కోరి..కొబ్బరి వంటకాలు!


Thu,July 25, 2019 12:54 AM

COCONUT
హైదరాబాద్‌లో ఆషాఢం బోనాలు.. శ్రావణం వస్తే తెలంగాణలో పోచమ్మలు.. ఇక శ్రావణ శుక్రవారాలు.. ఇలా ఇల్లంతా పండుగ వాతావరణంతో నిండిపోతుంది.. దానికి తోడు దేవుడి దగ్గర.. గుడిలో.. కొబ్బరికాయల మోత కూడా ఎక్కువే ఉంటుంది..
ఒకటి.. రెండు ముక్కల కంటే ఎక్కువ తినలేని కొబ్బరిని.. ఆ తర్వాత పక్కకు పడేయడమే చేస్తారు.. లేకపోతే పచ్చడితో సరిపెడతారు.. అలా కాకుండా ఇలా కమ్మని వంటకాలు కూడా ట్రై చేయొచ్చు..


కొబ్బరి లడ్డు

COCONUT-JAGGERY-LADDU

కావాల్సినవి :

కొబ్బరి తురుము : ఒక కప్పు , బెల్లం : ఒక కప్పు
యాలకుల పొడి : అర టీస్పూన్, ఉప్పు : చిటికెడు,
నెయ్యి : తగినంత

తయారీ : స్టెప్ 1 : బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి. అందులో కొన్ని నీళ్లు పోసి చిక్కగా అయ్యేంత వరకు మరిగించాలి.
స్టెప్ 2 : మరో పక్కన చిన్న కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి.. కొబ్బరి తురుమును సన్నని మంట మీద ఐదు నిమిషాల పాటు వేయించి దించేయాలి.
స్టెప్ 3 : ఈ లోపు బెల్లం చిక్కగా అయితే.. అందులో ఉప్పు, యాలకుల పొడితో పాటు కొబ్బరి తురుము వేసి కలిపి దించేయాలి.
స్టెప్ 4 : ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసి.. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తియ్యని లడ్డూలు రెడీ!

కోకోనట్ రైస్

COCONUT-RICE

కావాల్సినవి :

కొబ్బరి తురుము : ఒక కప్పు, అన్నం : 2 కప్పులు, పచ్చిమిర్చి : 4, కొత్తిమీర : చిన్న కట్ట, నిమ్మకాయ : 1, ఎండుమిర్చి : 2, జీలకర్ర : అర టీస్పూన్, ఆవాలు : అర టీస్పూన్, పల్లీలు : ఒక టేబుల్‌స్పూన్, శనగపప్పు : అర టీస్పూన్, మినుపపప్పు : అర టీస్పూన్, కరివేపాకు : 2 రెమ్మలు, నూనె : 3 టీస్పూన్స్, ఉప్పు : తగినంత

తయారీ :

స్టెప్ 1 : బియ్యాన్ని కడిగి అన్నం మరీ మెత్తగా కాకుండా.. పొడి, పొడిగా వండుకోండి.
స్టెప్ 2 : కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, పల్లీలు, మినుపపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కలుపుకోవాలి.
స్టెప్ 3 : దీంట్లోనే కరివేపాకు, కొబ్బరి తురుము, ఉప్పు వేసి కలుపాలి. ఇందులోనే నిమ్మరసం వేసి కలుపాలి.
స్టెప్ 4 : రెండు నిమిషాలు సన్నని మంట మీద ఉంచి వండిన అన్నం, కొత్తిమీర వేసి కలిపి ఒక నిమిషం ఉంచి దించేయాలి. టేస్టీ.. కోకనట్ రైస్ నోరూరిస్తుంది.

క్రీమీ కోకనట్ పై

CREAMY-COCONUT-PIE

కావాల్సినవి :

కొబ్బరి పాలు : ఒక టేబుల్‌స్పూన్, మైదా : 110 గ్రా., బటర్ : 60 గ్రా.,చక్కెర పొడి : 30 గ్రా., పాలు : 100 మి.లీ., బీన్స్ : ఒక కప్పు, కోడిగుడ్లు : 2, కొబ్బరి తురుము : ఒక కప్పు,
బటర్ : 2 టేబుల్‌స్పూన్స్, యాలకుల పొడి : చిటికెడు

తయారీ :

స్టెప్ 1 : ఒక గిన్నెలో మైదా, బటర్, చక్కెర, పాలు వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మరీ వదులుగా కాకుండా కలిపి పది నిమిషాలు ఉంచాలి.
స్టెప్ 2 : పై మౌల్డ్‌లో షీట్ వేసి ఈ మిశ్రమాన్ని వేయాలి. ఫోర్క్‌తో అక్కడక్కడ రంధ్రాలు పెట్టి, పై నుంచి బటర్ షీట్‌ని వేయాలి.
స్టెప్ 3 : దీని మీద డ్రై బీన్స్ వేసి 180 డిగ్రీల వద్ద 10 నిమిషాల పాటు బేక్ చేయాలి. ఈ లోపు ఒక గిన్నెలో కోడిగుడ్డు వేసి చక్కెర, బటర్, కొబ్బరి పాలు, యాలకుల పొడి, మైదా, కొబ్బరి తురుము వేసి బాగా గిలక్కొట్టాలి.
స్టెప్ 4 : బేక్ అయిన దాని మీద ఈ మిశ్రమాన్ని పోసి మళ్లీ 180డి గ్రీల వద్ద 30 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మనకు నచ్చిన రీతిలో కట్ చేసుకొని తింటే యమ టేస్టీగా ఉంటుంది.

కొబ్బరి బర్ఫీ

COCONUT-BURFI

కావాల్సినవి :

కొబ్బరి తురుము : 1 1/2 కప్పులు, చక్కెర : ఒక కప్పు, యాలకుల పొడి : పావు టీస్పూన్, నెయ్యి : 2 టీస్పూన్స్

తయారీ :

స్టెప్ 1 : ఒక గిన్నెలో చక్కెర, నీళ్లు పోసి చిక్కటి ద్రావకంలా చేయాలి. ఇందులో యాలకుల పొడి వేసి కాసేపు ఉండనివ్వాలి.
స్టెప్ 2 : ఆ తర్వాత కొబ్బరి తురుము వేసి ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. సన్నని మంట మీద ఐదు నిమిషాలు ఉంచాలి.
స్టెప్ 3 : చివరగా నెయ్యి వేసి కలిపి దించేయాలి. ఒక ప్లేట్‌కి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని దాని మీద పోయాలి. ఆ తర్వాత కావాల్సిన రీతిలో కట్ చేసుకుంటే సరిపోతుంది. రుచికరమైన బర్ఫీ మీ ముందుంటుంది.

గ్రీన్ కోకనట్ పాయా

GREEN-COCONUT-PAYA

కావాల్సినవి :

మటన్ లెగ్ బోన్స్ : 300 గ్రా., కొబ్బరి తురుము : ఒక కప్పు, పుదీనా : చిన్న కట్ట
కొత్తిమీర : చిన్న కట్ట, పచ్చిమిర్చి : 4, గసగసాలు : ఒక టేబుల్‌స్పూన్, సోంపు గింజలు : అర టీస్పూన్, లవంగాలు : 3, యాలకులు : 2, జీలకర్ర : అర టీస్పూన్, దాల్చిన చెక్క : చిన్న ముక్క, ఉల్లిపాయ ముక్కలు : అర కప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్, పెరుగు : ఒక టేబుల్‌స్పూన్, నూనె, ఉప్పు : తగినంత

తయారీ :

స్టెప్ 1 : కుక్కర్‌లో ఒక టేబుల్‌స్పూన్ నూనె పోసి, పుదీనా ఆకులు, కొత్తిమీర, పచ్చిమిర్చి, గసగసాలు వేసి వేయించాలి. ఇవి కాస్త చలారనిచ్చి వాటిని మిక్సీ పట్టాలి.
స్టెప్ 2 : మిక్సీ చేసేటప్పుడు అందులో ఉప్పు, కొబ్బరి తురుము వేసి మెత్తని పేస్ట్‌లా చేయాలి. కుక్కర్‌లో మళ్లీ నూనె పోసి సోంపు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, జీలకర్ర వేసి కలుపాలి.
స్టెప్ 3 : దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పచ్చిమిర్చి పేస్ట్, మటన్ లెగ్ బోన్స్ వేసి కలుపాలి.
స్టెప్ 4 : మూత పెట్టి విజిల్ పెట్టకుండా ఐదు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత మూత తీసి కొన్ని నీళ్లు పోసి ఈ సారి విజిల్ పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
స్టెప్ 5 : గ్యాస్ మొత్తం పోయేవరకు ఉంచి మూత తీసి కొత్తిమీర వేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.

సంజయ్ తుమ్మ
సెలబ్రిటీ చెఫ్

1171
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles