తెలంగాణ పర్యాటక వీణ


Fri,July 26, 2019 01:58 AM

ఉద్యమాలకే కాదు అందమైన పర్యాటకానికి నెలవు తెలంగాణ. ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలు, వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాలు, ఆకుపచ్చని అరణ్యాలు, గలగలపారే జలపాతాలు, లోయలు, నదులు ఎన్నో పర్యాటక ప్రాంతాలు. అందచందాల్ని ఆస్వాదించాలనుకునే ప్రకృతి ప్రేమికులు ఊటీ, కొడైకెనాల్‌కు వెళ్లా ల్సిన అవసరం లేదు. ప్రపంచానికే తలమానికమైన ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఈ గడ్డమీద పురుడు పోసుకుని రా..రమ్మని ఆహ్వానిస్తున్నాయి. ముప్పై మూడు జిల్లాలతో కొలువైన తెలంగాణ పర్యాటక శోభను ఒక్కసారి తనివితీరా వీక్షిద్దాం రండి.
viharammain
ఆదిలాబాద్:ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలిచే ఆదిలాబాద్ జిల్లాలో కుంతాల, పొచ్చెర, గాయత్రి , కనకాయి జలపాతాలున్నాయి. ఇక్కడ ఆదివాసీల ఆరాధ్య దైవమైన కేస్లాపూర్ నాగోబా దేవాలయం ఉంది.


కుమురం భీం ఆసిఫాబాద్: మార్లవాయి హేమండ్‌డార్ఫ్ దంపతుల స్మారకస్థలం, సప్తగుండాల, సముతుల గుండం జలపాతాలు,వాంకిడిలో కాకతీయుల నాటి శివాలయం ప్రసిద్ధి. కుమురం భీం ప్రాజెక్టు, వట్టివాగు, ఎన్టీఆర్‌సాగర్, జగన్నాథ్ సాగర్, పాల్వాయి సాగర్ జలాశయాలు ఈ జిల్లాలో ముఖ్యమైనవి.

నిర్మల్: నిర్మల్ కొయ్యబొమ్మలు, పెయింటింగ్‌లకు పెట్టింది పేరు. బాసర సరస్వతీ ఆలయం, పాపేశ్వర ఆలయం, అడెల్లి మహాపోచమ్మ ఆలయం, స్వర్ణ, గడ్డెన్నవాగు, కడెం జలాశయాలతోపాటు సదర్మాట్ బ్యారేజీ, పొచ్చెర, కుంటాల, కడెం జలపాతాలు, జిన్నారం, కవ్వాల్ టైగర్ జోన్ పర్యాటక కేంద్రాలు.

మంచిర్యాల: అపారమైన బొగ్గునిల్వలు, ప్రాణహిత, గోదావరి నదుల కలయికతో పునీతమైన జిల్లా మంచిర్యాల. గాంధారి ఖిల్లా, గాంధారి వనం, మొసళ్ల అభయారణ్యం, కృష్ణజింకల అభయారణ్యం, పులుల అభయారణ్యాలు, గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ప్రత్యేక పర్యాటక ఆకర్షణలు.

కరీంనగర్: ఎలగందులగా ప్రసిద్ధి చెందిన జిల్లా కరీంనగర్. ఎలగందుల కోట, మానేరు జలాశయం, దీనిపై నిర్మించిన డ్యాం, వెండితో వస్తువులు తయారుచేసే ఫిలిగ్రీ కళ, ఇల్లందకుంట దేవాలయం, పురావస్తు ప్రదర్శన శాల చూడదగినవి.

పెద్దపల్లి: రామగిరి ఖిల్లా, ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఎల్‌మడుగు జలాశయం, సబితం జలపాతం, రాముని గుండాలు ఈ జిల్లాలో పర్యాటక ప్రాంతాలు. ఓదెల మల్లన్న దేవాలయం పర్యాటక ప్రాంతాలు.

జగిత్యాల: ఈ జిల్లాలో గోదావరి నది ప్రవహిస్తున్నది. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి, జగిత్యాల కోట, క్లాక్‌టవర్ పర్యాటక కేంద్రాలు.

భదాద్రి కొత్తగూడెం:

BhadrachalamTemple
భద్రాచలంలో భక్త రామదాసు కట్టించిన దేవాలయం దేశవ్యాప్తంగా పేరుగాంచింది. దీనితో పాటు పర్ణశాల, తాలిపేరు, పెద్దవాగు, మూకమామిడి, కిన్నెరసాని, పాలెంవాగు ప్రాజెక్టులు ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. ఈ జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువ.

ఖమ్మం: స్వయంభువుగా వెలసిన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఖిల్లా, నేలకొండపల్లిలో బౌద్ధ స్తూపం, భక్తరామదాసు నివాసం ప్రముఖమైనవి. వైరా, లంకాసాగర్ ప్రాజెక్టులు, సత్తుపల్లి ఉపరితల బొగ్గుగని చూడదగిన ప్రాంతాలు.

సిరిసిల్ల: చేనేత పరిశ్రమకు పెట్టింది పేరు సిరిసిల్ల. మరనేత, చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. దక్షిణ కాశీ క్షేత్రమైన వేములవాడ, ఎగువ మానేరు జలాశయం, నాంపల్లి గుట్ట ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు.

వరంగల్ అర్బన్: సికింద్రాబాద్ తర్వాత అతి పెద్ద రైల్వే జంక్షన్ ఓరుగల్లులోని కాజీపేటలో ఉంది. భద్రకాళి దేవాలయం, వేయి స్తంభాల గుడి, ఖిలా వరంగల్, కాకతీయతోరణం, ఖుష్ మహల్, నైజాం కాలం నాటి మామునూరు విమానాశ్రయం చూడదగినవి.

వరంగల్ రూరల్: చారిత్రక పాకాల సరస్సు, పాకాల గుండం శివాలయం, అయినవోలు దేవస్థానం, భీమునిపాదం జలపాతం, కొమ్మాల జాతర పర్యాటక ప్రాంతాలుగా ప్రసిద్ధి.

మహబూబాబాద్: మానుకోటగా పేరుగాంచిన ఈ జిల్లా గిరిజనులకు ఆలవాలం. అనంతారం వెంకటేశ్వరస్వామి, నర్సింహులపేట శ్రీ వెంకటేశ్వరస్వామి, డోర్నకల్ చర్చి, భీమునిపాదం దర్శనీయ ప్రాంతాలు.

జయశంకర్ భూపాలపల్లి: ఆచార్య జయశంకర్ సార్ పేరు మీదుగా ఏర్పాటైన జిల్లా ఇది. కాళేశ్వర శ్రీ ముక్తేశ్వరస్వామి ఆలయం, గణపురం కోటగుళ్లు, రేగొండ పాండవుల గుట్ట, కోటంచ నర్సింహస్వామి ఆలయం, లక్నవరం చెరువులు, పర్యాటక కేంద్రాలు.
Pillalamarry
ములుగు జిల్లా: లక్నవరం, బోగతా జలపాతాలు, రామప్పఆలయం, సరస్సు, మల్లూ రు లక్ష్మీనరసింహస్వామి ఆలయం, చింతామణి జలపాతం, సమ్మక్కసారలమ్మ మేడా రం జాతర, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం అభయారణ్యం ఉన్నాయి.

జనగామ: పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి, జీడికల్ వీరాచల శ్రీ సీతారామచంద స్వామి, పెంబర్తి లోహ హస్తకళ, మహాకవి పోతన జన్మస్థలం బమ్మెర, కవి పాల్కురికి సోమనాథుడి జన్మస్థలం ఇక్కడ పర్యాటకాలు.

నల్లగొండ: నాగార్జున సాగర్, చందంపేట గుహలు, దేవరకొండ కోట, మల్లన్నస్వామి ఆలయం, మూసీ ప్రాజెక్టు, రాణీ రుద్రమ మరణ ధ్రువీకరణ శాసనం ఉన్న చందుపట్ల, రాచకొండ గుట్టలు చూడదగినవి.

యాదాద్రి - భువనగిరి: కొలనుపాక జైన దేవాలయం, ఏకశిలపై నిర్మితమైన భువనగిరి కోట,తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సుప్రసిద్ధం.

సూర్యాపేట: పురాతన కాకతీయుల కాలం నాటి శివాలయాలు, పిల్లలమర్రి, వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన చెన్నకేశవ ఆల యం చూడదగ్గ ప్రదేశాలు.

నారాయణపేట: ఇది పట్టు చీరలకు, బంగారు ఆభరణాల వ్యాపారానికి ప్రసిద్ధిగాంచింది. లోకపల్లి సంస్థానం చూడదగింది.

జోగులాంబ- గద్వాల

Alampur-India
కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహించే ప్రాంతం జోగులాంబ-గద్వాల జిల్లా. తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక సంప్రదాయాలు, సంస్కృతులు కలగలిసిన నేల ఇది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవదైన జోగులాంబ క్షేత్రం కొలువైన ఆలంపూర్, బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం, గద్వాల చేనేత చీరలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. ప్రియదర్శిని జూరాల, నెట్టెంపాడు, చందఘడ్ కోట, పెద్దచింతరేవుల ఆంజనేయస్వామి దేవాలయం, పాగుంట వెంకటేశ్వరస్వామి దేవాలయం, జూరాల జలవిద్యుత్ కేంద్రం చూడదగ్గ ప్రదేశాలు.

వనపర్తి: వనపర్తికోట, శ్రీరంగాపురం రంగనాయకస్వామి ఆలయం, రామన్నపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గరుడ పుష్కరిణి, ఘనపూర్ కోట చూడదగినవి.

నాగర్ కర్నూలు: పొడవైన కృష్ణాతీరం, నల్లమల అభయారణ్యం, నాగార్జునసాగర్ పులుల అభయారణ్యం, ఎత్తిపోతల ప్రాజెక్టు, శ్రీశైలం ఎడమకాల్వ సొరంగం, సోమశిల సప్తనదుల సంగమం, మల్లెల తీర్థం జలపాతం, పరహాబాద్ వ్యూపాయింట్, నల్లమలలోని ఉమామహేశ్వరస్వామి దేవాలయం, వట్టెం వెంకటేశ్వరస్వామి దేవాలయం, సోమేశ్వరాలయాలు ప్రసిద్ధి.

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెకు, బడాపహాడ్ దర్గా, ఖిల్లా జైలు, సిర్నాపల్లి గడీ, సారంగాపూర్ హనుమాన్ దేవాలయం, డిచ్పల్లి ఖిల్లా రామాలయం, దేవల్ మజీద్, కందకుర్తి త్రివేణి సంగమం, రామడుగు జలాశయం, గుత్ప ఎత్తిపోతల పథకాలు, అలీసాగర్, అశోకాసాగర్, జానకంపేట అష్టముఖి కోనేరు, బోధన్ భీమునిగుట్టలు ఇక్కడి ప్రముఖ పర్యాటక కేంద్రాలు.

కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్టు, బిక్కనూరు సిద్ధరామేశ్వరాలయం, కాల భైరవస్వామి, లక్ష్మీనరసింహస్వామి, బుగ్గరామలింగేశ్వర, బసవేశ్వర ఆలయాలు, పోచారం కౌలాస్‌నాలా ప్రాజెక్టు, దోమకొండకోట, పోచారం అభయారణ్యం పర్యాటక ప్రాంతాలు.

మెదక్: ఘనపూర్ ఆనకట్ట, ఏడుపాయల వనదుర్గా జాతర, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి, మెదక్ ఖిల్లా, కొల్చారం జైనమందిరం, నర్సాపూర్ అడవులు, పోచారం జలాశయం, పోచా రం అభయారణ్యం ప్రధాన పర్యాటక ప్రాంతాలు.
Kuntala-Waterfalls
సిద్దిపేట: కొమురవెల్లి మల్లన్న, వర్గల్ సరస్వతీ క్షేత్రం, కొండపోచమ్మ, నాచారం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ములుగు పాండురంగ ఆశ్రమం, జగదేవ్‌పూర్ వరదరాజస్వామి, కోటిలింగేశ్వర ఆలయం, సిద్దిపేట కోమటిచెరువు పర్యాటక కేంద్రాలు.

సంగారెడ్డి: సింగూరు జలాశయం, ఝరాసంగం కేతకీ సంగమేశ్వరాలయం ప్రధాన పర్యాటక కేంద్రాలు.

వికారాబాద్: తెలంగాణా ఊటీ అనంతగిరి. అనంతగిరి పద్మనాభుడు, బుగ్గరామేశ్వరం, భూకైలాస్, ఏకాంబరేశ్వర, జుంటుపల్లి రాముడు, కొడంగల్ వెంకటేశ్వరస్వామి ఆలయం చూడదగినవి.

మేడ్చల్: కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. జైన, బౌద్ధమతాల చారిత్రక ఆనవాళ్లు , ద్రాక్షతోటలు, అందమైన విల్లాలు ఈ ప్రాంతపు ఆకర్షణలు.

రంగారెడ్డి: రెండో తిరుపతిగా పేరొందిన చిలుకూరు బాలాజీ, నర్కూడలోని అమ్మపల్లి ఆలయం, హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్‌లు ప్రసిద్ధ పర్యాటకాలు.

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ చారిత్రక నగరం. నాలుగు వందల ఏండ్ల చరిత్ర కలిగిన వైభవోపేత చరిత్ర నగరమిది. అద్భుత నిర్మాణ కౌశలంతో కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల కాలం నాటి చారిత్రక కట్టడాలెన్నో దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. భిన్న సంస్కృతుల సమ్మేళనం ఈ కట్టడాల్లో కనిపిస్తుంది. ఇండో, అరబిక్, పర్షియన్ వాస్తు శిల్ప కళానైపుణ్యానికి హైదరాబాద్ కట్టడాలు ప్రతీక. చార్మినార్, గోల్కొండ, మక్కామసీదు, చౌమహల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా ప్యాలెస్, పురానా హవేలీ, సాలార్జంగ్ మ్యూజియం, స్టేట్ మ్యూజియం, నెహ్రూ జూపార్క్ ఇలా ఎన్నో ప్రాంతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.

మహబూబ్‌నగర్: ఇక్కడ 700 సంవత్సరాల చరిత్ర గల పిల్లలమర్రి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. పర్యాటకశాఖ ప్రదర్శనశాల, వస్తు ప్రదర్శనశాల ఉన్నాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పురాతన విగ్రహాలను ఇక్కడ భద్రపరిచారు. దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ జలాశయం, పేదల తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన మన్యంకొండ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆల యం ప్రధాన పర్యాటకాలు.
-మధుకర్ వైద్యుల
Sri-Kaleshwara-Muktheswara-

883
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles