దివ్యాంగులను నడిపిస్తున్నది!


Wed,August 14, 2019 12:23 AM

దివ్యాంగురాలైన ఓ మహిళ ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశించలేదు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేసింది. ఆ అడుగే 40 వేలమంది దివ్యాంగులను నడిపిస్తున్నది. ఎంతోమంది మహిళలకు, దివ్యాంగులకు ఆదర్శంగా నిలుస్తున్నదామె.
low-cost-prosthetics
బెంగళూరుకు చెందిన నూర్‌జాన్ చిన్నప్పుడే పోలియో కారణంగా రెండు కాళ్లు కోల్పోయింది. తన లాంటి దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకూడదనుకున్నది. అటువంటి వారికోసం ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, తక్కువ ఖర్చుతో కృత్రిమ అవయవాలను రూపొందిస్తున్నది. ఆ సంస్థ ద్వారా ఉపాధి కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. 1997లో నూర్‌జాన్ ఓ సంస్థలో కృత్రిమ అవయవాల తయారీపై శిక్షణ తీసుకున్నది. శిక్షణ పొందిన కొన్నాళ్ల తర్వాత తక్కువ ఖర్చుతో దివ్యాంగులకు కృత్రిమ పరికరాలను అందించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఐదుగురు దివ్యాంగ మహిళలతో కలిసి రిహాబిలిటేషన్ ఎయిడ్స్ వర్క్‌షాప్ బై ఉమన్ విత్ డిజేబిలిటీ (ఆర్‌ఏడబ్ల్యు డబ్ల్యుడి) సంస్థను ఏర్పాటుచేసింది. నూర్‌జాన్‌కు దివ్యాంగుల సమస్యలపై అవగాహన ఉండడంతో వారికి అవసరమయ్యే పరికరాలను తయారు చేయడం ప్రారంభించింది. వైకల్యం కలిగిన మహిళలకు చేయూతనిచ్చేందుకు ఈ పరికరాల తయారీపై శిక్షణ ఇచ్చింది. పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు సౌకర్యంగా ఉండే ఉపకరణాలను రూపొందిస్తూ దేశవ్యాప్తంగా 40 వేల మంది దివ్యాంగులకు సేవలందిస్తున్నది. 10 మంది మహిళా బృందాలకు ప్రత్యేకంగా కోర్సు ప్రవేశపెట్టింది. ఈ కోర్సు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ప్రోస్తెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ సంస్థ గుర్తింపునూ పొందింది. కోర్సులో భాగంగా సంవత్సరం పాటు ఆయా పరికరాల తయారీలో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలు కృత్రిమ పరికరాలను తయారు చేస్తుంటారు. ఈ పరికరాలను రూపొందించేటప్పుడు వైద్య నిపుణుల సలహాలు, సూచనలు పాటిస్తారు. ఇలా ఆయా ఉపకరణాలను వాడడం వల్ల ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నూర్‌జాన్‌కు వైకల్యం ఉన్నా ఎంతోమంది దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది. బెంగళూరులో రెండు శిక్షణా సంస్థలను ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉపాధినీ కల్పిస్తున్నది.

144
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles