ఓర్చుకొని.. ఒంటరితనాన్ని జయించి..


Thu,October 10, 2019 01:34 AM

బెంగళూర్ బస్టాండ్. ఆమె నిస్సహాయ స్థితిలో ఇద్దరు పిల్లలతో ఉంది. రెండు రాత్రులు అక్కడే గడిపింది. ఎవరైనా వచ్చి సాయం చేస్తారేమో అని ఎదురు చూసింది. ఓ వృద్ధురాలు వచ్చి సాయం చేసింది. ఆ సాయం ఆమె జీవితాన్ని మార్చింది. ఆమె జీవితాన్నే కాదు ఎంతోమంది జీవితాలను మార్చడానికి పునాది వేసింది.
sifiya-haneef
సిఫియాకు 16 ఏండ్లప్పుడు పెండ్లయింది. రెండేండ్లలో ఇద్దరికి జన్మనిచ్చింది. 20 ఏండ్లకు భర్త విడాకులిచ్చాడు. దీంతో ఆమె సింగిల్ పేరెంట్ అయింది. పిల్లల కోసమైనా ఇంకో పెండ్లి చేసుకోమని చాలామంది అన్నారు. దీని కోసం ఎవరి మీదా ఆధారపడాలనుకోలేదు. పిల్లలను తీసుకొని బెంగళూర్ వెళ్లింది. అక్కడ తెలిసిన వాళ్లెవరైనా సాయం చేస్తారేమో అనుకుంది. కానీ ఎవరూ చేయలేదు. కొత్త ప్రాంతం, ఎవరిని కలవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆమె పిల్లలతో కలిసి ఓ బస్టాండ్‌లోనే రెండ్రోజులు గడిపింది. గమనించిన ఓ వృద్ధురాలు ఇంటికి తీసుకెళ్లింది. ఆ ఇంట్లోనే ఉండేందుకు అనుమతి ఇచ్చింది. ఇలా రోజులు గడిచాయి. పిల్లలకు ఆ వృద్ధురాలు అమ్మమ్మ అయింది. సిఫియాకు అమ్మగా మారింది. ఈ క్రమంలోనే సిఫియా ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. ఓ కాల్‌సెంటర్‌లో చేరింది. పిల్లలను చదివించింది. ఆమె కూడా చదువుకోవాలనుకుంది. అప్పటికే ఇంటర్ చేసిన సిఫియా డిగ్రీలో బీఏ సాహిత్యంలో చేరింది. కాల్ సెంటర్ ఉద్యోగం మానేసి ఓ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా చేరింది. రోజులు సాఫీగా గడుస్తున్నాయి.


దీనికి కారణమైన అమ్మమ్మ సాయం గుర్తొచ్చింది. తన లాంటి వారికి ఆమె సాయం చేయాలనుకుంది. 2013 నుంచి ఆమె జీతం నుంచి కొంత వితంతువులకు ఇవ్వడం ప్రారంభించింది. ఆన్‌లైన్ ద్వారా క్రౌడ్‌ఫండింగ్ చేసి వితంతువులను, వారి పిల్లలను ఆదుకుంటున్నది. 2015లో చిల్డ్రన్ చారిటబుల్ ట్రస్ట్‌ను ప్రారంభించింది. సుమారు ఆరువందలకు పైగా కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నది సిఫియా. మరోవైపు ఆమె బీఏ తర్వాత బీఈడీ, పబ్లిక్ ఆడ్మినిస్ట్రేషన్‌లో డిప్లొమా, సోషల్ వర్క్‌లో మాస్టర్స్, ఇప్పుడు సాహిత్యంలో ఎంఏ చేస్తున్నది. ఒకనాడు ఏ దిక్కూ లేని సిఫియా నేడు ఎంతోమందికి పెద్ద దిక్కుగా, దేశంలో సామాజికవేత్తల్లో ఒకరిగా నిలిచింది.

712
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles