నిజమైన స్నేహితుడు


Sun,August 4, 2019 12:44 AM

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
బాల్యం నుంచి స్కూల్, కాలేజీ, ఉద్యోగం, వ్యాపారం.. మనిషి జీవితంలోని అన్ని వయసుల్లో కచ్చితంగా ఓ ఫ్రెండ్ ఉంటాడు. మధుర జ్ఞాపకాలుంటాయి. గుండెను పిండేసే గాథలుంటాయి. ఒక్కసారి కళ్లుమూసుకుంటే ఆ నిజమైన స్నేహితులు మీ మదిలో విహరిస్తుంటారు. మీకోసం కష్టపడిన, మీ కోసం తన జీవితాన్ని త్యాగం చేసినా, మీ కోసం దెబ్బలు తిన్న, మీకోసం చిలిపి పనులు చేసిన.. మిమ్మల్ని సంతోషపెట్టిన ఆ స్నేహితులను మరలా మననం చేసుకోండి.
friend-ship-day
భాషకందని కమ్మటి భావన స్నేహం. జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకం. జీవితం చుట్టూ ఒక గాడాంధకారం అలుముకున్నప్పుడు, నిరాశా నిస్పృహలు చుట్టుముట్టినపుడు నీ కోసం నేనున్నాను రా అంటూ భుజం తట్టే ఆత్మీయమైన స్పర్శ స్నేహం. అదే విషాదాన్ని సగానికి సగం తగ్గిస్తుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోయిన వేళ.. మనిషి జీవితం స్మార్ట్‌ఫోన్ చుట్టూ తిరుగుతున్న వేళ.. మనిషన్నవాడు మాయమైపోతున్న తరుణంలో ఇంకా ఎక్కడో ఒకచోట ఆత్మీయమైన స్నేహాలు వెలుగురేఖలుగా దారి చూపుతూనే ఉన్నాయి. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఒకచోట కలుస్తారు. మహా వృక్షంలా ఎదుగుతారు. జీవితంతో మమేకమవుతారు. కాలేజీలోనో, లైబ్రరీలోనో, కలిసి నడిచే కారిడార్‌లోనో, తరగతి గదిలోని ఒకే బెంచిపై, మాస్టారు బోధించే పాఠాల్లోని సందేహాల్లో ఊపిరి పోసుకొనే స్నేహం.. విడదీయరాని బంధమవుతుంది.

అందుకే ఫ్రెండ్‌షిప్ ఎవర్‌గ్రీన్. ఈ స్నేహితుల దినోత్సవం రోజున మరొక్కసారి మీ స్నేహితులను పలుకరించండి. స్నేహితుల జ్ఞాపకాలు గుండె చప్పుడులో చేసే సందడే వేరు. ఆ మధురానుభూతులను తలుచుకుంటూ ఒక్కసారి రెప్పవేస్తూ విహరించండి. ప్రియమైన స్నేహితులు గుండెను గిలిగింతలు పెడతారు. పెదవిపై చిరునవ్వు తెప్పిస్తారు. ఒకరా, ఇద్దరా.. అంతా కళ్లలో మెదులుతుంటారు. మరెందుకాలస్యం మీ స్మార్ట్‌ఫోన్‌తో అందర్నీ ఏకం చేయండి. గ్రూప్‌కాలింగ్‌లో ఊసులు చెప్పుకోండి. స్నేహితుడి తప్పును క్షమించినవాడే నిజమైన స్నేహితుడు!

1110
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles