లోపాన్ని జయించి.. విజయం సాధించి


Sun,August 4, 2019 12:46 AM

ఆ ఇంట్లో నలుగురు సంతానం. వారిలో ముగ్గురూ దివ్యాంగులే. ఇద్దరికి చూపులేదు. ఒకరు కుర్చీకే పరిమితమయ్యారు. తల్లిదండ్రులు కూడా వృద్ధులవడంతో.. కుటుంబ భారం పెద్ద కొడుకుపై పడింది. బతుకు బండిని లాగేందుకు ఊరూరు తిరిగి బట్టలమ్మే తండ్రి వారసత్వాన్ని అందుకున్నాడు కొడుకు. అంధులైన తన తోబుట్టువులు ఏం చెయ్యలేని పరిస్థితి. శారీరకంగా 90 శాతం లోపం ఉన్నా.. మానసికంగా దృఢంగా ఉన్న ఆమె కూడా.. అన్నతో పాటు కుటుంబ భారాన్ని భుజాన వేసుకున్నది. అవమానాలు, అవహేళనలు ఎదురైనా భరించింది. పేరులో ఉన్న విజయాన్ని తన జీవితంలోకి తెచ్చుకునేందుకు ఇన్నేండ్లు శ్రమించి, విధిరాతను మార్చుకొని చివరికి విజేతగా నిలిచింది ఈ విజయలక్ష్మి.
artist-vijaya-laxmi
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన ఈ వీల్‌చైర్ ఆర్టిస్ట్ విజయలక్ష్మిది గుండెను తొలిచేసే వ్య(క)థ. నలుగురిలో స్ఫూర్తిని నింపే విజయగాథ. ఇంట్లో ముగ్గురు దివ్యాంగ సంతానాన్ని పెంచుతూ ఆ తల్లిదండ్రులు ఎంత మానసిక సంఘర్షణ ఎదుర్కొన్నారో వారికే తెలియాలి. వారి కష్టాలు, తోబుట్టువుల బాధలన్నీ కళ్లారా చూసింది విజయ. తనకు నచ్చిన రంగంలో వీల్‌చైర్ నుంచే కష్టానికి అలవాటుపడింది. ఆమెకున్న లోపం కారణంగా ఊహ తెలిసినప్పుడే స్నేహితులు దూరమయ్యారు. ఖాళీగా ఉండలేక చిన్నప్పుడు పెన్సిల్‌తో బొమ్మలు గీసేది. పేపర్లలో వచ్చే బొమ్మలతో కుస్తీ పట్టింది. తనకు బాగా నచ్చిన చిత్రాలను పెయింటింగ్స్‌గా మలి కుంచెతో స్నేహం చేసింది. సమాజం పట్ల అవగాహన పెరుగుతున్న కొద్దీ తన కుంచెతో అన్ని కోణాలనూ స్పృశించింది.


ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తట్టుకునేందుకు పెండ్లిండ్లు, ఇతర శుభకార్యక్రమాలకు మెహందీ పెట్టేది. విద్యార్థులకు ట్యూషన్స్ చెప్పేది. తన యూట్యూబ్ చానెల్ ద్వారా పిల్లలకు డ్రాయింగ్ నేర్పింది. బొమ్మలతో పాఠాలు చెప్పింది. వీల్‌చైర్ నుంచే తనకు చేతనైన పనులు చేసేది. ఆమెలో చిన్నప్పటి నుంచే దైవచింతన ఎక్కువగా ఉండడంతో విష్ణు అవతారాలు, వినాయక, దుర్గమ్మ బొమ్మలు బాగా గీసేది. అలా సామాజికాంశాలపై కూడా తన కుంచెను సంధించింది విజయ. మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలను దాడులు, వెలివేతలను చిత్రాలుగా గీసింది. వీటితో పాటుగా మన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ, బోనాలు, పల్లె అందాలు, ప్రకృతిపై వందలకొద్దీ పెయింటింగ్స్ వేసింది. ఇప్పటి వరకు దాదాపు 500లకు పైగా పెయింటింగ్స్ గీసింది విజయ.

artist-vijaya-laxmi6

అవమానాలను ఎదుర్కొని..

ఓ ప్రమీలమ్మా.. ఎందుకమ్మా పిల్లను ఇంట్లో ఉండనివ్వకుండా బడికి పంపుతున్నావ్? ఆమె ఈడ్చుకుంటా ఎల్లి చదువుకుని జాబ్ చేస్తదా? అని విజయ లోపాన్ని చిన్నప్పటి నుంచే వెక్కిరించారు. అయినా తల్లి ప్రమీల, తండ్రి నర్సింహులు బయటవారి మాటలు వినలేదు. కూతురి ఇష్టానికే వదిలేశారు. ధైర్యం చెప్పి.. కష్టమైనా బడికి పంపారు. ముగ్గురు బిడ్డలను కంటికి రెప్పలా కాచుకున్నారు. విజయలక్ష్మిలో అంతకంతకూ ఆత్మైస్థెర్యం రెట్టింపు అయింది. పనిపై పట్టుదల పెరిగింది. పది వరకు చదివి.. ఆ తర్వాత ఓపెన్‌లో డిగ్రీ చేసింది.

artist-vijaya-laxmi5

ప్రతిభను మెచ్చిన అవార్డులు

తన పెయింటింగ్స్ ద్వారా ఎంతోమంది హృదయాలతో పాటు.. నాలుగు అవార్డులు కూడా గెలుచుకున్నది విజయలక్ష్మి. గతేడాది ఆగస్టులో రవీంద్రభారతిలో ఐపీఎస్ షిఖా గోయల్ చేతుల మీదుగా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం అందుకున్నది. ఈ ఏడాది ఉమెన్స్ డే సందర్భంగా ప్రతిభావంతులైన దివ్యాంగుల తల్లిదండ్రులు ఇచ్చే మాతృశ్రీ పురస్కారాన్ని తన తల్లితో కలిసి అందుకున్నది. మార్చిలో రవీంద్రభారతిలో తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ చేతుల మీదుగా స్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్నది. గత ఏప్రిల్‌లో త్యాగరాయ గాన సభలో ప్రతిభా పురస్కారం వకుళాభరణం కృష్ణమోహన్ చేతుల మీదుగా అందుకున్నది.

artist-vijaya-laxmi4

ఎగ్జిబిషన్‌కు సహకారం

రవీంద్రభారతిలో విజయ రెండోసారి అవార్డు తీసుకుంటున్నప్పుడు ఆమెను ప్రతిభను రాష్ట్ర సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గుర్తించారు. ఆ వేదికపై ఆమెకు రవీంద్రభారతిలో 5 రోజులు ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు మాట ఇచ్చారు. ఆ వెంటనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమె ఎగ్జబిషన్‌కు అనుమతిచ్చారు. ఈ ఆర్ట్ ప్రదర్శనను మంత్రి శ్రీనివాసగౌడ్ ప్రాంభించారు. ఆ సమయంలో 31 జిల్లాల నుంచి ఆ ఎగ్జిబిషన్‌ను చూడ్డానికి వచ్చిన దివ్యాంగులు, ఆయా జిల్లాల దివ్యాంగ సంఘాల ప్రతినిధులకు ఉచితంగా భోజన సదుపాయాన్ని కల్పించారు మామిడి హరికృష్ణ. ఈ ఎగ్జిబిషన్‌లో వివిధ అంశాలపై గీసిన 80కి పైగా చిత్రాలను ప్రదర్శించింది విజయ. ఈ ప్రదర్శన చూడ్డానికి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాంరెడ్డి తమ ఆర్షీ సొసైటీ నుంచి బ్యాటరీ వీల్‌చైర్‌ను విజయకు అందించారు. దాని విలువ దాదాపు రూ.70వేలపైనే. ఎగ్జిబిషన్ చూడ్డానికి వచ్చిన 31 జిల్లాల దివ్యాంగ ప్రతినిధులు విజయను ఘనంగా సత్కరించారు.

artist-vijaya-laxmi3

తెలంగాణ దివ్యాంగ కళాయాత్ర

వివిధ రంగాల్లో నిపుణులైన దివ్యాంగ కళాకారులతో కళాయాత్రను చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. చిన్న విషయాలకే కలత చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో చైతన్యం, దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కళాజాతాలో పలు జిల్లాలకు చెందిన 16మంది దివ్యాంగ కళాకారులను ఎంపిక చేశారు. వారిలో విజయలక్ష్మి కూడా ఉన్నది. ఈ కళాబృందం పాత పది జిల్లాల్లో పర్యటిస్తూ.. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నది. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రదర్శన ఇచ్చారు. త్వరలోనే సిరిసిల్లలో ప్రదర్శన ఉంది.

వారిలో స్ఫూర్తి నింపాలి

నేను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. నాలాగే ఎంతోమంది ఉన్నారు. వారిలో చైతన్యం తీసుకురావాలి. దివ్యాంగులను ఇంట్లో పెట్టుకొని తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారు. ఆయితే వారిని అలా ఇంటికే పరిమితం చేయకుండా నైపుణ్యం ఉన్న రంగంలో రాణించేందుకు సహాయపడాలి. అప్పుడే వారిలోని ప్రతిభ బయటి ప్రపంచానికి తెలుస్తుంది. పెయింటింగ్స్‌లో జాతీయస్థాయిలో అవార్డు తీసుకోవాలన్నదే నా లక్ష్యం. అదేవిధంగా నా కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటు అందించాలి. దానికోసమే శ్రమిస్తున్నా. నాకు ప్రోత్సాహం అందిస్తున్న వారికి, నా తల్లిదండ్రులు, మా అన్నయ్య-వదిన, నా కుటుంబ సభ్యులకు కొత్తా కృష్ణవేణి గారు, మామిడి హరికృష్ణగారు, మా సంఘం జాతీయ, రాష్ట్ర అధ్యక్షులకు పేరు పేరునా కృతజ్ఞలు.
- విజయలక్ష్మి, చిత్రకారిణి

artist-vijaya-laxmi2

మీరే సాయం చేయాలి

పెయింటింగ్ వేయడమంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. రంగులు, షీట్స్, లామినేషన్, ఫ్రేమ్స్ వంటివి సమకూర్చుకోవాలి. విజయ గీసేది కాన్వాస్ పెయింటింగ్. దీనికి ఖర్చు చాలా ఎక్కువ. అన్నికష్టాలకు ఓర్చి, తానేంటో నిరూపించుకోవాలని, నలుగురికి స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో పెయింటింగ్స్ వేస్తున్నది. ఈ క్రమంలో తాను గీసిన పెయింటింగ్స్‌ను విక్రయించాలని అనుకుంటున్నది విజయలక్ష్మి. ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి, ఆమె గీసిన పెయింటింగ్స్ కొనుగోలు చేయడానికి 9849548190 నంబర్‌లో సంప్రదించొచ్చు.

-డప్పు రవి

1219
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles