డెవలపర్ల మోసాలకు రెరా చెక్‌!


Sat,September 21, 2019 12:31 AM

RERA
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి బిల్డరును రెరాలో నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం మూడు నెలల గడువునిచ్చింది. పైగా, 1.1.2017 తర్వాత హైదరాబాద్‌లో ప్రారంభమైన ప్రాజెక్టులనే నమోదు చేసుకునే సౌలభ్యం కల్పించింది. అయినప్పటికీ, కొందరు బిల్డర్లు ఇంకా మోసపూరితంగానే వ్యవహరిస్తుండటం దారుణం. నేటికీ, రెరా అనుమతి లేకుండా అడ్డదారుల్లో ప్రకటనల్ని గుప్పిస్తూ కొనుగోలుదారులకు ప్లాట్లు, ఫ్లాట్లను అంటగడుతున్నారు. తక్కువ రేటుకు వస్తుందనే ఆశతో కొందరు మధ్యతరగతి ప్రజానీకం అక్రమ బిల్డర్ల మాయమాటల్లో చిక్కుకుంటున్నారు. అయితే, ఇలాంటి మోసపూరిత వ్యవహారాలకు రెరా అడ్డుకట్ట వేయనున్నది.


రెరా అమల్లో ఉందనే సోయి లేకుండా కొందరు డెవలపర్లు నేటికీ అక్రమ మార్గాలను వదలడం లేదు. ఇష్టం వచ్చినట్లు తమ కొత్త ప్రాజెక్టుల హోర్డింగుల్ని పెడుతున్నారు. మరికొందరేమో లేఅవుట్లు, నిర్మాణాల సమాచారాన్ని కరపత్రాల్లో ముద్రించి పేపర్లలో పెట్టి ప్రజలకు చేరవేస్తున్నారు. ఇంకొందరు బిల్డర్లు తెలివిగా ఏం చేస్తున్నారంటే.. తమ కొత్త ప్రాజెక్టుల సమాచారాన్ని వాట్సప్‌ల ద్వారా కొనుగోలుదారులకు పంపిస్తున్నారు. ఇది చాలదన్నట్లు పలు బడా సంస్థలు ఏకంగా హౌసింగ్‌ వెబ్‌ పోర్టళ్లలో కొత్త ప్రాజెక్టుల వివరాల్ని పొందుపరిచి విక్రయిస్తున్నారు. వాస్తవానికి, రెరా అనుమతి వచ్చాకే ఆయా ప్రాజెక్టుల సమాచారాన్ని పొందుపర్చాల్సి ఉంటుంది. కానీ, ఆ నిబంధనను పలువురు బడా డెవలపర్లు సైతం పట్టించుకోవడం లేదు. ఇలా, నగరానికి చెందిన అధిక శాతం మంది బిల్డర్లు రెరాను బేఖాతరు చేస్తూ.. ఇష్టం వచ్చినట్లు ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా తమను రెరా పట్టించుకోవడం లేదని భావించే డెవలపర్లు లేకపోలేరు. కానీ, ఇది వాస్తవం కాదని మోసపూరిత బిల్డర్లు అతిత్వరలో గ్రహిస్తారు.

రెరా ఏం చేస్తున్నది?

హైదరాబాద్‌ నలువైపులా ఏయే బిల్డర్లు తమ వద్ద అనుమతి తీసుకోకుండా చేస్తున్న అక్రమ విన్యాసాల సమాచారాన్ని రెరా సేకరిస్తున్నది. పలు నిర్మాణాలకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాల్ని సేకరించి ఒకేసారి భారీ స్థాయిలో జరిమానా విధించడానికి సిద్ధమవుతున్నది. అట్టి ప్రాజెక్టుల్లో ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదనే ప్రకటనల్ని విడుదల చేయడానికి రంగం చేస్తున్నది. వాస్తవానికి, రెరాలో నమోదు చేసుకునేందుకు నామమాత్రపు ఫీజును రెరా అథారిటీ వసూలు చేస్తున్నది. బిల్డర్లు కట్టే ప్రాజెక్టులతో పోల్చితే ఈ సొమ్ము నామమాత్రమేనని చెప్పొచ్చు. అయినప్పటికీ, పలువురు కక్కుర్తిగానే వ్యవహరిస్తున్నారని, మోసపూరిత అలవాట్లను మర్చిపోలేకపోతున్నారని తెలంగాణ రెరా అథారిటీ ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

అన్నీఇన్నీ కావు.. డెవలపర్ల మోసాలు

ఔటర్‌ రింగ్‌ రోడ్డుకి ఇరువైపులా, జాతీయ, రాష్ట్ర రహదారుల్లో పలు సంస్థలు ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల హోర్డింగుల నుంచి రెరా అథారిటీ వివరాల్ని కొంతకాలంగా సేకరిస్తున్నది.
- రెరా అనుమతి లేకుండా నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశం ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, స్థల యజమానుల పేరిట ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తున్న బిల్డర్ల వివరాలు, కరపత్రాలను ముద్రించి పేపర్లలో వాటిని పెట్టి కొందరు అమ్ముతున్నారు.. ఇలా రకరకాల పద్ధతిలో ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తున్న రియల్టర్ల సమాచారాన్ని రెరా సిబ్బంది విస్తృతంగా సేకరిస్తున్నది.

- కొందరు ప్రమోటర్లు 2017 తర్వాత అపార్టుమెంట్లను ప్రారంభించి, నిర్మాణాల్ని పూర్తి చేసి కొనుగోలుదారులకు అప్పగించారు. వీటి సమాచారాన్ని రెరా అథారిటీ సేకరిస్తున్నది. నగరంలో రెరా అనుమతి తీసుకోకుండా విక్రయిస్తున్న డెవలపర్ల సమాచారాన్ని సేకరించి.. వారికి గట్టి షాక్‌ ఇచ్చే పనిలో తెలంగాణ రెరా అథారిటీ నిమగ్నమైంది. వీరిలో కొందరికి షోకాజ్‌ నోటీసులను జారీ చేసే పనిలో నిమగ్నమైందని సమాచారం.

రెరాను పట్టించుకోని భాగస్వామ్యులు

హైదరాబాద్‌లో ప్లాట్లు, ఫ్లాట్లు, కమర్షియల్‌ స్పేస్‌ను విక్రయించే పలువురు వ్యాపార భాగస్వామ్యులు (ఛానల్‌ పార్ట్ట్‌నర్లు) అత్యుత్సాహాన్ని ప్రదరిస్తున్నట్లు తెలిసింది. వీరి వ్యవహారశైలి కారణంగా నగరానికి చెందిన కొందరు డెవలపర్లు ఇబ్బంది పడాల్సి వస్తున్నది. హైదరాబాద్‌లో పేరెన్నిక గల ఓ సంస్థకు సంబంధించిన పాత ప్రాజెక్టుల ఫోటోలను పెట్టి.. ఇంకా ప్రారంభానికి నోచుకోని ప్రాజెక్టుకు సంబంధించిన ఫ్లాట్లను విక్రయిస్తున్నారని రెరా దృష్టికి వచ్చింది. రెరా అనుమతి లేకుండానే ఇలా చేస్తున్నారని తెలిసింది. అసలెందుకిలా జరిగిందని ఆరా తీస్తే.. కొందరు ఛానల్‌ పార్ట్ట్‌నర్లు అత్యుత్సాహంతో అట్టి సంస్థకు చెప్పా పెట్టకుండా, వారి పేరును ఉపయోగించుకుంటూ, ఫ్లాట్లను విక్రయిస్తున్నారని తెలిసింది. పశ్చిమ హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్లలో పొందుపరిచారు. అంతేకాదు, బృందంగా ఫ్లాట్లను కొనుగోలు చేయాలని ప్రోత్సహిస్తున్నారు.

ఇలాంటి అక్రమ అమ్మకాల మీద తెలంగాణ రెరా అథారిటీ దృష్టి సారించింది. సదరు సంస్థకు సంబంధం ఉన్నా.. లేకున్నా.. ఆయా అమ్మకాలను నిరోధించాల్సిన బాధ్యత సంస్థ మీదే ఉంటుందని అభిప్రాయపడుతున్నది. రెరా అనుమతి తీసుకోకుండా ఏ కంపెనీ అయినా ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించకూడదని తెలంగాణ రెరా అథారిటీ చెబుతున్నది. మరి, ఇలాంటి సంస్థలపై రెరా ఎలా స్పందిస్తుంది? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే.. మరికొంత కాలం వేచి చూడాల్సిందే. రెరాలో నమోదు చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యక్తిగత గృహాలను విక్రయించకూడదని రెరా ఆదేశిస్తున్నది.

214
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles