కండరాలు ఎందుకు పట్టేస్తున్నాయి?


Mon,July 22, 2019 12:39 AM

నా వయసు 45 ఏండ్లు. ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తాను. పనిలో భాగంగా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కొద్దిరోజులుగా నడుస్తుంటే పాదాల్లో, పిక్కల్లో బాగా నొప్పి వస్తున్నది. కండరాలు పట్టేస్తున్నట్లుగా అనిపిస్తున్నది. ఏదో మామూలు నొప్పి అయుండొచ్చు.. తగ్గుతుందిలే అనుకున్నాను. ఆర్నెళ్ల నుంచి ఈ నొప్పి మరింత తీవ్రమైంది. అసలు నా సమస్య ఏంటి? ఎలా తగ్గుతుందో దయచేసి తెలుపగలరు.
- సరోజ్, హైదరాబాద్

Councelling
మీరు తెలిపిన వివరాలను పరిశీలిస్తే కాలి రక్తనాళాలలో పూడిక ఉన్నట్లు తెలుస్తున్నది. పూడిక ఏర్పడటం వల్ల వచ్చే ఈ నొప్పిని ఫెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ (పీవీడీ) అంటారు. గతంలో ఈ సమస్య ఎప్పుడన్నా వచ్చిందా? ఇప్పుడే వచ్చిందా తెలిస్తే పీవీడీ పట్ల కొంత స్పష్టత వస్తుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారని చెప్పారు కాబట్టి మీ సమస్యకు అది కూడా కారణమే. దాంతోపాటు పొగతాగే అలవాటు ఉంటే కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. మధుమేహంతో బాధపడుతున్నవారు, అధిక బరువున్నవారు, ఆరోగ్యకరమైన అలవాట్లు లేనివారి ఎక్కువగా ఈ సమస్యకు గురవుతుంటారు. సాధారణంగా కాళ్లకు రక్త సరఫరా తగ్గడం వల్ల పీవీడీ సమస్య వస్తుంటుంది. రక్తనాళాల్లోని పూడికలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. రక్త ప్రవాహం తెలుసుకోవడం ద్వారా కూడా పీవీడీని అంచనా వేయొచ్చు. దీనిని బట్టే చికిత్స చేస్తారు. చికిత్సతోపాటు మీరు జీవనశైలిని మార్చుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజు తప్పనిసరిగా వాకింగ్ చేయాలి. మీది నిత్యం ప్రయాణాలతో కూడుకున్న డ్యూటీ కాబట్టి ప్రయాణానికి ముందు లెగ్ ఎక్సర్‌సైజ్ చేయాలి. సిగరెట్, పాన్, గుట్కా వంటివి తినే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. నిర్లక్ష్యం చేస్తే వ్యాధి తీవ్రతరం అవుతుంది.

డాక్టర్ ప్రకాశ్ గౌర సీనియర్ వాస్క్యులర్ సర్జన్
యశోద హాస్పిటల్స్ ,మలక్‌పేట్

1021
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles