నాడీ సంబంధిత సమస్య, గుండెపోటు, రక్తపోటు, మూర్ఛ.. సమస్య ఏదైనా, దానికి సంబంధించిన సమాచారం క్షణాల్లోనే తెలుసుకోవచ్చు. అదీ కేవలం ఒక్క ఫోన్ కాల్ ద్వారా. 18001020237 టోల్ ఫ్రీ నంబర్‌కు డయల్ చేసి, మనదేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఎక్కడి నుంచైనా సమాచారం తెలుసుకోవచ్చు.

ఈ అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది మన తెలుగింటి ఆడబిడ్డే. పేరు డాక్టర్ బిందు మీనన్. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ప్రముఖ న్యూరాలజిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వ్యాధులపై అవగాహన ఉంటే ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో తెలుస్తుంది. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ నుంచి బయటపడొచ్చు కూడా. ఈ ఆలోచనతోనే 2013లో న్యూరాలజీ ఆన్ వీల్స్ అనే వైద్య సంస్థను ప్రారంభించించారు బిందు. ఈ సంస్థ ద్వారా ప్రత్యేకమైన వ్యాన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామాలను సందర్శించి ఉచిత వైద్యం అందిస్తున్నారు. వ్యాధుల బారిన పడడానికి కారణం.. సమస్యలపై అవగాహనలేకపోవడమేని అంటున్నారు డాక్టర్ బిందు. రక్తపోటు, గుండెపోటు, మూర్ఛ, నాడీ సంబంధిత వ్యాధులకు సంబంధించి 160కు పైగా అవగాహనా శిబిరాలు నిర్వహించారు బిందు. ఇవేకాకుండా స్త్రీ జననేంద్రియాలకు సంబంధించిన సమస్యలకూ పరిష్కారం చూపుతున్నారు. ఎవరైనా పేదలు ఆమెను సంప్రదిస్తే.. మెరుగైన వైద్యం చేసి, ఆపరేషన్లకు తనకు తెలిసిన పెద్ద వైద్యుల వద్దకు పంపుతున్నారు.
పేదవారికి నెలపాటు ఉచితంగా మందులు కూడా అందిస్తున్నారు. ఎవరికైనా మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు.. పక్కనున్న వారికి ఏం చేయాలో తెలియదు. ఆలాంటి క్లిష్ట సమయాల్లో 1800 1020237 టోల్ ఫ్రీ నంబర్‌కు డయల్ చేస్తే.. మూర్ఛవ్యాధిగ్రస్థులను ఎలా కాపాడాలో మార్గదర్శకాలు చెబుతారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ మార్గదర్శకాలు ఉంటాయి. ఆమె తండ్రి కేఎమ్ఆర్ నంబియార్ కూడా కూతురు స్థాపించిన సంస్థలో పనిచేస్తున్నారు. ఈ సంస్థలో భాగమైనందుకు గర్వపడుతున్నానని చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ సంస్థ 3 వేలమందికి పైగా ఉచిత వైద్యం అందించింది.