తెలంగాణ చేనేత సౌఖ్యం!


Wed,August 7, 2019 01:51 AM

తెలంగాణ చేనేతకు కొత్త కళ వచ్చింది. అనూహ్యంగా డిమాండ్ పెరిగి.. గ్లోబల్ మార్కెట్‌ను అందుకుంటున్నది. అటకెక్కిన చేనేత మగ్గం మళ్లీ ఆడుతున్నది. వలస బాట పట్టిన వేలాది కుటుంబాలు తిరిగి వృత్తిని చేపడుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబాయిలకు చెందిన ప్రముఖ డిజైనర్లు కోరుకున్న డిజైన్ల ఉత్పత్తి సామర్ధ్యం మన దగ్గరే ఉండడం గొప్ప విషయం. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత సౌఖ్యంపై కథనం.
ప్రోత్సాహం, ఆదరణ, ప్రచారం.. ఈ మూడు లభిస్తే ఏ రంగానికైనా ఢోకా ఉండదు. ఏ ఉత్పత్తికైనా డిమాండ్ పెరగాలన్నా, మార్కెటింగ్ లభించాలన్నా ఇంతకంటే ఏం కావాలి? పని చేసే శక్తి ఉంది. అంత కంటే నేర్పు ఉంది. గతంలో ఈ మూడు లభించలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కార్మికులకు, మాస్టర్ వీవర్లకు ప్రోత్సాహం లభిస్తున్నది. ప్రచారం విస్తృతంగా దొరికింది. ఇంకేముంది.. ఆదరణ నాలుగింతలైంది. అందుకే ఇప్పుడు చేనేత రంగంపై చర్చించుకోవాలంటే రాష్ర్టావిర్భావానికి ముందు, తర్వాత చెప్పుకోవాలి.

Saress
వెండి జరి, నాణ్యమైన సిల్క్‌తో చీరలను నేయగల నేర్పు తెలంగాణ చేనేత కార్మికుల సొంతం. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో ఈ రంగానికి విస్తృత ప్రచారం లభించింది. అందుకే ఇప్పుడు ఐటీ, పారిశ్రామిక, సినీ, క్రీడా, వ్యాపార, వాణిజ్య రంగాలకు విస్తరించింది. ప్రతి సోమవారం చేనేత వస్ర్తాలు ధరించాలన్న పిలుపు అనూహ్య ఫలితాలను ఇచ్చింది.

తీరొక్క ఉత్పత్తులు

ఖాదీ వస్ర్తాలకు గిరాకీ ఉన్నప్పటికీ ఖాదీలో తెలుపు మాత్రమే ఉంటుండడంతో రాజకీయ నాయకులకు మాత్రమే పరిమితం అనే భావన ఏర్పడింది. దీని నుంచి బయటకు వచ్చేందుకు మంచి అవుట్‌లుక్ రావడానికి అన్ని రంగులతో ఖాదీని నేస్తున్నారు. లాక్మే ఫ్యాషన్ వీక్ (ఎల్‌ఎఫ్‌డబ్ల్యూ) సమ్మర్-రీసోర్స్ డిజైన్లను ప్రదర్శించారు. ఖాదీకి ఆధునిక పోకడలను అద్ది ఔరా అనిపించారు. ఫ్యాషన్ వీక్‌లో ఖాదీ వస్ర్తాలనే ప్రదర్శించారు. సాంప్రదాయక చేనేతలోనే పార్శి, కశ్మీరీ, చికంకారి, కుచ్చి వంటి ఎంబ్రాయిడరీ చేసి తయారు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో మగ్గాలు ఉన్నాయి. తొలుత కార్మికులను చైతన్యవంతులను చేయడం, అవసరమైన శిక్షణ ఇవ్వడం నిత్యకృత్యం. ఆకర్షణీయమైన వస్ర్తాలను నేస్తే ఫ్యాషన్ ప్రియులు ఇష్టపడుతారని డిజైనర్స్ అభిప్రాయం. నేటి యువతకు అవసరమైన వస్ర్తాలను, డిమాండ్‌ను గుర్తించినప్పుడు చేనేత రంగానికి పూర్వవైభవం వస్తుందంటారు.

ఆర్గానిక్ వస్ర్తాల్లోనూ మేటి

ఆర్గానిక్ వస్ర్తాల ఉత్పత్తి కూడా కొనసాగుతున్నది. ఇక్కడి ఉత్పత్తులు అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫిన్‌లాండ్, కొరియా, యూరప్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. లాస్‌ఏంజిల్స్, న్యూయార్క్, లండన్, తైవాన్ లాస్‌వేగాన్‌లో టెక్స్‌టైల్స్ ప్రదర్శనలను ఏర్పాటు చేసి వీటిపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో మహిళా ఎంటర్‌ప్రెన్యూర్లు, కార్మికులతో ఏకంగా మ్యాక్స్ సొసైటీలు ఏర్పడుతున్నాయి.
Saress2

ప్రధాని మెచ్చిన వస్త్రం

ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్-2015లో పాల్గొన్న 60 మంది విదేశీ ప్రతినిధులు ధరించిన విభిన్న వస్ర్తాలు తెలంగాణ ఉత్పత్తులే. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వం ముందుగానే వస్ర్తాలను కుట్టించి బహుకరించింది. దీని కోసం హ్యాండీక్రాఫ్ట్ హ్యాండ్లూం ఎక్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ దేశ వ్యాప్తంగా శాంపిళ్లను సేకరించింది. వాటిల్లో నల్లగొండ జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన ప్రముఖ మాస్టర్ వీవర్ గజం అంజయ్య పంపిన 66 శాంపిళ్లనే ప్రధాని ఆమోదంతో అధికారులు ఎంపిక చేయడం విశేషం. ఇవి తెలంగాణకు ప్రత్యేకంగా గుర్తింపునిచ్చిన ఇక్కత్, దూప్యాన్ సిల్క్ రకాలే.

విభిన్న వస్త్ర తెలంగాణ

నల్లగొండ, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఇక్కత్, ఉప్పాడ, జమ్దానీ, కంచీ, రాజ్‌కోట్ (గుజరాత్ నమూనా), ఇక్కత్‌లో కోటా (రాజస్థాన్ డిజైన్లు) రకాల చీరలు ఉత్పత్తి చేస్తున్నారు. తాజాగా వీటన్నింటినీ ఆర్గానిక్, సహజ రంగులతోనూ రూపొందిస్తున్నారు. రూ.5 వేలు మొదలుకొని రూ.3 లక్షల దాకా పలికే చీరలను నేసే కార్మికులు ఉన్నారు. అలాగే నల్లగొండ జిల్లాలో కొందరు ఔత్సాహిక మాస్టర్ వీవర్లు లెనిన్‌తో ప్రయోగాలు చేస్తున్నారు. లెనిన్/లెనిన్, లెనిన్/కాటన్, లెనిన్/సిల్క్‌తో చీరలను నేయిస్తున్నారు. కళాంకారి కాటన్ చీరలను వెజిటెబుల్ కలర్స్‌తో ఉత్పత్తి చేస్తున్నారు. సిల్క్ మాదిరిగానే చేతితో డిజైన్లను అల్లిస్తున్నారు.

అహింసా సిల్క్ అదరహో

తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్న అహింసా సిల్క్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. రాజేంద్రనగర్ మండలం మణికొండ పంచవటికాలనీలో నివాసముండే రిటైర్డ్ ఆప్కో అధికారి కుసుమ రాజయ్య అనేక పరిశోధనల ఫలితమే ఈ బ్రాండ్. ఫ్యాబ్రిక్, షూటింగ్, షర్టింగ్, టేబుల్ క్లాత్స్, కర్టెన్లు, చీరలు, డ్రెస్ మెటీరియల్స్ వంటి అనేక రకాల ఉత్పత్తులకు దేశ విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. కేవలం శాంపిళ్లు చూసి ఆర్డర్ ఇవ్వడం ద్వారానే ఉత్పత్తి చేస్తున్నప్పటికీ డిమాండ్ బాగుండడం విశేషం. హైదరాబాద్‌కు వచ్చే దేశ విదేశీ ఫ్యాషన్ డిజైనర్లు పంచవటికాలనీలోని రాజయ్య ఇంటిని సందర్శిస్తుంటారు. వస్త్ర ప్రపంచంలో ఇక్కత్‌తో పాటు ఇతర తెలంగాణ బ్రాండ్లకు అనూహ్యంగా డిమాండ్ పెరుగుతున్నది.

అద్భుతాల సృష్టి

ఇక్కత్, టస్సర్ సిల్క్, పట్టు.. వస్ర్తాలతో యువతను ఆకట్టుకునే రీతిలో డ్రెస్సులను రూపొందిస్తున్నారు. ముడిసరుకులో నాణ్యతకు పెద్ద పీట వేస్తుండడంతో వస్ర్తాలకు మంచి ప్రాచుర్యం లభిస్తున్నది. డ్రెస్సులు, ఓవర్‌కోట్స్, టాప్స్, స్కర్టులు, కుర్తాస్, బాటమ్స్, దుప్పటాలు తయారు చేస్తున్నారు. వీకెండ్‌లో ధరించేందుకు చేనేత వస్ర్తాలతో రూపొందించిన పలు డిజైన్లు ఆకట్టుకుంటున్నాయి. హ్యాండ్లూం ఇక్కత్ కాటన్‌తో బ్లూ వేవ్ ప్యాటరన్, సిల్క్, హ్యాండ్లూం ఇక్కత్ స్కర్టులు, హ్యాండ్లూం ఇక్కత్ కాటన్ సిల్క్ క్రాప్ టాప్‌లు, బోట్‌నెక్ ఇక్కత్ మోటిఫ్ కాటన్‌తో షర్టులు, హ్యాండ్లూం ఇక్కత్ ఫ్లేర్ షిఫ్ట్ డ్రెస్ వంటి రకాలతో ఆకట్టుకుంటున్నాయి.
Saress1

సాంస్కృతిక గుర్తు:

తెలంగాణ వచ్చిన తర్వాత చేనేత సాంస్కృతిక గుర్తుగా మారింది. ప్రతి సోమవారం చేనేత వస్ర్తాలు ధరించాలన్న కేటీఆర్ పిలుపుతో మార్కెటింగ్ ట్రెండ్ మారింది. కల్చరల్ సింబల్‌గా చూస్తున్నారు. ఇక్కత్, తేలియా రుమాల్ వంటి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. గద్వాల, పోచంపల్లి, నారాయణపేట, గొల్లభామ వంటి వాటికి ఆదరణ లభించింది. తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన మార్కెటింగ్, ప్రచార ట్రెండ్‌ను ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం కస్టమర్ ఉత్పత్తిదారుడి నుంచే నేరుగా కొనుగోలు చేయాలనుకుంటున్నాడు. దాంతో మధ్యవర్తులు తగ్గిపోతున్నారు.
-సుధ, యూఎన్డీపీ దిశ భాగస్వామి

కేటీఆర్ ప్రచారంతో:

చేనేతకు పాజిటివ్ వేవ్స్ మొదలయ్యాయి. కేటీఆర్ తనదైన శైలిలో ప్రచారం కల్పించారు. ఇప్పుడు చేనేత కార్మికుడు, మాస్టర్ వీవర్ వారి ఉత్పత్తులను అమ్ముకునేందుకు ప్రభుత్వం మీద ఆధారపడకుండా బయట మార్కెట్లో స్వేచ్ఛగా, లాభదాయకంగా విక్రయిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చేనేత వస్ర్తాలను విక్రయిస్తూ ఉపాధి పొందుతున్న వారు అనేకం ఉన్నారు.
-యర్రమాద వెంకన్ననేత, జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త

ప్రోత్సాహం చాలు :

చేనేత రంగానికి ఇప్పుడు ఢోకా లేదు. మార్కెటింగ్‌కు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా చేనేతకు విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నది. దాంతో అన్ని వర్గాలకు చేరుతున్నది. జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ద్వారా మరింత ప్రచారం కల్పించినట్లవుతుంది. అలాగే చేనేత వస్ర్తాల ప్రత్యేకతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
-తడ్కక యాదగిరి, జాతీయ చేనేత బోర్డు మాజీ సభ్యుడు

- శిరందాస్ ప్రవీణ్‌కుమార్
- సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి

902
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles