400 వంటల పుస్తకాలు రాసింది


Wed,August 14, 2019 12:44 AM

మార్పు అవసరం.. ఏదో ఒకసారి అందరూ మారాల్సిందే. అలాంటి మార్పు ఉంటేనే విజయం ఆలింగనం చేసుకుంటుంది. అచ్చంగా ఇలాగే జరిగింది ప్రముఖ చెఫ్ నీతా మెహతా జీవితంలో. సాధారణ గృహిణి నుంచి కిచెన్ క్వీన్‌గా ఎదిగిందామె. రచయితగా, చెఫ్‌గా జాతీయ ఖ్యాతిగాంచింది. ఆమె ప్రయాణంలో మార్పు విజయాన్ని రుచి చూపించింది. అభిరుచితో ఈ ఉపాధిలోకి చేరి ఇప్పుడు ఎంతోమందికి వంటల్లో కొత్త రుచులను పరిచయం చేస్తున్నది. ఆరు పదుల వయసులో కూడా ఆమె కాలానికి తగ్గ వంటకాలను తయారు చేస్త్తూ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నది.
nitha
సమస్యలొచ్చినప్పుడు సమస్యల గురించే ఆలోచించి పరిష్కార మార్గాల గురించి పట్టించుకోం. ఈ వ్యవధిలో జీవితకాలం కూడా అయిపోవచ్చు. అందుకే ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. ప్రతి విషయంలో మారాల్సిందే. మార్పు కావాల్సిందే. విజయం సాధించాలంటే ఒక అడుగు ముందుకు వేయాల్సిందే అంటారు నీతా మెహతా. సాధారణ గృహిణిగా ఉన్న ఈమె వంటల రంగంలోకి అడుగుపెట్టి సెలబ్రిటీ చెఫ్‌గా, రచయితగా, వంటల టీచర్‌గా పేరు సంపాదించారు. ఇప్పటికి నాలుగు వందలకు పైగా వంటల పుస్తకాలు రాశారు. ప్రపంచ వేదికలపై అవార్డులూ అందుకున్నారు. ఇంతటి విజయం వెనుక ఆమెను ఒకప్పుడు కుంగదీసిన సమస్యలు ఉన్నాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఇప్పుడు అపారమైన విజయాన్ని చవి చూడగలిగారు.

భర్తకు తోడుగా.. అమ్మ నుంచి ఆదర్శంగా

1982లో నీతా వయసు 36. భర్త మెడికల్ బిజినెస్‌లో ఉన్నాడు. అప్పుడే అనుకోని సమస్యలు చుట్టుముట్టాయి. ఉన్నట్టుండి ఆ బిజినెస్ పతనానికి దారి తీసింది. అప్పుడే నీతా అండగా నిలువాలనుకుంది. అప్పటి వరకూ గృహిణిగా ఉండి వ్యాపారంలో ఎలాంటి అనుభవం పొందలేదు. కానీ తల్లి నుంచి నేర్చుకున్న వంటకాలు ఆమెకు వెలుగురేఖల్లా కనిపించాయి. ఆమె తల్లి మంచి హార్డ్‌వర్కర్. రకరకాల వంటలు చేయడంలో దిట్ట. ఆత్మస్థయిర్యం కలిగిన వ్యక్తి. ఆమెను నీతా ఆదర్శంగా తీసుకుంది. మొదట ఇంట్లోనే వంటలు చేయడం ప్రారంభించింది. రకరకాల వంటలను చేసే నైపుణ్యాన్ని సాధించాక వాటిని ఇతరులకు నేర్పించాలనుకున్నది. ఏటా చుట్టుపక్కల వారికి వంటలు చేయడంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది.

ఒక్కో బ్యాచ్‌లో 20 మంది చొప్పున రోజుకు రెండు నుంచి మూడు నాలుగు బ్యాచ్‌ల వారికి వంటల తరగతులు నిర్వహించింది. కేవలం వంద రూపాయల ఫీజుతోనే ఈ క్లాస్‌లను నిర్వహించేది. ఎలాంటి పెట్టుబడి లేకుండా ప్రారంభించిన వంటల తరగతులు కొద్ది కాలంలోనే పాపులర్ అయ్యాయి. చైనీస్, మొఘులాయ్, కాంటినెంటల్, ఇండియన్ వంటకాల తయారీని నేర్పించేది. వీటికోసం ఎక్కువ మంది నేర్చుకోవాలనే ఆసక్తి చూపేవారు. దీంతో ఆమె రెస్టారెంట్ల మీద దృష్టి సారించింది. కొత్త వంటలను వారి రెస్టారెంట్లలో తయారు చేయడానికి నిర్వాహకులతో మాట్లాడింది. ఇలా కొన్ని రెస్టారెంట్లను ఎంచుకొని కొత్త రుచులను పరిచయం చేయగలిగింది.
nitha-1

జాయ్ ఆఫ్ కుకింగ్..

ఇంటి నుంచి ప్రారంభమైన నీతా మెహతా వంటల తరగతులు ప్రొఫెషనల్‌గా మారాయి. ఢిల్లీలోని వసంత విహార్‌లో అత్యాధునిక కిచెన్ అకాడమీని ప్రారంభించింది. ఇక్కడ చేరేందుకు ఎక్కువ మంది లైన్లో నిల్చుండేవారు. దీంతో ఆమె వంటల తరగతులను మరింత ప్రొఫెషనల్‌గా మార్చింది. ఇందులో జాయ్ ఆఫ్ కుకింగ్ పేరుతో డిప్లొమా కోర్సులను ప్రారంభించింది. రెగ్యులర్ తరగతుల కంటే 15 శాతం అదనపు ఫీజుతో ఈ కోర్సుల్లో చేర్చుకుంది. వంటలను ఎంచుకోవడంలో, తయారు చేయడంలో సమయాన్ని వృథా చేయకుండా వంట నైపుణ్యాలను పెంపొందించుకొనేందుకు ఈ తరగతులు ఉపయోగపడతాయని చెప్తున్నది నీతా. విద్యార్థులు రకరకాల వంటలు ప్రయత్నించేవారు. ఆ వంటకాల వైఫల్యానికి అవకాశం లేదు. విద్యార్థులకు వారి అంచనాలకు మించి చిట్కాలు, సూచనలు అందించేది నీతా.

నాలుగు వందల పుస్తకాలు

నీతా మెహతా వంటలకు వచ్చిన ప్రజాదరణతో కొంతమంది ప్రచురణకర్తలు, స్నేహితులు ఆమెను పుస్తకాలు రాయాలని ప్రోత్సహించారు. దీంతో ఆమె 1992లో వెజిటేరియన్ వండర్స్ అనే మొదటి పుస్తకాన్ని రాసింది. పూర్తి చేసిన తర్వాత ప్రచురణకర్తలు దొరకలేదు. దీంతో ఆమె భర్త తన కోసం దాచిన ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఇచ్చి ప్రోత్సహించాడు. ఆ డబ్బుతో సొంతంగా పుస్తకాలు ప్రచురించింది. కానీ, ఏడాది కాలంలో కేవలం మూడువేల పుస్తకాలు మాత్రమే అమ్ముడుపోయాయి. తన తరగతులకు వచ్చే ప్రాచుర్యం కంటే పుస్తకాలకు వచ్చిన స్పందన చాలా తక్కువ అనుకుంది. అప్పుడే బాగా ఆలోచించింది. పన్నీర్ ఆల్ ద వే బుక్‌ను చిన్న సైజ్‌లో ప్రచురించింది. చైనీస్, కాంటినెంటల్, ఇండియన్ వంటకాలతో ఆకర్షణీయ బుక్‌లెట్‌గా దాన్ని మార్కెట్‌లోకి తెచ్చింది. ఇది మొదటివారంలోనే 3 వేలకు పైగా కాపీలు అమ్ముడుపోయాయి. ఇంకా ముందస్తు ఆర్డర్లు కూడా వచ్చాయి. విజయవంతం అయిన పుస్తక ప్రచురణలతో ఆమె నాలుగు వందలకు పైగా పుస్తకాలు రాసింది. తర్వాత సొంతంగా స్నాబ్ బుక్స్ అనే పబ్లిషింగ్ హౌస్‌ను ప్రారంభించింది. వంటల రంగంలో ఆమె రాసిన పుస్తకాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 1997లో ప్యారిస్‌లో జరిగిన వరల్డ్ కుక్ బుక్ ఫెయిర్‌లో అవార్డునూ అందుకుంది.

వ్యాపారంలోకి..

nitha2
2016లో సుగంధద్రవ్యాల సరఫరాను మెహతా ప్రారంభించింది. ఆహార నిపుణుల సలహాలు తీసుకొని మసాలాలు తయారు చేయడం మొదలెట్టింది. రెడీమేడ్ మసాలాలు కాకుండా సొంతంగా ఉత్పత్తి చేసిన మసాలా దినుసులను కలిపి తయారు చేయడం ఆమె ఇష్టపడుతానని చెప్తున్నది. వీటి తయారీ, ప్యాకింగ్‌కు 20 మందితో ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సిబ్బంది ప్యాకింగ్ దగ్గర నుంచి సప్లయ్ వరకూ వివిధ ప్రక్రియలను చూసుకుంటారు. వీలైనంత త్వరగా దుకాణాలను చేరుకొనేలా, ఇబ్బందులు రాకుండా పర్యవేక్షిస్తారు. కిందటి ఏడాదిలోనే నీతా ఫుడ్స్ 3 కోట్ల రూపాయల టర్నోవర్ దాటింది. ఢిల్లీ కేంద్రంగా ఎన్నో బ్రాంచుల ద్వారా ఇవి సరఫరా అవుతున్నాయి. కాలానికి అనుగుణంగా ఆరోగ్యకరమైన, అవసరమైన వంటకాలను ఇస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నది నీతా మెహతా.

- వినోద్ మామిడాల

629
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles