నర్మద పరిక్రమ మూకాంబికా గుడిలో ఏం జరిగింది?


Sun,September 29, 2019 12:09 AM

- మల్లాది వెంకట కృష్ణమూర్తి తీర్థయాత్ర 23
(గత సంచిక తరువాయి)


అలా గోవానుంచి గోకర్ణం, మురిడేశ్వర్‌, కొల్లూరు, ఉడిపి, ధర్మస్థల, శృంగేరిలను దర్శించాను. ఏమైందో నాకు ఇప్పటికీ తెలీదు కానీ, తర్వాత తక్షణం మాంసాహారం తీసుకోకూడదని గట్టి నిర్ణయం తీసుకొన్నాను. అలాగే, కొన్ని చెడ్డ వ్యసనాలకు దూరం అయ్యాను. అవి తప్పన్న గట్టి భావన నాలో ఉదయించింది. అప్పటినుంచి మళ్లీ అవకాశాలు వచ్చినా నేను నిజాయితీగా వాటి జోలికి పోలేదు. అలాగే, ఆల్కహాల్‌ తాగడం మీద ఆకస్మిక విరక్తి కలిగి, మూడు నెలల తర్వాత ఓ రోజు అదికూడా ప్రయత్నం లేకుండానే మానేశాను. ‘ఆల్కహాల్‌ తాగడమంటే వార్నిష్‌ తాగడమనే’ మానసిక భావన నాలో చాలా బలంగా ఉండేది. ఇప్పుడు దానిమీద ఎలాంటి ఉత్సాహం లేదు. నాకున్న ఈ మూడు చెడ్డ అలవాట్లు అలా వాటంతటవే రాలిపోయాయి.

ఆ యాత్ర నుంచి ఇంటికి వచ్చాక గాయత్రి మంత్రం చదువుకోవాలనే కోరిక బలంగా కలిగి, జపం ఆరంభించాను. ప్రాపంచిక విషయాల మీద మోజు తగ్గి దైవం మీద ఆసక్తి వేగంగా పెరిగింది. ఆ విధంగా ఆధ్యాత్మిక మార్గంలోకి నా ప్రమేయం లేకుండానే నేను దైవికంగా వచ్చాను.చాలాకాలం నేను ఇతరులకు చేసిన హానికి, అనేక దుష్కర్మలకు పశ్చాత్తాపంతో బాధపడ్డాను. కానీ, అవి ఓ కారణంగా చేయబడ్డాయన్న అంతర్గత సమాధానం తర్వాత లభించి, ఆ బాధనుంచి పూర్తిగా విముక్తి కలిగింది. నేను ఆ బాధలో ఉన్న సమయంలోనే ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం అనుబంధం ఫెయిల్యూర్‌ స్టోరీ ఇంటర్వ్యూలలో ఈ విషయమే ప్రధానంగా ప్రస్తావించాను. దాన్ని చదివే పాఠకులు నన్ను ఛీత్కరించుకొనే అవకాశం ఉందని నన్ను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్‌ కందుకూరి రమేష్‌ స్నేహపూర్వకంగా వారించినా నిజాయితీగా, ఏదీ దాచకుండా చెప్పాను. ఒకప్పుడు నేనేమిటో ప్రపంచానికి వెల్లడించడం ద్వారా కూడా కొంత ఉపశమనం లభించింది. క్రిస్టియానిటీలో చర్చిలో ఫాదర్‌కు తను చేసిన పాపాలను చెప్పుకొనే కన్ఫెషన్‌తో ఆ ఫెయిల్యూర్‌ స్టోరీని పోల్చవచ్చు.

Narmada
కొల్లూరులోని మూకాంబికా తల్లి ఆలయం నుంచి తిరిగి వెళ్తుంటే నాలో కలిగిన కొన్ని వింత ఆలోచనలు గుర్తుకు వచ్చాయి. ఆలయం దర్శించి తిరిగి వెళుతుంటే, ‘ఆ తల్లి దగ్గరే శాశ్వతంగా ఉండిపోవాలన్న’ భావన కలిగింది.

ఓ రోజు నాలో ఆకస్మిక మార్పు ఎక్కడ, ఎలా జరిగి ఉండవచ్చని ఆలోచించాను. కొల్లూరులోని మూకాంబికా తల్లి ఆలయం నుంచి తిరిగి వెళ్తుంటే నాలో కలిగిన కొన్ని వింత ఆలోచనలు గుర్తుకు వచ్చాయి. ఆలయం దర్శించి తిరిగి వెళుతుంటే, ‘ఆ తల్లి దగ్గరే శాశ్వతంగా ఉండిపోవాలన్న’ ఆలోచన కలిగింది. ‘మంచిదే. కాని, రాత్రి గుడి మూసేసేప్పుడు పూజారి వెళ్లి పొమ్మంటాడు కదా’అన్న సందేహం. వెనువెంటనే ‘అమ్మవారికి ఇచ్చే హారతి పళ్లెంలోని నల్లటి మసిరూపంలో ఉంటే వెళ్లగొట్టరు కదా’ అన్న సమాధానం. ‘అది బాగానే ఉంది. కాని, నా బంధుమిత్రులను మిస్‌ అవుతానన్న’ మరో సందేహం. ‘వాళ్లు ఎప్పుడైనా గుడికి వచ్చినప్పుడు చూడవచ్చు కదా’ అన్న సమాధానం.. ఇలా ఆలోచనలుగా సాగాయి. పిచ్చిగా ఆలోచిస్తున్నానని అనిపించి అక్కడితో ఆ ఆలోచనలను ఆపేసి పుస్తకం తెరిచాను. ప్రభుతో ఇంకోమాట కూడా చెప్పాను.

“నాకున్న ఏకైక చింత నాలో కలిగిన ఈ స్పిరుచువల్‌ అవేకెనింగ్‌ నలభై తొమ్మిదో ఏట కాక ఏ పదహారో ఏటో ఎందుకు కలుగలేదా అని. అలా జరిగి ఉంటే నేను చేసే ఆధ్యాత్మిక సాధనతో ఈ జన్మలో చేసిన దుష్కర్మలకు బదులు గత జన్మలోని దుష్కర్మలను రద్దు చేసుకొనే వాణ్ణి కదా. కొత్తగా ఈ జన్మలో దుష్కర్మలను చేసేవాడిని కాను. అదంతా నా ప్రారబ్దకర్మవల్ల జరిగిందని తెలిసినా సమాధాన పడలేకపోతున్నాను. దొరికిన ఈ మనిషి జన్మ ఆధ్యాత్మిక ప్రగతికి సరిగ్గా ఉపయోగపడలేదనే బాధ మాత్రం ఇంకా పోలేదు.”

ఇదంతా ప్రభు మౌనంగా విన్నాక చెప్పారు. “నేను మూడు రోజులనుంచి మానసికంగా బాధ పడుతున్నాను. ఫ్రెండ్స్‌తో కలిసి ముంబైలో రెస్టరెంట్లలో గప్పాలు కొడుతూ జీన్స్‌ ప్యాంట్లలో తిరిగి ఈ వయసులో ఈ తీర్థయాత్రలు ఏమిటా అని. మా నాన్న వస్తే సరిపోదా, నేను కూడా ఎందుకు అని. కానీ, మీ మాటలు విన్నాక నా బాధ తొలగి నాకు ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది.”నేను, వెంకటేశ్వరరావు బస్‌ ఎక్కబోయే ముందు ఆఖరిసారిగా పక్కనే ఉన్న జైన మందిరంలోకి వెళ్లి దణ్ణం పెట్టుకొని వచ్చి బస్సు ఎక్కాం. ఈ రోజు మా బస్సు ఒకే ఒక గంటలో మూడు రాష్ర్టాలనుంచి ప్రయాణించింది. అవి మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌లు. ఖేతియో అనే ఊళ్లోని ఓవైపు మధ్యప్రదేశ్‌, మరోవైపు మహారాష్ట్ర మురికినీరు పారే చిన్నకాలువ ఆ రెండు రాష్ర్టాల సరిహద్దు.

461
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles