మూగజీవాల కోసం.. ఒక ఆదివారం


Wed,September 4, 2019 12:36 AM

ఊళ్లో ఉండే మనుషులు అడవుల్లోకెళ్లి పచ్చని సంపదను నాశనం చేస్తున్నారు. అందుకే అడవుల్లో ఉండే మూగజీవాలు జనావాసాల్లోకి వచ్చి ఇండ్లు పీకి పందిరేస్తున్నాయి. తప్పు ఎవరిదైనా తెలంగాణలో కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ కోతుల బెడదతో ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. ఇంటిని, పంటల్ని నాశనం చేస్తున్న మూగజీవాల గుంపులతో పల్లెవాసులు నిత్యం కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మూగజీవాలను తరిమేందుకు ఇంటికొక్కరు కాపలా ఉంటున్నారు. ఆ సమస్యలకు కొంత మేర పరిష్కారం చూపే దిశగా ఓ యువకుడు ఆలోచన చేశాడు. ఆ ఆలోచనే ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్టుకు ప్రాణం పోసింది. మూగజీవాలకు అమ్మలా మారుతున్న ఈ ట్రస్టు ఫౌండర్‌ను పలుకరిస్తే మనసు చలించే విషయాలెన్నో యువతో పంచుకున్నాడు.
friends
మూడేండ్ల క్రితం ఓ రోజు మంచిర్యాలకు చెందిన సందేశ్ ఆదిలాబాద్ వెళ్లి వస్తున్నాడు. జన్నారం దగ్గర డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపాడు. డ్రైవర్ సహా కొంతమంది ప్రయాణికులు తినుబండారాలు, పండ్ల ను కిటికీలోంచి కోతులకు వేస్తున్నారు. ఈ క్రమంలో కిటికీ పక్కన కూర్చుని కునుకు తీస్తున్న సందేశ్‌కు ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఎదురుగా హారన్ కొడుతూ స్పీడ్‌గా వస్తున్న కారు వైపు దృష్టి మరలింది. రోడ్డుపై గుంపులుగా ఉన్న మూగజీవాలు చెల్లాచెదురుగా వెళ్లిపోయాయి. రెండు కోతులు మాత్రం ఎటు వెళ్లాలో తెలియక రోడ్డుపై అటూ ఇటూ తిరగసాగాయి. చివరికి కారు టైరు కింద పడి మృతి చెందాయి. కారు మాత్రం ఆగకుండా వెళ్లిపోయింది.

అదంతా క్షణాల వ్యవధిలోనే జరిగిపోయింది. బస్సులోని కొందరు ఈ విషయం మాట్లాడి మరిచిపోయారు. కానీ సందేశ్‌కు మాత్రం అదే విషయం దారిపొడవునా వేధించసాగింది. ఎవ్వరిదైనా ప్రాణమే. ఎవ్వరిదైనా ఆకలే. అది తీరే మార్గం లేకనే కదా కోతులు రోడ్లపైకి వచ్చాయి? అనే ప్రశ్న ఆ రోజు రాత్రి సందేశ్‌ను నిద్రపోనివ్వలేదు. ఎలాగైనా వాటి ఆకలి తీర్చాలని సంకల్పించుకున్నాడు. తెల్లవారి నుంచే తన ఆలోచనలకు రూపం ఇచ్చాడు.

friends4

ఆలోచన నుంచి ఆచరణ..

తెల్లవారి జేబులో ఉన్న ఐదొందలతో అరటి పండ్లను కొన్నాడు సందేశ్. జన్నారం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అప్పటి నుంచి వరుసగా ప్రతీ ఆదివారం ఇదే పని చేస్తున్నాడు. ఆ తర్వాత తన సేవల్ని విస్తరించాలనుకున్నాడు. 10 మే 2017న ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్టు ఏర్పాటు చేశాడు. మూగజీవాలకు సేవ చేయాల నుకుంటున్నా.. ఖర్చు నేను చూసుకుంటాను. మీకు వీలు దొరికినప్పుడల్లా నాతో రండి. సేవలో పాలుపంచుకోండి అని సామాజిక మాధ్యమాల్లో తన భావాన్ని పంచుకున్నాడు. అలా స్నేహితుల్ని కూడా తన సేవలో భాగస్వాములయ్యేలా చేశాడు సందేశ్.

friends2

ఏం చేస్తాడంటే..

మూగజీవాల కోసం సందేశ్ ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్టును ఏర్పాటు చేశాడు. ప్రతి ఆదివారం రూ. 23 వందల నుంచి 3 వేల వరకు సొంత ఖర్చుతో అరటి పండ్లు, కర్బూజకాయలు, దోసకాయలు, పుట్నాలు, పల్లీలు కొంటారు. అరటి పండ్లయితే 600 పీసులు. వాటర్ మెలోన్, దోసకాయలైతే క్వింటా 20 కిలోలు కొనుగోలు చేస్తాడు. వాటిని ప్రతి వారం ఓమ్నీ వ్యానులో తీసుకెళ్లి కోతులకు అందిస్తున్నాడు. ప్రమాదంలో గాయపడిన ఆవులు, గేదెలకు చికిత్స అందిస్తున్నాడు. మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో అర్ధరాత్రి లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ ఆవు కాలు విరిగింది. స్నేహితుల ద్వారా సమాచారం తెలుసుకున్న సందేశ్ ఆవుకు వైద్య చికిత్సలు అందించారు. సమీపంలో ఎక్కడ మూగజీవాలు ప్రమాదానికి గురైనా తనకు సమాచారం ఇవ్వాలని మంచిర్యాల పట్టణంలో అక్కడక్కడా తన నంబర్‌తో కూడిన పోస్టర్లు అతికించాడు.

ఒక్క రూపాయి విరాళం!

ఒక్క రూపాయి చెల్లించండి.. మూగజీవాల సేవలో తరించండి అంటూ సందేశ్ సామాజిక మాధ్యమాల ద్వారా జంతు ప్రేమికుల్ని ఏకం చేసున్నాడు. తను చేస్తున్న సేవలో అనేకమందిని భాగస్వామ్యం చేస్తున్నాడు. పెండ్లి రోజు, పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, ఆహారం కొనుగోలు చేయించి మూగజీవాల ఆకలి తీర్చి వేడుకలు జరుపుకొనేలా కృషి చేస్తున్నాడు. అడవిలో పండ్ల మొక్కలు నాటిస్తున్నాడు.

సేవల విస్తరణ

ఇదివరకు మంచిర్యాల జిల్లాలోని మూగజీవాలకు మాత్రమే వారం వారం ఆకలి తీర్చేవాడు. గతేడాది జూలై నుంచి ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంథని జిల్లాల్లోని అడవుల్లోకి వెళ్లి మూగజీవాల ఆకలి తీరుస్తున్నాడు. ఇలా ఆకలి తీర్చడం ఒక ఎత్తయితే.. ఇటీవల మంచిర్యాల జిల్లాలో స్నేహితుల ప్రోత్సాహంతో అడవిలో రెండు వేల పండ్ల మొక్కల్ని నాటాడు. అవి పెరిగి మూగజీవాలకు ఫలాల్నిస్తే నా జన్మ ధన్యమైనట్లే అని చెబుతున్నాడు సందేశ్. ఈ ఏడాది వేసవిలో తీవ్ర ఎండల దృష్ట్యా మంచిర్యాలలోని కూరగాయల మార్కెట్, బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో 600 ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను, వెయ్యి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశాడు.

friends3

ఉన్నంతలో సేవ చేస్తున్నా..

నా వంతుగా నాకున్న దాంట్లో సేవ చేస్తున్నా. స్నేహితులు, బంధువులు విరాళాలు ఇస్తే తీసుకుంటున్నా. నేను చేసే సేవా కార్యక్రమాల్లో నా కుటుంబీకుల ప్రోత్సాహం మరువలేనిది. ప్రతి వారం రూ. 3 వేలు మూగజీవాల కోసం ఖర్చు చేస్తున్నా. నా సేవల్ని మరింత విస్తరించాలనుకుంటున్న. ఇదివరకు ఒకే రోజు మూగజీవాల కోసం పనిచేసేవాడిని ఇకపై వారానికి రెండు రోజలు మూగజీవాల కోసం పనిచేయాలనుకుంటున్నా. ఇటీవలే ఢిల్లీలో ఫ్రెండ్స్ ఆనిమల్ ట్రస్టు సేవల్ని ప్రారంభించి మట్టి గణపతుల్ని పంపిణీ చేయించాను.
- పద్మసందేశ్, మంచిర్యాల

మృతుల కుటుంబాలకు ఆసరా

సందేశ్ 7వ తరగతి వరకే చదువుకున్నాడు. ఆ తర్వాత సొంతగా వ్యాపారం చేస్తూ వచ్చిన డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో పేద కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే వారి కి ధైర్యమిచ్చేందుకు అన్నపూర్ణ ఫౌండేషన్ ప్రారంభించాడు. బాధిత కుటుంబాలకు భోజన వసతి కల్పిస్తున్నాడు. గత మూడేండ్లుగా 18 కుటుంబాలకు భోజ నం పెట్టి బాధిత కుటుంబాలకు ఆసరాగా నిలిచాడు.

-పడమటింటి రవికుమార్

191
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles