ఆ పాటకు అవార్డులు!


Sun,August 11, 2019 01:48 AM

అతనికి చిన్నప్పటి నుంచి పాటలంటే పిచ్చి. అవే అతనిలో ఎనర్జీని పెంచి, స్టెప్పులేపిస్తాయి. ఆ పాటలే ప్రేక్షకులతోనూ విజిల్స్ వేయిస్తాయి. అందుకే అతనికి పాటంటే ప్రాణం. దివంగత సంగీత దర్శకుడు చక్రీ ట్రంప్‌కార్డ్‌గా పేరొంది.. ఆ పేరును నిలబెట్టడానికి తపన పడుతున్నాడు సింగర్ సింహా. ఒకవైపు వృత్తి, మరోవైపు ప్రవృత్తిని బ్యాలెన్స్ చేస్తూ గాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మారుమూల పల్లెలో పుట్టి.. హైదరాబాద్ మహానగరంలో పెరిగి.. 36 దేశాల్లో పాటల ప్రదర్శనలు ఇచ్చి న సింహా గురించి అతని మాటల్లోనే.
Simha-singer
నేను పుట్టింది రాజమండ్రి. పెరిగింది, చదువుకున్నదంతా హైదరాబాద్‌లోనే. అమ్మ సుబ్బలక్ష్మీ, నాన్న సోమయాజలు. 30 యేండ్లుగా అంతా హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. నాకు పాటలు పాడడం చాలా ఇష్టం. ఒకరకంగా పిచ్చి అని చెప్పాలి. స్కూల్‌లో ఏ ఈవెంట్ జరిగినా.. ముందుగా నేను పాట పాడాల్సిందే. బాలసుబ్రహ్మణ్యం పాటలు ఎక్కువగా వినేవాడిని. ఇంటర్ నుంచే పోటీల్లో పాల్గొనేవాడిని. వెళ్లి పాడామా? లేదా? అన్నదే ముఖ్యం. నా చుట్టుపక్కల జరిగిన ఏ పాటల పోటీని కూడా నేను వదిలిపెట్టలేదు. కిషోర్ కుమార్‌వి హిందీ పాటలు ఎక్కువగా వినేవాడిని. డిగ్రీ కాస్ట్ అకౌంటెన్స్ భవన్స్ కాలేజ్‌లో చేశా. అప్పటి నుంచే మెల్లిగా యాంకరింగ్ మొదలు పెట్టా. తర్వాత డాక్యుమెంటరీలకు వాయిస్ ఓవర్ చెప్పడం ప్రారంభించా. యాడ్స్‌కు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చా. ఆ సమయంలో రవివర్మ అనే గాయకుడు, కీబోర్డు ప్లేయర్ సుధాకర్ పరిచయమయ్యారు. వీరిద్దరూ సంగీత దర్శకుడు చక్రీగారి దగ్గర పనిచేస్తున్నారు. అలా చక్రీగారిని కలిసే అవకాశం వచ్చింది.


Simha-singer2

అనుకోకుండా ఒకరోజు..

ఒకరోజు వరంగల్‌లో చక్రీగారి పాటల కార్యక్రమం బాగా జరుగుతున్నది. పెద్ద సంఖ్యలో ఆడియన్స్ వచ్చారు. నేనూ అక్కడి వెళ్లా. చక్రీ గారితో సర్! నేను వాళ్లతో కోరస్ అయినా పాడతా అన్నాను. అయితే.. ఆ రోజు కార్యక్రమానికి ఉదిత్ నారాయణ గారు రావాల్సి ఉన్నది. ఆయన కొన్ని కారణాలతో రాలేకపోయారు. దీంతో నాకు పాట పాడడానికి అవకాశం ఇచ్చారు. స్టేజ్‌మీదకు వెళ్లడంతోనే జోష్‌తో ఇంగ్లిష్‌లో ఇరగదీసి.. లేలేత నవ్వులా పింగాణి బొమ్మాలా అంటూ కౌసల్యగారితో పాట అందుకున్నా. ఆ పాటతో నాలో ఉన్న సింగర్‌ను గుర్తించారు చక్రీగారు. ఒక్కపాట ఇస్తానన్న చక్రీగారు నాతో ఆ ప్రోగ్రాంలో మూడు పాటలు పాడించారు. ఆ తర్వాత రేపు ఒకసారి వచ్చి ఆఫీస్‌లో కలువ్ అన్నారు.

ఒక్క ఛాన్స్ ప్లీజ్..

సార్.. అందరూ ఎవరెవరి పాటలు వాళ్లు స్టేజ్‌మీద పాడుతున్నారు. నాక్కూడా ఒక్క అవకాశం ఇవ్వండి సర్ అని చక్రీగారితో అన్నాను. ఓకే ఇచ్చేద్దాం అన్నారు. ఆ సమయంలో నేను పెళ్లికి రెడీ, అందరూ దొంగలే.. దొరికితే అనే సినిమాల్లో పాడడానికి అవకాశం కల్పించారు. వాటిల్లో గుమ్మా గుమ్మా పండిస్తావా.. వయ్యారాలే వడ్డిస్తావా అనేపాట హిట్ అయింది. అది కూడా ఉదిత్ గారు పాడాల్సిన పాట. ఆ సినిమా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ స్టూడియోలో ఉదిత్ నారాయణే పాడుతున్నారని అనుకున్నారు. పాట పూర్తయ్యాక నన్ను చూసి షాక్ అయ్యారు. నా వాయిస్ కూడా కొంచెం అలాగే ఉండడంతో నాకిచ్చిన మొదటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా. అలా చక్రీగారు నాకు గురువు అయ్యారు. అప్పటి నుంచి సింగర్‌గా నేనేంటో నిరూపించుకున్నా. స్నేహానికి ప్రాణమిచ్చే చక్రీగారు తన తుదిశ్వాస వరకూ నాకు అవకాశాలు ఇచ్చారు. నాకే కాదు.. నాలాంటి ఎంతోమందికి ఆయన అవకాశాలిచ్చారు. చక్రీగారు పరిచయం చేసిన గాయకుడిగా ఆయన పేరు వమ్ముకానివ్వకూడదు అనేదే నా తపన.

Simha-singer3

ఫిల్మ్‌ఫేర్ తెచ్చిన రేసుగుర్రం

అమెరికాలో ఓ షోలో ఒకసారి తమన్‌గారితో కలిసి పాటలు పాడాను. ఆ పరిచయంతో నాకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు తమన్. రేసుగుర్రం సినిమా సమయంలో ఓసారి డైరెక్టర్ సురేందర్‌రెడ్డి గారు చెన్నైలో కలిశారు. మాటల మధ్యలో ఓ అవకాశం అడిగాను. ఆయన వెంటనే ఆలోచించకుండా ఇవాళ చెన్నైలో ఉండగలుగుతావా అన్నారు. నాకు డ్యూటీ ఉంది సార్ అనగానే.. నాకొక లిరిక్ పంపి రెండ్రోజుల్లో పాడి వినిపించమన్నారు. అదే రేసుగుర్రం సినిమాలోని సినిమా సూపిస్త మామా నీకు.. పాట. ఆ పాటను తమన్ లేనప్పుడు సౌండ్ ఇంజినీర్‌తో సహాయంతో పాడాను. ఆ పాట ఒకసారి విని సరేందర్‌రెడ్డికి పంపారు తమన్. అది ఆయనకు నచ్చకపోవడంతో పదిమంది పెద్ద సింగర్స్‌తో పాడించారు. ఏమైందో తెలియక.. మళ్లొక అవకాశం అడిగా.

ఆ పాటలో తెలంగాణ యాస లేదు అందుకే రిజెక్ట్ చేశాం అన్నారు. ఆ విషయం నాకు వాళ్లు ముందే చెప్పలేదు. కాబట్టి.. ఒక్కఛాన్స్ ఇవ్వండని అడిగా. వెంటనే పాటలో మార్పులు చేసుకుంటూ పాడాను. ఆ పాట విని.. చాలా ఉత్సాహంతో రిథమ్ కొట్టారు తమన్. అల్లు అర్జున్ ఎనర్జీకి ఈ సాంగ్ ఎనర్జీ సరిపోవడంతో ఫైనల్ చేశారు సురేందర్‌రెడ్డి. అలా ఆ పాట సూపర్ హిట్ అవడం తర్వాత ఫిల్మ్‌ఫేర్ అవార్డు రావడం జరిగిపోయాయి. ఆ పాట విని చక్రీగారు ప్రత్యేకంగా అభినందించారు. ఆ పాటకే 2016లో సైమా, గామా వంటివి 15 అవార్డులు వచ్చాయి. బన్నీ కూడా ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.

చాలా అవకాశాలిచ్చారు..

రేసుగుర్రం పాట విని దేవీశ్రీ ప్రసాద్, మణిశర్మ గారు ఎంతో అభినందించారు. వారు కూడా చాలా అవకాశాలు ఇచ్చారు. బాలకృష్ణగారి సింహా సెంట్‌మెంట్‌కు నేనూ తోడయ్యా. అప్పటి నుంచి ఆయన ప్రతీ సినిమాలో సింహా పాట పాడాలి అంటూ.. నాకు అవకాశాలు ఇస్తున్నారు. నేను కూడా ఉదయం ఉద్యోగం చూసుకొని, రాత్రిళ్లు పాటలు పాడేవాడిని. ప్రస్తుతం నోవార్టీస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ విభాగంలో ఎస్‌ఏపీగా పనిచేస్తున్నా. బాలీవుడ్‌లో పాడాలన్నది నా కోరిక. జక్కన్న, ధ్రువ వంటి సినిమాల్లో నటించా. భరత్ అనే నేను సినిమాలో శరత్ కుమార్ గారికి డబ్బింగ్ కూడా చెప్పా. ఇప్పటి వరకు 36 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చా. నా వంతుగా కొన్ని సామాజిక కార్యక్రమాల కోసం ఉచితంగానే పాటలు పాడుతున్నా. నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు.

-డప్పు రవి

673
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles