ఏనుగు తొండం పనితనం


Fri,September 20, 2019 12:55 AM

Prakriti-Patham
భూమ్మీది పెద్ద జంతువుల్లో ఒకటైన ఏనుగు విలక్షణత, గొప్పతనం అంతా దాని తొండంలోనే ఉంటుంది. అసాధారణమైన దీని పనితనంలోని సాంకేతికతను శాస్త్రవేత్తలు మరమనిషి చేతుల తయారీకి వినియోగించడంలో విజయం సాధించారు. ఏనుగు తొండం విభిన్న భంగిమల్లో వంగే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఎంత మృదువుగా కనిపిస్తుందో అంతే స్థాయిలో బలమైంది కూడా. మనిషి శరీరంలో మొత్తం 639 కండరాలు ఉం టే, మనకంటే ఎంతో పెద్దదైన ఏనుగుకు తొండంలోనే 40,000 విభిన్న కండరాలుంటాయని అంచనా. భూమిమీద అత్యంత ఎక్కువ సంఖ్య లో (బహుముఖ) జీవనక్రియలను నిర్వర్తించగల ఏకైక శరీరావయవంగా ఏనుగు తొండాన్నే చెప్తా రు. ఉఛ్వాస నిశ్వాసలకు, నీళ్లు తాగడానికి, పుకిలించడానికి, ఆహారం నోట్లోకి తీసుకోవడం, వాసన చూడడం, ఒక చేతిలా స్పర్శను పొంద డం, భావాల్ని అందించడం, పట్టుకోవడం, లాగ డం వంటి ఎన్నో పనులకు ఏనుగుకు తొండమే దిక్కు.


ఇది ఎంత సున్నితమో అంత దృఢమైంది కూడా. దీని చివర రెండు వేళ్లవంటి భాగాలు మొనదేలి ఉంటాయి. చిన్న వస్తువులను పట్టుకోవడానికి అవి ఉపయోగపడుతై. ఆఖరకు అది తన కన్నీళ్లు తుడుచుకొని, కండ్లను శుభ్రపరచుకోవడానికీ తొండాన్నే ఉపయోగిస్తుంది. సుమారు 350 కేజీల బరువైన చెట్టునైనా తొండంతో పెకిలించి వేస్తుంది. కొన్ని మైళ్ల దూరంలోనే నీళ్లున్న సంగతిని దీని వాసన శక్తితో పట్టేస్తుంది.

Prakriti-Patham2
ఇంతటి పనితనాన్ని కలిగివుంది కాబట్టే, శాస్త్రవేత్తలను ఏనుగు తొండం ఆకట్టుకొంది. దీని సాంకేతికతను మరమనిషి చేతి (రోబో ఆర్మ్) తయారీకి వారు ఉపయోగించారు. తొలుత రోబోల చేతులు అనుకొన్నంతగా ఆయా భంగిమల్లో కదలకుండా కొంత నియంత్రణకు లోబ డి ఉండేవి. ఏనుగు తొండం పనితనాన్ని ప్రవేశపెట్టిన తర్వాత రోబోల చేతులకు అనూహ్య శక్తి సమకూరింది. 21వ శతాబ్దంలోనే ఈ పరిశోధన ఉత్తమ ఆవిష్కరణగానూ గుర్తింపు పొందినట్లు తెలుస్తున్నది.

మరమనిషి చేతులు ఏనుగు తొండం పనితనాన్ని సంతరించుకోవడం వల్ల పారిశ్రామిక రంగంలో ఎన్నో అదనపు లాభాలు సాధ్యమైనాయి. వాటిలోని ప్లాస్టిక్ డిస్క్‌లను ఒత్తిడికి గురిచేసి, ఏ భంగిమల్లోనైనా సులువుగా వంగేలా తీర్చిదిద్ద గలిగారు. ఈ మేరకు గాలిని చొప్పించడం ద్వారా దీనిని సాధించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫిన్ గ్రిప్పర్ టెక్నాలజీని ఇందుకు వినియోగించినట్లు వారు తెలిపారు. ఫలితంగా ఎంతో సున్నితమైన వస్తువులను కూడా పట్టు సడలకుండా పట్టుకోగల సామర్థ్యం రోబో కృత్రిమ చేతులకు సిద్ధించింది.

-డా॥ రాజూరు రామకృష్ణారెడ్డి

191
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles