వినియోగదారుల సేవల్లో రాణిస్తున్న సింధు జోసెఫ్


Mon,July 22, 2019 12:48 AM

డబ్బులున్న ప్రతివారు వ్యాపారం చేయాలనుకుంటారు. వ్యాపారం చేయడం పెద్ద కష్టమేమీ కాదు. చేస్తున్న వ్యాపారం లాభాలు సాధించి సక్సెస్ అయినప్పుడే విజయం సాధించినట్లు. ఆ విజయం రావాలంటే సాధించాలనే పట్టుదల, దానికి తగిన కృషి చేయాలి. అన్నిటికంటే ముందు మనం చేసే సేవల పట్ల వినియోగదారులు సంతోషంగా ఉంటేనే ఎలాంటి వ్యాపారం అయినా ముందుకు సాగుతుంది. అభివృద్ధి చెందుతుంది. కేవలం సేవలు అందించడమే కాదు మనం అందిస్తున్న సేవల్లో ఎలాంటి లోపమున్నా, సమస్యలు ఉత్పన్నమైనా వెంటనే స్పందించగలగాలి. కంపెనీలు రెస్పాండ్ అయ్యే తీరును బట్టే ఆ కంపెనీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అదే కస్టమర్ సర్వీసులకు కాస్త టెక్నాలజీని జోడిస్తే.. కేవలం కంప్లయింట్ తీసుకోవడంతోనే వదిలేయకుండా కాల్ చేసిన కస్టమర్‌కు పర్ఫెక్ట్ రెస్పాన్స్ అందించగలిగితే అనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే కాగ్నికోర్ టెక్నాలజీస్ దాని కో ఫౌండర్, సీఈవో సింధు జోసెఫ్ సక్సెస్‌మంత్ర.
Dr-Sindhuj
కేరళకు చెందిన సింధు జోసెఫ్ కాగ్నికోర్ టెక్నాలజీస్ కోఫౌండర్, సీఈవో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పిహెచ్‌డీ చేస్తున్న సమయంలో సింధుకు వచ్చిన ఆలోచన.. మహావృక్షమైంది. స్పెయిన్, ఇండియా, అమెరికాలలో బ్రాంచీలు ఏర్పాటు చేసుకోగలిగే స్థాయికి కంపెనీ వెళ్లింది. తన వ్యాపార ప్రయాణం మొదలైన తీరు చూస్తే ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటుంది.

కేరళలో చదివి..

కేరళలోని వాయనాడుకు చెందిన సింధు.. అక్కడే పదోతరగతి వరకూ చదువుకున్నారు. చిన్నతనం నుంచి జీవితమంటే ఏంటో తల్లిదండ్రులు నేర్పిన పాఠాలు ఆమెకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. పై చదువుల కోసం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఆమెకు భాషా సమస్య రావడంతో ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత చెన్నయ్‌లోని స్టెల్లామేరీ కాలేజీలో గ్రాడ్యుయేషన్, కొచ్చిన్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.

బార్సిలోనావెళ్లి..

2000లో బెంగళూరులోని హనీవెల్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో సింధుకు రోష్ చెరియన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వృత్తిరీత్యా బార్సిలోనాలో సెటిల్ అవ్వాల్సి వచ్చింది. అక్కడే స్ధానిక యూనివర్సిటీలో పీహెచ్ డీ చేశారు. రీజనింగ్‌పై ఎక్కువగా ఆసక్తి కనబర్చిన ఆమెకు .. మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఏర్పడింది. దాని ప్రభావంతోనే సమస్యలను అధిగమించేతత్వం తనకు అలవాటైంది అంటారు సింధు. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై అమితంగా ఆసక్తి ఉండేది. అందుకే.. అదే సబ్జెక్ట్స్‌పై పీహెచ్‌డీ కూడా చేశారు. ఆ తర్వాత ఏదైనా చాలెంజింగ్ టాస్క్ తీసుకోవాలని భావించి.. స్టార్టప్‌పై దృష్టి పెట్టారు.
sindhu-joseph

తొలి అడుగు..

సింధు, తన భర్తతో కలిసి బార్సిలోనా కేంద్రంగా 2012లో కాగ్నికోర్ కంపెనీని స్థాపించారు. వెంచురా నుంచి రూ. 55 లక్షల గ్రాంట్ తీసుకున్న తర్వాత కొన్ని కార్పొరేట్ కంపెనీలు, ఏంజల్ ఇన్వెస్టర్ల ద్వారా 2013లో ఆరున్నర కోట్ల రూపాయల ఫండింగ్ దక్కించుకుంది కంపెనీ. ఈ ఫండింగ్‌తో కొన్ని యురోపియన్ టెలికామ్ కంపెనీలు క్లయింట్లుగా వచ్చాయి. తర్వాత మెల్లగా కేరళలో కంపెనీ స్థాపించి ఇండియాలో సేవలను ప్రారంభించారు. మోస్ట్ ఇన్నోవేటివ్ వెబ్ స్టార్టప్ ఇన్ యూరోప్-తో సహా పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను కాగ్నికోర్ ఇప్పటికే సొంతం చేసుకుంది. ఆ తర్వాత అమెరికాకు షిఫ్ట్ అయిన సింధు.. వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే సంస్థల కోసం అన్వేషించారు. అలా పలు సంస్థలు కలసి పనిచేయడానికి ముందుకు వచ్చాయి.

కాగ్నికోర్ ఏం చేస్తుందంటే..

బ్యాంకులోన్ తీసుకోవడం దగ్గర్నుంచి.. కారు ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయడం, టిక్కెట్ బుక్ చేయడం ఇలా.. ప్రతీ సర్వీసులోనూ ఎక్స్‌పర్ట్ అసిస్టెన్స్ అన్నది చాలా కీలక అంశంగా మారిపోయింది. 2012లో బార్సిలోనా కేంద్రంగా మొదలైన కాగ్నికోర్ సరిగ్గా ఇదే పనిచేస్తుంది. కస్టమర్ల అవసరాలకు తగినట్లు వారి ప్రశ్నలకు త్వరితగతిన రెస్పాండ్ అవడంతో పాటు పర్సనలైజ్డ్ కస్టమర్ అసిస్టెన్స్‌ను అందిస్తున్నది. కంపెనీ సీఈవో సింధు చెబుతున్నదాని ప్రకారం.. ప్రతీఏటా 27 వేల కోట్ల కస్టమర్ కాల్స్‌లో 60 శాతం వరకూ.. అంటే దాదాపు 16,200 కోట్ల కాల్స్‌కు ఎలాంటి పరిష్కారం దొరకడంలేదు. ప్రతీ సక్సెస్‌పుల్ బిజినెస్ కూడా..కస్టమర్ కాల్స్‌కు పరిష్కారం చూపడానికే ఎక్కువగా ఫోకస్ పెడుతుంటాయి అంటారు సింధు ప్రస్తుతం ఉన్న పోటీలో సమస్యకు సమాధానం కాదు.. పరిష్కారం ఇవ్వాలి. సరిగ్గా ఇదే విషయంలో చాలా కంపెనీలు ఫెయిల్ అవుతున్నాయి. కస్టమర్‌గా ఇలాంటి సమస్యను ఫేస్ చేసిన సింధు.. అందుకు కేవలం టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు లేకపోవడమేనన్న విషయాన్ని గుర్తించారు. మధ్యతరహా, పెద్ద వ్యాపారాలకు ఇది మరింత అవసరమంటారు సింధు.

మార్కెట్ పై ప్రభావం..

2022 నాటికి ఇంటెలిజెంట్ వర్చువల్ ఏజెంట్ మార్కెట్ రూ. 33,930 కోట్లకు చేరుకుంటుంది. ఐబీఎంలాంటి అత్యుత్తమ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై గతంలో ఎన్నడూ లేనంతగా ఫోకస్ పెడుతున్నాయి. ఈ పరిణామం తమలాంటి మరెన్నో కంపెనీలకు బూస్ట్ ఇస్తుందంటారు సింధు. మానవజాతిని తుడిచిపెట్టడానికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారన్న అపోహ.. దానిలోని పాజిటివ్ కోణాలను చూడనీయకుండా చేస్తున్నది అంటారు సింధు. ఇదే టెక్నాలజీతో అద్భుతాలు నిత్యజీవితంలో అది ఎంతగానో ఉపయోగపడుతుందని, కొన్ని కోట్లమందికి తమ పనులను సులువుగా చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుందని అంటున్నారు.

నేను ఫైటర్‌ని..

Dr-Sindhuj1
టెక్నాలజీ అనేది ఒక్కటే మనల్ని బతికించగలదు అని నేను నమ్మను. అందుకే.. ఎక్కువమంది మహిళలు టెక్నాలజీ వైపు రావాలని నేను భావించడంలేదు. కాకపోతే.. అది మహిళ అయినా మగవాళ్లయినా.. ఇంట్రస్ట్ ఉంటే మాత్రం దేనికీ వెనుకాడకుండా అనుకున్నది సాధించి తీరాలి. మహిళలనే వివక్ష కూడా స్వయంగా ఎదుర్కొన్నారు సింధు. కానీ.. నేను ఫైటర్‌ని. నా చేతలతోనే సమాధానం చెప్తాను అని ధీమాగా సమాధానం ఇచ్చారామె.

కార్పొరేట్ల సాయం లేదు..

సమస్యల పరిష్కారంలో టెక్నాలజీది ఎప్పుడైనా కీలక పాత్ర అంటారు సింధు. అలాంటి సమస్యల పరిష్కారానికి తాను కృషిచేస్తుంటే.. తన భర్త కంపెనీ కోఫౌండర్ రోష్ చెరియన్ దానితో ఒక అత్యుత్తమ ప్రొడక్ట్ ఎలా డెవలప్ చేయాలా అని నిత్యం ఆలోచిస్తుంటారు అని చెబుతున్నారు. చాలామంది మహిళలు పైస్థాయికి రావడానికి ఎంతో కష్టపడుతున్నారని, అందుకు కార్పొరేట్ల నుంచి ఆశించినంత సాయం మాత్రం అందడం లేదు అంటారు ఆమె. కష్టపడి పనిచేయడానికి ఆసక్తి ఉన్నప్పటికీ కార్పొరేట్ సంస్థలు ముందుకు రాకపోవడం వల్ల మహిళలు ఆసక్తి చూపడం లేదంటారు సింధు.

553
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles