అప్పటి ఇప్పటి జ్ఞాపకాల తెలంగాణ


Wed,September 18, 2019 01:02 AM

ఈమె వయసు వంద సంవత్సరాలు. వయసు అనడం కంటే.. అనుభవాలు, జ్ఞాపకాలు అంటే బావుంటుందేమో. ఎందుకంటే ఈమె ఎన్నో చారిత్రక ఘట్టాలకు ప్రత్యక్ష సాక్షి. నిజాం కాలంలో భర్త తో కల్సి జైలు జీవితాన్నీ గడిపింది. రజాకార్ల ఆగడలనూ చూసింది. స్వాతంత్ర పోరాటాన్నీ ఆ కన్నులతోనే చూసింది. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవాన్నీ చూడడమే కాదు ఆ ఫలాలనూ ఆస్వాదిస్తున్నది. ముని మనవలు మనవరాండ్ల తో కలిసి ఆనందంగా ఆడుకుంటున్నది. కేసీఆర్ బాగా కష్టపడి పనిచేయడం సంతోషంగా ఉందని చెబుతున్నది సుర్యాపేట జిల్లా, అనంతగిరి మండలం, వెంకట్రామపురం గ్రామానికి చెందిన జలగం రాధమ్మ. సెప్టెంబర్ 17 సందర్భంగా రాధమ్మ తన అప్పటి ఇప్పటి జ్ఞాపకాలను ఇలా పంచుకున్నది.
Baapamma

సెప్టెంబర్ 17, 1948 యాదికుందా?


యాదికుంది. రజాకార్ల గుర్రపు స్వారీలు, హిందుస్తాన్ జీపు సప్పుల్లు ఇంకా గుర్తున్నయి. నెహ్రు, పటేల్ సైనికుల్ని పంపి పట్నంల నిజాంని ఓడించిన్రు. ఆ నాలుగైదు రోజులు ఎవరో ఒకరు ఊళ్లోకి వచ్చి ఇట్లా కొట్లాట జరిగింది అట్లా జరిగింది అని చెప్పేటోళ్లు. ఇప్పట్లెక్క టీవీలు అప్పడు లేకపాయే. ఇప్పటిసంది మనం ఎవరికి భయపడేది లేదని ఊళ్లో అందరం పండగ లెక్క చేసుకున్నం. అప్పటిసంది రజాకార్ల పెత్తనం, దొరల పెత్తనం బాగా తగ్గింది.

వందేండ్ల వయసులో ఇంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా సొంతంగా వండుకునే తింటున్నారా?

చిన్నపటి జొన్నన్నం / రాగులు/ సజ్జ అన్నం, గట్క, గుగ్గిల్లు, కల్తీ లేని పాలు, ఇంట్ల పండిన కూరగాయలు తినేది. కంటినిండా నిద్ర పోయేది. వీటన్నింటికి మించి ఎంత పెద్ద కష్టం వచ్చినా ప్రశాంతంగా ఉండే గుండె ధైర్యం.. ఇవే కారణం కావచ్చు ఇట్టా ఉండడానికి.

మీ కుటుంబ నేపథ్యం?

నశింపేట నుండి కేసముద్రం, బలపాల, బేతోలు, మేడెపల్లిలలో వ్యవసాయం చేసుకుంటూ 40 ఏండ్ల కింద వెంకట్రమాపురంలో సెటిల్ అయినం. మేనమామనే పెండ్లి చేసుకున్న. ముగ్గురు బిడ్డలు, ముగ్గురు కొడుకులు. దేవుని దయ వల్ల అందరూ మంచిగనే ఉన్నరు. చిన్న కోడలు చనిపోవడం వల్ల కొడుక్కి వండిపెట్టుకుంట ఇక్కడే ఉంటున్న.

రజాకార్లు ఎవరు? వాళ్లేం చేసేటోళ్లు?

ఊళ్లల కొంతమంది నాయకులను అడ్డం పెట్టుకొని రజాకార్లు ఆరాచకం చేసేటోళ్లు. సాయంత్రం పూట మందల్లెక్క వచ్చి మగ, ఆడ తేడా లేకుంట కొట్టుకుంటు ఉన్నకాడికి దోచుకుంట పోయేటోళ్లు. వీళ్ల అరాచకాలకు భయపడి చాలామంది ఊర్లు విడిచిపెట్టి పోయేటోళ్లు. బట్టలిడిపించి బతకమ్మ ఆడిపించిన్రు అని నేను కూడ అప్పట్ల విన్న. కమ్యూనిస్ట్‌లను వెతికి వెతికి పటుకొని చంపేటోళ్లు.

వ్యవసాయం అప్పటికీ ఇప్పటికీ ఎమైనా మారిందా?

అప్పట్లో అడవులు నరికి పోడు వ్యవసాయం చేసెటోళ్లం. 10 రూపాయలిస్తే ఒక ఎకరం ఖర్చు ఎల్లిపొయేది. ఇప్పట్లెక్క మందులు వాడేది లేకుండే. దిగుబడి తక్కువున్నా మంచి వడ్లు, మొక్కజొన్న, పసుపు.. ఇట్లా ఎన్నో పండేయి. వడ్లు దంచుకొని తినేటోళ్లం. ఇంట్ల పాలు, కూరగాయలు ఎప్పుడూ పుష్కలంగా ఉండేయి. ఇప్పడంతా అన్నం తెల్లగా ఉండి రుచి పచి లేని కూరలు.. కల్తీ యవ్వారం.

అప్పటి బతకమ్మ ఇప్పటి బతకమ్మలో తేడా ఏమైనా ఉందా?

మొదట్లో ప్రతి ఊర్ల రెండు మూడు జాగాల బతకమ్మ ఆడెటోళ్లు. వెలమ, రెడ్లు, కోమటోళ్లు, గౌడ, తెలగ, కుమ్మరి, కంసలోళ్లు.. ఇట్లాంటోళ్లు ఒకచోట, మాదిగ, మాలలు ఇంకో చోట. బాగ పైసలున్నోళ్లు మరో దగ్గర ఆడేటోళ్లు. కొన్ని ఊర్లల్లో కొంతమంది మాదిగ, మాల వాల్లు మతం మారి బతకమ్మకు దూరంగా ఉండేటోళ్లు. మద్యల ఓ 40, 50 ఏండ్లు (సమైక్యాంధ్రలో) బతకమ్మ ఉనికే లేకుండపాయె. మల్ల ఈ 20 ఏండ్ల సంది మల్ల అన్ని కులపోళ్లు కలిసి ఒక దగ్గర ఆడడం మంచిగనిపిస్తున్నది. 50, 60 ఏండ్ల కిందలెక్క నీళ్లు ఇప్పుడు చెరువులల్ల కనిపిస్తున్నయి. పసుపుతో గౌరమ్మను చేసి తంగేడు పూలు, గుమ్మడి పూలు, తామెర పూలు, గొరింట పూలు, బంతి పూలు, గునుగు పూలు, అల్లిపూలు, పట్నం బంతి పూలతో బతకమ్మను చేసేటోళ్లం. ఇప్పుడంత ప్లాస్టిక్ పూలు, కాగితం పూల బతకమ్మలు చూడాల్సి వస్తుంది. బతకమ్మ పూల కోసం ప్రభుత్వం కొన్ని నర్సరీలు ఏర్పాటు చేస్తె మంచిగుంటది.

దొరలు, పటేళ్ల పెత్తనం ఎట్లుండే అప్పట్ల?

మాల, మాదిగ,లంబాడ వాళ్లతో పాటు ఆర్థికంగా ఎనకబడ్డ వెలమ, రెడ్డోళ్లు కూడా అప్పట్ల జీతం ఉంటుండే. పొలం పనులు, పిట్టలు కొట్టడం, పొలం దున్నడం, పశువుల కొట్టం శుభ్రం చేయడం లాంటివి చేసేటోళ్లు. మొదట్ల కొంచెం దూరంగా ఉంచినా కమ్యూనిస్ట్, నక్సల్ ప్రభావం వల్ల తర్వాత తర్వాత అన్ని కులాలల్లో పైసలు ఉన్నోళ్లు తయారైండ్రు. దొరలంటే ఒక వెలమొళ్లు అనే భావన తప్పు. నైజం సర్కార్‌కు గులాంగిరి చేస్తూ ఊళ్ల మీద పెత్తనం చేసేటోళ్లలో తురకలు, కరణాలు, రెడ్లు.. ఇట్లా చాలా కులపోల్లు ఉండేది. మల్ల ఈళ్లదాంట్ల జనం కోసం పనిచేసేటోళ్లు ఉన్నరు, జనం రక్త మాంసం పీక్కతిన్నోళ్లూ ఉన్నరు. మేడపల్లిలో తురకాయన దొర, అనంతగిరిలో కరణం దొర, చాలా ఊళ్లల్లో రెడ్డి దొరలు ఉండేది.

కమ్యూనిస్ట్‌ల ప్రభావం ఎట్లుండె?

అడవుల్లో ఉంటూ జీతగాల్ల, కౌలు రైతుల హక్కుల కోసం కొట్లాడేటోళ్లు. బాగ రుబాబు చేసే దొరల గడులు కూల్చేటోళ్లు. దొరల ఆస్తులను పేద ప్రజలకు జెండాలు పంచి పెట్టేటోళ్లు. వీళ్ల పాటలకు 13, 14 ఏండ్ల పిల్లల నుండి 60, 70 ఏండ్ల పెద్దోళ్ల దాకా సంతోషంగా వినేటోళ్లు. బండ్లు కట్టుకొని ఎంత దూరం ఉన్నా వీళ్ల మీటింగ్‌లకు పోయేటోళ్లం. కాంగ్రెసోళ్లకు వీళ్లకు అసలు పడేది కాదు. ఆడోళ్లు కొంచెం తక్కువగానే కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేటోళ్లు. ఇబ్బంది ఉందని కబురు పెడితే ఎక్కడ ఉన్నా వచ్చేటోళ్లు.
Baapamma1

ముస్లిం దొరలు ఎట్లాంటోళ్లు?

కొన్ని ఊళ్లల్లో తురక దొరలు వేల వేల ఎకరాలు కౌలుకు ఇచ్చి పేదోల్లతో వ్యవసాయం చెపిచ్చేటోళ్లు. వీళ్లు గుర్రాల బండిపై ఊళ్లల్లో అప్పుడప్పుడు కవాతు చేసేటోళ్లు. హిందువులు ఎక్కువగా ఉండె ఊళ్లలో వీళ్లే పెద్దమనుషులుగా వ్యవహరిస్తూ దసరా పండుగకు జమ్మిచెట్టుకు పూజ చేసేటోళ్లు. రజకార్ల లెక్క కాకుండా వీళ్లు జనంతో కలిసి మెలిసి ఉండేటోళ్లు.

అప్పట్లో తెల్లన్నం ఎక్కువ తినేదా? జొన్నన్నమా??

అప్పట్ల ఎక్కువగా జొన్నన్నం తినేటోళ్లం.

ఇప్పుడంటే తాగటానికి మందు, బీరు దొరుకుతుంది? అప్పట్ల ఏం తాగేది జనాలు?

విప్పచెట్టు చింతచెట్టు లెక్క పెద్దగా ఉండేది. విప్ప పూత తీసుకొని నానపోసి, పటిక యాలకులు, అరటిపండ్లు వేసి సార లెక్క తయారు చేసేటోళ్లు. అప్పట్ల ఇదే బీర్ విస్కీ జనాలకు. కొంతమంది అమ్ముకునేందుకు చేసేటోళ్లు. ఇంకొంతమంది ఇంట్ల తాగేందుకు చేసుకునేటోళ్లు.

మీ కోరికలు ఏమన్న మిగిలినయా?

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవడం బాధనిపిస్తుంది. నైజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో రెండు మూడుసార్లు ఆస్తులన్నీ పోగొట్టుకున్నాం. ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డాం. వందల ఏండ్ల వయసులో పైసలేమీ ఇవ్వకున్నా అప్పటి నైజం తెలంగాణ సర్కార్‌నుండి ఇప్పటి కేసీ ఆర్ తెలంగాణ సర్కార్ వరకు చూసిన ఇక చాలు. ఎవరన్నా పిలిచి గౌరవిస్తే మంచిగనిపిస్తది.

-సుధీర్ జలగం, సూర్యాపేట

1262
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles