దృష్టి జ్ఞానం!


Sun,October 13, 2019 12:43 AM

కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అలవర్చుకోవలసిన ఆధ్యాత్మిక దృష్టిని తెలియజెప్పే విలువైన రచన చదువండి
Visual-knowledge
-ప్రేమపూర్వకంగా తల్లిదండ్రులవైపు మనం చూసే చూపుకు హజ్‌యాత్ర చేసినంత పుణ్యం లభిస్తుంది!
- ప్రవక్త (అల్లాహ్)


-ఇస్లాం మతస్థులు ఖురాన్ చదవగానే సరిపోతుందా! అందులోని సారాన్ని గ్రహించాలి
- సద్గురు షిరిడీ సాయిబాబా

మనిషిని మాయలో పడేసే ఇంద్రియాల్లో కంటిచూపు ఒకటి. నేత్రశక్తిని మనం దేనికోసం వినియోగించాలి? ఇదే అందరూ తెలుసుకోదగ్గ సత్యం. చాలా సహజంగా కొందరి కండ్లు, వాళ్లకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాయి. మానవజన్మను పవిత్రమైందిగా, ధార్మికమైందిగా భావించేవారు చక్షురింద్రియం వలలో పడరు. దానికోసం ఏం చేయాలో తెలుసుకోండి. మన కనుచూపులు ఒక్కోసారి మనల్ని కష్టాలపాలు చేస్తాయి. అవే కనుచూపులు మరోసారి ఎనలేని సంతోషాన్ని కలిగిస్తాయి. కష్టాలు తెప్పించి, కన్నీళ్లు పెట్టిస్తాయి. సంతోషం మన చూపుల్లో చల్లని వెన్నెలను కురిపిస్తుంది. మొత్తం మీద మనం చూసే చూపుమీదే మన వ్యక్తిత్వమూ ఆధారపడి ఉంటుంది కదా. అయితే, కనుచూపుల్లోనూ ఎన్నో రకాలున్నాయి. కనుసైగల్లోనూ తేడాలున్నాయి. మన బాధ, సంతోషం, ఆక్రోశం.. ఏదైనా కనుచూపుల్లో వ్యక్తమవుతుంటుంది. ఈ చూపుల విషయంలోనూ ఇస్లాం పవిత్రగ్రంథం ఖురాన్ కొన్ని సూచనలు చేసింది. మన దృష్టిపథాన్ని చక్కగా ప్రబోధించింది.

ఏం చూడకూడదో, ఏం చూడాలో ఖురాన్ చెబుతుంది. ఎలా చూడాలో, ఎలా చూడకూడదో కూడా ప్రవక్త చేసి చూపెట్టారు కూడా. మీ చూపులను కిందికి వాల్చండి అని కరాఖండిగా ఖురాన్ హెచ్చరించింది. అంటే, దానర్థం? ఈ చూపులే ఒక్కోసారి మనిషిని ఎంతో నీచస్థాయికి దిగజారుస్తాయి. ఉదా॥కు మనల్ని కన్న అమ్మానాన్నలవైపు ప్రేమతో చూడాలన్నారు ప్రవక్త. ఇలా ప్రేమపూర్వకంగా తల్లిదండ్రులవైపు చూసే చూపుకు హజ్‌యాత్ర చేసినంత పుణ్యం లభిస్తుందనీ అన్నారు. దీన్నిబట్టి, మన పవిత్రమైన, ఆత్మీయమైన చూపుకు ఎంత ప్రాధాన్యం ఉందో తెలుస్తున్నది. అలాగే, పెద్దలను గౌరవ భావంతో చూడాలని మన ప్రవక్త అన్నారు. పిల్లల పట్ల ప్రేమ, వాత్సల్యంతో కూడిన చూపులను సారించమన్నారు. తోటివాడి కష్టాలు చూసి మన కళ్లు చెమర్చాలనీ అన్నారాయన. మనం చేసిన పాపాలపట్ల అపరాధభావంతో మన కళ్లనుండి అశ్రువులు రాలాలని ప్రవక్త పేర్కొన్నారు.

అల్లాహ్‌కు ఈ ప్రపంచంలో రెండు బొట్లు అంటే ఎంతో ఇష్టం. వాటిలో ఒకటి మన కళ్లనుండి రాలిన అశ్రువులు. ఎవ్వరూ చూడకుండా రాత్రివేళ చివరి ఘడియల్లో అల్లాహ్ ముందు తలవంచి దైవభీతితో మన కళ్లల్లో నుండి ఎప్పుడైనా కన్నీళ్లు రాలాయా? అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ప్రేమ, వాత్సల్యం ఉట్టి పడేలా ఎప్పుడైనా మన తల్లిదండ్రులకేసి చూశామా? గుర్తు తెచ్చుకొందాం. అంతేకాదు, మన చుట్టూ వున్న సమాజంలో జరుగుతున్న చెడు పనులు, దౌర్జన్యాల పట్ల మన కళ్లు ఎన్నడైనా ఉక్రోశం, పౌరుషంతో ఎర్రబడ్డ సందర్భాలు ఉన్నాయా? ఆలోచించండి.

మనకు తెలియదనుకొంటాం. కానీ, అల్లాహ్ మన చూపు ల చౌర్యాన్ని కూడా పసిగట్టగలడు. అందుకే ప్రవక్త మహనీయులు పరస్త్రీపై తొలిచూపు పడగానే వెంటనే దృష్టి మరల్చుకోవాలని తాఖీదు ఇచ్చారు. మొదటి చూపు నీదే. కాని రెండో చూపు సైతాన్ చూపు అన్నారు. ఇలా పడ్డ చెడుచూపు మనిషిని ఎక్కడికో దిగజారుస్తుంది. ఇప్పుడు మనం చేస్తున్న దుర్మార్గాల్లో సగం ఈ చూపుల పర్యవసానమే. అతడు తన నెవ్వరూ అదుపు చేయలేరని అనుకుంటున్నాడా? మేం అతనికి రెండు కళ్ళూ, ఒక నాలుకా, రెండు పెదవులూ ప్రసాదించలేదా? ఇంకా స్పష్టమైన రెండు (మంచీ చెడుల) మార్గాలనూ అతనికి చూపాం (ఖురాన్). ఆ రోజు మన రెండు కళ్ల విషయంలో అల్లాహ్‌కు జవాబు చెప్పుకోవాలన్న సంగతి బోధపడుతుంది.

ఇన్ని పనులు చేస్తేనే అల్లాహ్ మనకు ఆ అనంత స్వర్గలోకాన్ని ప్రసాదిస్తాడు. ఇదే విషయాన్ని ఖురాన్ ఇలా వర్ణించింది. ఈ మహాభాగ్యాల మధ్య సిగ్గులొలికే చూపులుగల సుకన్యలు ఉంటారు. ఈ స్వర్గవాసులకు పూర్వం వారిని ఏ మానవుడు గానీ, ఏ జిన్నాతు గానీ తాకి ఉండలేదు. అం దుకే సిగ్గు, బిడియాలతో జీవితం గడుపుదాం. మన పిల్లలను సిగ్గు, బిడియాలకు ప్రతీకలుగా తీర్చుదిద్దుదాం. నిస్సి గ్గు, నిర్లజ్జకు దగ్గర చేసే దారులన్నింటినీ మూసివేద్దాం.

యూట్యూబ్, సోషల్ మీడియాను పరిమితంగా వాడుకుందాం. సిగ్గు, బిడియాలు ఒక ముస్లిమ్‌కు ఆభరణాల వంటివి. సిగ్గూ ఎగ్గూలేని చూపుల నుంచి మన యువతరాన్ని, మన సంతానాన్ని కాపాడుకుందాం. చెడు ఎంత వేగంగా వైరల్ అవుతుందో అంతే వేగంగా మట్టిలో కొట్టుకుపోతుంది. మంచి చాలా నెమ్మదిగా వైరల్ అయినా అది నిలకడగా నిలిచి పోతుంది. వేగంగా వైరల్ అయ్యే చెడుచూపుల మాయలో పడి కొట్టుకుపోకుండా మన చూపుల్ని నియంత్రించుకుందాం. మరీ ముఖ్యంగా చూపుల చౌర్యం విషయంలో ఓ కన్నేసి ఉంచుదాం. మన చూపుల్ని మనం కాపాడుకుందాం.
- మహమ్మద్ ముజాహిద్
సెల్: 96406 22076


Visual-knowledge2

ఆ ఔన్నత్యాన్ని కాపాడుదాం!

ఈ లోకంలో మన కళ్లను మంచివైపే దృష్టి సారిద్దాం. మన చూపులను కిందికి వాల్చి ఉంచుదాం. మన తల్లిదండ్రులవైపు ప్రేమ వాత్సల్యాలతో చూద్దాం. చెడుచూపు నుంచి మనల్ని మనం కాపాడుకుందాం. సృష్టి అందాలను వీక్షించి అల్లాహ్ ఔన్నత్యాన్ని చాటుదాం. మన చుట్టూ సమాజంలో జరుగుతున్న దుర్మార్గాలను అల్లాహ్ ముందు ఏకరువు పెట్టి కన్నీటి పర్యంతమవుదాం. అన్నింటికీ మించి మనకు రెండుకళ్లను, చూసే శక్తిని ప్రసాదించిన అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుందాం. సమాజంలో కళ్లు లేని కబోదులకు మార్గం చూపుదాం. కళ్లుండీ చూడలేని వాళ్ల మనో నేత్రాలు తెరిపించమని అల్లాహ్‌ను వేడుకుందాం.

508
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles