ఆమె ఓడిపోయింది!


Fri,September 20, 2019 01:05 AM

చిన్నప్పటి నుంచి ఆడిన ఆటలు ఆమెకు గెలుపు, ఓటములను రుచి చూపించాయి. పెద్దయిన తర్వాత క్రీడాకారిణిగా రాణించి తానేంటో నిరూపించింది. విధి ఆడిన ఆటలో మాత్రం ఓడిపోయింది. ఒకప్పటి ఫుట్‌బాల్ ఛాంపియన్ ఇల్లు గడవక పేదరికంతో పోటీ పడుతున్నది.
SubharaniFootballPlayer
శుభారాణి దాస్ ఒకప్పుడు క్రీడామైదానంలోకి అడుగు పెట్టిందంటే ఆటలో గెలువాల్సిందే! ఫుట్‌బాల్ ఛాంపియన్‌గా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఆమె విధి చేతిలో పరాజయం పాలయింది. 1992లో ఒడిశా తొలి మహిళా ఫుట్‌బాల్ జట్టు సభ్యురాలిగా జాతీయ స్థాయిలో విజేతగా నిలిచింది. ఆ ఆటలో శుభారాణి చూపిన తెగువ వల్ల ఒడిశా జట్టు క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లగలిగింది. ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా వివిధ స్థాయిల్లో రాణించింది. స్పోర్ట్స్‌లో ఆమె ప్రతిభను గుర్తించిన ఒడిషా సర్కారు శుభారాణిని కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక చేసింది. ఉద్యోగంలో చేరడానికి వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో అందినట్టే అందిన ఉద్యోగం చేజారిపోయింది. యాక్సిడెంట్ అయిన రెండేండ్లకు ప్రకాశ్ చంద్ర మిశ్రాతో పెండ్లి జరిగింది. కొన్నాళ్లకు శుభారాణికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆమె భర్తకు అరుదైన వ్యాధి సోకింది. దీంతో ఆయన ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఉపాధి లేక 44 ఏండ్ల మాజీ క్రీడాకారిణి ఇప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్నది. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకూ ఇల్లు గడవడానికి నానా ఇబ్బందులు పడుతున్నది. పొద్దున్నే పేపర్ అమ్ముతుంది. ఆ తర్వాత హోమ్ ట్యూషన్స్ చెప్పడానికి ఇంటింటికీ తిరుగుతుంది. మధ్యాహ్నానికి ఇంటికి చేరుకొని కుట్టు మిషన్ మీద బట్టలు కుడుతుంది. సాయంత్రం పాత పేపర్లతో కవర్లు తయారు చేసి వాటిని దుకాణాల్లో అమ్ముతుంది. అలా శుభారాణి సైకిల్‌పైనే రోజుకు 20 కిలోమీటర్లు చుట్టివస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా తన పిల్లలను ఆటల్లో ఆణిముత్యాలుగా తయారుచేస్తా అని చెబుతున్నదీ ఈ మాజీ ఛాంపియన్.

671
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles