ఆలోచింపజేసే ఐడియా!


Thu,October 3, 2019 12:59 AM

దేశంలోని చాలా రాష్ర్టాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చాలాచోట్ల ఇంటి నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల సరైన తిండి లేక ఆకలితో తల్లడిల్లుతున్నారు వరద బాధితులు. వరదల కారణంగా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. అయినా అధికారులు సరిగా స్పందించకపోవడంతో ఈ యువతి ఫొటోషూట్ చేసింది. ఎందుకో తెలుసా?
photoshoot
వరద బాధిత రాష్ర్టాల్లో బీహార్ కూడా ఉంది. అక్కడ పరిస్థితి రోజురోజుకూ తీవ్రమవుతున్నది. వరదల కారణంగా ఇప్పటికే 29 మంది మరణించారు. రాబోయే నెల రోజుల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని అంచనా. బీహార్‌లోని పాట్నాలో ఎక్కడ చూసినా మోకాళ్ల వరకు నీరు చేరింది. అయినా ప్రజలను పట్టించుకునే అధికారులే కరువయ్యారు. దీంతో పాట్నాలోని రోడ్లు, వీధుల పరిస్థితులపై ప్రజలు, అధికారుల దృష్టిని ఆకర్షించడానికి అదితి సింగ్ అనే ఈ యువతి ఫొటోషూట్ నిర్వహించింది. ఆమె నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో చదువుతున్నది. దీనికోసం ఎలాంటి పోరాటం చేయలేదు. ఎవరినీ ఎదిరించలేదు. అందరినీ ఆకర్షించేలా ఫొటోషూట్ చేయించుకుంది. ఎలాగంటే నీటితో మునిగిన కారు దగ్గర నిలబడి ఫొటోకు ఫోజులిచ్చింది. ఫొటో వెనుక దాగి ఉన్న పరిస్థితిని గమనించండంటూ తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇలా ఎక్కడైతే దయనీయమైన పరిస్థితి ఉందో అక్కడ ఫొటోలు దిగి అక్కడి పరిస్థితిని ఫొటో రైటప్ ద్వారా వివరిస్తున్నది. మరో ప్రయత్నంగా.. ప్రజలు వరద నీటితో పడుతున్న బాధలను వీడియో రూపంలో చూపించింది అదితి. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాట్నా ప్రజల పరిస్థితి అర్థం చేసుకున్నవారు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఫొటోషూట్ ద్వారా సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ఆమె ఆలోచనను అందరూ అభినందిస్తున్నారు.

445
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles