దసరా స్పెషల్!


Thu,October 3, 2019 01:06 AM

నవరాత్రులు మొదలై ఐదు రోజులవుతున్నది. రోజుకో వంటకంతో దుర్గామాతకు నైవేద్యం..ఈ తొమ్మిదిరోజులు వెజ్‌తో నోరు చప్పబడుతుంది. నాన్‌వెజ్ ప్రియులు మాత్రం పండుగరోజు కోసం ఎదురుచూస్తుంటారు. మరి ఆరోజు కూడా మామూలు వంటలే చేస్తే ఇంట్లో ఊరుకుంటారా? తెలంగాణాకు తగినట్లుగా, పండుగ స్పెషల్‌గా కొన్ని వంటల్ని ముందుగానే అందిస్తున్నాం..


బగారా కోడి పలావ్

chicken-bagarannam

కావాల్సినవి :

బాస్మతీ రైస్ : 250 గ్రా., చికెన్ (బోన్) : 250 గ్రా.పచ్చిమిర్చి : 4, యాలకులు : 4, లవంగం : 4, దాల్చినచెక్క : 2, పుదీనా : 1 కట్ట, పెరుగు : 2 టేబుల్‌స్పూన్లు, నూనె : 2 టేబుల్ స్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్ట్ : 1 టీసూన్, పలావు ఆకు : 2, కొత్తిమీర : 2 కట్టలు, నెయ్యి : 1 టీస్పూన్, ఉప్పు : తగినంత.

తయారీ :

బాస్మతీరైస్‌ను శుభ్రం చేసి గంటపాటు నానబెట్టాలి. చికెన్ కూడా శుభ్రం చేయాలి. దీనికి అల్లంవెల్లుల్లి వేస్ట్ కలిపి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో కొంచెం నూనె, నెయ్యి వేడిచేసి అందులో యాలకులు, లవంగం, దాల్చినచెక్క, పచ్చిమిర్చి, పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసి వేయించాలి. తర్వాత చికెన్ వేసి వేయించాలి. ఇందులో తగినంత నీరు, ఉప్పు, ముందుగా నానాబెట్టిన బాస్మతీ రైస్ వేయాలి. రైస్, వాటర్ లెవల్ సమానం అయ్యేవరకూ ఉడికించి కొత్తిమీర, పుదీనా వేసి మూతపెట్టి సన్ననిమంటపై 15 నిమిషాలపాటు ఉడికించాలి. తర్వాత రైస్‌ను అన్నివైపులా కలిసేలా కలుపుకోవాలి. దీన్ని కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకొని రైతాతో తింటే అద్భుతంగా ఉంటుంది.

చింతకాయ కోడి వేపుడు

chintakaya-kodi-vaypudu

కావాల్సినవి :

నూనె : అరకప్పు, పచ్చిమిర్చి : 4, చికెన్ (బోన్) : 250 గ్రా., అల్లంవెల్లుల్లి పేస్ట్ : ఒకటిన్నర టీస్పూన్, గరం మసాలా : అర టీస్పూన్, ఉల్లిముద్ద : అర కప్పు, కరివేపాకు : 2 రెబ్బలు, చింతకాయలు : 10, ధనియాల పొడి : అర టీస్పూన్, కొత్తిమీర : 1 కట్ట, పసుపు : పావు టీస్పూన్, ఉప్పు : తగినంత.

తయారీ :

ముందుగా చింతకాయ చెక్కు, గింజలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని చీలికలుగా, కొత్తిమీరను సన్నగా తరగాలి. కడాయిలో నూనె వేడి చేసి ఉల్లిముద్ద, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఇందులో చికెన్ వేసి కలుపుతూ సన్నని సెగపై మూడువంతులు ఉడికించాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన చింతకాయ ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి బాగా దగ్గర పడే వరకూ ఉడికించాలి. చివరగా ఉప్పు, కారం, పులుపు సరిచూసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించుకుంటే టేస్టీగా ఉంటుంది.

తెలంగాణ మాంసం కూర

telangana-mamsam-koora

కావాల్సినవి :

చికెన్ : అరకేజి, ఉల్లిగడ్డలు : 2, యాలకులు : 3, దాల్చినచెక్క : 2, కారం : 2 టీస్పూన్లు, కరివేపాకు : 2 రెబ్బలు, కొత్తిమీర : 1 కట్ట, పలావు ఆకు : 2, నూనె : అరకప్పు, పచ్చిమిర్చి : 6, లవంగాలు : 3, అల్లంవెల్లుల్లి పేస్ట్ : ఒకటిన్నర టీస్పూన్, ధనియాలు : 1 టీస్పూన్, జీడిపప్పు : అరకప్పు, ఉప్పు : తగినంత.

తయారీ :

చికెన్‌ను శుభ్రం చేసి పెట్టుకోవాలి. పాన్‌లో ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు వేసి దోరగా వేయించి మిక్సీ పట్టించాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డను కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేడిచేసి యాలకులు, లవంగం, దాల్చినచెక్క, పలావు ఆకు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇందులో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి. దీంట్లో చికెన్ వేసి కలుపుతూ ఐదునిమిషాలపాటు మగ్గనివ్వాలి. దీనికి కారం జోడించి తగినన్ని నీళ్లుపోసి మాంసాన్ని ఉడకపెట్టాలి. ఉడికిన తర్వాత ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు ముద్ద వేయాలి. గ్రేవి గుజ్జుగా తయారయ్యే వరకు సన్నని మంటపై ఉడికించాలి. ఉప్పు, కారం సరిచూసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. దీన్ని అన్నంతోగాని, జొన్నరొట్టెతో పాటు తింటే టేస్ట్ అదిరిపోతుంది.

సోయాకు బోటీ

soyaku-boti

కావాల్సినవి :

బోటీ : 250 గ్రా., సోయాకు : 1 కట్ట, నూనె : అరకప్పు, పచ్చిమిర్చి : 4, కరివేపాకు : అరకప్పు, కొత్తిమీర : అరకప్పు, ఉల్లిముద్ద : అరకప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్ : ఒకటిన్నర టీస్పూన్, పసుపు : అర టీస్పూన్, కారం : అర టీస్పూన్, ధనియాల పొడి : అర టీస్పూన్, గరం మసాలా : అర టీస్పూన్, ఉప్పు : తగినంత.

తయారీ :

ముందుగా సోయాకు, పచ్చిమిర్చి సన్నగా తరగాలి. బోటీని వేడినీటిలో ఐదు నిమిషాలపాటు ఉంచి శుభ్రం చేసుకోవాలి. తర్వాత బోటీని అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసి తగినంత నీరు పోసి కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించి వార్చుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేడి చేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిముద్ద, వేసి దోరగా వేయించాలి. ఇందులో తగినంత సోయాకు వేయాలి. తర్వాత ఉడికించి వార్చి పెట్టుకున్న బోటీ వేసి ఐదు నిమిషాలపాటు మగ్గ్గనివ్వాలి. ఇప్పుడు ధనియాలపొడి, గరం మసాలా, కారం వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఉప్పు, కారం సరిచూసుకోవాలి. వేడి వేడి బోటీని సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించుకొని సర్వ్ చేసుకోవాలి.

పొడి మాంసం వేపుడు

podi-mamsam-vaypudu

కావాల్సినవి :

చికెన్ : 200 గ్రా., ఉలిముక్కలు : 1 గ్రా., వెల్లుల్లి ముక్కలు : అర టీస్పూన్, కొత్తిమీర : 1 కట్ట, జీడిపప్పు : అరకప్పు, నూనె : అరకప్పు, అల్లం ముక్కలు : అర టీస్పూన్, పచ్చిమిర్చి : 4, కరివేపాకు : 2 రెబ్బలు, పసుపు : పావు టీస్పూన్, అల్లంవెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్‌స్పూన్, ఉప్పు : తగినంత.

తయారీ :

ముందుగా చికెన్‌ను శుభ్రం చేసుకోవాలి. దీనికి పసుపు, అల్లంవెల్లులి పేస్ట్ కలిపి కడాయిలో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మరో కడాయిలో నూనె వేడిచేసి ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు. అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. దీంట్లో ఉడికించిన చికెన్, మిక్సీ పట్టించిన పొడి వేసి సన్ననిసెగపై దోరగా వేయించాలి. చివరగా ఉప్పు, కారం సరిచూసుకొని తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే ఆహా అనాల్సిందే.

పొడి కోసం

అవిశలు : అరకప్పు
ఎండుమిర్చి : 2
జీలకర్ర : 1 టీస్పూన్
ధనియాలు : అర టీస్పూన్
ఉప్పు : తగినంత

పొడి తయారీ :

పొడికి సంబంధించిన వాటన్నింటినీ విడివిడిగా దోరగా వేయించుకోవాలి. వీటన్నింటినీ కలిపి మిక్సీ పట్టించాలి. ఉప్పు, కారం సరిచూసుకోవాలి.

జి.యాదగిరి
కార్పొరేట్ చెఫ్
వివాహభోజనంబు రెస్టారెంట్
జూబ్లీహిల్స్, హైదరాబాద్
పార్క్‌లైన్, సికింద్రాబాద్

1024
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles