చెయ్యి ఎందుకు వణుకుతున్నది?


Thu,October 3, 2019 12:57 AM

నా వయసు 60 సంవత్సరాలు. నేను ఒక సంవత్సరం క్రితం వరకూ ఆరోగ్యంగానే ఉండేదాన్ని. బీపీ, షుగర్ లాంటి వ్యాధులు ఏమీ లేవు. సంవత్సరం నుంచి బాగా నెమ్మదిస్తున్నాను. ఏ పని చేయాలన్నా చాలా సమయం తీసుకుంటాను. త్వరగా నడవలేకపోతున్నాను. ఒకటి, రెండుసార్లు కింద కూడా పడిపోయాను. కుడి చెయ్యి వణుకుతూ ఉంటుంది. సంవత్సరం నుండి న్యూరోబైన్ మాత్రలు వేసుకుంటున్నా ఫలితం లేదు. దయచేసి పరిష్కారం చెప్పగలరు.
- సుజాత

tremor-early
మీరు పార్కిన్‌సన్స్ జబ్బుతో బాధపడుతున్నట్టు ఉంది. ఈ జబ్బు 60 సంవత్సరాలు నిండిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కూర్చుని ఉన్నప్పుడు చెయ్యి వణకడం, తొందరగా నడవలేకపోవడం, కూర్చునేటప్పుడు గబుక్కున ఒక దిమ్మ మాదిరిగా కూర్చోవడం, ఎవరన్నా వెనుక నుంచి పిలిచినప్పుడు వెంటనే తిరగలేకపోవడం, ముఖంలో కదలికలు లేకపోవడం, నోటి నుంచి ఉమ్మి కారిపోవడం వంటివి ఈ జబ్బు లక్షణాలు. మెదడులో డోపమిన్ అనే కెమికల్ తగ్గిపోవడం వల్ల మనిషిలోని కదలికలు తగ్గిపోతాయి. దీన్ని టాబ్లెట్ రూపంలో ఇవ్వడం ద్వారా మనిషిని నడిచేటట్లు చేయవచ్చు. సిండోసా, రోపాల్క్, పాసిటోన్ వంటి మందులతో ఈ జబ్బుకి వైద్యం చేయవచ్చు. ఈ మందులు వాడుకుంటూ 10-15 సంవత్సరాల వరకు వాళ్ల పనిని వాళ్లు చేసుకొనే అవకాశం ఉంటుంది. ఐదు నుంచి ఏడు సంవత్సరాలు గడిచాక మెడిసిన్స్ సరిగా పని చేయనప్పుడు డిబిఎస్ అనే సర్జరీ ద్వారా రోగిని నడిపించవచ్చు. మీరు ఒక సంవత్సరం నుంచే బాధపడుతున్నారు కాబట్టి సరైన మందులతో మీ రోగాన్ని నయం చేయవచ్చు.


-డాక్టర్ మురళీధర్ రెడ్డి
-కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్
-కేర్ హాస్పిటల్స్,హైదరాబాద్

1050
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles