సూపర్ మీల్!


Thu,August 29, 2019 12:39 AM

food
రోజూ అన్నం, పప్పు, ఏదో ఒక కాయగూర.. రొటీన్‌కి భిన్నంగా ఉండాలంటే.. కాస్త టేస్టీ రైస్‌తో పాటు అందులో డీప్ ఫ్రై.. షోర్వాలతో పాటు మధ్యమధ్యలో నంజుకోవడానికి గారెల వంటివి ఉంటే.. అబ్బో.. ఆ మీల్ అదుర్స్ అంటారేమో కదా!
చివరగా ఒక స్వీట్‌తో ముగించేస్తే.. ఆ ఆత్మరాముడు చల్లబడడం ఖాయం.. అందుకే ఆ స్పెషల్ వంటకాలు మీకోసం..


భగారన్నం

bhagarannam

కావాల్సినవి :

బాస్మతి బియ్యం : 300 గ్రా.
గరం మసాలా : 2 టేబుల్‌స్పూన్స్,
ఉల్లిగడ్డలు : 2, పచ్చిమిర్చి : 5,
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 టేబుల్‌స్పూన్స్, ధనియాల పొడి : 2 టేబుల్‌స్పూన్స్, నూనె : 4 టేబుల్‌స్పూన్స్, నెయ్యి : 2 టేబుల్‌స్పూన్స్, కరివేపాకు : 2 రెమ్మలు, పుదీనా : 4 రెమ్మలు, ఉప్పు : తగినంత

తయారీ :

బాస్మతీ బియ్యాన్ని కడిగి నానబెట్టాలి. ఒక గిన్నె తీసుకొని అందులో నూనె పోసి వేడి చేయాలి. అందులో గరం మసాలా వేసి వేయించాలి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి కలుపాలి. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కలుపాలి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి కలుపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత.. బియ్యానికి సరిపడా నీళ్లు పోసి, ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యంలో నీళ్లు ఒంపేసి బియ్యాన్ని అందులో వేయాలి. ఐదు నిమిషాల తర్వాత సన్నని మంట మీద ఉంచి నీరు మొత్తం ఇంకిపోయేవరకు ఉంచి దించేయాలి. పై నుంచి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే భగారన్నం రెడీ! దీన్ని నాన్‌వెజ్ కూరలతో తింటే యమ టేస్టీగా ఉంటుంది.

కాళ్లకూర షోర్వా

kaallakura-shorva

కావాల్సినవి :

మేక కాళ్లు : 250 గ్రా.
ఉల్లిపాయ ముక్కలు : 250 గ్రా.
పచ్చిమిర్చి : 4
కరివేపాకు : 4 రెమ్మలు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 టీస్పూన్స్
కారం : 2 టేబుల్‌స్పూన్స్
ధనియాల పొడి : 1 1/2 టీస్పూన్స్
గరం మసాలా : అర టీస్పూన్
కొత్తిమీర : చిన్న కట్ట
ఉప్పు, కారం : తగినంత

తయారీ :

పెద్ద కుక్కర్ తీసుకొని అందులో శుభ్రం చేసుకున్న మేక కాళ్ల మాంసాన్ని వేయాలి. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, నూనె అన్నీ వేసి కలిపి అందులో ఉంచాలి. పది నిమిషాల తర్వాత నాలుగు లీటర్ల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేయాలి. పది విజిల్స్ వచ్చేవరకు స్టౌ మీద ఉంచాలి. ఆ తర్వాత దించేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. దీన్ని వేడిగా లాగిస్తేనే బాగుంటుంది.

మొక్కజొన్న గారెలు

mokkajonna-garelu

కావాల్సినవి :

మొక్కజొన్న గింజలు : 300 గ్రా. (పచ్చివి)
మొక్కజొన్న పిండి : 200 గ్రా.
మైదా పిండి : 50 గ్రా.
అల్లం, వెల్లుల్లి ముక్కలు : ఒక టేబుల్‌స్పూన్
పచ్చిమిర్చి : 4
ఉల్లిపాయ ముక్కలు : 2 టేబుల్‌స్పూన్స్
కొత్తిమీర : ఒక కట్ట
ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

మొక్కజొన్న గింజలను మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో వేసుకొని, దీంట్లో మొక్కజొన్న పిండి, మైదాపిండి, అల్లం, వెల్లుల్లి ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్ప వేసి కలిపి పెట్టుకోవాలి. పది నిమిషాలు పిండిని అలాగే ఉంచాలి. ఈ లోపు కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగుతున్నప్పుడు మొక్కజొన్న మిశ్రమాన్ని చిన్న చిన్న గారెల్లా ఒత్తుకొని నూనెలో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వేడి వేడి టేస్టీ వడలు మీ ముందుంటాయి.

పూతరేకులు

putharekulu

కావాల్సినవి :

బియ్యం : 250 గ్రా., చక్కెర : 250 గ్రా., నెయ్యి : 100 గ్రా.

తయారీ :

చక్కెరను మిక్సీ పట్టి పొడిలా చేసుకోవాలి. బియ్యం కడిగి ఐదు గంటల ముందుగా నానబెట్టాలి. ఆ తర్వాత కూడా రెండు మూడు సార్లు కడిగి రుబ్బుకోవాలి. పాలలా చిక్కగా అయ్యేలా ఈ పిండి ఉండాలి. దీంట్లో కాస్త చక్కెర పిండిని కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద కుండ బోర్లించాలి. ఒక మెత్తటి కాటన్ బట్టను తీసుకోవాలి. కుండకు కాస్త నెయ్యి రాయాలి. ఆ తర్వాత బట్టను బియ్యం పిండి మిశ్రమంలో ముంచి కుండ మీద వేయాలి. ఈ పొరలా వచ్చిన దాన్ని కాలిన తర్వాత మనకు నచ్చిన రీతిలో మడుచుకోవాలి. పూత రేకుల పై మనకు నచ్చిన ఐస్‌క్రీమ్ పెట్టి సర్వ్ చేస్తే రుచి అదిరిపోతుంది.

భట్టి మాంసం మటన్

batti-mutton

కావాల్సినవి :

మటన్ : 250 గ్రా.
కారం పొడి : 3 టేబుల్‌స్పూన్స్
ధనియాల పొడి : 2 టేబుల్‌స్పూన్స్, జీలకర్ర పొడి : ఒక టేబుల్‌స్పూన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టేబుల్‌స్పూన్, గట్టి పెరుగు : 5 టేబుల్‌స్పూన్స్, నిమ్మరసం : 2 టేబుల్‌స్పూన్స్, కొత్తిమీర : ఒక కట్ట, ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

మటన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, నూనె, పెరుగు, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపాలి. దీన్ని ఒక పావుగంట పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు సింగిడి పొయ్యి తీసుకొని దాంట్లో బొగ్గులు వేసి అంటించుకోవాలి. బొగ్గులు వేడయ్యేలోపు.. రెండు సీకులను తీసుకొని మటన్ ముక్కలను సీకులకు గుచ్చాలి. బొగ్గుల మీద ఈ సీకులను ఉంచి ముక్కలను బాగా కాల్చుకోవాలి. ఈ ముక్కలను పుదీనా చట్నీతో తింటే మరింత టేస్టీగా ఉంటాయి.

సతీష్ , ఎగ్జిక్యూటివ్ చెఫ్
కృష్ణపట్నం ,జూబ్లీహిల్స్, రోడ్‌నం. 36,హైదరాబాద్

508
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles