అతి చిన్న కోతతో అత్యాధునిక ఊపిరితిత్తుల చికిత్సలు


Tue,October 1, 2019 01:25 AM

ఇంతకు ముందు..సర్జన్ చేతిలో కత్తులూ.. కటార్లు.. ఆపరేషన్ బెడ్ మీదికి వెళ్లడానికే వణికిపోయే పేషెంట్.. ఇప్పుడు..సర్జన్ చేతిలో రోబో యంత్రం.. చకచకా ఆడుతున్న రోబో చేతులు.. నిశ్చింతగా పేషెంట్..పెద్ద పెద్ద కోతల్లేవ్.. ఆపరేషన్‌లో పొరపాట్లు దొర్లుతాయేమోన్న అనుమానాల్లేవ్.. స్క్రీన్ మీద లోపలున్న ఊపిరితిత్తులు కన్పిస్తుంటాయ్.. డాక్టర్ రోబో చేతులతో సర్జరీని చకచకా చేసేస్తుంటాడు. ఆపరేషన్ తరువాత..కొద్ది రోజుల్లోనే పేషెంటులో హుషారు.. మినిమల్లీ ఇన్వేసివ్, రోబో సర్జరీలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఆపరేషన్లు మరింత సులువు అయ్యాయి. ఇవి ఊపిరి తిత్తుల సర్జరీల్లో కూడా మంచి ఫలితాలిస్తున్నాయి. అయితే ఈ సర్జరీలు చేయడానికి నిపుణులైన సర్జన్ తప్పనిసరి. ఈ శస్త్ర చికిత్సలు ఎలాంటి సమస్యలకు.., ఎప్పుడు ఉపయోగమంటే...
Health


ఊపిరి తీసుకుంటే జననం.. ఊపిరి పోతే మరణం. ఊపిరి తీసుకోవడం అంత ముఖ్యమైన ప్రక్రియ. దీన్ని నిర్వహించే శ్వాస వ్యవస్థకు శరీరంలో అత్యంత కీలకమైన స్థానం ఉంది. ఊపిరితిత్తుల్లో సమస్య ఎదురైతే దానికి చికిత్స అందించడం కూడా క్లిష్టమైన విషయంగానే ఉండేది. అయితే వైద్యరంగంలో వస్తున్న నూతన పరిశోధనలు, ఆధునిక ప్రక్రియలు శ్వాసకోశాలకు, శ్వాస వ్యవస్థకు చికిత్సలను సులభతరం చేశాయి. ఒకప్పుడు క్షయ వ్యాధి అంటే ఇక మరణమే శరణ్యం అనుకునేవాళ్లు. ఇప్పుడది పెద్ద సమస్యే కాదు. మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా శ్వాసకోశాలకు ఏదైనా సమస్య వచ్చి శస్త్రచికిత్స చేయాల్సి వస్తే ఒకప్పుడైతే ఛాతి మీద పెద్ద గాటు పెట్టి పెద్ద సర్జరీ చేయాల్సి వచ్చేది. కాని ఇప్పుడు అందుబాటులో ఉన్న సరికొత్త సర్జరీలు రోగికీ, వైద్యులకూ ఎంతో సౌకర్యంగా ఉంటున్నాయి.

పెద్ద పెద్ద కోతలిక లేవు..

వ్యాధి త్వరగా నయమవ్వాలి.., చికిత్స తేలికగా ముగియాలి.., కోలుకునే సమయం తక్కువ ఉండాలి.., గాయాలూ చిన్నవిగా ఉండాలి..., సర్జరీ తదనంతరం ఇతరత్రా సమస్యలేవీ రాకూడదు... ఏ పేషెంటు అయినా కోరుకునే అంశాలివి. ఇలా ఒకవైపు రోగికి మంచి ఫలితాలనిస్తూ, మరోవైపు డాక్టర్లకు సర్జరీని సులభతరం చేసే చికిత్సా విధానమే మినిమల్లీ ఇన్వేసివ్ ట్రీట్‌మెంట్. ఛాతీపై పెద్ద పెద్ద గాట్లు లేకుండా, ఎక్కువ రక్తం పోకుండా కేవలం చిన్న రంధ్రాలతో చేసే సర్జరీ ఇది. దీన్నే కీహోల్ సర్జరీ అని కూడా అంటారు. డాక్టర్ తన చేతులకు బదులుగా రోబో యంత్రం ద్వారా సర్జరీ చేసే వెసులుబాటు కూడా వచ్చింది. రోబో చేతుల ద్వారా సర్జరీని నిర్వహిస్తారు వైద్యులు. కాబట్టి మనిషి వల్ల కలిగే చిన్న చిన్న పొరపాట్లు కూడా జరుగకుండా ఉంటాయి.

ప్రయోజనాలు బోలెడు

ఛాతీ సమస్యలకు గతంలో అయితే భుజం అడుగున పెద్ద కోతతో సర్జరీలు జరిగేవి. ఇలాంటి ఓపెన్ సర్జరీ వల్ల ఆ భాగంలోని నాలుగు కండరాలను కోయవలసి వచ్చేది. ఫలితంగా వాటికి శాశ్వత నష్టం జరిగి చేయి కదలికలకు జీవితాంతం ఇబ్బంది ఎదురయ్యేది. చేతుల కదలికలకు సంబంధించిన ఉద్యోగాలు చేసేవారికి ఇలాంటి సర్జరీ వల్ల అంతకుముందు చేయగలిగిన పనులు చేయలేని పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటి ఓపెన్ సర్జరీ వల్ల పెద్ద గాటు ఉంటుంది కాబట్టి రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. పైగా కోత పద్ధతి వల్ల సర్జరీ తర్వాత కోలుకోవడానికి నెలల తరబడి సమయం పడుతుంది. శరీరం మీద పెద్ద గాట్లు శాశ్వతంగా మిగిలిపోతాయి. నొప్పి కూడా మూడు నెలల వరకూ ఉంటుంది. సర్జరీ తర్వాత హాస్పిటల్‌లో ఇన్‌పేషెంట్‌గా ఉండే సమయమూ ఎక్కువే. ఈ ఇబ్బందులన్నిటికీ చెక్ పెడుతూ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ (కీహోల్ సర్జరీ) ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ సర్జరీ భుజం అడుగు భాగంలో కేవలం చిన్న చిన్న రంధ్రాలు మాత్రమే పెట్టి సర్జరీ చేస్తారు. ఈ సర్జరీనే వి.ఎ.టి.ఎస్. (వీడియో అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీ) అని కూడా అంటారు. ఈ సర్జరీ చేసే సమయంలో నాలుగు కండరాలకు కోత పడదు. పక్కటెముకలు కత్తిరించే పని ఉండదు. అందువల్ల రక్తస్రావం ఎక్కువగా ఉండదు. అంతేగాక రోగికి సర్జరీ తర్వాత ఎక్కువ కాలం పాటు నొప్పి వేధించదు. ఆపరేషన్ కోసం ఎక్కువ రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సిన అవసరం ఉండదు. త్వరగా కోలుకుంటారు. కాబట్టి పనిసామర్థ్యం కుంటుపడదు. తొందరగా పనులు చేసుకోగలుగుతారు. కొన్ని సందర్భాల్లో రుగ్మతను బట్టి వాట్స్, రోబోటిక్ రెండూ ఒకే సమయంలో చేసే వీలూ ఉంది.

సౌకర్యవంతమైన సర్జరీ

మినిమల్లీ ఇన్వేసివ్, రోబోటిక్ సర్జరీలు అతి తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనం పొందగలిగే సర్జరీలుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఒక చోటి నుంచి మరో చోటికి ప్రయాణం చేయదలచుకున్నప్పుడు అందుకోసం బైక్, ఆటో, కారులను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ మూడింట్లో కారు ప్రయాణం సురక్షితం. బైక్ మీద ప్రయాణం చేస్తే బ్యాలెన్స్ తప్పి పడిపోయే ప్రమాదం ఉండవచ్చు. ఆటోలో ప్రయాణం చేస్తే ప్రయాణం ఆలస్యం కావొచ్చు. పొల్యూషన్ సమస్య కూడా ఉంటుంది. అదే కారులో ప్రయాణిస్తే ఈ రెండింటికి ఆస్కారం లేకపోగా, ఏదైనా వాహనానికి గుద్దుకున్నా కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కాబట్టి సురక్షితంగా ఉంటాం. మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలు ఈ కారు ప్రయాణం లాంటివే. ఇవి ఎంతో సురక్షితంగా గమ్యానికి చేరుస్తాయి. అంటే పేషెంటుకు సమస్య నుంచి సురక్షితంగా బయటపడేస్తాయి. కారు మాదిరిగా ప్రయాణ సమయాన్నీ తగ్గిస్తాయి. అంటే కోలుకునే సమయాన్నీ తగ్గిస్తాయి. ఇటు పేషెంటుకూ, అటు వైద్యునికీ సౌకర్యవంతంగా ఉంటాయి.

రోబోటిక్ సర్జరీ అంటే భయమెందుకు?

రోబోటిక్ సర్జరీ అనగానే అది వైద్యులు స్వహస్తాలతో చేసే సర్జరీ కాదనీ, రోబోలు చేసే సర్జరీ కాబట్టి వాటి కదలికలను ఎలా నమ్మగలమనే అపోహలు అంతటా ఉంటున్నాయి. నిజానికి పేరుకు రోబోటిక్స్ అని ఉన్నా, వాటిని కదలిస్తూ సర్జరీ ముగించేది వైద్యులే. ప్రధానంగా ఇన్వేసివ్ సర్జరీలో రోబోటిక్స్ ఉపయోగం పెరిగింది. పలు రకాల మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీల సమయంలో రోబోటిక్స్ ఉపయోగం కొన్ని సందర్భాల్లో సగానికి పైగా, మరికొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువగా ఉంటుంది.
Health1

రోబోటిక్స్ ఉపయోగాలు..

-రోబోటిక్ సర్జరీల వల్ల శరీరం మీద కోతలు లేని, 8 మిల్లీ మీటర్ల మేర చిన్న రంధ్రాలే ఏర్పడుతాయి. ఇవి కొన్ని రోజుల్లోనే మానిపోతాయి.
-చేతులు వణికినా, రోబోలు ఆ కుదుపులను ఆపేస్తాయి. ఫలితంగా స్వయంగా చేతులతో చేసే సర్జరీల్లో దొర్లే తప్పులనూ రోబోలు సరిచేసి పొరపాటుకు ఆస్కారం లేకుండా చేస్తాయి.
-మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ, ఓపెన్ సర్జరీ చేసే సమయంలో అంతర్గత అవయవాల సైజు కంటికి అవసరానికి మించి పెద్దగా కనిపించదు. కానీ రోబోటిక్ సర్జరీలో అంతర్గత అవయవాలు, కణుతులు పెద్ద పరిమాణంలో కనిపించి, సర్జరీ చేయడం సులువవుతుంది.
-నాడులు కూడా స్పష్టంగా కనిపిస్తాయి.
Health2

ఈ రుగ్మతల కోసం..

మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీని అనేక రకాల ఛాతి సమస్యల చికిత్స కోసం ఉపయోగిస్తారు. ఊపిరితిత్తులకు వచ్చే న్యుమోనియా లాంటి ఇన్‌ఫెక్షన్ల నుంచి కణుతుల వరకూ కూడా ఈ చికిత్సలను ఉపయోగించవచ్చు. క్యాన్సర్‌కు కూడా మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతి ద్వారా సర్జరీ చేయవచ్చు.

ఊపిరితిత్తుల క్యాన్సర్

గతంలో అయితే క్యాన్సర్ కణితులను తీసేయడానికి ఓపెన్ సర్జరీయే చేయాల్సి వచ్చేది. కాని ఇప్పుడు ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ గడ్డలు తొలగించడానికి కూడా మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ ఉపయోగపడుతున్నది.
Health3

న్యుమోనియా

న్యుమోనియా సాధారణంగా బాక్టీరియ ఇన్‌ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ సమస్యలో ఊపిరితిత్తుల్లో సుమారుగా 50 మిల్లీ లీటర్ల వరకు నీరు చేరుకుంటూ ఉంటుంది. ఈ నీరు ఎంతో కొంత దానంతట అదే ఇంకిపోతుంది. అయితే కొంతమందిలో ఇన్‌ఫెక్షన్ కారణంగా ఈ నీరు మరీ ఎక్కువగా తయారవుతుంది. దానివల్ల అది దానంతట అదే ఇంకిపోలేనంతగా పెరుగుతుంది. దాంతో ఆ నీరు ఊపిరితిత్తుల చుట్టూ పేరుకుపోతుంది. ఫలితంగా శ్వాస తీసుకున్నప్పుడు ఊపిరితిత్తులు వ్యాకోచించలేవు. క్రమంగా కుంచించుకుపోతాయి. దాంతో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఈ సమస్య సాధారణ ఎక్స్‌రేలో తెలిసిపోతుంది. రోడ్డు ప్రమాదాల్లో ఛాతీకి దెబ్బ తగిలినప్పుడు కూడా ఊపిరితిత్తుల చుట్టూ రక్తం నిండుకుని, ఊపిరితిత్తులు వ్యాకోచం చెందలేక శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఈ రెండు పరిస్థితులను చక్కదిద్దకపోతే ప్రాణ నష్టం తప్పదు. న్యుమోనియాలో పేరుకుపోతున్న నీరు రెండు వారాలకు మించి తొలగించకపోతే అది గట్టి పొరగా మారి గట్టిపడుతుంది. ఇలాంటప్పుడు మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ సహాయంతో గట్టిపడిన ఈ పొరను కత్తిరించి నీటిని తొలగిస్తారు. దాంతో ఊపిరితిత్తులు ఎప్పటిలా వ్యాకోచించగలుగుతాయి. ఈ సర్జరీని వైద్య పరిభాషలో డీకార్డిగేషన్ అంటారు.

ఊపిరితిత్తుల్లో కావిటీలు

ఇన్‌ఫెక్షన్ కారణంగా ఊపిరితిత్తుల్లోని కొంతభాగం చెక్కుకుపోతుంది. వీటినే కావిటీలంటారు. వీటివల్ల రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. దగ్గినప్పుడు నోటి వెంట రక్తం పడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మినిమల్లీ ఇన్వేసివ్ చికిత్సలు ఉపయోగపడుతాయి.
Health4

ఛాతీలో కణుతులు

కణితులంటే అన్నీ క్యాన్సర్ గడ్డలే కానక్కరలేదు. క్యాన్సర్ కాని గడ్డలను బినైన్ ట్యూమర్లు అంటారు. ఇలాంటి బినైన్ గడ్డలు ఊపిరితిత్తుల్లో ఏర్పడినప్పుడు వాటిని కూడా తొలగించడానికి కూడా మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలు ఉపయోగపడుతున్నాయి.

క్షయ

క్షయ కారణంగా ఊపిరితిత్తులు ఛాతీకి అంటుకుపోతాయి. ఇలాంటప్పుడు ఇంతకుముందయితే పొట్ట ప్రాంతంలో రంధ్రం చేసి కార్బన్ డయాక్సైడ్ వాయువును పంపిస్తారు. దాంతో ఛాతి ఉబ్బుతుంది. అప్పుడు సర్జరీ చేసేవాళ్లు. ఊపిరితిత్తులు ఛాతి ఎముకలకు అంటుకుపోవడం వల్ల సర్జరీ చేయడానికి అనువుగా ఉండేది కాదు. అందుకే ఈ పద్ధతి అనుసరించేవాళ్లు. కానీ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలో కృత్రిమ పద్ధతి ద్వారా ఊపిరితిత్తులను కుంచించుకుపోయేలా చేస్తారు. ఛాతీలో సర్జరీకి అనువైన ఖాళీ ప్రదేశాన్ని సృష్టించే వీలుంటుంది. ఫలితంగా సర్జరీ సులువవుతుంది.
Health5

స్మోక్ బబుల్స్

సంవత్సరాల పాటు ధూమపానం అలవాటు ఉన్నవారి ఊపిరితిత్తుల్లో స్మోక్ బబుల్స్ తయారవుతూ ఉంటాయి. ఈ సమస్యను బుల్లా అంటారు. దగ్గినప్పుడు లేదా చిన్న ఒత్తిడి కలిగినా ఈ బుడగలు పగిలిపోయి రక్తస్రావం అవుతూ ఉంటుంది. బుడగలు పగిలిన భాగంలో రంధ్రం ఏర్పడి పీల్చకున్న గాలి కూడా బయటకు వెళ్లిపోతుంటుంది. దాంతో క్రమేపీ ఊపిరితిత్తులకు సమస్యలు తలెత్తి, శ్వాసలో ఇబ్బందులు ఏర్పడుతాయి. ఈ రంధ్రాలను మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ ద్వారా సరిచేసే వీలుంది. ఈ సర్జరీని వైద్య పరిభాషలో బుల్లెక్టమీ అంటారు.

లోబ్ పాడయితే..

ఊపిరితిత్తులు మూడు లోబ్‌లుగా ఉంటుంది. వీటినే లంబికలు అని కూడా అంటారు. తరచుగా ఊపిరితిత్తుల్లో సమస్యలు వస్తే ఈ లోబ్‌లు దెబ్బతింటాయి. పదే పదే తలెత్తే ఇన్‌ఫెక్షన్ (బ్రాంకైటిస్), న్యుమోనియా, క్షయ, క్యాన్సర్ వంటి కారణాల వల్ల లోబ్ పాడయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. ఇలా ఏదైనా లోబ్ పాడయినప్పుడు దాన్ని మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ ద్వారా తొలగించవచ్చు. అయితే ఊపిరితిత్తిలో కొంత భాగం అయిన లోబ్‌ని తీసేయడం వల్ల మిగిలివున్న ఊపిరితిత్తిలో సమస్య వస్తుందేమో అని భయపడుతారు. కాని అలాంటిదేమీ ఉండదు. పాడయిన లోబ్ తొలగించడం మూలంగా మిగతా ఊపిరితిత్తి పనిచేయకుండాపోయే పరిస్థితి ఉండదు.
Health6

డయాగ్నస్టిక్ బయాప్సీ

కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తులు పదే పదే ఇన్‌ఫెక్షన్లకు గురవుతూ మందులు వాడినా తగ్గకుండా పదే పదే తిరగబెడుతూ ఉంటే ఊపిరితిత్తుల్లోని చిన్న భాగాన్ని బయాప్సీకి పంపించాల్సి ఉంటుంది. ఈ ముక్కను సేకరించడానికి కూడా ఇన్వేసివ్ సర్జరీ చేయవచ్చు. వాతావరణ కాలుష్యం కారణంగా ఇండస్ట్రియల్ లంగ్ డిసీజ్ వచ్చిన సందర్భంలో ఎలాంటి కాలుష్యం కారణంగా రుగ్మత తలెత్తుతుందో తెలుసుకోవడం కోసం బయాప్సీ చేయక తప్పదు. కొంతమందిలో క్షయను నిర్ధారించడం కష్టమవుతుంది. సాధారణ రక్త పరీక్ష, ఎక్స్‌రేలలో క్షయ నిర్ధారణ కాకపోతే అలాంటి సందర్భంలో కూడా బయాప్సీ చేయాల్సి వస్తుంది. ఇలా ఊపిరితిత్తుల బయాప్సీ కోసం సురక్షితమైన మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ చేయవచ్చు.

గుండె సమస్యలు

గుండె చుట్టూ నీరు చేరినప్పుడు ఛాతి గుండా ట్యూబ్ వేసి నీరు తొలగించే ప్రక్రియ శాశ్వత పరిష్కారం అందించలేదు. నీరు తొలగించిన తర్వాత తిరిగి నీరు చేరుతూనే ఉంటుంది. ఇలా అదేపనిగా చేసే వీలుండదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కూడా మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీని ఆశ్రయించవచ్చు. గుండె చుట్టూ ఉండే పెరికార్డియం అనే పొరకు రంధ్రం చేసి కిటికీ లాగా చేస్తారు. దీని ద్వారా ఆ ద్రవం ప్లోరిక్ కేవిటీలోకి (ఛాతి, పొట్ట మధ్య ఉండే భాగం) చేరుకుంటుంది. ఈ ద్రవాన్ని తేలికగా తొలగించవచ్చు. ఇలా పేరుకున్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించకపోతే గుండె మీద ఒత్తిడి పెరిగి, హార్ట్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
Health7

డాక్టర్ కె. బాలసుబ్రమణియం
సీనియర్ మినిమల్లీ ఇన్వేసివ్ లంగ్
అండ్ రోబోటిక్ థొరాసిక్ సర్జన్
యశోద హాస్పిటల్స్, హైదరాబాద్
ఫోన్ : 8121022333

Balasubramaiam

200
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles