గావురంగా పెంచి పెద్ద చేస్తే.. వాళ్లు అమెరికాలో.. మేం ఇక్కడ
ఢిల్లీ ఎంతదూరం? ఎప్పుడు చూసినా బిజీ బిజీ. యాడాదికొక్కసారి కూడా రాకపాయె

Anvayaa
ఇలా.. ఓదార్పు లేక నిట్టూర్పుతో సహవాసం చేస్తున్న తల్లిదండ్రులు ఎక్కడో అక్కడ తారసపడుతూనే ఉన్నారు. ఆశ రేకెత్తి ఆనందంగా పిల్లల్ని తమకు దూరంగా వేరే రాష్ర్టాలకు.. వేరే దేశాలకు పంపుతారు. తర్వాత వారికోసం ఆరాటపడుతారు. బిజీ లైఫ్‌లో తల్లిదండ్రులను కలవలేక.. చూడలేకపోతున్న పిల్లలకు సైతం పేరెంట్స్‌కు ఏ లోటూ లేకుండా చూసుకోవాలి అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు డబ్బులు.. కావాల్సిన సామగ్రి అందేట్లు చొరవ చూపిస్తుంటారు. కానీ కలిసేది లేదు.. వారిని చూసుకునేది లేదు. ఆయుష్షు మీదపడి.. అనారోగ్యం దరిచేరి ఒంటరిగా ఉంటున్న పేరెంట్స్‌కు ఆసరా అవుతూ తోడుగా నిలుస్తున్నది అన్వయ డాట్ కామ్. ఇదొక స్టార్టప్ సంస్థ.

తోడుగా నిలుస్తూ ..

పిల్లలు కళ్లెదుట లేకపోతే తల్లిదండ్రులకు ఎప్పుడూ ఏదో లోటు కనిపిస్తుంది. కనీసం మనవలు.. మనవరాండ్లతో అయినా కాలక్షేపం చేద్దామా అనుకుంటే అందరూ ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉంటారు. చేతగాని వయసులో ఓ పెండ్లికి పోలేరు.. పేరంటానికి పోలేరు. ఏ కాళ్ల నొప్పులో.. బీపీ.. షుగర్ తిప్పలో పరీక్ష చేయించుకోవడానికి హాస్పిటల్ కు కూడా వెళ్లలేని పరిస్థితి. తినడానికైనా అన్నం వండుకోలే రు.. అలాగనీ బయట నుంచి తెచ్చుకునే ఓపిక ఉండదు. ఏ ఆర్నెళ్లకోసారో బయటకు వెళ్లి మనసు కుదుట పడేసుకుందామనుకుంటే తీసుకెళ్లేవారెవరు? అనే ప్రశ్న దగ్గరే ఆగిపోతా రు. ఇలాంటి పనులన్నీ మేం చేసి పెడతాం.. మిమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటా అని భరోసా ఇస్తున్నది అన్వయ డాట్ కామ్. పొద్దున పలకరింపు నుంచి పాలబిల్లు దాకా.. ఆరోగ్య పరీక్ష నుంచి ఆరు బయట పిక్‌నిక్ దాకా.. అన్నింట్లో ఆసరా అవుతూ పిల్లలు దగ్గరా లేని లోటు పూడుస్తున్నది అన్వయ.

ఏమేం చేస్తారు?

అన్వయ డాట్ కామ్ సంస్థ ఆధ్వర్యంలో పేరెంట్స్‌ను చూసుకోవడానికి ప్రతి ఆరు కుటుంబాలకు ఒక కేర్ మేనేజర్.. నర్సు.. సెక్యూరిటీ ఆఫీసర్ పర్యవేక్షణ ఉంటుంది. ఇరవై నాలుగు గంటలూ నర్స్ పర్యవేక్షణలో ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు జరుగుతాయి. హృద్రోగులుంటే దవాఖానాలు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఎమర్జెన్సీ సేవలు అందిస్తారు. 105 ఎమర్జెన్సీ కేసుల్లో 98 శాతం సక్సెస్ సాధించారు. కాల్ సెంటర్ నుంచి మెడిసిన్స్ వాడుతున్నారా? ఇంట్లో ఏం సమస్యలున్నాయి? అంటూ ఇంటి సభ్యుల్లా పలకరించి వారి యోగక్షేమాలు చూసుకుంటున్నారు. అలా చూసుకోవడానికి కేర్ టేకర్స్ అన్వయలో ప్రస్తుతం 42 మంది ఉన్నారు. వీరికి డబ్బు కన్నా సేవా థృక్పథం ముఖ్యం. వీరు తెలంగాణ పోలీస్ వారి హాక్‌ఐలో నమోదై ఉన్నారు కూడా.

ఎలాంటి ప్లాన్స్?

జూబ్లీహిల్స్‌లో అన్వయ కేర్ సెంటర్ ఉంది. దీని ద్వారా తమ పేరెంట్స్‌కు సేవలు అందాలి అనుకునేవారు www.anvayaa.com ద్వారా పేరు నమోదు చేసుకోవాలి. అన్ని సేవలు హోం డెలివరీ ఉంటాయి. మూడు దశల్లో 24x7 సేవలు అందిస్తారు. హెల్త్‌ప్లాన్‌లో.. హెల్త్ కేర్ అసిస్టెంట్లు, డాక్టర్లు, అంబులెన్స్, ఫార్మసీలు, హోం హెల్త్ కేర్, డయాగ్నస్టిక్ సెంటర్లు, హాస్పిటల్స్, డెంటిస్టులు అందుబాటులో ఉంటారు. హోం కేర్ అసిస్టెంట్స్ ప్లాన్‌లో సాధారణ అవసరాలేంటో సమకూరుస్తారు. ఫ్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రిషియన్స్ ఈ ప్లాన్‌లో ఉంటారు. కుకింగ్, బిల్ పేమెంట్స్, బర్త్ డే సెలబ్రేట్స్ వంటి సేవలు అందిస్తారు. ప్రతీది అన్వయ యాప్‌కు అనుసంధానం చేస్తారు.
Anvayaa1

ఆలోచన ఎలా వచ్చింది?

అన్వయ ఫౌండర్ ప్రశాంత్‌రెడ్డి. ఒక్కడే కొడుకు. చదువు పూర్తయిన తర్వాత అమెరికా వెళ్లి.. పలు దేశాల్లో ఉద్యోగం చేశాడు. పేరెంట్స్ హైదరాబాద్‌లో.. అతను విదేశాల్లో. పేరెంట్స్‌కు ఏ అవసరం వచ్చినా ఇతరుల సహాయం తీసుకునేవాడు. ప్రతీసారి ఇతరులపై ఆధారపడటం నచ్చలేదు. అమెరికా, ఆఫ్రికా, యూరప్, కెనడాలో టాటా కన్సల్టెన్సీ కంపెనీలో పది సంవత్సరాల పాటు పనిచేసి ఇండియాకు వచ్చేశాడు. తాను ఒకప్పుడు ఎలాగైతే తల్లిదండ్రులకు సేవలందించాలని వేడుకున్నాడో.. స్నేహితుల నుంచి కూడా తనకు అవే రెక్వెస్ట్‌లు వచ్చాయి. నేనైతే తీరిక చేసుకొని వచ్చేశాను కానీ.. నాలాగ అందరూ రాలేరు కదా? ఏదైనా పరిష్కారం కనుక్కొని ఒంటరిగా బతుకీడుస్తున్న నా తల్లిదండ్రుల్లాంటి వారికి ఆసరా అవ్వలేనా? అని ఆలోచించి ఒన్‌స్టాప్ సీనియర్ కేర్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటుచేసి.. 400 కుటుంబాలపై సర్వే చేసి అన్వయ డాట్ కమ్ రూపొందించాడు. అన్వయ అంటే సంస్కృతంలో కుటుంబం అని అర్థం.

లక్షమంది మా లక్ష్యం

రూ. 60 లక్షలతో దీనిని ప్రారంభించాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు కేంద్రంగా సేవలందిస్తున్నాం. ప్రస్తుతం 800 కుటుంబాలకు అన్వయ సేవలు అందుతున్నాయి. వచ్చే మూడేండ్లలో పుణె, ముంబై, ఢిల్లీ నగరాల్లోనూ మా సేవల్ని విస్తరిస్తాం. ఒక కుటుంబానికి ఏడాదికి రూ. 45వేల నుంచి రూ.1,50,000 వరకు ప్యాకేజీ ఉంటుంది. సభ్యులు ఎంతమంది ఉన్నా ప్యాకేజీ ఒకేవిధంగా ఉంటుంది. లక్ష మందికి సేవ చేయాలన్నది మా లక్ష్యం. అన్వయ సేవల గురించి తెలుసుకోవాలనుకుంటే +91 7288818181 నంబర్ ద్వారా సంప్రదించవచ్చు.
-ప్రశాంత్‌రెడ్డి

-వర్ధెల్లి బాపురావు, సిటీబ్యూరో
-చిన్న యాదగిరి గౌడ్

420
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles