అమ్మ చేతివంట ఆన్‌లైన్‌లో..


Wed,September 18, 2019 12:54 AM

ఏంటి సార్ అన్నం అలా పడేస్తున్నారు.. ఏం చేయమంటావు ఈ హోటల్ ఫుడ్డు అస్సలు పడట్లేదు. పోనీ ఇంట్లోంచి లంచ్ బాక్స్ తెచ్చుకుందామంటే అంత పొద్దున్నే వంట కాదు. అయినా నాకిదేం కొత్తకాదు. బాక్స్ తెచ్చుకొని ప్రతీసారి చెత్తకుండి పాలుచేయాల్సిందే.. అయ్యో సార్ మీరే కదా ఆన్‌లైన్‌లో ఇష్టమైంది ఆర్డర్ చేసి మరీ తెప్పించుకున్నారు. ఆ ఇష్టమైందే ఆర్డర్ చేశా కానీ ఇలా ఉంటుందని ఊహించలేదు. ప్రతిసారీ రెస్టారెంట్లను మారుస్తున్నా కానీ అసలు టేస్టీ ఫుడ్ దొరకట్లేదు.. చాలామంది ఇలా పారేసేవాళ్లే. చేసేదేముంది. ఏదో ఇంత తినడం.. మిగతాది డస్ట్‌బిన్‌కు సమర్పించుకోవడం.. అని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మూర్తి బాధపడ్డాడు. ఇదంతా గమనించాడు ముఖేశ్. అలా బాక్స్ తెచ్చుకోని వారిని కొన్నాళ్లుగా గమనిస్తూనే ఉన్నాడు. వారికి లంచ్ బాక్స్ అందిస్తూ ఉపాధి పొందొచ్చు కదా అనుకున్నాడు. తెల్లవారే ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
online-cook
ఉద్యోగం మానేశాను స్నేహితుడితో చెప్పాడు ముఖేశ్.. పిచ్చి పట్టిందా ఇప్పుడు ఉద్యోగం మానేసి ఏం సాధిస్తావ్ అంటూ స్నేహితుడు చైతన్య బదులిచ్చాడు. బిజినెస్ చేస్తా. సొంతంగా నాకాళ్లపై నేను నిలబడతా. కరెక్టే కానీ వర్కవుట్ అవుతుందంటావా? మెల్లిగా అన్నాడు చైతన్య. అయితే కానివ్వు లేకపోతే ఇంకోటేదైనా ట్రై చేసా బదులిచ్చాడు ముఖేశ్. అవునూ ఎన్నాళ్ల నుంచో నువ్వు కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అంటున్నావ్‌గా. నువ్ కూడా బిజినెస్‌లో నాతో పాటు ఉండొచ్చుగా అంటూ ముఖేశ్‌కు తన ఐడియాను చెప్పాడు. హైదరాబాద్‌లో ఇప్పటివరకూ ఇలాంటి స్టార్టప్ ఎవ్వరూ స్టార్ట్ చేయలే. మనం చేద్దాం. అంటూ ఇద్దరూ ఒక ఓ నిర్ణయానికి వచ్చారు.


మొదటి అడుగు

ఉద్యోగం మానేసిన తెల్లవారి నుంచే వీరి అన్వేషణ మొదలైంది. ఐటీ ఏరియాలో ఎన్ని కంపెనీలున్నాయి. ఎంత మంది ఉద్యోగులున్నారు. వీరిలో లంచ్ డబ్బా తెచ్చుకోని వారు ఎందరు. ఇలా మొదటి రోజు ఇతర కంపెనీల్లో పనిచేస్తున్న తమ స్నేహితుల ద్వారా వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇలా పదిహేను రోజుల్లో పూర్తి వివరాలు సేకరించారు. తమకున్న పరిచయాల ద్వారా కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలను ప్రత్యక్షంగా పరిశీలించారు. లంచ్‌బాక్స్ మీ ఇంటి నుంచి మేం తీసుకొస్తాం మీరు మా కష్టానికి ఎంత చెల్లిస్తారని ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఆ తర్వాత మొదటి నెల 40 మందితో అగ్రిమెంట్ కుదుర్చుకొని లంచ్‌బాక్స్ తీసుకెళ్లి ఇచ్చే పనిలో పడ్డారు. రోజూ లంచ్ బాక్స్ తీసుకెళ్లి ఇచ్చేవాళ్లు. మధ్యాహ్నం రెండు మూడు గంటలు మాత్రమే పని ఉండేది. నెల రోజులు తమ ఐడియా బాగానే వర్కవుట్ అయ్యింది. చేతి నిండా డబ్బులు కనిపించాయి. అదనపు ఖర్చు ఎందుకని పది నిమిషాలు లేటయ్యినా లంచ్‌బాక్స్‌లు తామే తెచ్చుకుంటున్నాం అని సగం మంది ఉద్యోగులు వీరిని వద్దన్నారు.

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి

ఏదో సాధిద్దాం అనుకొని ఉన్న ఉద్యోగాల్ని వదిలేశాం. ఇప్పుడెలా అని తలలు పట్టుకున్నారు. ఎలాగో ఉద్యోగాన్ని వదులుకున్నాం. ఇక వెనక్కి తిరిగి చూడొద్దు మరో ప్రయత్నం చేద్దాం ఏదైతే అదైంది అని చైతన్య ముఖేశ్‌కు ధైర్యాన్నిచ్చాడు. మనం దేనికోసమైతే ఉద్యోగాన్ని వదిలేశామో.. దానికోసమే పనిచేద్దాం. అందులోనే ఉపాధి పొందుదాం. అంటూ చైతన్య ముఖేశ్ భుజం తట్టాడు. కానీ ఎలా.. అదే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్‌కు హోటల్ ఫుడ్ రుచించట్లేదు. ఈ చుట్టుపక్కల ఉన్న మహిళల నుంచే వంటల్ని చేసి తీసుకొద్దాం. వాళ్లకు ఉపాధినిచ్చినట్లుంటుంది. మనమూ ఉపాధిని పొందొచ్చు. ఏమంటావ్ అన్నాడు చైతన్య స్వరంతో చైతన్య.

online-cook3

చెఫ్స్ కావలెను!

సామాజిక మాధ్యమాల్లో స్నేహితులిద్దరూ విమెన్ చెఫ్స్ కావలెను అని పోస్టు పెట్టారు. రెండు రోజుల్లోనే పదుల సంఖ్యలో ఫోన్లు వచ్చాయి. వారి ఫుడ్ టేస్ట్ చేసి వారిలోంచి ఇద్దరిని ఎంచుకున్నారు. మొదటి రోజు పదిమంది ఎంప్లాయిస్‌కు చెఫ్స్ చేసిన వంటల్ని అందించారు. రుచిగా ఉండడంతో ఆర్డర్స్ పెరిగాయి. ఆ తర్వాత గచ్చిబౌలికి చెందిన మరో ఇద్దరు చెఫ్స్‌కు వంటలు చేసే బాధ్యతల్ని అప్పగించారు. నెల తిరగకముందే అనూహ్యమైన స్పందన రావడంతో టిన్‌మెన్ యాప్‌ను తయారు చేశారు. అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీల ఉద్యోగులకు తెలిసేలా ప్రచారం చేశారు. ఈ యాప్ ద్వారా వారం రోజులు ఫుడ్ ఆర్డర్ చేయవచ్చని కొన్ని డిస్కౌంట్ ఆఫర్లను సైతం ప్రకటించారు. 40 మంది వుమెన్ చెఫ్స్‌ను ఎంచుకున్నారు.

ఎవరింటి నుంచి కావాలి భోజనం!

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లోని మహిళల్ని చెఫ్‌లుగా పెట్టుకున్నారు. 2015లో కంపెనీ ప్రారంభమైంది. ఏడాదికి 100 మంది వుమెన్ చెఫ్స్‌కు పని దొరికింది. ఆయా ఏరియాల్లోంచి కొంతమంది చెఫ్స్‌ల వంటల్ని ఆర్డర్ చేసేలా టిన్‌మెన్ యాప్‌లో పొందుపరిచారు. యాప్‌లో ఆర్డర్ చేసిన వెంటనే చెఫ్‌కు మెనూ మెసేజ్ వెళ్తుంది. మెనూ ప్రిపేర్ అయ్యిన తర్వాత యాప్‌లో ప్రిపేర్డ్ అనే ఆప్షన్ నొక్కగానే(ఇది ఓన్లీ చెఫ్స్‌యాప్‌లో మాత్రమే ఉంటుంది.)డెలివరీ బాయ్ వెళ్లి ఫుడ్ పికప్ చేసుకుంటాడు. పికప్ పాయింట్‌కు వెళ్లి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేస్తాడు.

ఏమేం ఆర్డర్ చేయవచ్చు?

టిన్‌మెన్ యాప్‌లో నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ వంటకాలు, సలాడ్స్, ఫ్రూట్ జ్యూస్‌లు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవేకాకుండా చిరుధాన్యాలతో కూడిన అల్పాహారం కూడా లభిస్తుంది. రూ. 120 నుంచి ఫుడ్ ఆర్డర్ మొదలవుతుంది. ఎక్స్‌ట్రా డెలివరీ చార్జీ ఏమీ తీసుకోరు. వంటల్లో శుచి, శుభ్రతకు టిన్‌మెన్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని నిర్వాహకులు ముఖేశ్, చైతన్య చెబుతున్నారు.

online-cook2

మీరూ ఉపాధి పొందొచ్చు!

మీరు బాగా వంట చేయగలరా? మిమ్మల్ని ఇంట్లో వాళ్లు తరచూ మెచ్చుకుంటున్నారా? అయితే మీలోని కిచెన్ కళద్వారా ఉపాధి పొందవచ్చు. అనేకమందికి మీ వంటల్ని అందించవచ్చు. మీకు ఖాళీగా ఉన్న సమయాల్లో ఆహారపదార్థాల్ని తయారు చేసి టిన్‌మెన్‌కు ఇవ్వొచ్చు. ఇందుకోసం www.tinmen.com వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు అనంతరం నిర్ణయించిన తేదీలో సంస్థకు మీ చేతి వంటల్ని పార్శిల్ చేయాలి. అవి సంస్థకు నచ్చితే వారు కిచెన్‌ను పరిశీలించేందుకు వస్తారు. ఆ తర్వాత అగ్రిమెంట్ ప్రకారం ఆర్డర్‌కు కొంత మొత్తాన్ని అందజేస్తారు.

కొందరికి ఉపాధినిస్తున్నా..

టిన్‌మెన్ ప్రారంభంలో రోజుకు 20 ఆర్డర్లు వచ్చేవి. శుచి, రుచి బాగుండడంతో ప్రస్తుతం చాలా వరకు ఆర్డర్లు పెరిగాయి. నా స్నేహితుడు చైతన్య డేగల ప్రోత్సాహం మరువలేనిది. మాద్వారా వందమంది మహిళలు, 120 మంది డెలివరీ బాయ్స్ ఉపాధి పొందుతున్నారంటే ఆనందంగా ఉంది. గృహిణులు ఒక్కొక్కరు రూ.30 వేల నుంచి రూ.40 వేలు సంపాదిస్తున్నారు. మాసేవల్ని మరింతగా విస్తరించాలనుకుంటున్నాం. ప్రస్తుతం ఐటీ ఏరియాల్లో మాత్రమే మా సేవలు అందుతున్నాయి. త్వరలో జంటనగరాల్లోని అన్ని ప్రాంతాల్లో ఫుడ్ డెలివరీ అయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం.
- ముఖేశ్ మండ, టిన్‌మెన్ వ్యవస్థాపకులు

online-cook4

మీక్కావాలా భోజనం

యాప్‌లో వారం రోజుల మెనూ ఒకే రోజు బుక్ చేసుకోవచ్చు. ఒక వేళ ఆఫీసుకు వెళ్లకపోయినా, ఊరికెళ్లినా ఆరోజు ఫుడ్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగస్తులే కాకుండా ఎవ్వరైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. కేవలం టిన్‌మెన్ యాప్‌లో మాత్రమే ఫుడ్ ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్‌లో మనకు కావాల్సిన మెనూ కనిపిస్తుంది. అది సెలెక్ట్ చేసుకోగానే ఎవరి నుంచి ఫుడ్ అందుకోవాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న వుమెన్ చెఫ్స్ ఫొటో, పేరు వంటల్లో వారి ప్రత్యేకత ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే వారికి ఫుడ్ ఆర్డర్ వెళ్లి పోతుంది. ఫుడ్ ఆర్డర్ చేసిన గంటలో ఫుడ్ అందుతుంది. దూరాన్ని బట్టి ఫుడ్‌డెలివరీ సమయం ఉంటుంది. ప్రస్తుతం ఈ రకమైన సేవలకు ఆన్‌లైన్ పేమెంట్ మాత్రమే అందుబాటులో ఉంది.

-పడమటింటి రవికుమార్
-కోనేటి వెంకట్

419
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles