నెల రోజులే కనిపించే గ్రామం


Fri,July 26, 2019 01:50 AM

కొన్ని విషయాలు వినడానికి వింతగా ఉన్నా..అవి నిజం అని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. గోవాలోని కుర్ది గ్రామం ఏడాదిలో11 నెలలు నీట మునిగి ఉండి ఒక నెలమాత్రమే తేలుతుంది. అటువంటి ప్రదేశాన్ని సందర్శించేందుకు పర్యాటకులు, ఇటు గ్రామస్థులు ఎదురు చూస్తారంటే అతిశయోక్తి కాదు.
Govvva
గోవాలోని పశ్చిమ కనుమల్లో కొండల మధ్యలో సలౌలిం నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది పరీవాహక ప్రాంతంలో కుర్ది అనే గ్రామం ఉంది. నిజానికి ఆ గ్రామం ఒకప్పుడు మామూలుగానే ఉండేది. కాకపోతే 1986లో ఆ నదిపై ఆనకట్ట నిర్మించారు . దాంతో ఆ గ్రామం మొత్తం నీట మునిగింది. ఇక్కడ విచిత్రమేంటంటే సంవత్సరంలో పదకొండు నెలలు పాటు ఆ గ్రామం నీటిలోనే మునిగి ఉన్నా..వేసవిలో మాత్రం తేలుతుంది. కారణం అక్కడ జలాశయంలో ఉండే నీరు పూర్తిగా ఇంకిపోవడం వల్ల ఆ సమయంలో గ్రామం ఆనవాళ్లు శిథిలాలు బయటకు కనబడుతాయి. అది కొద్ది రోజులు మాత్రమే. నీరు పూర్తిగా ఇంకిపోయినప్పుడు ఒక నెల రోజులు మాత్రమే ఆ గ్రామం కనబడుతుంది. ఆనకట్ట కోసం తమ గ్రామాన్ని ఇచ్చిన ఆ గ్రామంలోని ప్రజలు, ఇతర ప్రాంతాల్లో నివశించే వారు. ఈ నెలరోజుల పాటు ఇక్కడికి వచ్చి, సంబురాలు చేసుకుంటారు. వారు నివశించిన ప్రాంతాన్ని చూస్తూ అక్కడ సంతోషంగా గడుపుతుంటారు. శిథిలమైన తమ ఇండ్లను, తాము తిరిగిన ప్రాంతాలను గుర్తు చేసుకుంటుంటారు. అంతకు ముందు ఆ గ్రామంలో ఉన్న చర్చి, ఒక దేవాలయం ఉండగా అవి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. అయినా సరే.. ఆయా మతస్థులు వాటిల్లోనే తమ దైవాలను ప్రార్థిస్తుంటారు. విందులు, వినోదాలు చేసుకుంటుంటారు. ఈ విషయం తెలిసి దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. వర్షాలు ప్రారంభమయ్యాయంటే క్రమేణా మునిగే కుర్ది గ్రామం ఒక దశలో ఓ దీవిలా దర్శనమిస్తుంది.ఆ సమయంలో ఆ దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్లూ సరిపోవు. ఆ అందమైన దృశ్యాన్ని చూడడం కోసం పర్యాటకులు, గ్రామస్థులు ప్రతి ఏటా అక్కడికి వెళ్లి ఎదురుచూడటం కుర్ది ప్రత్యేకత.

1062
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles