నేనెప్పుడూ హీరోయిన్‌నే!


Sun,July 21, 2019 01:08 AM

హీరోయిన్‌గా అందం, అభినయంతో కవ్వించింది.. అమ్మగా అందరి కళ్లల్లో నీళ్లు తెప్పించింది.. ఇప్పుడు బామ్మగా నవ్వుల పువ్వులు పూయిస్తున్నది.. మూడు తరాలనూ.. తన నటనతో కట్టి పడేయడమే కాదు.. ఇచ్చిన ఏ పాత్రలోనైనా జీవించేస్తారు అని ముక్తకంఠంతో అనేలా చేస్తుంది.. ఆమె 50యేండ్ల సినీ ప్రస్థానంలో ఫెయిల్యూర్ల కంటే.. సక్సెస్‌లే ఎక్కువ.. పైగా 400ల సినిమాలకు పైగా నటించిన ఘనత ఆమె సొంతం.. 66 యేండ్ల వయసులో కూడా అదే హుషారుతో నటించి.. ఓ బేబీ సక్సెస్ అందుకున్నది నటి లక్ష్మి. అందరి ఇంట్లోని మనిషిలా చేరువైన ఆమెతో ఈ ప్రత్యేక చిట్‌చాట్.
Laxmi

ఓ బేబీ స్క్రిప్ట్ వచ్చినప్పుడు మీ రియాక్షన్?

నందినీ రెడ్డి ఈ స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు కొత్తగా అనిపించింది. అందులో నా క్యారెక్టర్‌లా ఉన్న మనుషులను ఎంతోమందిని గమనించా. కచ్చితంగా ఆ పాత్రకు న్యాయం చేస్తానని అనిపించింది. అందుకే ఒప్పుకొన్నా. సురేష్ ప్రొడక్షన్స్ కూడా నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి ఒక కారణం. ఆ సంస్థలో నేను ఎన్నో సినిమాలు చేశా. అన్నీ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఓ బేబీ కూడా ఆ సక్సెస్‌లో చేరిపోయింది.

ఓ బేబీ పాత్ర విషయంలో మీకు వచ్చిన ప్రశంసల గురించి చెబుతారా?

ఆప్యాయత ఉన్న పాత్ర అది. అందుకే అందరూ నన్ను మా లక్ష్మీగారు బాగా చేశారు.. ఆమె కాబట్టి ఆ ప్రేమ అంత పండింది.. ఇలాంటి ఎన్నో ప్రశంసలను అందుకున్నా. నేను తప్పు చేసినా ఒప్పుకోరు. నన్ను అందరూ వాళ్ల ఇంటి మనిషిలా భావించారు. అంతలా అందరి ప్రేమను నేను పొందినందుకు సంతోషంగా ఉన్నా.

లక్ష్మీగారు మళ్లీ యంగ్‌గా మారితే ఎలా ఉంటుంది?

నేను అవ్వదలుచుకోలేదు. నాకు మళ్లీ యంగ్‌గా మారడం ఇష్టం లేదు. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలా ఉండడానికే ఇష్టపడతా. నాకు ముందున్న జీవితాన్ని చూడాలని ఉంది. అది మరింత బాగుంటుంది, బాగుండేలా చేయాలని అనుకుంటున్నా.

వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ఎలా ఉంది?

ఏదో జరిగిపోతుంది.. అంతే! కొన్ని రోజులు చెన్నైలో ఉం టాను, కొన్ని రోజులు కేరళలో, ఇప్పుడు హైదరాబాద్‌లో కనిపిస్తున్నా. అంతే.. ఎప్పుడు ఎలా జరుగాలంటే అది జరిగిపోతుంది. కానీ నాకు ఇది బెస్ట్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. మూడు వెరైటీ క్యారెక్టర్‌లతో అందరినీ అలరించే చాన్స్ వచ్చింది. అందుకు చాలా సంతోషిస్తున్నా.

ఇది మీ థర్డ్ ఇన్నింగ్స్ అనొచ్చా? అంటే.. హీరోయిన్‌గా, తల్లిగా, ఇప్పుడు బామ్మ అవతారమెత్తారు కదా!

నాకు ఇన్నింగ్స్ అంటూ ఏమీ లేవండీ! ఇదొక జర్నీ అంతే.. నా విషయంలో. అలా అని నేనెప్పుడూ ఇలా ఇన్నింగ్స్ గురించి ఆలోచించను. నాకు నేనెప్పుడూ హీరోయిన్‌నే! స్క్రీన్ మీదనే కాదు.. నిజ జీవితంలోనూ నేను హీరోయిన్‌నే అనుకుంటాను.

అప్పటి హీరోయిన్‌లకు, ఇప్పటి హీరోయిన్‌లకి మధ్య వ్యత్యాసం ఏమైనా గమనించారా?

నాకు ఏమీ తేడా కనిపించడం లేదు. అప్పుడు ఉన్నది ఆడవాళ్లే.. ఇప్పుడూ ఆడవాళ్లే. ఫిగర్ మెయింటెన్ చేయడానికి అప్పుడూ, ఇప్పుడూ కష్టపడుతూనే ఉన్నారు. సిన్సియర్‌గా తమ పనికి న్యాయం చేయాలనే ఎవరైనా అనుకుంటారు. ఒక ఉదాహరణ చెబుతాను మీకు.. ఒకప్పుడు దోశ కోసం.. రోట్లో పిండి రుబ్బుకునేవారు. ఆ తర్వాత ప్యాకింగ్ వచ్చేశాయి. ఇప్పుడు కావాలనుకుంటే ఆర్డర్ చేసి తెప్పించుకుంటారు. చివరకి వచ్చేది అదే దోశ. ఏదైనా నటనే!

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు తగ్గాయంటే మీరేమంటారు?

లేదండీ.. ఇప్పుడు సమంత గారు, కీర్తి సురేష్ గారు నటించిన సినిమాలే ఇందుకు ఉదాహరణ. చాలామంది హీరోయిన్లు ఎదురుచూస్తున్నారు. ఎంటర్‌టెయిన్‌మెంట్ అనేది ఇప్పుడు థియేటర్‌లో కాకుండా.. ఇంట్లోకే వచ్చేసింది. దీంతో థియేటర్‌కి వచ్చేవాళ్ల సంఖ్య తగ్గిపోయింది. అందరూ బిజీగా ఉండడంతో యంగర్ జనరేషన్‌ని మాత్రం టార్గెట్ చేయడానికి సినిమాలు చేస్తున్నారు. దాంతో హీరోయిన్ ఓరియెంటెడ్ తక్కువ అవుతుండొచ్చు. నాకు తెలిసిన కారణం ఇది అనిపిస్తుంది.

నాలుగు భాషల్లో కనిపించారు కదా. దేని మీద మక్కువ ఎక్కువ?

ఏ భాషైనా ఓకే నాకు. తెలుగు, తమిళ, కన్నడలో కంఫర్ట్‌గా ఉంటాను. కాకపోతే మలయాళంలోకి వచ్చేసరికి అక్కడ నాకు భోజనం పడదు (నవ్వుతూ..). కాకపోతే అక్కడ పనిచేస్తే ఎక్కడైనా పని చేయొచ్చు అనేది నా భావన. అక్కడ యూనిటీ ఉంటుంది. వేస్ట్ ఖర్చులు ఉండవు. కాబట్టి అది కూడా ఇష్టమే.

మీతో కెరీర్ మొదలుపెట్టిన వారెవ్వరూ ఇప్పుడు కనిపించడం లేదు. దానిపై మీ కామెంట్?

అది వాళ్ల వాళ్ల ఇష్టం. వాళ్ల గురించి ఆలోచిస్తూ నేను కూర్చోలేను. నేను కెరీర్ ఓరియెంటెడ్. నాకు షూటింగ్ లేకపోతే ఏమీ తోచదు. నన్ను పుట్టించాడు.. ఇలా సినిమాల వైపు వదిలాడు దేవుడు. అలా రోజులు గడిచిపోతున్నాయి. నాకు ఓపిక ఉన్నంతవరకు నటిస్తూనే ఉంటా.

సినిమా నుంచి చాలామంది సీరియల్స్ వైపు వెళ్లారు. మరి మీరెందుకు మళ్లడం లేదు?

నాకు సీరియల్స్ చాలా కష్టం. రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేస్తూనే ఉండాలి. నేను రెండు సీరియల్స్ ప్రొడ్యూస్ చేశాను. తమిళంలో ఒక సీరియల్‌లో కనిపించా. నా వల్ల కాదు అని రెండో సీరియల్‌లో నేను నటించను అని మా ఆయనతో చెప్పేశా. సీరియల్ అంటే రోజూ ముహూర్తం ఉన్నట్లే. అలా పరిగెత్తడం నా వల్ల కాదనిపించింది.
Laxmi2

ఒక సినిమా దర్శకత్వం చేశారు. కానీ మళ్లీ ఎందుకు ఇంకో సినిమా చేయాలనుకోలేదు?

నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్. దర్శకత్వం చాలా కష్టం అని ఒక సినిమా తీశాక అర్థమైంది. ఆ సినిమా ఆడకపోతే మళ్లీ సినిమా తీయాలని అనిపించేదేమో! తమిళం, కన్నడంలో ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అప్పుడే బాలచందర్ గారు.. ఇక్కడ సినిమాలు తీయడానికి చాలామంది ఉన్నారు. ఆర్టిస్టులకు ఇక్కడ కొరత ఉంది. ఆ పని చూడూ అని మందలించారు. దాంతో సర్లే అని యాక్టింగ్‌లోకి వచ్చేశా. నాకు ఇది కంఫర్ట్‌గా ఉన్నప్పుడు ఇంకొకటి ఎందుకు ఆలోచిస్తాను.

లక్ష్మికి కోపం ఎక్కువ అని టాక్. మరి మీరేమంటారు?

(నవ్వుతూ..) అనుకొనే వాళ్లు అనుకోనివ్వండి. వాళ్ల అభిప్రాయంతో నాకు పని లేదు. అందరూ ఒకే పార్టీకి ఓటేయరు. అందరికీ పాలకోవానే ఇష్టం ఉండదు. అలాగే లక్ష్మి అందరికీ నచ్చకపోవచ్చు. అది వాళ్ల ఇష్టానికే వదిలేస్తాను. నన్ను ఎవరైనా అంటే ఊరుకోను. అది వాళ్లకు కోపం అనిపిస్తే నేనేం చేయలేను. అయినా లక్ష్మీ గారు ఎవరితో మాట్లాడరు అని అనుకోవడమే మంచిది. లేకపోతే లక్ష్మీగారు ఇలా అన్నారు, అలా అన్నారు అనుకునే కంటే ఆమెకు కోపం ఎక్కువ, ఆమెతో మాట్లాడకపోవడమే మంచిది అనుకోవడం వరకు ఓకే. సెట్‌కి వెళ్లేది ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి, అంతేకానీ కబుర్లు చెప్పుకోవడానికి కాదు అనేది నా ఉద్దేశం. అది కొందరికి తప్పుగా అనిపించొచ్చు అంతే!

తమిళంలో, కన్నడంలో టాక్ షోలు చేశారు. తెలుగులో ఎందుకు చేయలేదు?

ఫ్యామిలీ ప్రాబ్లంలు ఉన్న టాక్ షోలు కన్నడలో చేశా. తెలుగులో కూడా అడిగారు. కానీ ఆ తాళి తెంపి విసిరేయడాలు అవి చూడలేను. అందుకే చేయను అని చెప్పా. ఇంకొక జీ టీవి కన్నడలో డ్రామా జూనియర్స్ చేస్తున్నాం. ఇప్పుడు మూడో సిరీస్ నడుస్తున్నది. దానికి వ్యాఖ్యాతగా చేస్తున్నా. అసలు అంత చిన్న పిల్లలు ఎంత అద్భుతంగా చేస్తున్నారో.. వాళ్లలో నాకు కొంచెం యాక్టింగ్ వచ్చినా చాలానుకుంటా. నేను సమ్‌థింగ్ డిఫరెంట్‌గా చేయాలనుకుంటా. డబ్బులు ఇచ్చారు కదా అని ఏది చేయమంటే అది చేయడం నా వల్ల కాదు. ఎవరైనా డిఫరెంట్ స్క్రిప్ట్‌తో వస్తే తెలుగులో చేయడానికి నేను రెడీ!

మీ దృష్టిలో అవార్డులు, రివార్డులంటే..?

(నవ్వుతూ..) ఇస్తే తీసుకుంటామండీ! క్యాష్ అవార్డు అయితే మరీ మంచిదని ఇక సంతోషం. ఇప్పటికీ మూడు నంది అవార్డులు వచ్చాయి. ఇంకొకటి వస్తే బాగుండునని ఎదురుచూస్తున్నా. ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో!

లక్ష్మీ హీరోయిన్.. అమ్మ.. బామ్మ.. ఏ పాత్ర మీకు సంతృప్తినిచ్చింది?

నేను లక్ష్మీగానే ఇంకా ఎదగాలి. ఇంక నా నడకే సరిగా లేదని నా భావన. ఎక్కడా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ దేవుడిచ్చిన పాత్రని ఇంకా పూర్తిగా చేసినప్పుడే నాకు సంతృప్తి. ఎప్పుడు వెళతామో తెలియదు కాబట్టి అన్నీ నేర్చుకోవాలి అనుకుంటున్నా.

మీ బాల్యం గురించి చెప్పండి?

(నవ్వుతూ..) నా లైఫ్‌లో ఎలాంటి అడ్వెంచర్స్ లేవు. నేను ఒక్కతే కూతురిని. దాంతో గారాబంగా చూసుకున్నారు. చాలా కామ్‌గా ఉండేదాన్ని. స్కూళ్లో టెన్నికాయిట్ ఆడేదాన్ని. జిల్లా లెవల్‌లో కూడా ఎన్నో కప్పులు తెచ్చా. డ్యాన్స్ నేర్చుకున్నా. నా లైఫ్ అంతా బోర్‌గానే సాగిందని నేననుకుంటున్నా.

ఒకసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. మీ మొదటి సినిమాకి వచ్చిన డబ్బులను ఏం చేశారో గుర్తుందా?

నేను నా మొదటి సంపాదనతో వాచీ కొనుకున్నా. అప్పటికీ నేను ఫైనల్ మెట్రిక్యులేషన్ రాయలేదు. ఎగ్జామ్స్ సమయంలో వాచీ పెట్టుకొని వెళ్లాలని ఆశ. కానీ పెద్దవాళ్లున్నారే.. వాళ్లు కొనుక్కోనివ్వలేదు. నా డబ్బులతో వాచీ కొనుకున్నా. అది కొన్న తర్వాత కూడా కీ ఎక్కువ ఇవ్వకు అని మా వాళ్లు అనేవాళ్లు. ఆ తర్వాత పెన్నులు, ఐస్‌క్రీమ్‌లు కొనుకున్నా. కానీ కొంత కాలానికి నాకే విసుగు వచ్చేసింది. డబ్బులు ఖర్చు పెట్టడం ఒక ఆర్ట్. అది నాకు చేతకాదు. అయితే మరీ ఎక్కువగా ఖర్చు చేస్తా. లేకపోతే అస్సలు రూపాయి కూడా తీయను. బ్యాలెన్స్‌డ్‌గా ఖర్చు పెట్టడం నాకు ఇప్పటికీ తెలియదు.

మీ తాతగారు మిమ్మల్ని లా చదివించాలనుకున్నారట. కానీ మీరేమో సినిమాల్లోకి వచ్చేశారు?

నేను కూడా అనుకున్నాను. లేదా పోలీస్ అవ్వాలని కూడా కొన్ని రోజులు అనుకున్నాను. ఆ కాలంలో ఉన్న అమ్మాయిలనైతే.. ఇంక తిట్టేసేవారు. నన్ను పోలీసా.. అంటూ నోరెళ్లబెట్టారు. అయితే అది వద్దన్నారు కదా.. లాయర్‌నైనా అవుతా అని చెప్పా. మా తాతగారు నాకు సపోర్ట్. కానీ సినిమాల్లోకి వచ్చాక.. జడ్జీ, పోలీస్, లాయరు.. ఇలా అన్ని పాత్రలూ చేశా.
Laxmi1

ఎన్నో సక్సెస్‌లు చూసిన లక్ష్మీ గారి పర్సనల్ లైఫ్‌లో డిస్టబెన్సెస్ గురించి ఏమంటారు?

ఎవ్వరి లైఫ్ సాఫీగా సాగింది చెప్పండి. నేనూ ఒక మనిషినే కదా! సినిమాలో సావిత్రి బేబీ చెప్పినట్టు ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోవాలంటే పిండి పిసుక్కుంటూ కూర్చోవాలి. అలా నేను చేయలేను. నా మనసుకి ఏది అనిపిస్తే ఇది చేశాను. అది నా లైఫ్ అంతే! నేను బాధలను కూడా పెద్దగా దాచుకోను. అలా అని ఒకేసారి ఏడ్చేయను. సినిమాలో ఏదైనా క్యారెక్టర్‌కి ఎమోషన్‌ని పండించాలని అన్నప్పుడు నా ఈ సమస్యలను గుర్తుకు తెచ్చుకుంటా. ఆటోమేటిక్‌గా ఆ సీన్ పండుతుంది. అక్కడ నా ఒత్తిడిని తగ్గించేసుకుంటా.

ఆడవాళ్లకు జుట్టు అందం అంటారు. కానీ మీరెందుకు అంత చిన్నగా కట్ చేశారు. దీని వెనుక ఏమైనా స్టోరీ ఉందా?

(నవ్వుతూ..) పెద్ద స్టోరీనే ఉంది. అది చెప్పే ముందు నాకు ఇలా కంఫర్ట్‌గా ఉంది. 97లోఇలా కట్ చేయించా. దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నా. ఇక స్టోరీ విషయానికొస్తే.. నాది చాలా పెద్ద జుట్టు. ఒకసారి పార్లర్‌కి వెళ్లి భుజాల వరకు జుట్టు కట్ చేయమన్నాను. కొన్ని విగ్గులు పెట్టడానికి నా జుట్టు అడ్డం అనిపిస్తున్నది. అందుకే కట్ చేయ మని చెప్పా. దానికి పార్లర్ అతను మీరు నిద్రపోండి. నేను చేసేస్తా అన్నాడు. నేను కళ్లు మూసుకున్నా. ఏదో మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో షావుకారు జానకి గారి టాపిక్ వచ్చింది. కాసేపటి తర్వాత కళ్లు తెరిస్తే ఈ పొట్టి జుట్టు వచ్చేసింది. ఇలా అలవాటు అయిపోయింది. అంతే.. దీనికి పెద్ద రీజన్ ఏమీ లేదు.

వయసు దాచుకోవడానికి చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మీరు అలా కాదు. దీనికి ప్రత్యేక కారణం ఉందా?

(నవ్వుతూ..) నాకు ఎక్స్‌ట్రా లగేజ్ మోసుకెళ్లడం ఇష్టం ఉండదు. ఇది నిజంగా నిజం. వాటిని మోసుకెళ్లే ఓపిక నాకస్సలు లేదు. అందుకే అనవసర ఆర్భాటాలకి వెళ్లను. ఉన్నదాంట్లో సరిపెట్టేస్తా. భూమ్మీద ఉన్నంత కాలం సంతోషంగా ఉంటే చాలనుకుంటున్నా. అంతకుమించి వేరే ఏమీ అక్కరలేదనిపిస్తున్నది. జీవితం ఒక బబుల్ అనుకుంటే అది ఎప్పుడు పగిలిపోతుందో ఎవరికీ తెలియదు. ఉన్నంతకాలం వేరే వాళ్ల దగ్గర కొత్త విషయాలు నేర్చుకుంటూ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నా.

-సౌమ్య నాగపురి

930
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles