ఆపరేషన్‌కి ప్రత్యామ్నాయం ఉన్నదా?


Mon,October 14, 2019 01:45 AM

మా అమ్మ వయసు 82 సంవత్సరాలు. గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నాయని మూడు స్టెంట్‌లు వేశారు. ఇప్పుడు ఆయాసం బాగా వస్తున్నది. పడుకోలేకపోతున్నది. డాక్టర్‌కి చూపిస్తే గుండె పంపింగ్ తగ్గిందన్నారు. కవాటంలో సమస్య ఉందన్నారు. దీనికి సర్జరీ చేయాలన్నారు. అయితే సర్జరీ తర్వాత పెరాలిసిస్ వచ్చే రిస్కు ఉందంటున్నారు. సర్జరీ చేయించుకోకుండా వేరే చికిత్సా మార్గం ఏమైనా ఉందా?
- వసుమతి, ఖమ్మం

shutterstock
కవాటంలో సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు దాన్ని మార్చి కొత్త కవాటం వేయడం ఒకటే మార్గం. ఇంతకుముందైతే దీనికి ఛాతి ఓపెన్ చేసి సర్జరీ చేయాల్సిన అవసరం ఉండేది. కాని ఇప్పుడు మీరు బెంగపడవలసిన అవసరం లేదు. సర్జరీ చేయడం కష్టం అయిన వాళ్లకోసమే కొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. మీ అమ్మగారికి అయోర్టిక్ కవాటంలో సమస్య ఉంది కాబట్టి ట్రాన్స్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ చికిత్స ద్వారా కొత్త కవాటాన్ని అమర్చవచ్చు. కాలి రక్తనాళం గుండా స్టెంట్ వేసినట్టుగానే కవాటాన్ని కూడా పంపిస్తారు. దీనికి కోత ఉండదు. చిన్న రంధ్రం చాలు. రక్తస్రావం ఉండదు. ఓపెన్ సర్జరీ ద్వారా అయితే కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. సర్జరీ తరువాత ఐసియులో ఉంచాల్సిన పరిస్థితి కూడా ఉండేది. ఆపరేషన్ తరువాత యాంటి థ్రాంబోలైటిక్ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది కాబట్టి రక్తస్రావం అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. అందువల్ల రెగ్యులర్‌గా మానిటర్ చేయాల్సి వస్తుంది. కాని ఈ ప్రొసీజర్ చేయించుకుంటే అలాంటి ఇబ్బందులేమీ ఉండవు. అయితే కవాటం సైజు సరిగ్గా ఉండాలి. సైజు చిన్నదైతే రక్తం లీక్ కావొచ్చు. సైజు పెద్దదైతే అయోర్టా చిరిగిపోవచ్చు. అందువల్ల నిపుణులైన, ఈ ప్రొసీజర్ చేయడంలో అనుభవం ఉన్న కార్డియాలజిస్టులను ఎంచుకోవాలి.


డాక్టర్ , ఎ. శ్రీనివాస్ కుమార్
డైరెక్టర్, కార్డియాలజీ ,అండ్ క్లినికల్ రీసెర్చ్
అపోలో హాస్పిటల్స్,హైదరాబాద్

515
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles