కడుపులో బిడ్డకు కిడ్నీ వాపు.. ఎందుకు?


Wed,September 18, 2019 12:55 AM

నేను 24 వారాల ప్రెగ్నెంట్ ని. కడుపులో బిడ్డ ఆరోగ్యం చూడడానికి యాంటినేటల్ పరీక్ష చేయిస్తే ఒకవైపు కిడ్నీ వాచిపోయిందని అన్నారు. రెండో కిడ్నీ ఆరోగ్యంగానే ఉంది. ఇలా ఎందుకవుతుంది? దీనివల్ల బేబీకి ప్రమాదమా? ఈ సమస్యకు పరిష్కారం ఉందా? ఇప్పుడు నేనేం చేయాలి?
- నవ్య, వరంగల్

Week-33-Future-baby
ఒకవైపు కిడ్నీ ఆరోగ్యంగా ఉండి ఒకదానిలోనే సమస్య ఉంటే దానికి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పెల్విస్, మూత్రనాళం జంక్షన్ దగ్గర అడ్డంకి ఉన్నప్పుడు ఇలాంటి సమస్య వస్తుంది. ఇది బిడ్డగా ఎదిగేటప్పుడు కనిపించే స్ట్రక్చరల్ సమస్య. ఈ సమస్య ఉన్నప్పుడు బిడ్డ పుట్టిన 7వ రోజున అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. దీనిలో వాపు ఏ మేరకు ఉందో తెలుస్తుంది. దాన్నిబట్టి ఇన్‌ఫెక్షన్లు రాకుండా యాంటిబయాటిక్స్ ఇస్తారు. నెలరోజుల వయసు వచ్చిన తరువాత ఇసి స్కాన్ చేస్తారు. ఇది న్యూక్లియర్ మెడిసిన్ స్కాన్. దీనిలో ఒక ఇంజెక్షన్ ఇస్తారు. మందు కిడ్నీ నుంచి యూరిన్ ద్వారా వెళ్లిపోతుంది. బయటి నుంచి గామా కెమెరా సహాయంతో ఫొటో తీసి బ్లాక్ తీవ్రత ఎంత ఉంది, ఎక్కడ బ్లాక్ ఉంది అనేది తెలుసుకుంటారు. అడ్డంకి కొద్దిగా ఉంటే సర్జరీ అవసరం లేదు. కొన్నిసార్లు తగ్గిపోవచ్చు. మైల్డ్ బ్లాక్ ఉంటే 50 శాతం వరకు సర్జరీ అవసరం ఉండదు. రెగ్యులర్ చెకప్స్ చేయించాలి. ఎప్పుడు బ్లాక్ ఎక్కువైతే అప్పుడు సర్జరీ చేయాల్సి ఉంటుంది. అడ్డంకి తీవ్రంగా ఉంటే సర్జరీ తప్పనిసరి. లాపరోస్కోపిక్ పైలోప్లాస్టీ ద్వారా అడ్డంకిని తీసేసి లోపల స్టెంట్ వేస్తారు. ఆ తరువాత రెండూ జాయింట్ చేస్తారు. నెల తరువాత సిస్టోస్కోపీ ద్వారా స్టెంట్ తీసేస్తారు. చాలామంది చంటిపిల్లకి సర్జరీ అంటే భయపడుతారు. కాని భయం అక్కరలేదు. ట్రీట్‌మెంట్ చేయించకుంటే బ్లాక్‌వల్ల కిడ్నీపై ఒత్తిడి పెరిగి కిడ్నీ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ట్రీట్మెంట్ చేయించాలి. మీరు ఇప్పుడు దిగులుపడాల్సిన అవసరం లేదు. బిడ్డ పుట్టిన తరువాత బ్లాక్ తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు.


డాక్టర్ లావణ్య
కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్,
పీడియాట్రిక్ యూరాలజిస్ట్
రెయిన్‌బో హాస్పిటల్స్
హైదరాబాద్

7226
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles