వర్షాల జోరు జలపాతాల హోరు


Fri,August 9, 2019 12:43 AM

నిండు ఆకాశమంత ఎత్తైన కొండలపై నుంచి నేలను ముద్దాడాలన్న ఉబలాటంతో నురుగలు కక్కుతూ జాలువారే నీటిని చూచి తన్మయం చెందని మనసుంటుందా? మంచు బిందువులను తలపించే నీటి తెమ్మెరలు ముఖాన్ని తగులుతూ కశ్మీరు అందాల్ని మరిపిస్తుంటే మురిసి పోని మనిషి ఉంటాడా? వెన్నెల పైటేసుకున్న మేఘాలు ఆకుపచ్చ పావడకట్టిన ఆడవుల్ని స్పృశిస్తూ, కిలకిలమంటూ పలికే పక్షుల్ని పలకరిస్తూ చేసే అల్లరిని ఆస్వాదించాలనుకోనివారు ఎవరు ఉంటారు. తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో ఎత్తైన కొండప్రాంతాల పైనుంచి జాలువారుతున్న జలపాతాలు మన రాష్ర్టానికి మరింత అందాన్ని అద్దుతున్నాయి. ఈ నిండైన అందాల్ని పొదివి పట్టుకుని తెలంగాణకు మకుటాయమానంగా నిలుస్తున్న కొత్త, పాత జలతరంగాలను సందర్శిద్దాం రండి.
Waterfall

కుంటాల

ఇవి ఆదిలాబాదు జిల్లాలోని సహ్యాద్రి పర్వత పంక్తుల్లో కడెం నదిపై కుంటాల గ్రామానికి సమీపంలోని అభయారణ్యంలో ఉంది. 45 మీటర్ల ఎత్తు నుంచి జలజల పారే నీళ్ళు, ఆ చప్పుడు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. దట్టమైన అడవులలో, సహ్యాద్రి పర్వత శ్రేణిలో గోదావరికి ఉపనది అయిన కడెం నది పై ఈ జలపాతం ఉంది.

బొగత

ఇది కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా, వాజేడు మండలంలోని బొగత గ్రామంలో ఉంది. బొగతను చీకులపల్లి ఫాల్స్ అనికూడా అంటారు. దట్టమైన పచ్చని అడవుల మధ్య, కొండకోనల నుంచి హోరెత్తే నీటి హొయలతో నిండిన జలపాతమిది.

గాయత్రి

గాయత్రి జలపాతాలు నిర్మల్ జిల్లాలో ఉన్న అనేక జలపాతాల్లోనివి. ఇవి జిల్లాలోని నేరడిగొండ మండలంలో ఉన్నాయి. సుమారు 70 మీటర్ల ఎత్తునున్న రాతికొండ నుంచి కిందకు జాలువారుతున్న ఈ జలపాత అందాలు చూసినవారిని మైమరపిస్తుంటాయి.

కనకాయ్

ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం బలన్‌పూర్ గ్రామ సమీపంలో ఈ జలపాతం ఉంది. దీన్ని కనకదుర్గ జలపాతం అనికూడా అంటారు. కుంతాలకు 35 కి.మీటర్ల దూరంలో గిర్నూర్ సమీపంలో ఈ జలపాతం ఉంది. ఇది కనకాయ్, బండ్రేవు, చీకటిగుండం అనే మూడు జలపాతాల సముదాయం.

పారేఖాతి అందాలు

పారేఖాతి జలపాతాలు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని మాన్కాపూర్ గ్రామ సమీపంలో ఉన్నాయి. పచ్చనిచెట్లు, పెద్దపెద్ద రాళ్లు, గుట్టల మధ్యన జలపాతం 10 మీటర్ల ఎత్తు నుంచి జాలువారుతూ ఆహ్లాదాన్ని పంచుతున్నది.
gowri-gundala

పొచ్చెర

పొచ్చెర జలపాతం ఆదిలాబాదు జిల్లాలో బోథ్ మండలానికి వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి 6 కి.మీ దూరంలో పొచ్చెర గ్రామ సమీపంలో ఉంది. ఇది దట్టమైన అరణ్యం ఉండి పర్యాటకులను ఆకర్షిస్తున్నది.

అజలాపురం

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని అజలాపురంలో ఈ జలపాతం ఉంది. మొగలిపూల పరిమళం వెదజల్లుతున్నట్టుండే ఈ జలపాతం అందాలు చూడచక్కగా ఉంటాయి. సుమారు 2వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన కొండల మధ్య జలధారలు ప్రవహిస్తున్న తీరు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

గుండాల

గుండాల జలపాతం మహబూబ్ నగర్ జిల్లా, ఆత్మకూరు మండలంలోని గుండాల గ్రామ సమీపంలో ఉంది. ఇక్కడ ఎత్తైన బండరాళ్ళపై నుండి కృష్ణానది ప్రవహించడం వల్ల జలపాతం ఏర్పడింది. కృష్ణానది పడమటి దిశ నుండి తూర్పువైపు ప్రవహిస్తూ జలపాతాన్ని సృష్టిస్తుంది. ఈ జలపాతం కేవలం వేసవి కాలంలో మాత్రమే కనిపిస్తుంది.

గౌరీగుండాలు (సబ్బితం)

పెద్దపల్లి జిల్లాలో గుండారం-సబ్బితం సరిహద్దుల్లోని గుట్టపై గౌరీగుండం ఉంది. ఇది 40 అడుగుల ఎత్తునుండి కిందికి జాలువారుతూ ఉంటుంది. దీనికి రెండు దిక్కుల్లో వున్న ఆకుపచ్చనిచెట్ల పచ్చదనం, జేగురురంగు రాతిబండలు, తెల్లనినీరు త్రివర్ణాలు అద్భుతదృశ్యాన్ని ఆవిష్కరిస్తుంటాయి.

సిర్నాపల్లి

సిర్నాపల్లి జలపాతం నిజామాబాదు జిల్లాలోని ధర్పల్లి మండలం సిర్నాపల్లి గ్రామంలో ఉంది. సిర్నాపల్లి సంస్థానానికి చెందిన సీలం జానకి బాయి ఒక తటాకాన్ని నిర్మించారు. ఆ సరస్సు నుండి ప్రవహించే నీరు రామడుగు ప్రాజెక్టుకు ప్రవహిస్తుంది. ఆ క్రమంలో ఏర్పడిందే ఈ జలపాతం.

భీముని పాదం

ఈ జలపాతం సహజసిద్ధంగా ఏర్పడింది. ఇది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని కొమ్ములవంచ పరిధి అటవీప్రాంతంలో పచ్చని ప్రకృతి మధ్యన నిరంతర జలధారలతో అలరిస్తున్నది. 70 అడుగుల ఎత్తు నుంచి దూకే జలధార పర్యాటకుల్ని ఉల్లాసపరుస్తుంది.
SAMUTALA-GUNDAM

మల్లెలతీర్థం

మల్లెలతీర్థం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో విస్తరించి ఉన్న దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కనిపించే ఒక సుందర సహజ జలపాతం. 500 అడుగుల ఎత్తులో నుండి కిందికి దూకే ఈ జలపాతం చూపరులకు కనువిందు చేస్తూ అలరిస్తున్నది.

రాయికల్

ఇది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామానికి 3కిలోమీటర్ల దూరంలో ఉంది. వరంగల్ అర్బన్, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో దట్టమైన పచ్చని అటవీ ప్రాంతంలో ఉందీ జలపాతం.

సప్తగుండాల జలపాతం

సప్తగుండాల జలపాతం తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లా లింగాపూర్ మండలంలోని పిట్టగూడకు రెండు కిలో మీటర్ల దూరంలో అడవిలో ఉంది.

రాముని గుండాలు

పెద్దపల్లి జిల్లా రామగుండం మండలకేంద్రంలో ఈ జలపాతాలున్నాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాస కాలంలో ఈ కొండపై దాహార్తి తీర్చుకోవడం కోసం ఈ గుండాలు ఏర్పరిచినట్లు చెబుతారు. అందులో కొన్ని పాలగుండం, నేతిగుండం, భైరవగుండం, జీడిగుండం, ధర్మగుండం ఇలా 108 గుండాలను ఏర్పాటు చేసినట్లు కథనం ఉంది.

గద్దల సరి

ఈ జలపాతం భూపాలపల్లి జిల్లాలోని చెర్ల-వెంకటాపురం డివిజన్‌లో ఉంది. గద్దల సరి జలపాతంలో దాదాపు ఏడువందల అడుగుల నుండి నీళ్లు కిందికి దుముకుతాయి. గద్దలు ఎగిరేంత ఎత్తులో ఉండటంతో దీన్ని గద్దల సరి గుండంగా పిలుస్తారు.

కొర్టికల్

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఈ జలపాతం ఉంది. ఇది సహజ సిద్ధంగా ఏర్పడింది. మండలంలోని రాజురా గుట్టల నుండి వచ్చే నీరు వాంకిడి వాగు గుండా ప్రవహించి కొరటికల్ జలపాతంలో కలుస్తుంది.
kanakaya

బోడకొండ

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధి మంచాల మండల కేంద్రంలోని బోడకొండ గుట్టల్లో ఈ జలపాతం ఉంది. ఎత్తయిన కొండలపై నుంచి నీరు పరవళ్లు తొక్కుతూ కిందకు పారుతుంటుంది.

జాడి మల్కా పూర్

ఇవి జహీరాబాద్ సమీపంలోని మొగుడంపల్లి మండలం, జాడిమల్కాపూర్‌లో ఈ జలపాతం ఉన్న ది. తెలంగాణ, కర్ణాటకల సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ జలపాతాన్ని చూడడానికి పక్క రాష్ట్రం ప్రజలు కూడా వస్తుంటారు.

సముతుల గుండం

ఆసిఫాబాద్ జిల్లా, మండలం నుంచి 26 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. జిల్లా లోని బలంపూర్ నుంచి అటవీ మార్గంలో 5 కిలో మీటర్లు కాలినడకన వెళ్తే ఈ జలపాతానికి చేరుకోవచ్చు.

కట్టిపడేస్తున్న మిట్టె

ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌లో మిట్టె జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తున్నది. జిల్లా కేంద్రం నుంచి 75 కిలో మీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. జైనూర్ నుంచి లింగాపూర్‌కు చేరుకుని అక్కడి నుంచి 3 కిలో మీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది.

మాదర

ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని చింతలమాదర మందగుడ గ్రామ సమీపంలో ఈ జలపాతముంది. 30అడుగుల ఎత్తు నుంచి చింతలమాదర, అలాగే సుమారు 60 అడుగుల ఎత్తు నుంచి గుండాల నీరు జాలువారుతున్నది.

జాలువారుతున్న బాబేఝరి

ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని బాబేఝరి గ్రామసమీపంలో ఉన్న జలపాతం కనువిందు చేస్తున్నది. జోడేఘాట్ వెళ్లే రహదారి పక్కన పచ్చని అడవి మధ్య లోయలో కనిపించే ఈ దృశ్యం పర్యాటకులను ఆకర్షిస్తున్నది.
parekathi

పెద్దగుండం

ఆదిలాబాద్ జిల్లా బోథ్ సమీపంలోని ఇచ్చోడ మండలంలో ఓ సరికొత్త జలపాతం ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తుంది. ఈ మండలంలోని కోకస్ మన్నార్ గ్రామ శివార్లలో అద్భుతమైన ఈ జలపాతం ఉంది.

ముక్తిగుండం

నిర్మల్ జిల్లా గోదావరి నది ఉపనది అయిన కడెం పరిసరాల్లో ఈ జలపాతం ప్రవహిస్తున్నది. దీనికే గాడిద గుండం అని కూడా పేరు. దట్టమైన అటవీమార్గం గుండా ప్రయాణిస్తే ఈ జలపాతానికి చేరుకోవచ్చు.

రథం గుట్ట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని రథంగుట్ట వద్ద జలపాతాలు ఉన్నాయి. రథం గుట్ట పైనుంచి 30 అడుగుల ఎత్తు నుండి నీరు జాలు వారుతున్నది. ఇది మణుగూరుకు కిలోమీటర్ దూరంలో ఉంటుంది.

పాండవ లొంక

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని జాఫర్‌ఖాన్‌పేట గ్రామంలో ఉన్న పాండవలొంక జలపాతం పర్యాటక కేంద్రంగా ఆహ్లాదాన్ని పంచుతుంది. గ్రామానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండవలొంక సమీపంలో ఎత్తైన కొండ నుండి, పెద్దలోయలోకి నీళ్ళు దూకే దృశ్యం అందంగా ఉంటుంది.

-మధుకర్ వైద్యుల
pochera1

1996
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles