రోబో మెరుపు తీగ!


Fri,September 20, 2019 01:09 AM

గడ్డ కట్టిన రక్తం ముద్దల క్షయీకరణ (Clot-Reducing) చికిత్సలకు అద్భుత మార్గంగా దారం మాదిరి రోబో ఒకటి అవతరిస్తున్నది. అత్యంత సంక్లిష్టమైన (కుహరం) మెదడు రక్తనాళాల వ్యవస్థ వంటివాటిలోనూ చాలా సున్నితంగా జారుతూ వెళ్లి లక్ష్యాన్ని ఛేదించగల రీతిలో దీనిని అభివృద్ధి పరిచారు. ఒక లోహాయస్కాంత రోబో (ferromagnetic robot) గా ఇది జటిలమైన, నిరోధక పర్యావరణ రక్తనాళాల లోనూ ఎంతో చక్కగా పాకుతూ వెళ్లిపోతుందని పరిశోధకులు అంటున్నారు. వైద్యవిజ్ఞాన శాస్త్రరంగంలో ఒక మైలురాయిలా నిలిచిపోయే ఈ పరిశోధన బ్లడ్ క్లాటింగ్ (coagulation) చికిత్సలో ఎంతో ప్రయోజనకారి కాగలదని కూడా వారు అంటున్నారు.
robo

మెదడు సంక్లిష్ట రక్తనాళాలకు అద్భుత చికిత్స

రొబోటిక్ దారం (robotic thread) ఎంత సన్నగా, సౌలభ్యంగా ఉంటుందంటే, మానవ మెదడులోని రక్తనాళాలకు చెందిన అతి ఇరుకైన మార్గాల గుండాకూడా తేలిగ్గా, సాఫీగా పాకుతూ వెళుతుందని పరిశోధకులు అంటున్నారు. మెదడు అఘాతం, రక్తనాళ/ గుండెకుహర వాపు (stroke and aneurysms) వంటివాటికి గురైన పేషెంట్లలో సంభవించే రక్తనాళ ప్రతిబంధకాల (blockages) ను తొలగించడానికి భవిష్యత్‌లో ఇది అద్భుతంగా ఉపయోగపడగలదన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా, మసాచుసెట్స్ రాష్ర్టానికి చెందిన కేంబ్రిడ్జి నగరంలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచిన ఈ రోబో దారం అయస్కాంతత్వం ఆధారంగా రూపొందింది. ఈ పరిశోధన సైన్స్ రోబోటిక్స్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైంది.

గడ్డ కట్టిన రక్తం ముద్దలకు చికిత్స చేయడానికి ప్రస్తుతం వైద్యులు అవలంభిస్తున్న ఎండోవాస్క్యులర్ విధానం నిజానికి అత్యంత అల్పస్థాయి హానికారక (minimally invasive) శస్త్రచికిత్సనే. ఇందులో సర్జన్లు సాధారణంగా పేషెంట్ల కాలు లేదా గజ్జలద్వారా ప్రధాన ధమని (నాడి)లోకి ఒక పల్చని తీగను పంపిస్తారు. రేడియేషన్‌తో ఉత్పన్నమయ్యే ఫ్లోరోస్కోప్ (fluoroscope) ఆధారంగా, ఎక్స్‌రే చిత్రాలనూ ఏకకాలంలో గమనిస్తూ నాళంలో రక్తం గడ్డకట్టిన భాగం వద్దకు తీగను సర్జన్లు చేతితో కదుపుతూ వెళతారు. తర్వాత తీగ పొడుగునా క్యాథెటర్ (catheter: గొట్టం) ద్వారా ఇవ్వలసిన ఔషధాన్ని లేదా సదరు పరికరాలను పంపిస్తారు. ఈ విధానంలో పేషెంట్లకు కొంత భౌతిక ఒత్తిడితోపాటు సర్జన్ల నైపుణ్యమూ కీలక పాత్ర పోషిస్తుంది. ఒక్కోసారి పలుమార్లు ఫ్లోరోస్కోప్ అవసరం పడవచ్చు. నిజానికి ఈ వైద్య నైపుణ్యానికి అత్యధిక డిమాండ్ ఉందని, పేషెంట్లకు తగిన సంఖ్యలో నిపుణులు లేరని, ప్రత్యేకించి గ్రామీణ, పట్టణ/నగర శివారు ప్రాంతాలలో వారి అవసరం చాలా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.

వైద్య మార్గదర్శక తంత్రుల (medical guidewires) ను ఉపయోగించే ప్రస్తుత చికిత్సా విధానాలన్నీ దాదాపు నిష్క్రియాత్మకమైనవి (passive) గా పరిశోధకులు అంటున్నారు. పైగా, వైద్యుల హస్తలాఘవం (manipulated manually)పై ఆధారపడి ఉండడమేకాక, అవి లోహమిశ్రమాలు, పాలిమర్ పూతలతో తయారవుతున్నాయి. ఇరుకు నాళ ప్రదేశాలలో ఒకవేళ తీగకాని ఇరుక్కుపోయినా, రాపిడి, నాళాల లైనింగ్‌లకు నష్టం కలిగించినా కష్టమే. ఈ రకమైన ఇబ్బందులకు వేటికీ ఆస్కారం లేకుండా రోబోటిక్ దారాన్ని (తీగ) తాము అభివృద్ధి పరిచినట్లు వారు చెబుతున్నారు. దీనిని తాము జీవానుగుణమైన పదార్థాలతోనే రూపొందించామని వారు పేర్కొన్నారు. తీగను తయారుచేసిన పదార్థ స్వభావం, అయస్కాంతత్వం వంటివాటివల్ల దీనికి అసాధారణ రీతిలో, అత్యంత అనుగుణంగా రక్తనాళాలలో జారే గుణం సిద్ధించినట్లు వారు వివరించారు. సిలికాన్‌తో తయారుచేసిన మెదడు రక్తనాళాల నమూనాలలో దీనిని పరీక్షించగా, పూర్తిగా విజయవంతమైనట్లు వారు తెలిపారు.

ఎక్కువమేర నీటితోనే తయారయ్యే హైడ్రోజెల్స్, అయస్కాంతత్వపు ప్రేరణనిచ్చేలా త్రిమితీయ ముద్రణలు, పదార్థాలతోనే రోబో తీగను రూపొందించినట్లు పై శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయస్కాంతత్వపు గుణంతోనే నియంత్రించే సామర్థ్యాన్ని, హైడ్రోజెల్ పైపూతను దానికి ఏర్పరిచారు. రోబోటిక్ దారం అంతర్భాగాన్ని నిటినోల్ (nitinol) గా పిలిచే పదార్థంతో తయారుచేశారు. ఇది కూడా సాగే, వంగే గుణం కలది. దీని తయారీకి నికెల్-టైటానియం మిశ్రమాన్ని ఉపయోగించారు. దుస్తులు ఆరేసుకొనే హ్యాంగర్ స్వభావానికి విరుద్ధంగా ఇది వొంపులు తిరిగాక తిరిగి యథాస్థితికి చేరుకోగలదు కూడా. ఇరుకైన, మెలి తిరిగినట్టు చుట్టల్లా వుండే రక్తనాళాలలోకి కూడా ఈ రోబో దారం సులువుగా వెళుతుందని వారన్నారు. తీగ (దారం) అంతర్భాగానికి జారుడు స్వభావంగల పదార్థాన్నే పూతగా పూసి, దాని పొడుగునా అయస్కాంత పరమాణువులను అమర్చామని, చివరగా ఒక రసాయనిక విధానంతో హైడ్రోజెల్‌తో కలిపి అయస్కాంత లేపనాన్నిచ్చామని వారు తెలిపారు.

robo2

విజయవంతమైన ప్రయోగం

రోబోటిక్ దారం కచ్చితత్వం, క్రియాశీలత ప్రయోగాలలో విజయవంతమైనట్టు పై పరిశోధకులు పేర్కొన్నారు. నిజమైన పేషెంట్ల స్కానిం గ్స్ ఆధారంగా వారి మెదడుకు చెందిన ప్రధాన రక్తనాళికల సిలికాన్ నమూనాలను తయారు చేసి ఆ మేరకు కూడా వారు పరీక్షలు నిర్వహించారు. సిలికాన్ నమూనాలలో రక్తం వంటి చిక్కదనంతో కూడిన పదార్థాన్ని నింపారు. బయటినుంచి రోబోటిక్ దారాన్ని నియంత్రించగలిగామని, ఔషధాన్ని నాళికల్లో సదరు అవాంతరం ఏర్పడిన ప్రదేశానికి చేర్చగలిగామని వారు తెలిపారు. ఇక, ఇది క్లినికల్ ప్రయోగాలనుకూడా పూర్తిచేసుకొని వైద్యరంగంలోకి అందుబాటులోకి రావడమే తరువాయి.

-దోర్బల బాలశేఖరశర్మ

377
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles