శ్రావణ వేళ.. కమ్మని వంటకాలు


Thu,August 1, 2019 01:02 AM

vantalu
వచ్చేది శ్రావణమాసం.. ఇంటింటా పూజలు.. పురస్కారాలు మొదలవుతాయి.. అమ్మలగన్న అమ్మను ఆరాధిస్తూ.. ఆడవాళ్లు భక్తి పారవశ్యంలో మునిగిపోతారు.. మరి ఆ అమ్మకు నైవేద్యంగా పెట్టాలంటే.. తియ్యని.. కమ్మని వంటకాలు చేయాల్సిందే! అందుకే చిరుధాన్యాలతో చేసిన.. ప్రత్యేకమైన వంటకాలు మీకోసం..


కొర్రల గారెలు

garelu

కావాల్సినవి :

కొర్రలు : 200 గ్రా., ఉల్లిపాయ ముక్కలు : ఒక కప్పు,
అల్లం ముక్కలు : ఒక టీస్పూన్, సోంపు పొడి : అర టీస్పూన్,
కరివేపాకు : 2 రెమ్మలు, పసుపు : పావు టీస్పూన్, జీలకర్ర : పావు టీస్పూన్, పచ్చిమిర్చి : 3, ఆలుగడ్డలు : 100 గ్రా., కొత్తిమీర : చిన్న కట్ట,ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

కొర్రలు శుభ్రం చేసి మూడు గంటల పాటు నానబెట్టాలి. ఆలుగడ్డలను ఉడకబెట్టి, పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. నానిన కొర్రలను మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. దాంట్లో ఆలుగడ్డలను మెత్తగా చేసి అందులో కలుపాలి. దీంట్లోనే పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, జీలకర్ర, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కలిపి ఒక పావుగంట అలా ఉంచాలి. ఈ లోపు కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక.. పిండిని గారెల్లా చేసి నూనెలో వేయాలి. గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించి తీయాలి. ఇలా పిండి మొత్తం చేసుకోవాలి. పై నుంచి సోంపు పొడి చల్లి సర్వ్ చేయాలి. టేస్టీ కొర్ర గారెలు రెడీ!

కేసరి పూర్ణాలు

poornalu

కావాల్సినవి :

బొంబాయి రవ్వ : 200 గ్రా., చక్కెర : 100 గ్రా.,
నెయ్యి : 3 టేబుల్‌స్పూన్స్, యాలకుల పొడి : ఒక టీస్పూన్,
జీడిపప్పు : 10 గ్రా., కిస్‌మిస్ : 10 గ్రా., మినపపప్పు : 100 గ్రా., బియ్యం : 50 గ్రా., ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

బొంబాయి రవ్వ నెయ్యిలో దోరగా వేయించుకోవాలి. మినుపపప్పు, బియ్యం కడిగి నీళ్లు పోసి మూడు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత మరీ మెత్తగా కాకుండా ఈ పిండిని రుబ్బుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్‌లను నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. అందులో రవ్వ పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. దీంట్లోనే చక్కెర, యాలకుల పొడి, నెయ్యి వేసి దగ్గర అయ్యేంత వరకు కలుపుతుండాలి. పక్కన కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. రవ్వ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఒక్కో ఉండను మినుపపప్పు మిశ్రమంలో ముంచి నూనెలో వేసి వేయించాలి. నెయ్యితో పాటు ఈ పూర్ణాలు తింటే మరింత టేస్టీగా ఉంటాయి.

అవిసెల అన్నం

avisela-annam

కావాల్సినవి :

అవిసెలు : ఒక కప్పు
జీలకర్ర : ఒక టీస్పూన్
ధనియాలు : 1 1/2టీస్పూన్స్
ఎండుమిర్చి : 5
కరివేపాకు : 4 రెమ్మలు
పసుపు : పావు టీస్పూన్
బియ్యం : 200 గ్రా.
ఇంగువ : పావు టీస్పూన్
వెల్లుల్లి : 6 రెబ్బలు
నూనె : 2 టేబుల్‌స్పూన్స్
ఉప్పు : తగినంత

తయారీ :

బియ్యం కడిగి మరీ మెత్తగా కాకుండా వండాలి. ఆ తర్వాత అన్నాన్ని ఒక ప్లేట్‌లో వేసి చల్లార్చాలి. ఈలోపు అవిసెలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి దోరగా వేయించాలి. అదే కడాయిలో కొద్దిగా నూనె పోసి వెల్లుల్లి రెబ్బలను కూడా వేయించాలి. వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఆ తర్వాత కడాయిలో మరికొద్దిగా నూనె పోసి కరివేపాకు, ఇంగువ, పసుపు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టాలి. అన్నంలో అవిసెల మిశ్రమం వేసి కలిపి.. ఈ పోపు అందులో పోయాలి. అంతా సరిగా కలిసేలా చూసుకోవాలి. పై నుంచి కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది.

అల్లం భక్షాలు

allam-bobatlu

కావాల్సినవి :

బెల్లం : 100 గ్రా.
అల్లం : 25 గ్రా.
మైదాపిండి : 300గ్రా.
శనగపప్పు : 250 గ్రా.
నెయ్యి, ఉప్పు : తగినంత

తయారీ :

అల్లం చెక్కు తీసి సన్నగా, పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. బెల్లం తురిమి, కొన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. శనగపప్పులో నీళ్లు పోసి రెండు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత శనగపప్పును ఉడికించి, ఉడికిన తర్వాత మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. ఇందులో బెల్లం వేసి బాగా దగ్గర అయ్యే వరకు ఉడికించాలి. దీంట్లో అల్లం ముక్కలు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఈలోపు మైదాపిండిలో తగినంత ఉప్పు, నీరు వేసి పూరీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. చల్లారిన శనగపప్పు మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి. మైదాపిండిని కూడా చిన్న ఉండల్లా చేసుకొని అందులో శనగపప్పు మిశ్రమంలో కూరాలి. ఆ తర్వాత నెయ్యితో చిన్నగా పూరీల్లా ఒత్తుకోవాలి. ఇలా పిండి మొత్తం చేసుకోవాలి. పెనం మీద కాస్త నెయ్యి లేదా నూనె వేసి ఈ భక్షాలను రెండు వైపులా కాల్చుకోవాలి. వీటిని పాలతో తింటే సూపర్‌గా ఉంటాయి.

జి.యాదగిరి
కార్పొరేట్ చెఫ్
వివాహభోజనంబు రెస్టారెంట్
జూబ్లీహిల్స్, హైదరాబాద్
పార్క్‌లైన్, సికింద్రాబాద్

1157
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles