ఆధునిక ఆవిష్కరణలకు క్రెడాయ్ న్యాట్‌కాన్


Sat,August 3, 2019 01:01 AM

నిర్మాణాల్లో వినియోగించే ఆధునిక పరిజ్ఞానం గురించి నిత్యం తెలుసుకోవాలి.. ఈ రంగంలో అనుసరించే ఉత్తమ ప్రమాణాలపై అవగాహన పెంచుకోవాలి.. అత్యుత్తమ నిర్మాణాల్ని స్వయంగా పరిశీలిస్తే అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి. పైగా, ఏమైనా సందేహాలుంటే వాటిని నివృత్తి చేసుకునే వీలు కలుగుతుంది. ఇలాంటి చక్కటి ఉద్దేశ్యంతో.. క్రెడాయ్ జాతీయ సంఘం ప్రతిఏటా న్యాట్‌కాన్ సదస్సును విదేశాల్లో నిర్వహిస్తుంది. విదేశీ నిర్మాణ రంగం నుంచి ఎప్పటికప్పుడు సరికొత్త విషయాల్ని తెలుసుకునేందుకు క్రెడాయ్ కొన్నేండ్ల నుంచి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో 19వ సదస్సును ఇజ్రాయేల్‌లోని టెల్ అవీవ్‌లో జరుపుతున్నది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సదస్సు నిర్వహణ బాధ్యతల్ని ఈసారి క్రెడాయ్ తెలంగాణ సంఘం చేపడుతున్నది.
BANNER
దేశవ్యాప్తంగా దాదాపు 1300 మంది డెవలపర్లు.. మన తెలంగాణ నుంచి రెండు వందలకు పైగా బిల్డర్లు.. ఇజ్రాయేల్‌లోని టెల్ అవీవ్‌కు చేరుకున్నారు. మొత్తానికి దక్షిణ భారతదేశం నుంచే అధిక శాతం మంది సదస్సులో పాల్గొంటున్నారు. భారత నిర్మాణ రంగంలో చోటు చేసుకుంటున్న తాజా పోకడల్ని టెల్‌అవీవ్ సదస్సులో చర్చిస్తారు. గత ఏడాది కాలంలో ఈ రంగం ఎదుర్కొన్న సమస్యలు, వాటిని అధిగమించిన తీరు గురించి నిపుణులు సభాముఖంగా వివరిస్తారు. టెల్ అవీవ్ సదస్సులో ఈసారి తెలంగాణ రాష్ట్రమే ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది. ఎందుకంటే, దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించని విధంగా.. మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ రంగంలో సింగిల్ విండో విధానానికి ఈమధ్యే శ్రీకారం చుట్టారు.

గత పదిహేను, ఇరవై ఏండ్ల నుంచి దేశమంతటా దీన్ని గురించి చర్చిస్తుంటే, తెలంగాణ రాష్ట్రం మాత్రం అన్ని రాష్ర్టాల కంటే ముందుగా ఈ విధానాన్ని అమలు చేయడానికి పచ్చజెండా ఊపింది. ఇదే అంశం, ఈసారి న్యాట్‌క్యాన్ సదస్సులో చర్చకు వచ్చే అవకాశముందని క్రెడాయ్ వర్గాలు భావిస్తున్నాయి. పైగా, దేశమంతటా నిర్మాణ రంగం కునారిల్లుతుంటే.. తెలంగాణలో మాత్రం మూడు పూవులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నది. అసలు ఏ రాష్ట్రంలో లేని రియల్ రంగం పెరుగుదల మన తెలంగాణలో గత రెండేండ్ల నుంచి స్పష్టంగా కనిపిస్తున్నది. పైగా, మన ప్రభుత్వం ప్రత్యేకంగా మున్సిపల్ చట్టాన్ని తీసుకురావడం, శాటిలైట్ టౌన్‌షిప్పులను ఏర్పాటు చేసే అంశానికి చట్టంలో స్థానం కల్పించడం వంటి అంశాల వల్ల తెలంగాణ వ్యాప్తంగా రియల్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇజ్రాయేల్ ప్రధాని హాజరు..

ఇజ్రాయేల్ మొదటి రోజు సదస్సుకు ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యుహూ ముఖ్య అతిథిగా హాజరవుతారు. టెల్‌అవీవ్ మేయర్ రాన్ హుల్దయ్, ఇజ్రాయేల్ అంబాసిడర్ పవన కపూర్, హెచ్‌డీఎఫ్‌సీ ఎండీ రేణుసూద్, క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు సతీష్ మగర్, ఛైర్మన్ జక్సే షా తదితరులు పాల్గొంటారు. ఇజ్రాయేల్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ జరగనంత అతిపెద్ద సదస్సు ఇదే కావడం గమనార్హం. ఆ దేశ పరిస్థితులకు, మన రియల్ రంగం స్థితిగతులకు అతికినట్లు సరిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా, ఈ సదస్సులో ఏయే అంశాలు చర్చకొస్తాయంటే..

-వాణిజ్య సముదాయాల్లో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వల్ల కలిగే లాభనష్టాలపై చర్చిస్తారు. ఉద్యోగుల అంతర్గత సామర్థ్యాన్ని పెంపొందించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను డెలాయిట్ హ్యుమన్ కేపిటల్ హెడ్ డా. మాయా ఇంబర్మన్ వివరిస్తారు. ఇజ్రాయేల్‌లో రియల్ రంగం స్థితిగతుల గురించి ప్రత్యేక చర్చ జరుపుతారు. కొత్తతరం కొనుగోలుదారుల ఆలోచనా విధానం, కొనుగోలుదారులకు మెరుగైన సేవల్ని అందించడమెలా? రియల్ రంగంలో సుస్థిరతను సాధించడమెలా? వంటి పలు అంశాలపై ప్రత్యేక చర్చలుంటాయి.

టెల్‌అవీవ్ సదస్సు సదావకాశం..

తెలంగాణకు చెందిన బిల్డర్లు, డెవలపర్లు ప్రపంచ నిర్మాణ రంగం పోకడల గురించి తెలుసుకోవడానికి ఇదో చక్కటి అవకాశం. విదేశాల్లో నిర్మాణాల నాణ్యత, ఆయా సంస్థలు పాటించే ఉత్తమ ప్రమాణాల్ని తెలుసుకుంటే, ఇక్కడా వాటిని అమలు చేయడానికి వీలు కలుగుతుంది. ఇజ్రాయేల్‌లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఘనవ్యర్థాల నిర్వహణ వంటి అంశాల్లో సరికొత్త విధానాల్ని తెలుసుకునే అవకాశమున్నది. ఈ సదస్సు విజయవంతం అవుతుందని, తెలంగాణ డెవలపర్లకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
RAMREDDY
- గుమ్మి రాంరెడ్డి, అధ్యక్షుడు, క్రెడాయ్ తెలంగాణ

ఇజ్రాయేల్ నుంచి నేర్చుకోవాలి...

ఇజ్రాయేల్ నిర్మాణ రంగం గురించి మన దేశీయ బిల్డర్లంతా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నాణ్యమైన నిర్మాణాల్ని చేపట్టడమే కాదు.. మెరుగైన రీతిలో పౌరసేవలు లభిస్తాయి. స్థానిక సంస్థలు ఘనవ్యర్థాల నిర్వహణను సమర్థంగా చేపడతాయి. నిర్మాణ రంగంలో ఆధునిక ఆవిష్కరణలకు ఇజ్రాయేల్ పెట్టింది పేరు. నిర్మాణాల్లో కాలుష్యాన్ని తగ్గించడానికి వాతావరణ అనుకూలమైన పరిజ్ఞానాన్ని అక్కడ వినియోగిస్తారు. వాణిజ్య సముదాయాలకు ఆధునిక పరిజ్ఞానాన్ని జోడించి ఎంతో స్మార్ట్‌గా నిర్మిస్తారు.
ramchandrareddy
- చెరుకు రామచంద్రారెడ్డి, కో-కన్వీనర్, క్రెడాయ్ న్యాట్‌కాన్

రెండున్నర కోట్ల ఇండ్లు కావాలి

దేశవ్యాప్తంగా మొత్తం జనాభాలో 34 శాతం మంది పట్టణ ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు. ఈ పరిస్థితి దేశంలో 25 మిలియన్ల ఇండ్ల కొరతకు దారితీస్తుంది. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 10 మిలియన్ల ఇండ్ల కొరత ఉంది. అది కూడా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోనే గృహాల ఎక్కువగా నెలకొంది. అయితే, 2022 వరకూ అందరికీ అందుబాటు గృహాలు అందించడంలో భాగంగా ఇప్పటికే కేంద్రం 80 లక్షల ఇండ్లను మంజూరు చేసింది. అందులో 50 లక్షల ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. 20 లక్షల నిర్మాణం పూర్తయింది. వచ్చే డిసెంబర్ వరకు అదనంగా మరో కోటికి పైగా గృహాల్ని మంజూరు చేస్తారు. మరి, మన రాష్ట్రంలో అందుబాటు గృహాలను ప్రోత్సహించడానికి కేంద్రం సాయం చేయాల్సిన అవసరముంది.

251
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles